కిందటి టపాలో నా పద్యంలో, చంద్రబింబాన్ని అలసి వెలవెలబోతున్న సూర్యుని ప్రతిబింబంగా వర్ణించడాన్ని ఆ చంద్రుని తరఫున చంద్రమోహన్ గారు తీవ్రంగా ఖండించారు :-) అదీ పద్యంలో! పైగా నేను చంద్రునిపై మంచి పద్యాన్ని వ్రాస్తే గానీ వారి మనోభావాలు శాంతించవని కూడా హెచ్చరించారు! తమ పేరింటివారి మీద ఆ మాత్రం అభిమానం సహజమే. కాని వారి కోరిక విని నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఎందుకంటే మన కావ్యాలలో అందరికన్నా ఎక్కువగా, అందంగా వర్ణించబడింది బహుశా చంద్రుడే! అలాంటి చంద్రునిపై పద్యం వ్రాయాలంటే మాటలా?
చంద్రుని మీద పద్యం అనగానే నాకు గుర్తుకువచ్చిన పద్యం పెద్దన మనుచరిత్రలోనిది. చంద్రుని గురించి అంత అందమైన పద్యం మరొకటుందా అనిపించేంత చక్కని పద్యమది.
కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొర జోడు రేవెలుంగు
"కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి" - స్థూలంగా చూస్తే, "పాలసముద్రమునుంచి పుట్టినవాడు ఎవడో అతడు" అని అర్థం, అంతే! ఇందులో కవిత్వమేముంది? అని పెదవి విరిచేస్తే ఏమీ లేదు! సూక్ష్మంగా పరికిస్తే చాలా ఉంది. ఈ పద్యం మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. మనుచరిత్ర కృతిభర్త మరెవరో కాదు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. అతని వంశాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు పెద్దన్న. కృష్ణదేవరాయలు తుళు వంశానికి చెందిన రాజు. ఈ తుళువంశం చంద్రవంశం. అంటే ఈ వంశానికి ఆదిపురుషుడు చంద్రుడన్న మాట! ఆ చంద్రుని వర్ణనతో ఆ వంశ ప్రశంసని ప్రారంభించాడు. పెద్దనకి కృష్ణదేవరాయలపైనున్న అభిమానం అంతా ఇంతా కాదు! అలాంటి రాయల వంశ మూలపురుషుణ్ణి వర్ణించడమంటే పెద్దనగారి మనసులో ఉత్సాహం ఉప్పొంగి ఉండాలి. అందుకే ఇలాంటి పద్యం జాలువారింది. అసలీ పద్యంలో స్వయానా ఆ రాయలనే కీర్తిస్తున్నాడా అనికూడా నాకు అనిపిస్తుంది.
సీస పద్యం ఒకో పాదంలోనూ చంద్రుని ఒకో గొప్పతనాన్ని వర్ణించాడు. చంద్రుని వంశోన్నతిని చాటుతున్నది మొదటిపాదం. అయితే ఇందులో మంచి చమత్కారాన్ని చేశాడు పెద్దన. చంద్రుడు ఫలానా పాలసముద్రపు కొడుకు అని అన్నాడా? లేదు! కలశపాథోరాశి అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రం మధ్యలోనున్న, "వీచి మతల్లి". మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. వీచి అంటే అల. వీచిమతల్లి అంటే ఒక గొప్ప/పెద్ద అల. పాలసముద్రం మధ్యనున్న ఒక గొప్ప అల ఎవని కన్నతల్లో అతను చంద్రుడుట! సముద్రుణ్ణి మగవానిగా, చంద్రుడు లక్ష్మీదేవి మొదలైనవాళ్ళకి తండ్రిగా చెప్పడం సాధారణమైన విషయం. కాని ఇక్కడ తల్లిని కూడా తీసుకువచ్చాడు పెద్దన. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మధ్యలో తరంగాలు ఏర్పడి ఉంటాయి కదా. అలాంటి ఒక ఉన్నతమైన, ఉత్తుంగమైన తరంగంనుంచి ఉద్భవించాడట చంద్రుడు. అంతే కదా మరి! ఉన్నట్టుండి అలా సముద్రంలోంచి హఠాత్తుగా పుట్టలేదు కదా చంద్రుడు. సముద్రాన్ని మథించినప్పుడు, అందులోంచి పుట్టిన అలల నురగ గడ్డగట్టి, ఆ మథన వేగానికి పైకి కొట్టబడి చంద్రుడు ఉద్భవించి ఉండాలి. ఇంత కథనీ గుర్తుచేస్తూ చంద్రుని పుట్టుక ఎంత గొప్పదో ధ్వనింపజేస్తోంది ఈ వర్ణన. పదాల పొందిక సరేసరి!
"అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు" - మళ్ళీ ఆ పదాల పొహళింపు చూడండి! తెలుగుభాషలోని అనుప్రాస సౌందర్యమంతా మొదటి మూడు పదాలలోనూ నింపేసాడు! అనలాక్షుడంటే నిప్పుకంటివాడు, శివుడు. అతని ఘనమైన జడలనే తోటకి వెన్నె తెచ్చే పువ్వుట చంద్రుడు. పైగా అలాంటిలాంటి పువ్వుకూడా కాదు. అనావర్తవంపు పువ్వు. అంటే అన్ని ఋతువులలోనూ కూడా పూసేపువ్వని అర్థం. ఏ ఋతువులోనైనా చందమామ ఆకాశంలో అలా వెలుగుతూనే ఉంటాడు కదా! పైగా మనకంటే ఒక పదిహేను రోజులు క్షీణిస్తున్నట్టు కనిపిస్తాడు కాని శివుని జటాజూటంలో ఎప్పుడూ వెన్నెలలు చిలికిస్తూనే ఉంటాడాయె. ఈ పాదంలో చంద్రుని ఔన్నత్యం, నిరంతర వైభోగం ధ్వనింపజేసాడు పెద్దన. అంతటి ఔన్నత్యం వైభోగం రాయలకి మాత్రం లేవా?
"సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు పుట్టుగానని మేని మెట్టపంట" - ఈ పాదంలో చంద్రుని సంపన్నత, దాతృగుణం వర్ణింపబడ్డాయి. సకల దేవతల ఆకలినీ కూడా తీర్చే మెట్టపంట చంద్రుడు. చంద్రుడు కురిపించే సుధ/అమృతం దేవతల ఆహారం కదా. పైగా అతనిది "పుట్టుగానని మేను". అంటే ఆ మెట్టపంట ఎవరూ నాటకుండానే స్వతస్సిద్ధంగా పండినదన్న మాట. అంచేత ఇది కూడా ఋతుసంబంధి కాదు. నిరంతరం ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది.
"కటికిచీకటి తిండి కరముల గిలిగింత నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు" - ఇందులో చంద్రుని సరసత్వం వర్ణించాడు పెద్దన. కటికచీకటిని తినే చేతుల గిలిగింతతో, తొగ కన్నెని - అంటే కలువ కన్నెని, నవ్విస్తాడు చంద్రుడు. చంద్రకిరణాలు చీకటిని హరించి కలువకన్నెకి ఆనందాన్ని కలిగిస్తాయని భావం. ఇందులో "కటికి చీకటితిండి కరములు" అన్న సమాసం దుష్టసమాసం. పైగా విచిత్రమైన ప్రయోగం కూడాను! కటికచీకటిని తినే చేతులు అని చంద్రకిరణాలని వర్ణించడంలో మరి వేరే ఉద్దేశం కూడా ఏమైనా ఉందేమో నాకు తెలీదు.
"నతడు వొగడొందు మధుకైటభారి మఱది" - పైన చెప్పిన గొప్పతనమున్న చంద్రుడు స్వయానా మధుకైటభారి మఱది, అంటే విష్ణువు బావమఱది. బంధుత్వంలో కూడా చంద్రుని గొప్పతనాన్ని చెపుతున్నాడిక్కడ. "కళల నెలవగువాడు" - పదహారు కళలకి నెలవైనవాడు. రాయల కళావైదుష్యం ఇక్కడ ధ్వనిస్తోంది. చుక్కలకు రాజు. చంద్రుని/రాయల దక్షిణ నాయకత్వం స్ఫురిస్తోందిక్కడ. "మిసిమి పరసీమ" - మిసిమి అంటే మిలమిలా మెరిసిపోయే కాంతి. దానికి పైహద్దు చంద్రుడు. అంటే అంతకన్నా మెరిసే కాంతి మరెవ్వరికీ లేదని. ఇది రాయల కీర్తిని ధ్వనిస్తోంది. కీర్తిని వెలుగుతో పోల్చడం కవిసమయం. "వలరాజు మేనమామ" - మన్మథునికి స్వయానా మేనమామ. అంటే మన్మథుని అందమంతా ఇతనిలోనూ ఉందని అనుకోవచ్చు. ఇది కృష్ణరాయల సౌందర్యాన్ని ధ్వనిస్తోంది. "వేవెలుంగులదొర జోడు రేవెలుంగు" - వేయి వెలుగులున్న ఆ సూర్యునికి సరిజోడు, ఇతను రాత్రి వెలుగేవాడు అని. అంటే చంద్రవంశం సూర్యవంశానికి ఏమాత్రం తీసిపోని సరిజోడు అని అర్థం వస్తుంది.
ఇంతకన్నా అందంగా సమగ్రంగా చంద్రుణ్ణి మరెవరైనా వర్ణించారేమో నాకైతే తెలియదు. అలా చేస్తూ, కృష్ణరాయల గొప్పతనాన్ని కూడా ధ్వనింపజెయ్యడం పెద్దన ధురీణత. అతనికి రాయలమీదనున్న అభిమానానికి నిదర్శనం. ఈ "కలశపాథోరాశి" అనే ఎత్తుగడకి ప్రేరణ బహుశా క్రీడాభిరామంలో పద్యం అయ్యుండవచ్చు. ఆ పద్యం కూడా చంద్రస్తుతే.
చంద్రునిపై ఇంత పెద్ద పద్యం, ఇంత అందమైన పద్యం గురించి వివరించినా చంద్రమోహన్ గారు శాంతిస్తారని నమ్మకం లేదు :-) నన్ను స్వయంగా ఒక పద్యం వ్రాయమని ఆదేశీంచారు కదా! అంచేత ఆ చంద్రునికో నూలుపోగుగా నేనూ ఒక పద్యాన్ని ప్రయత్నించాను:
స్నేహరసార్ద్రయౌ జనని నిత్యము తండ్రి రుషాకషాయతన్
దా హృది నింకజేసుకు సుధామయ ప్రేమను జిల్కునట్లుగా
దాహకరోష్ణ తీక్ష్ణ కరధారను చల్లని వెన్నెలేరుగా
మోహన చంద్రబింబమ! అమోఘముగా ప్రసరింపజేతువే!
పూర్తిగా చదవండి...
