అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిసారిగా పోస్టుని షెడ్యూల్ చేసాను! అంచేత నిజంగా ఈ భోగీ నాడు ఇది పోస్టవుతుందో లేదో మరి తెలీదు. ఎందుకు షెడ్యూల్ చెయ్యాల్సి వచ్చిందంటే, నేనీ సంక్రాంతికి మా తాతగారి ఊరు వెళుతున్నానోచ్! అంటే పల్లెటూరన్న మాట. అక్కడ కంప్యూటరు ఇంటర్నెట్టు వగైరా ఉండవుగా మరి. సంక్రాంతి పండక్కి ఆ ఊరు వెళ్ళి ఎన్నో ఏళ్ళయిపోయింది. సంక్రాంతి పండుగంటే అది పల్లెటూళ్ళో జరుపుకోవలసిందే.
మా చిన్న్నప్పుడు చక్కగా సంక్రాంతి సెలవలకి కనీసం ఓ వారం రోజులకైనా వెళ్ళేవాళ్ళం మా తాతగారి ఊరికి. మా చిన్నాన్నల కుటుంబాలు, అత్తయ్య కుటుంబం అందరమూ కలిసేవాళ్ళం. ఇంక సందడే సందడి. పెద్ద మండువా ఇల్లు. ఎంతమంది వచ్చినా ఇరుకనిపించేది కాదు. ఇంటిముందు ఖాళీ జాగాలో ఒక పెద్ద చెట్టు, రకరకాల మొక్కలు. పెద్ద పెద్ద ఎత్తైన విశాలమైన అరుగులు. వాటికానుకొని వీథి చావిడి. ఆ చావిడిలో ఒక పక్క రెండు పెద్ద కఱ్ఱ బల్లలు. మరొక పక్క పెద్ద పడక్కుర్చీ. అందులో మా తాతగారు కూర్చునేవారు. తెల్లని పంచె, నుదుటన విభూది, మధ్యలో నామం. మా ఇద్దరు తాతగార్లు ఒకరేమో సంప్రదాయానికీ మరొకరూ ఆధునికతకూ నిలువెత్తు నిదర్శనంలా ఉండేవారు. వారి గురించి మరోమారు వివరంగా. ఈ తాతగారు ఆయుర్వేద వైద్యులు. చావిడిలోనే ఒక పక్కగా రెండు పెద్ద పెద్ద కల్వాలుండేవి, మందులు నూరడానికి. ఆ చావిడే మా తాతగారి ఆసుపత్రి. చావిడి చెరో వైపు రెండు చిన్న చిన్న గదులు, ధాన్యం వగైరా సరుకులుండేవి. చావిడి దాటి లోపలకి వెళితే ఒక పెద్ద గది. రెండువైపులా రెండు పెద్ద అల్మారాలు. అందులో ఆయుర్వేదానికి సంబంధించిన బోలెడన్ని పుస్తకాలు. తాళపత్ర గ్రంథాలు కూడా ఉండేవి! ఆ గది దాటి వెళితే వసారా. ఈ పెద్ద గదికి అటు ఇటూ రెండు పడక గదులు. ఈ మూడు గదులను కలుపుతూ ఆ వసారా. అది దాటగానే ఇంటి మధ్య మండువా. దానికొక వైపుగా డాబా మీదకి మెట్లు. మండువా దాటగానే మరొక వసారా. ఆ వసారాలో ఇనప గొలుసులతో పెద్ద చెక్క ఉయ్యాల. కనీసం ఒక నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని ఊగవచ్చు! ఆ వసారా దాటగానే మధ్యలో మరొక హాలు. ఎడంవైపు మరొక పడగ్గది. కుడివైపు దేవుడి గది. ఆ హాలు దాటాక ఒక వరండా. దానికి కుడివైపున వంట గది. ఎడం వైపున చిన్న కొట్టు గది. ఆ వరండా కిందకి దిగడానికి మెట్లు. ఆ మెట్లు దిగితే పెద్ద పెరడు. ఎదురుగ్గా మధ్యలో తులసి కోట. పెరడంతా చెట్లు, మొక్కల మయం! కుడిపక్కగా పెద్ద గట్టు, గట్టు మీద బావి. దానికానుకొని నీళ్ళు నింపడానికి కుండీ. బావి గట్టుకానుకొని కిందన నీళ్ళ పొయ్యి. పెరట్లోనే ఒక పక్కకి వెనకగా ఆడవాళ్ళకి స్నానాల గది. ఇల్లంతా భూమికి ఒక అయిదడుగుల ఎత్తులో ఉండేది! ఇంటి చుట్టూ పెరడే!
