ఉదంకోపాఖ్యానం మొదటి భాగం ఎంత వరకూ చెప్పుకున్నాం? కుండలాలని అడిగి తీసుకోడానికి వెళ్ళిన ఉదంకుడు, అంతఃపురంలో పౌష్యుని భార్య కనిపించక తిరిగివచ్చాడు కదా. వచ్చి పౌష్యుడితో ఆ విషయం చెపితే, పౌష్యుడిలా అంటాడు:
భూవినుత! నిన్ను ద్రిభువన
పావను నశుచి వని యెట్లు వలుకగ నగు న
ద్దేవి పవిత్ర పతివ్రత
గావున నశుచులకు గానగా దనవద్యా!
ఒక సంభాషణా రచనలో, నన్నయాది కవులు ఎంత జాగ్రత్త వహించారో తెలుసుకోడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ. ఏదో గణాలు, యతి ప్రాసలు కిట్టించేసి పద్యాలు వ్రాస్తే అది కవిత్వం అవ్వదు. కథా కావ్యంలో పాత్రల సంభాషణలకి ఎంతో ప్రాధాన్యముంటుంది. సంభాషణ పాత్రకి సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. ఉదంకుడికి పౌష్య దేవి కనిపించలేదు. మహా పవిత్రురాలు కాబట్టి, శుచులకు (మనోవాక్కాయములు మూడిటా పరిశుద్ధులైన వాళ్ళు) మాత్రమే ఆవిడ కనిపిస్తుంది. ఉదంకుడికి కనిపించ లేదంటే అతడు పరిశుద్ధుడు కాడన్న మాట. అతను చూస్తే ముని. పైగా పవిత్రమైన గురు కార్యమ్మీద వచ్చినవాడు. అతణ్ణి పట్టుకొని నువ్వు అశుచివి అనడం అసమంజసం. కాని విషయం చెప్పాలి. అలాంటి సందర్భంలో ఒక రాజైన వాడు ఎంత సందర్భోచితంగా, చతురతతో మాట్లాడాలి. అది మనకీ పద్యంలో కనిపిస్తుంది. పద్యం ఎత్తుకోడమే "భూవినుత" అన్న సంబోధనతో మొదలయ్యింది. అంటే భూప్రజల చేత చక్కగా నుతింపబడే వాడా అని అర్థం. అంటే నువ్వంత గొప్పవాడివని నాకు తెలుసు అని ముందుగానే ప్రకటిస్తున్నాడు. అలా మూడు లోకాలలోకెల్లా పవిత్రమైనవాడివి నిన్ను అశుచి అని అనడం కుదురుతుందా? అయినా విషయం ఏమిటంటే, నా దేవేరి మహా పవిత్ర, పతివ్రత. అందువల్ల ఆవిడ ఆశుచులకి కనపడదు (కానన్=చూడ్డానికి, కాదు=అవ్వదు). అని చెప్పి, మళ్ళీ "అనవద్యా!" అన్న సంబోధనతో ముగించాడు. అనవద్యుడంటే దోషములేనివాడు. అంటే ఉదంకుని మీద తనకున్న అచంచల గౌరవాన్ని ప్రకటిస్తూనే, అసలు విషయం చెప్పాడన్న మాట. ఇలాంటి పద్యాలు Communication trainingలో ఉదాహరణలుగా చెప్పదగ్గవి!
అలా చెప్పబట్టే ఉదంకుడు చిన్నబుచ్చుకోకుండా, కోపగించుకోకుండా, నింపాదిగా ఆలోచించాడు. ఆలోచిస్తే, తాను ఎద్దు పేడని తిన్నానన్న సంగతి గుర్తుకువచ్చింది. ఒహో బహుశా అందుకే కాబోలు అశుచి దోషం తనకి కలిగిందని అనుకొని, శుభ్రంగా చేతులు కాళ్ళు ముఖము కడుక్కొని, తూర్పుకు తిరిగి ఆచమనం చేసి శుద్ధిచేసుకొని, పౌష్యుడి అనుమతి తీసుకొని మళ్ళీ అంతఃపురానికి వెళ్ళాడు. ఇప్పుడతనికి ఆ పౌష్యా దేవి కనిపించింది. అతనికి నమస్కరించి తన కుండలాలని సంతోషంగా ఇచ్చింది.
