"వింటే భారతం వినాలి, తింటే గారలే తినాలి"
మొన్న సంక్రాంతి పండక్కి ఎంచక్కా గారెలు తినడం అయింది! భారతం వినాలంటే ఏ మల్లాదివారో చెపుతూంటేనే వినాలి. వారి భారత ప్రవచనాలు సీడీలుగా వచ్చాయో లేదో తెలీదు, వెతకాలి. అసలు భారతమే "వినిపించబడింది". ఒక్క భారతమనేవి, రామాయణమూ, అష్టాదశ పురాణాలూ కూడా ఎవరో ఎవరికో వినిపించినవే కదా. పూర్వం కావ్యాలు కూడా ఇలా ఒకరు చెపితే పదిమంది వినడమే కాని చదవడం తక్కువే. ఆధునిక కాలంలో చదివే పద్ధతి బాగా వ్యాపించి వినిపించే పద్ధతి వెనకబడింది. టీవీ ఛానళ్ళ ధర్మవా అని అది మళ్ళీ ముందుకొస్తోంది. సరే, అందాకా పుస్తకంలో మల్లిన నరసింహారావుగారు చేస్తున్న మహాభారత పరిచయం చదువుకోవచ్చు. ఆ స్ఫూర్తితోనే భారతంలోని ఉపాఖ్యానాలని మరింత వివరంగా పరిచయం చెయ్యాలనే ఊహ కలిగింది. ఎంతదాకా సాగుతుందో చూడాలి మరి!
భారతంలో అసలు కథతో బాటు కొసరు కథలు మధ్యమధ్యలో చాలానే వస్తాయి. వీటినే ఆఖ్యానకాలని, ఉపాఖ్యానాలని అంటారు. అసలు, భారతం మొదలవ్వడమే ఈ కొసరు కథలతో మొదలవుతుంది. అందులో మొదటగా వచ్చే కథ ఉదంకుడి కథ. అసలు భారతం కథని వైశంపాయనుడు జనమేజయునికి సర్పయాగం సందర్భంలో చెప్తాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే అర్జునుడికి స్వయానా మునిమనవడన్న మాట. జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేసేడు అన్నదానికి కారణం ఉదంకుడి కథలో దొరుకుతుంది. ఆ రకంగా భారత కథ చెప్పబడడానికి మూల బీజం ఉదంకుడి కథ! ఈ కథంతా సౌతి (సూతుని కుమారుడు) శౌనకాది మునులకు చెప్తాడు. ఈ ఉదంకుడి కథ చాలా చిత్ర విచిత్రమైనది. పక్కా జానపద సినిమాలాగా ఉంటుంది! సంస్కృత మహాభారతంలో ఇది చాలా పెద్దదిగానే ఉంటుంది కాని నన్నయ్యగారు అనవసరమైన విషయాలని ఎడిట్ చేసి స్థూలంగా సొంపుగా మనకి చెప్పారు. ఒక విశేషం ఏవిటంటే, సంస్కృతంలో ఇది చాలా వరకు గద్యంలోనే సాగుతుంది. కాని తెలుగులో ఎక్కువ పద్యాలలో సాగుతుంది. అంతే కాదు ఎన్నో సొగసైన, ప్రసిద్ధమైన పద్యాలిందులో ఉన్నాయి.
సరే, ఇక అసలు కథలోకి ప్రవేశిస్తే... అననగనగా ఉదంకుడనే (ఉతంకుడని కూడా అంటారు) ముని ఉన్నాడు. అతను పైలముని శిష్యుడు (సంస్కృత భారతంలో వేద ముని శిష్యుడని ఉంది). అతడెలాంటి వాడంటే,
పంకజభవ సన్నిభు డఘ
పంక క్షాళన మహా తపస్సలిలు డనా
తంక మతి పైలశిష్యు డు
తంకుండను మునివరుండు తద్దయు భక్తిన్
పంకజభవుడంటే బ్రహ్మ కదా. అతని సన్నిభుడు అంటే బ్రహ్మవంటి వాడు (బ్రహ్మచారి) అని అర్థం. పాపమనే (అఘము) బుఱదని (పంకము) కడిగి వేయగల (క్షాళన) మహాతప్పస్సనే నీరు కలవాడు. ఎలాంటి శంకలూ లేని మనసు కలవాడు. ఎంతో భక్తితో పైలముని దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అపరిమిత నిష్ఠాపరుడై గురువుగారికి పరిచర్యలు చేస్తూ, అణిమాది అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సంపాదించాడు.