పండగకి కనీసం మూడు రోజులముందైనా వెళ్ళేవాళ్ళం! తెల్లవారుఝాము నాలుగ్గంటలకి దేవుని భజనలతో ఊరేగింపు వచ్చేది. అది వస్తే ఇక లేవాల్సిందే! అప్పటికే కళ్ళాపి జల్లేసేవారు. వాళ్ళు వచ్చి వేళ్ళాక ముగ్గులు మొదలుపెట్టేవారు. పెద్ద పెద్ద ముగ్గులు! రకరకాల ముగ్గులు! సరే ఇక భోగీనాడు చెప్పేదేవుంది, నాలుగ్గంటలకే భోగిమంట వెయ్యడం ప్రారంభం. అబ్బో ఆ మంట ఒక రెండు మనుషుల ఎత్తుకి వెళ్ళేది! దాని దగ్గర కూర్చుంటే ఇక చలి గిలి జాంతానై. మెల్లిగా అయిదు అయిదున్నర దాకా అక్కడ గడిపి, ఆ తర్వాత స్నానాలు. పండగ స్నానాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుబ్బరంగా ఒంటికంతా నూనె పట్టించి, ఆ తర్వాత నలుగు పిండి రాసి, కాస్త ఆరాక దాన్ని బలంగా నలచడం. ఇలా రెండు మార్లు నలిచేవారు. ఇదంతా చెయ్యడానికి ఒకతను వచ్చేవాడు. బలిష్టంగా ఉండి అతను నలుగు పెడుతూంటే అబ్బో! ఒళ్ళంతా రక్తం జఱ్ఱు జఱ్ఱున పాకేది! అలా నలుగు పెట్టించుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళతో మా అమ్మో అత్తయ్యో ఒకరు కుంకుడు పులుసు పోస్తూంటే మరొకరు తల రుద్దేవారు. ఆ తలంటు కార్యక్రమం అయ్యేసరికి ఒళ్ళు గాల్లో తేలిపోయేది. అప్పుడెంచక్కా కొత్తబట్టలు వేసుకొని, పెద్దవాళ్ళందరికీ దణ్ణాలు పెట్టి, ఆశీర్వాదాలందుకొని, పండగ కట్నం దండుకొని, వేడివేడి ఇడ్లీలు లాగించి, ఆపైన ఆటలే ఆటలు! నేలాబండో, డీఫాటో, ఇంటి ముందు జాగాలో క్రికెట్టో. పెద్దవాళ్ళందరూ కూర్చొని చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. కొంత సేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఎవరెలా ముక్కలు సర్దుతున్నారు, ఎలా కలుపుతున్నారు, ఎలా ఆడుతున్నారు పరిశీలించడం. మా తాతగారు ఆడేవారు కాదు కాని మా నాయనమ్మ ఆడేది. ఆవిడ పేకలు పట్టుకొనే తీరు చాలా విచిత్రంగా ఉండేది. పక్కవాళ్ళు చూసినా ఏమీ అర్థమయ్యేది కాదు! మధ్యాహ్నమయ్యేసరికి ఘుమ ఘుమలాడే విందుభోజనం తయార్. భోజనాలయ్యాక నాలుగవుతోందనగా ఎవరింట్లో అయినా భోగిపళ్ళ వేడుక ఉంటే వెళ్ళడం. లేదా అలా రామాలయానికో, తోటలోకీ షికారు. రాత్రి ఫలహారాలు వేగిరం ముగించుకొని, మళ్ళీ పెద్దవాళ్ళు చతుర్ముఖపారాయణం మొదలుపెట్టేవారు. లేదంటే ఏవో పిచ్చాపాటీ కబుర్లు. రాత్రి ఎనిమిదిన్నర అయ్యేసరికల్లా పడకలే. వేసంకాలంలో అయితే డాబా మీద పడుకొనేవాళ్ళం కాని సంక్రాంతికి చలికదా అంచేత వసారాల్లో వరసగా బొంతలు పరిచేసేవారు. పెద్దలూ పిల్లలూ అందరూ అక్కడే. ఇలా పండగ నాలుగురోజులూ అసలు సమయం తెలియకుండా గడిచిపోయేది! ముక్కనువునాడు అనుకుంటా ఊరి బయట పెద్ద తిరనాళ్ళు జరిగేవి. అదో సంబరం.