ఇదొక విచిత్రమైన సన్నివేశం. ఏ గోమయమాన్ని తింటే కార్యం సఫలమవుతుందని ఆ దివ్యపురుషుడు చెప్పాడో అదే ఆటంకమయ్యింది! ఎందుకిలా జరిగింది? అసలా దివ్యపురుషుడు ఎవరు, ఆ గొమయం ఏమిటి అన్న విషయం ప్రస్తుతానికి పక్కనపెడితే, ఉదంకుడు తాను తిన్నది గోమయమనే భావనతోనే ఉన్నాడు. అంటే మనస్సులో అతనికి శుచిత్వం లేదన్న మాట. అంచేత నిజంగా ఆ గోమయం వల్ల అతనికి అశుచి కలిగినా కలగకపోయినా, మనసులో అతనికా అపవిత్ర భావన కలిగింది కాబట్టి అతను అపవిత్రుడే అయ్యాడు. శుద్ధి చేసుకున్నాక, అతని మనసులోనున్న శంక పోయి అది పరిశుద్ధమయింది. అప్పుడతనికి పౌష్యుని భార్య కనిపడింది.
ఉదంకుడికి కుండలాలని ఇస్తూ పౌష్యుని భార్య తక్షకుడి గురించి చెపుతుంది. తక్షకుడు ఒక నాగరాజు. అతడు చాలా రోజులుగా ఆ కుండలాలపై కన్నేసి ఉంచాడు. అతను చాలా మాయగాడు. ఆ తక్షకుడినుండి కాపాడుకుంటూ తీసుకువెళ్ళమని ఉదంకుడికి చెపుతుంది. సరే అని చెప్పి ఆ కుండలాలు తీసుకొని మళ్ళీ పౌష్యుడి వద్దకు వస్తాడు. అప్పుడా రాజు ఉదంకుడితో, మీరు మా అతిథి కాబట్టి మా యింట భోజనం చెయ్యనిదే వెళ్ళకూడదని అంటాడు. ఇది భారతీయ సంస్కారం, సంప్రదాయం. తొందరలో ఉన్నా, అడిగినప్పుడు కాదనకూడదని సరేనంటాడు ఉదంకుడు. భోజనం చేస్తూంటే అందులో ఒక తలవెండ్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడా అన్నాన్ని అసహ్యించుకొని, కోపించి, సరిగా పరీక్షించకుండా అశుద్ధాన్నం పెట్టావు కాబట్టి గుడ్డివాడవు కమ్మని పౌష్యుడిని శపిస్తాడు. పౌష్యుడు కూడా శాపానుగ్రహ సమర్థుడే. ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నీకు సంతానం కలగకుండు గాక అని ప్రతిశాపం పెడతాడు. సంతానోత్పత్తికి అన్నం మూలాధారమని వేదం చెపుతుంది. వెండ్రుక వచ్చిన దోషానికి అన్నాన్నే ఈసడించినందువల్ల అతను సంతానహీనుడయ్యాడన్నది ఇందులోని రహస్యం. ఉదంకుడప్పుడు, అయ్యో నేను సంతానహీనుణ్ణి కాలేను, శాపం ఉపహరించు అంటాడు. దానికి పౌష్యుడు ఇలా అంటాడు:
నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత, విప్రులయందు, నిక్కమీ
రెండును రాజునందు విపరీతము, గావున విప్రుడోపు, నో
పం డతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మఱింపగన్
ఇది బాగా ప్రాచుర్యం పొందిన పద్యం. ఇక్కడ పౌష్యుడు చెప్పదలుచుకున్నది తానిచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని. కాని దానికి హేతువు కూడా చెపుతున్నాడు. ఆ చెప్పడం కూడా ఎంతో సొగసుగా చెపుతున్నాడు. విప్రుల నిండుమనసు అప్పుడే చేసిన వెన్నతో సమానము. అంటే అంత మృదువైనది. కాని వాళ్ళ మాట మాత్రం దారుణమైన వజ్రాయుధమంత కఠినం (ఆఖండలుడు అంటే ఇంద్రుడు. అతని శస్త్రం వజ్రాయుధం). కాని రాజు విషయంలో ఈ రెండూ విపరీతం, అంటే ఇటునుంచి అటు. రాజు హృదయం వజ్రాయుధమంత కఠినమైనా వాక్కు వెన్నంత మెత్తగా ఉంటుంది! ఈ లక్షణాలు వాళ్ళ వాళ్ళ వృత్తులవల్ల వాళ్ళకి సంక్రమిస్తాయన్న విషయాన్ని అక్కడ వాడిన పదాల ద్వారా స్ఫురింపచేసాడు నన్నయ్య. విప్రుడంటే వేదాలు చదివినవాడు. నిరంతర వేద పఠనం వలన విప్రుల వాక్కు కాఠిన్యాన్ని