విద్య పూర్తయిన తర్వాత గురుదక్షిణ చెల్లించడం అప్పటి ఆనవాయితీ కనక గురువుగారి దగ్గరకి వెళ్ళి ఏ గురుదక్షిణ సమర్పించుకోవాలని అడుగుతాడు. ఆ గురువుగారు, నాకేం అక్కరలేదు కాని నా భార్యకి ఏమైనా అవసరమేమో కనుక్కోమంటాడు. ఆ గురుపత్ని ఉదంకుడిని ఒక వింతైన దక్షిణ కోరుకుంటుంది. పౌష్యుడనే రాజుంటాడు. అతని భార్య కుండలాలు ఒక నాలుగురోజుల్లో తనకి తెచ్చి యిమ్మని అడుగుతుంది. ఆ కుండాలాలకి ఏం మహిమ ఉందో మరి! సరే గురుపత్ని కోఱిక చెల్లించడానికి ఉదంకుడు బయలుదేరుతాడు. అడవి మార్గంలో వెళుతూ ఉంటే మధ్యలో మహోక్షాన్ని (పెద్ద ఎద్దు) ఎక్కి ఉన్న ఒక దివ్యపురుషుడు దర్శనమిస్తాడు. కనిపించి, ఆ వృషభ గోమయాన్ని (పేడని) భుజిస్తే, బయలుదేరిన కార్యం సఫలమవుతుందని చెపుతాడు. ఎవరా దివ్యపురుషుడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. :-) భారతం చదివే పాఠకుడికీ తెలియదు, ఉదంకుడికి కూడా తెలియదు. అయినా అతడు దివ్యపురుషుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి, అతను చెప్పినట్టు చేస్తే తన కార్యం సఫలమవుతుందని నమ్మి, ఉదంకుడు ఆ గోమయాన్ని తిని గబగబా పౌష్యుని దగ్గరకి వెళతాడు. వెళ్ళి ఆ రాజుతో వచ్చిన విషయం ఇలా చెప్తాడు:
ఏను గుర్వర్థ మర్థినై మానవేశ!
కడగి వచ్చితి నిపుడు నీ కడకు వేడ్క
దండితారాతి! నీ దేవి కుండలమ్ము
లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాగ
గురువుగారి కార్యమై నీ దగ్గరకి అర్థినై వచ్చాను. నీ భార్య కుండలాలు ఇచ్చి నా ప్రయత్నాన్ని సఫలం చెయ్యమని కోరుతాడు. ఇక్కడున్న "గుర్వర్థ మర్థి" అనేది కాళిదాసు ప్రయోగం. వరతంతు ముని శిష్యుడు రఘు మహారాజును గురుదక్షిణ అడిగిన సందర్భంలో అతను కూర్చిన పదం. నన్నయ్య సరిగ్గా అలాంటి సందర్భంలోనే ఆ పదాన్ని తిరిగి ప్రయోగించడం కాళీదాసుమీదున్న గౌరవాన్ని ప్రకటించడానికే అయ్యుంటుంది! ఈ పద్యంలో నాలుగు పాదాల్లోనూ ప్రాస యతినే ప్రయోగించడం గమనించండి. నన్నయ్య సాధారణంగా ఎప్పుడూ, ఒక పాదంలో ప్రాసయతి వాడితే ఆ పద్యం అన్ని పాదాల్లోనూ ప్రాసయతినే వాడతారు.
