మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
పుక్కిటి పురాణాన్ని చక్కని కావ్యంగా కొన్ని పద్యాలు మారుస్తాయి. అలాటి పద్యాలలో ఇదొకటి. కాకపోతే, సంస్కృత భాగవతంలో లేని ఈ విషయం పోతన భాగవతంలోకి ఎందుకు వస్తుంది!
హాలాహలం పొంగుకొచ్చి లోకాలని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు అందరూ కలిసి వెళ్ళి మహేశ్వరుడికి మొర పెట్టుకొంటారు. అసలే శివుడు భోళాశంకరుడాయె! వాళ్ళలా వేడుకొనేసరికి అతని మనసు కరగకుండా ఉంటుందా? ప్రపంచాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించే అనుకంప అతనిది! అందుకే ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకొంటాడు. తన అర్థాంగి కదా పార్వతి, ఆమె యేమంటుందో అని ఆమె వైపు చూస్తాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలుపుతుంది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం.
తెలుగులోనూ ఇంతదాకా ఇలాగే ఉంటుంది. ఇక్కడ పోతనకి ఒక సందేహం వచ్చి ఉంటుంది - "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పోతన లాంటి భాగవతోత్తమునికి దానికి సమాధానం దొరకడం పెద్ద కష్టమై ఉండదు. అయితే ఇక్కడ గొప్పతనం ఏవిటంటే, ఆ సందేహాన్నీ దాని సమాధానాన్నీ, కవితాత్మకంగా తెలుగు భాగవతంలో చిత్రించడం! తనే నేరుగా ఇది చెప్పేస్తే, అది వ్యాఖ్యానంలా ఉంటుంది. కాబట్టి ఆ సందేహాన్ని పరీక్షిత్తుచేత అడిగించాడు. "శివుడైతే భక్తవత్సలుడు, విషాన్ని తాగడానికి సిద్ధపడవచ్చు. దేవతలందరూ తమని కాపాడతాడు కదా అని తాగమని ప్రోత్సహించవచ్చు. కానీ పార్వతి, తన భర్త విషం తాగడానికెలా ఒప్పుకుంది?" అని అడుగుతాడు. దానికి శుకమహర్షిచ్చిన జవాబు ఈ పద్యం.
కేవలం ఒక్క రెండు పదాలతో మొత్తం భారతీయ సంస్కృతిని ఎంత చక్కగా చెప్పాడు, అదీ తెలుగు నుడికారంతో! "మంగళసూత్రాన్ని నమ్మడ"మంటే తమ భార్యాభర్తల అనుబంధాన్ని నమ్మడం! ఒకరినొకరు విడిచిపెట్టమని చేసిన ప్రమాణాలలోని సత్యాన్ని నమ్మడం! ఇక్కడ పార్వతి ఎవరు, "సర్వమంగళ". అంటే పరిపూర్ణమైన శుభానికి ఆకారమే ఆవిడ. తన మాంగల్యమ్మీద అంత నమ్మకం ఉండబట్టే ఆవిడ సర్వమంగళ అయింది. అందుకే, మింగుతున్నది తన భర్తని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి మింగమని చిరునవ్వుతో తన అంగీకారాన్ని చెప్పగలిగింది.
ఈ పద్యం చదివినప్పుడల్లా, యుద్దానికి ధైర్యంగా తమ భర్తలని పంపే ఈనాటి సైనుకుల భార్యలు నా మదిలో మెదులుతారు. వాళ్ళందరూ సర్వమంగళలే కదా! ఈ కాలంలో బయట శత్రువులని ఎదుర్కొనే సైనికులు సరిపోరు. సమాజంలో పాకిపోతున్న రకరకాల విషవాయువులనుండి మనలని మనం కాపాడుకోవాలంటే, ప్రతి భర్తా శివుడూ, ప్రతి భార్యా పార్వతీ కావాల్సిన అవసరం ఉంది! కాదంటారా?
మంగళసూత్రం - పురుషాధిక్య సమాజం ఆడవాళ్ళ మెళ్ళో వేసిన పలుపుతాడని, దాన్ని ద్వేషించేవాళ్ళూ, తిరస్కరించేవాళ్ళూ ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. కానీ ఆవేశంలో ఆలోచన లేదు. ఈ సంప్రదాయం ఎప్పుడెలా ఎందుకు మొదలయ్యిందీ ఇప్పుడనవసరం. ఇది దాంపత్య జీవనానికీ, భార్యాభర్తల గాఢమైన అనుబంధానికీ ఒక శక్తివంతమైన ప్రతీకగా రూపొందిందన్న మాట నిజం. సంప్రదాయాన్ని తమ స్వార్థానికి వాడూకొనేవాళ్ళు ఏ కాలంలోనైనా ఉంటారు. అంతమాత్రాన సంప్రదాయం చెడ్డదనుకోవచ్చా? అది ప్రతీకగా ఉన్న మంచినెందుకు గ్రహించకూడదూ? మంగళసూత్రాన్ని వేసుకోకపోయినా, ఒకవేళ అది మగాళ్ళ మెళ్ళో వేసినా, పురుషాధిక్యం తొలగిపోతుందా? కన్యాశుల్కం పోయి వరకట్నం వచ్చి ఏం వెలగబెట్టింది? మార్పు రావలసింది ముందు మనుషుల్లో. వారి మనసుల్లో. దానిబట్టి ఆచారాలూ సంప్రదాయాలూ అవసరమైతే మారవచ్చు.
కొందరు మరొక విచిత్రమైన వాదన చేస్తారు. అసలీ కాలంలో ఇలాటి సంప్రదాయాలెందుకూ అని. స్కూల్లో యూనిఫారమూ, ఆఫీసుల్లో Dress code మనలో చాలామందికి తెలిసిన విషయాలే. ఇవి ఆచారాలు కావా? ఇవెందుకని ప్రశ్నిస్తున్నామా? మరాలటప్పుడు మనదైన, మన జన్మకి కారణమైన మన పూర్వులు ఆచరించిన సంప్రదాయాలని మాత్రం మన మెందుకు కాదనాలి? మనుషుల మధ్య ఒక ఏకతనీ, సంఘీభావాన్నీ కలిగించి సమాజంగా ఏర్పడడానికి ప్రథాన చోదకాలుగా పనిచేసేవి సంప్రదాయాలూ, ఆచారాలూ. వాటిని తిరస్కరిస్తే, మనుషులని సమైక్య పరిచే సాధనాలు ఏవి? వ్యక్తి వాదం ప్రబలితే, సమాజ పరిస్థితి ఏమవుతుంది? ఒక జాతిగా మనిషి మనుగడ ఏమవుతుంది? ఆలోచించండి...
పూర్తిగా చదవండి...