పొందుతుంది. కాని వాళ్ళకి ఎవరిపైనా ద్వేషమో, కోపమో ఉండాల్సిన అవసరం లేదు. కఠినంగా ఆలోచించాల్సిన, ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు. రాజు అలా కాదు. రాజు రాజ్యాన్ని ఏలేవాడు. అతను నరపాలుడు. అంచేత అతని మనసు వివిధ విషయాలలో చీకాకు పొందుతూ ఉంటుంది. రాగద్వేషాలతనికి కలుగుతూ ఉంటాయి. అతనికి చాలామందితో కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మెత్తగా మాట్లాడవలసిన అవసరమూ ఉంది. ఈ లక్షణాల కారణంగా విప్రుడు తన శాపాన్ని వెనక్కు తీసుకోగలడుట, రాజు మాత్రం ఆ పని చెయ్యలేడట! అంతేకదా మరి. మాట కన్నా మనసు శక్తివంతమైనది.
ధారాశుద్ధి, చిక్కదనం రెండిట్లో ఏ ఒక్కటీ చెడకుండా కూర్చిన పద్యమిది. ఇతిహాసాన్ని కావ్యంగా మలచేటప్పుడు ఎలాంటి నేర్పు చూపించాలో, ఈ పద్యాన్ని దీని సంస్కృత మూలంతో పోల్చి చూస్తే తెలుస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశీలించవచ్చు. ఈ పద్యం గుఱించి విశ్వనాథవారు "సాహిత్యసురభి" పుస్తకంలో ఇచ్చిన వివరణ ఇక్కడ చదువుకోవచ్చు:
http://groups.yahoo.com/group/Chandassu/message/1072
పౌష్యుడలా వివరించి, కాబట్టి నువ్వే నీ శాపాన్ని తిరిగి తీసుకోమని ఉదంకుడిని కోరతాడు. సరే కొద్ది కాలంలోనే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పి ఉదంకుడు అక్కడనుండి బయలుదేరతాడు. గురుకార్యం సఫలమయిందని సంతోషిస్తూ తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. తోవలో ఒక సరస్సు కనిపిస్తే, గట్టున ఒక చోటును శుభ్రం చేసి, కుండలాలని అక్కడ పెట్టి, స్నానానికని ఆ సరస్సులోకి దిగుతాడు. అంతదాకా తక్షకుడు ఉదంకుణ్ణి ఒక దిగంబరుడి వేషంలో అనుసరిస్తూనే ఉంటాడు. ఉదంకుడు ఎప్పుడైతే కుండలాలని విడిచి సరస్సులోకి వెళ్ళాడో అప్పుడా కుండలాలని చేత చిక్కించుకొని పరుగు లంకించుకుంటాడు. ఇది చూసిన ఉదంకుడు ఆ తక్షకుడి వెంటపడి అతడిని పట్టుకుంటాడు. వెంటనే ఆ తక్షకుడు మనిషి రూపాన్ని విడిచి, తన అసలు రూపమైన పాముగా మారి, ఒక పుట్టలోకి దూరి కుండలాలతో పాటు పాతాళలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడుకూడా వాడి వెంటే ఆ పుట్టలోంచి నాగలోకానికి వెళతాడు. తక్షకుడైతే పాము రూపంలో చకచకా పుట్టలోంచి దూరిపోయి వెళిపోతాడు. మరి మనిషైన ఉదంకుడు ఎలా వెళ్ళగలడు అనే అనుమానం మనకి రావచ్చు. ఇక్కడే నన్నయ్య మితభాషిత్వం మనకి తెలుస్తుంది. ఉదంకుడు ఎలా వెళ్ళగలిగాడో వాచ్యంగా మనకి చెప్పడు. కాని దాన్ని ఇప్పటికే కథలో స్ఫురింపజేసాడు. ఒక్కసారి కిందటి టపాలో మొదట ఉదంకుడి గుఱించిన వర్ణనలో ఏముందో చూడండి. ఉదంకుడు అణిమాది సిద్ధ విద్యలన్నీ నేర్చినవాడు అని అక్కడుంది కదా. కాబట్టి ఆ విద్యలని (అందులో లఘిమ అన్నదొక విద్య. దాన్ని ఉపయోగించి మనిషి ఎంత చిన్నగానైనా మారిపోవచ్చు!) ఉపయోగించి వెళ్ళాడని మనం ఊహించవచ్చు. అరిటిపండు వలిచిపెట్టినట్టుగా ప్రతి చిన్న విషయాన్నీ అనవసరంగా విశదీకరిస్తే అది మంచి కవిత్వం అవ్వదు. పూర్వాపర సంబంధంతో పాఠకుడికి కొన్ని విషయాలని స్ఫురించేట్టు వ్రాసినప్పుడే అది చిక్కని కవిత్వం అవుతుంది.