ఆ యిల్లింకా అలాగే ఉంది. వెళ్ళడానికి మాకే తీరిక లేకుండా పోయింది! ఎప్పుడో అడపాదడపా ఒక్కరోజుకి వెళ్ళి వచ్చెయ్యడమే.
నా నాస్టాల్జియాలో పడి పద్యాల సంగతి మరిచే పోయాను! ఎప్పుడో నలభైలలో భారతి పత్రికలో వచ్చిన శ్రీ పాలెపు వెంకట రత్నంగారి ఈ సంక్రాంతి పద్యాలు మీ కోసం. ఈ కవిగారు కూడా నాస్టాల్జియాలో పడ్డారేమో అనిపిస్తుంది పద్యాలని చదివితే. కాని అప్పుటి పరిస్థితులు ఇప్పటికన్నా మెరుగ్గానే ఉండేవేమో! అసలు పరిస్థితులెలా ఉన్నా, పండగనాడైనా కొంచెం మంచి మాటలు చెప్పుకోవడం శుభప్రదం కాబట్టి వారు వర్ణించిన ఆనాటి పల్లెటూరి సంకురాతిరి శోభను మీరు కూడా ఊహించుకొని ఆనందించండి.
పౌషశ్రీ
ఒక ప్రాభాతికవేళ శీత ఘన బాధోద్వృత్తి నే సాలువా
సకలాంగంబులకున్ ముసుంగిడి సుఖాశన్ సుప్తినుండంగ "గొ
క్కొకురోకో" యని తామ్రచూడవర మాఘోషింప కన్విచ్చి, లే
చి కనుంగొంటి మనోజ్ఞ పౌష ప్రకృతిశ్రీ చిద్విలాసాకృతిన్
పచ్చనై కనుపట్టు భవ్యశాద్వలతలిన్ జాలుగా మంచుముత్యాలు చేరె
అరవిచ్చు చేమంతి విరిసోయగము మెచ్చి భ్రమరాళి వలగొని పాటపాడె
ముంగిళ్ళ జెలువాఱు రంగవల్లికలలో బంతి గొబ్బెమ్మలు పాదుకొనిరి
ప్రక్కవీథిని పాటపాడు సాతానిజియ్యరు కాలి చిఱుగజ్జియలు నదించె
గొబ్బితట్టెడు బాలికాకోమలాస్య
జనిత మృదుహాసలహరులు సంచరించె
బొలము చాయల వినిపించె బొలియగాని
గూర్చి పాడుచు గుప్పల నూర్చు సద్దు
ధవళాద్రి నిర్మలత్వము ధిక్కరించు నీ వెల్లపూసిన యిండ్ల తెల్లదనము
లక్ష్మీనివాస విలాసంబులం దెల్పు పసుపుగుంకుమల నొప్పెసగు గడప
లలరుదండల కాంతులొలుకబోసినవి సుందరశిల్పముల నొప్పు ద్వారసమితి
కమనీయ హేమ నిష్క సమాన కాంతుల ధాన్యరాసులతోడ దనరె బంచ
లెంత సౌభాగ్యసౌందర్యవంతురాల
వమ్మ! ఆగర్భధనవంతురాల పౌషి!