ఈ పౌష్యుడు కూడా ఆ ముని శిష్యుడే. ఆ మహానుభావునికి వినియోగపడితే అంతకన్నా భాగ్యమేముంది తప్పకుండా తీసుకొమ్మంటాడు. మామూలుగా అయితే సేవకుడిని పంపించో, లేదా స్వయంగా వెళ్ళో భార్య దగ్గరనుండి ఆ కుండలాలని తీసుకువచ్చి ఉదంకుడికి ఇవ్వాలి. కాని ఈ రాజొక తిరకాసు పెడతాడు. ఉదంకుణ్ణే తన భార్య వద్దకు వెళ్ళి స్వయంగా అడిగి తీసుకోమంటాడు! ఉదంకుడు సరేనని అంతఃపురంలోకి వెళతాడు. వెళ్ళి చూస్తే అక్కడ మహారాణి కనిపించదు! అంతటా వెతికినా ఎక్కడా ఉదంకుడికి కనిపించదు. ఇంకేం చేస్తాడు. తిరిగి పౌష్యుడి దగ్గరకి వచ్చి జరిగింది చెప్పి, నువ్వే ఆ కుండలాలని తెప్పించి ఇప్పించని కోరుకుంటాడు.
పౌష్యుడి భార్య ఉదంకుడికి ఎందుకు కనిపించ లేదు? ఆ రాణి అంతఃపురంలోనే ఉందా లేదా? ఆ కుండలాలని రాజు ఇప్పిస్తాడా లేదా ఉదంకుడే తీసుకుంటాడా? ఇదంతా వచ్చే టపాలో చూద్దాం! కాస్త సస్పెన్సు ఉండకపోతే ఎలా.:-)
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Friday, January 21, 2011
ఉదంకుడి కథ - 1
Subscribe to:
Post Comments (Atom)
బ్లాగర్లు రాను రాను బిజినెస్ మైండెడ్ మనుషులు అవుతున్నారు.. మీరిలా సస్పెన్సె పెడితే ఎలా... ఇకనుండి టపా చివర్లో సస్పెన్స్ ఉందో లేదో చూస్కుని టపా చదవాలి..
ReplyDeleteపౌష్యుడి భార్య chat లో invisible లో ఉందేమో?
ReplyDeletekidding :) I am looking forward to the rest of the series!
ఆఖ్యానకము/ఉపాఖ్యానము అన్న పేర్లు బావున్నాయండి. అయితే ఈ పేర్లు ఎక్కడినుండి వచ్చాయో? అమరకోశంలో లేవు. అగ్నిపురాణాన్ననుసరించి గద్యానికి ఐదు పేర్లట - కథ, ఆఖ్యాయిక,పరికథ, ఖండకథ,కథానిక.
ReplyDeleteఈ కథ భారతంలోనిదని ఇప్పుడు మీరు చెబుతుంటే తెలిసింది. బావుంది.
@కాకి,
ReplyDelete:-) అలా అయితే మీరు దీని రెండు మూడు భాగాలు కూడా చదవలేరేమో! :-) కాని ఇందులో వ్యాపారాత్మకత ఏమీ లేదు. అసలు నా బ్లాగుకి ఎన్ని హిట్లొస్తాయో కూడా నేను లెక్కపెట్టను. ఏదో చదివేవాళ్ళకి కాస్త ఆసక్తి కలిగించాలని.
@RK,
:-) మనలో మన మాట, ఇంటర్ణెట్లో visible అయినా invisible అయినా పెద్ద తేడా లేదుగా!
@రవి,
ఆఖ్యాయిక, ఆఖ్యానము అంటే చెప్పబడినది, కథ అన్న అర్థం ఉంది. అక్కణ్ణుంచి వచ్చినవే ఆఖ్యానకం, ఉపాఖ్యానం. నన్నయ్య భారతం గురించి చెప్పే పద్యంలో ఆఖ్యానక శబ్దం వాడారు:
అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయమై
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారతపారిజాత మమరున్, ధాత్రీసురప్రార్థ్యమై
The kid is amazingly cute and unbelievably brilliant. God bless her.