నాగలోకం చేరిన ఉదంకుడికి నాగజాతి ప్రముఖులందరూ కనిపిస్తారు. వాళ్ళని నాలుగు పద్యాలలో స్తుతిస్తాడు. ఆ నాలుగూ పద్యాలూ నన్నయ్యగారి అద్భుత రచన!
మొదటగా ఆదిశేషుని (అనంతుడని కూడా అంటారు) స్తుతించే పద్యం:
బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయైన అ
య్యహిపతి దుష్కృతాంతకు డనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్
ఎన్నో అడవిచెట్లతోనూ (పాదపము అంటే చెట్టు), సముద్రాలతోనూ (అబ్ధి), కులపర్వతాలతోనూ, పూర్ణ సరః అంటే నిండైన సరస్సులతోనూ, సరస్వతీ అంటే నదులతోనూ, సహిత=కూడిన, మహా భూభారాన్ని, అజస్ర=స్థిరమైన, సహస్రఫణాళి=వేయిపడగలతో, దాల్చి, దుస్సహరత=భరింపశక్యము కాని మూర్తి కల విష్ణుమూర్తికి నిరంతరం పాన్పుగా ఉన్న నాగరాజు అనంతుడు, దుష్కృతాంతకుడు=పాపములని అంతమొందించేవాడు, మాకు ప్రసన్నుడు అవుగాక - అని ప్రార్థన.
ఇందులోని పదాల పొహళింపు పాము బుసని ఎలా ధ్వనిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు, అది అనుభవైకవేద్యం. భావంలో కూడా ఆ అనంతుడు ఎంత గొప్ప భారాన్ని మోస్తున్నాడో సార్థకమైన పదాలతో ధ్వనింప చేసాడు నన్నయ్య. విశ్వమంతా వ్యాపించినవాడు విష్ణుమూర్తి. అందుకే అతను దుస్సహతర మూర్తి. ఒక వైపు తన పడగలతో భూభారాన్ని మోస్తూ, మరొక వైపు ఆ దుస్సహతర మూర్తికి పానుపయ్యాడు, అది కూడా నిరంతరమూ! అంతే కాదు అక్కడ విష్ణుమూర్తికి ఉపయోగించిన పదం జాగ్రత్తగా చూడండి. అతను "జలధిశాయి". అంటే సముద్రంలో శయనించేవాడు. కాబట్టి అతని పానుపైన ఆదిశేషువు కూడా సముద్రంలోనే ఉండాలి కదా. ఇంత భారాన్ని మోస్తూ అతనున్నది అస్థితరమైన సముద్రంలో నన్న మాట! అతని పని ఇంకెంత కష్టమో! అహిపతి, దుష్కృతాంతకుడు అనే పదాలు, తనకు వచ్చిన కష్టాన్ని తొలిగించమని సూచించడానికి. అతను నాగరాజు కాబట్టి అతనికా శక్తి ఉంటుంది. పాపాలని పోగొడతాడు కాబట్టి, తన వల్ల దోషమేదైనా ఉంటే పోగొట్టమని. చివరనున్న "మాకు ప్రసన్నుడయ్యెడున్" అనడంలోని బహువచనం దేనికి అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఇది తెలుగు పలుకుబడి. ఎప్పుడైనా దేవుడిని ప్రార్థించేటప్పుడు "మమ్మల్ని కాపాడు తండ్రీ" అనే అంటాం కాని "నన్ను కాపాడు తండ్రీ" అనడం ఆనవాయితీ కాదు. ఆ "మనం"లో మన కుటుంబం, దేశం, ప్రపంచం కూడా ఇమిడి ఉంది.