నీ విమల దివ్యతర కమనీయ సుషమ
కవి హృదయసీమ శతరత్న కాంతి నించె
చిన్నబావ ప్రయాణసన్నాహ మొనరింప మఱదలు చేసంచి మాటుపఱిచె
చీరపై జలతారు చారలు లేవని పుత్రిక నాన్నపై మోము ముడిచె
విందువంటకు సగ్గుబియ్యమేవీ యని వెలది నాథునితోడ విరసమాడె
చాటుగా మగనితో మాటలాడిన యాడబడుచు వధూనిక పరిహసించె
కృషి ఫలింపగ మంచి జోడెడ్లు కాడి
మేడి హలమును రైతు ప్రేమించి కొలిచె
సకల సౌభాగ్యకల్యాణ సదనమైన
స్వర్ణ సంక్రాంతి కాంతులు జగతి వరలు
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Friday, January 14, 2011
సంక్రాంతి తలపోతలు
Subscribe to:
Post Comments (Atom)
థాంక్యూ కామేశ్వరరావు గారూ ఒక 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాను. మాతాతగారి ఊరు కానురాగ్రహారం. ఇల్లు రెండు మూడు గదులు ఇటూ అటూ బహుశా అల్లాగే ఉండేది అనుకుంటాను. సరిగ్గా గుర్తులేదు. తలంటు కార్యక్రమానికి మా పెద్దమ్మ గారు , అత్తయ్యగారూ నూనె రాసేవారు ఒకరు, సున్నిపిండి పట్టించే వారు ఒకరు. మేము పెరడు అంతా పరిగెత్తించే వాళ్ళం. మా పెద నాన్న గారి ఇల్లు ఎదురుగా ఉండేది. అక్కడ పేకాట కార్యక్రమం. 12 అయినా కదిలేవారు కారు. అప్పుడు మా అమ్మమ్మ గారు వచ్చేవారు, పండగ పూటా మమ్మల్ని పస్తుంచుతారా అంటూ. తలచుకుంటే మనసు పులకరిస్తుంది. ఏమిటో ఇప్పుడు ఎవరికి తీరుబడీ లేదు, ఆ ఉత్సాహమూ లేదు.
ReplyDeleteమీకు మీకుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఆహా, ఏదో ఊహాలోకంలో ఉన్నట్టు ఉందండి, మీ తాతగారి ఇంటి వర్ణన చదువుతుంటే. చంద్రముఖి రూము ఉంటే ఆ రూముకు మాత్రం వెళ్ళకండి.
ReplyDeleteబాగున్నాయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు, సంక్రాంతి పద్యాలు.
ReplyDeleteచిన్నప్పుడెప్పుడో ఏటుకూరి నరసయ్యగారి సంక్రాంతి లక్ష్మి / శోభ చదువుకున్నాము కాని పద్యాలు గుర్తులేవు. చాలా బాగుండేవి అవి.
~సూర్యుడు
కామేశ్వరరావు గారూ, మీ ఇల్లు నాకు బాగా నచ్చింది...పెద్దయ్యాక అలాంటి ఇల్లొకటి కట్టుకోవాలని,నా చిన్నప్పుడు మా పాతిల్లు పడగొట్టినప్పట్నుంచీ నాకు కోరిక....
ReplyDeleteకామేశ్వర్రావుగారూ, చాలా ఆలస్యంగా చూస్తున్నాను. మీ సంక్రాంతి కబుర్లూ పద్యాలూ చాలా బావున్నయ్యి. పెద్దవాళ్ళ కవిత్వంలో తప్పులెంచేంత వాణ్ణి కాదుగాని, శ్రీ వెంకటరత్నంగారి సీస పద్యాల్లో మొదట ఎత్తుకున్న ఆలోచనా ధోరణి పద్యం మధ్యలో మారిపోయేసరికి కొంచెం వెల్తిగా అనిపించింది. నాక్కూడా హైస్కూల్లో పౌష్యలక్ష్మి అనే పద్యపాఠం ఉన్నట్టు లీలగా జ్ఞాపకం కానీ పద్యాలేవీ గుర్తు లేవు.
ReplyDelete