ReplyDeleteKumarN
ధన్యవాదాలండీ.ఉదంకోపాఖ్యానం ఎలానూ సీరియల్ గా మొదలు పెట్టారు కాబట్టి తిక్కన గారి ఉపాఖ్యానాన్ని కూడా వ్రాయండి.ఇటువంటి ఉపాఖ్యానాలు మీవంటి వారి ద్వారా విన్నప్పుడు (చదివినప్పుడు)కొత్త కొత్త అర్థాలతో వివరణలు దొరుకుతాయి.
ReplyDeleteనరసింహగారు,
ReplyDeleteఉపాఖ్యానాల పరిచయం ఎంతవరకూ వీలయితే అంతవరకూ చెయ్యడానికి ప్రయత్నిస్తాను. విబుధవరుల వలన విన్నంత కన్నంత అన్నట్టుగా చాలావరకూ ఏవో పుస్తకాలలో చదివిన విషయాలే. సొంత బుఱ్ఱకి తట్టిన ఆలోచనలు అక్కడక్కడా ఉంటాయి.
కామేశ్వర రావు గారు
ReplyDeleteతెలుగుపద్యం నెట్ లో దొరుకుతుందా అని వెతకడం మొదలుపెట్టేను. నెట్టడవిలో వెతకగా ఒకచోట మీ బ్లాగు సమచారం దొరికింది. ఇదేమో చూదామని లోనికి చొరబడితే నాకు కావలసినది ఇదేనని తెలిసింది. అదృష్టం ఏమంటే నా కోరికతీరినది. విచిత్రం ఏ మంటే మొదటిగా ఆదిన్ శ్రీసతి కొప్పుపై తో ప్రారంభమైనది. మిమ్మల్ని చూస్తూనేవున్నాను. ఉదంకునితో ప్రవచన ప్రారంభం బాగుంది. మల్లాదివారి భారతప్రవచనం డి వి డి వచ్చిందా. తెలుపగలరు.
భాస్కరశర్మగారు,
ReplyDeleteమీకు నా బ్లాగు ఉపయోగపడినందుకు చాలా సంతోషం. మల్లాదివారి ప్రవచనాల గుఱించి నాకేమైనా సమాచారం తెలిస్తే ఇక్కడ పంచుకుంటాను.
అసలు ఆరోజుల్లో ఆంధ్రభూమిలో యండమూరి తులసీదళం సస్పెన్సుకి ఏమీ తగ్గలేదుగా!
ReplyDeletebrilliant narration.
ఉపజాతుల్లో ప్రాసయతి వాడకం గురించి మీ అబ్సర్వేషను బాగుంది. మొదటిపాదంలో అలా వాడితే, మిగతా పాదాల్లో కూడా వాడడం వల్ల ఒక సొంపైన శబ్దసౌందర్యం అబ్బుతుంది.
"కాని నన్నయ్యగారు అనవసరమైన విషయాలని ఎడిట్ చేసి స్థూలంగా సొంపుగా మనకి చెప్పారు."
ReplyDeleteమహా భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం లో, ఏ ఒక్కరు వ్యాస భారతం లో ఏది అవసరమో, ఏది అనవసరమో వెదికే ప్రయత్నం చెయ్యలేదు. మార్పులు కనిపించిన చోట, ఆయా కవుల హృదయాల్ని దర్శించే ప్రయత్నం మాత్రమె మనం చేయాలి. ఇది నా అభిప్రాయం. సహృదయం తో స్వీకరించగలరు.
చాలా బాగుంది సార్
ReplyDeleteHyderabad lo ttd 18 parvalu ekkada Dodorukuno cheppagalaru
ReplyDeleteచాలా బాగా వివరించారు ధన్యవాదాలు అండి 🙏
ReplyDelete