మంచి కవిత్వమంటే శబ్దార్థాల మేలికలయిక. దానికి యిలాంటి పద్యాలు మేలి మచ్చుతునకలు.
అనంతుడిని ప్రార్థించిన తర్వాత, ఉదంకుడు వాసుకిని ప్రార్థిస్తునాడు:
అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
సుర మకుటాగ్రరత్నరుచి శోభిత పాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నుడయ్యెడున్
అరిది=అపురూపమైన తపశ్శక్తితో రాక్షసుల చేత (అమరుల అరులు అంటే దేవతల శత్రువులు) బాధలు పొందకుండా నాగులందరినీ రక్షించిన గొప్ప నాగనాయకుడు, ఆనమత్=నమస్కరించుచున్న దేవ రాక్షసుల కిరీటాల చివరనున్న రత్నకాంతులచే ప్రకాశించే పాదాలు గల పార్వతీపతికి అలంకారమైనవాడు అయిన వాసుకి మాకు ప్రసన్నుడు కావాలి.
అనంత వాసుకిల స్తోత్రంలో అంతర్భాగంగా హరిహరులని కూడా స్తుతించినట్టయ్యింది!
ఆ తర్వాత ఐరావతుడనే సర్పరాజుని, చివరకి తక్షకుడిని ప్రార్థిస్తాడు ఉదంకుడు. ఎలా ప్రార్థించాడు, ఆ ప్రార్థనకి మెచ్చి ఆ నాగరాజులు ఉదంకుడికి కుండలాలని తిరిగి ఇచ్చేసారా లేదా అనే విషయాలు తర్వాతి టపాలో చూద్దాం.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Friday, January 28, 2011
ఉదంకుడి కథ - 2
Subscribe to:
Post Comments (Atom)
ఉదంకోపాఖ్యానం వివరిస్తున్నందుకు ధన్యవాదములు. 'మాకు ప్రసన్నుడయ్యెడున్' అనే మకుటంతో వరుసగా ఉన్న ఈ ఐదు పద్యాలే శతక రచన ఆవిర్భావానికి నాంది, స్ఫూరి అని అంటారు.
ReplyDeleteకామేశ్వరరావు గారు
ReplyDeleteమా పట్నంకాని పల్లెకి నెట్ వచ్చి రెండేడ్లు. సంవత్సరం క్రితం చందాదారుగా చేరాను. పట్నం కాని పల్లె కనక సౌకర్యాలకు తక్కువ ఖర్చులకు ఎక్కువగా జీవితం ఉంటుంది. మిమ్ములను చూడడమేకాని వినలేని పరిస్తితి. ఉపకరణాలను ఏర్పాటుచేసుకుని పద్యాలు నా మనుమరాలితో సహా విన్నాము. తను కూడా పద్యాలు చెపుతూ గంతులువేసింది. మీకు చిన్నారులందరికి శతమానంభవతి శతమనంతం భవతి............ఆశీస్సులు. రసవత్తరంగా సాగుతున్న ఉపాఖ్యానలో అప్రస్తుత ప్రసంగం బాగుండదు కనక
హద్దులు దాటని అసౌకర్యంకాని అసభ్యంకాని అప్రస్తుత ప్రసంగాలకి చోటు వేరుగా కేటాయించితే బాగుంటుందేమో సూచన అలోచించండి. తెలుగులో అక్షరాలు ఏబదియారు అందరికి వచ్చును. కాని వాటిని సొగసుగా కూర్చడం కొంతమందికే వచ్చును, అందులో మీరు సిద్ధహస్తులు.
ఉదంకోపాఖ్యానానికి మీ వ్యాఖ్యానం ఆసక్తికరంగా సాగుతోంది. వివరణ చాలా బాగుంది. సేవ్ చేసి దాచుకో దగిన పోస్టులు. ధన్యవాదాలు.
ReplyDeleteఈ ఉదంకోపాఖ్యానాన్ని మాకు కళాశాలలో శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు చెప్పారు. ఇది చదువుతుంటే వారి పాఠం మళ్ళీ వింటున్న అనుభూతి కలుగుతోంది.
1969 తెలంగాణా ఉద్యమం సమయంలో కొందరు మా సహవిద్యార్థులే దౌర్జన్యంగా వారిని వరంగల్ రైల్వే స్టేషనుకు తీసుకువెళ్ళి విజయవాడ వెళ్ళే రైలు ఎక్కించిన సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధ కలుగుతుంది.
"ఉకంకుడు" అన్న పదం వింటే చాలు, నాకు వారే గుర్తుకు వస్తారు.
అరటి పండు వొలిచిపెట్టినట్లు చాల బాగున్నదీ కామేశ్వరోదంకోపాఖ్యానం
ReplyDeleteGood one.
ReplyDelete~sUryuDu
బహు చక్కగా ఉందండి. "బహువనపాదపాబ్ధి .." సమాసయుక్తమైనా కూడా ప్రాసాదంగా, అద్భుతంగా ఉంది. నన్నయ్య కవిత్వశైలి గురించి చాలా బాగా చెబుతున్నారు.
ReplyDeleteకామేశ్వర రావు గారు
ReplyDeleteఉదంకునియందు రాజుకున్న భక్తి శ్రద్ధలలో తేడా లేదు. ఉదంకునికి రాజు యందు గౌరవభావమేకాని మరొకటి లేదు. గహస్థు ధర్మాన్ని పాటించి రాజు భుజించమన్నాడు. ఉదంకుడుకూడా భారతీయ ధర్మాన్ని పాటించి భుజించడం ఆరంభించేడు. ఇంతవరకు అంతా సవ్యంగానేఉంది కాని కేశ మిళితమైన అన్నాన్ని పెట్టినందుకు కోపం పట్టలేక ఉదంకుడు శపించాడు. దానికి ప్రతి శాపం రాజు ఇచ్చాడు. ఈద్దరూ ఎంత గొప్పవారయినా కోపానికి వశులై దారుణ శాపాల పాలబడ్డారు. అంటే కోపాన్ని జయించలేక పోయారు. కోపం ఎంత దుష్కర్మ చేయించుతుందో నేర్చుకోతగిన పాఠము.
కామేశ్వర రావు గారూ, ఉదంకోపాఖ్యానము చాలా బాగా వివరించారు. నన్నయ అక్షర రమ్యత మాటల పొదుపు ఆశ్చర్యము కలుగ చేస్తాయి.
ReplyDeleteవ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteఫణిగారు, ఈ పద్యాలు శతాకలకి స్ఫూర్తినిచ్చాయనడానికి ఆధారాలు లేవు.
శంకరయ్యగారు, మీరు చెప్పిన సంఘటన చదివి చాలా బాధ కలిగింది. "విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న సూక్తికి కాలంచెల్లిపోయింది! అందులోనూ చదువు చెప్పిన గురువుకి అట్లా చెయ్యడం చాలా బాధాకరం.
భాస్కరశర్మగారు, ఈ కథ ద్వారా మీరన్న నీతిని గ్రహించవచ్చు. అర్థంలేని కోపం అనర్థానికే దారితీస్తుంది! అయితే ఇలాంటి కథలలోనుండి నీతిని గ్రహించగలిగే వారెందరు?
కామేశ్వరరావుగారూ, వీలు చూసుకుని భారతంలోని ఆయా ఆఖ్యానాలూ ఉపాఖ్యానాలూ... వీలైనన్ని వాటి గుఱించి వ్రాయవలసినదని మనవి. శ్రీమన్మహాభారతం మూలం చదవటానికి సోమరితనం ప్రదర్శించే నాబోటివారికి చాలా మేలు చెసినవారౌతారు. నెనర్లు.
ReplyDeletebeautiful
ReplyDeletereally amazing discussion by people
ReplyDeleteYour efforts are deeply appreciated. I have been searching for Nagadevatha stothram for some time and I got it here. Thank you very much. May God bless you.
ReplyDelete