శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" పుస్తకం పేరు చాలామంది వినే ఉంటారు. ఆ పేరు వెనక ఒక పద్యం ఉందని ఎంతమందికి తెలుసు? ఆ పుస్తకం చదివిన వాళ్ళకి బహుశా తెలియవచ్చు. పుస్తకం మొదట్లోనే ఆ పద్యం ఉంటుంది. ఆ పద్యం ఇది:
గరళపు ముద్ద లోహ; మవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్;
హరు నయనాగ్ని కొల్మి; ఉరగాధిపు కోరలు పట్టకార్లు; ది
క్కరటి శిరంబు దాయి; లయకారుడు కమ్మరి - వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గసృష్టికిన్
ఒక ఖడ్గ సృష్టిని (కత్తి తయారీ విధానాన్ని) వర్ణించే పద్యమిది. కత్తి తయారికీ కావలసినవేమిటి - ముడిసరుకు లోహం (అంటే ఇనుములాంటి గట్టి మెటల్), దాన్ని అచ్చుపోసి బాగా కాల్చడానికి కొలిమి, కొలిమిలో కాల్చేటప్పుడు పట్టుకోడానికి పెద్ద పెద్ద పట్టకార్లు, ఒక దాయి, పెద్ద సమ్మెట. కాలుస్తూ, కత్తిని సాపు చెయ్యడానికి దాయి (ఇనప దిమ్మ) మీద పెట్టి, దాన్ని సమ్మెటలతో (పెద్ద సుత్తులు) దభీ దభీమని మోదుతారు. ఖణేల్ ఖణేల్ మంటు చప్పుడవుతుంది. సరే ఇదంతా చేసే కమ్మరి కూడా కావాలి కదా!
ఇక్కడ చెపుతున్న కత్తిని తయారు చెయ్యడానికి ఇవన్నీ ఎలా సమకూరాయో కవి చెపుతున్నాడు. లయకారుడయిన శివుడే స్వయానా ఈ కత్తిని తయారుచేసాడట! అతని దగ్గర ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయంటే - లోహమేమో గరళపు ముద్ద, అంటే ముద్దగా చేసిన కాలకూట విషం! దద్దరిల్లుతూ కోట్లకొలదిగా పడే పిడుగులు సమ్మెటలు. హరుని నిప్పుకన్నే మండే కొలిమి. ఉరగాధిపుడంటే పాములరాజైన వాసుకి (శివుడి మెడలో ఉండేది ఇతడే). ఆ వాసుకి కోరలు పట్టకార్లట. ఎనిమిది దిక్కులా భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తూంటాయని అంటారు కదా! వాటినే దిగ్గజాలంటారు. అలాంటి ఒక దిగ్గజం తల దాయిగా మారింది. ఈ సామాగ్రి అంతటితో లయకారుడయిన హరుడే కమ్మరిగా ఆ ఖడ్గాన్ని సృష్టించాడట. అది ఎంత భయంకరమైన ఖడ్గమో మనం ఊహించుకోవలసిందే! ఇంతకీ ఎవరిదీ ఖడ్గం అంటే, శత్రు రాజులను సంహరించే గుణంతో శోభిల్లే మైలమ భీమునిదట. మైలమ భీముని ఖడ్గం ఎంత శక్తివంతమయినదో, శత్రువులపాలిట ఎలా మృత్యుసమానమయినదో ధ్వనించే పద్యమిది. చదవగానే ఒళ్ళు గగుర్పొడిచేలా లేదూ! తెలుగు సాహిత్యం మొత్తంలోనూ ఇంతకన్నా భయంకరంగా ఒక ఖడ్గాన్ని గూర్చి వర్ణించిన పద్యం మరొకటి లేదు! ఈ భీషణ వాక్కు వేములవాడ భీమకవిది.
వేములవాడ భీమకవి పదకొండవ శతాబ్దానికి చెందిన కవి. దక్షారామ భీమేశ్వరుని కొలిచి, అతని చేత నిగ్రహానుగ్రహ శక్తి కలిగిన వాక్కును సంపాదించాడని కథ. ఇతని కావ్యాలేవీ దొరకలేదు కాని ఇతనివిగా చెప్పబడుతున్న ఒక 53 పద్యాలు మాత్రం లభించాయి. ఇందులో చాలా వరకూ చాటువులే. ఒకో చాటువుకీ ఒకో కథ! తిట్టు కవిత్వంలో ఇతడు మహా దిట్ట. బహుశా చిన్నతనంనుండీ ఎదుర్కున్న
ఈసడింపే (తండ్రిలేని బిడ్డ కావడాన) అతని వాక్పారుష్యానికి కారణమని ఒక ఊహ. చాటుపద్యాలయినా, వాటిలో చిక్కని ధార, తళుక్కున మెరిసే భావాలు కనిపిస్తాయి. ఇతను దేశ సంచారం చేస్తూ ఎందరో రాజులని దర్శించినట్టుగా అతని చాటువుల వల్ల తెలుస్తుంది. భీమకవి ప్రభావం శ్రీనాథుని మీద చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. భీమకవిలాగానే శ్రీనాథుడుకూడా దేశసంచారం చేసి వివిధ రాజాస్థానాలని దర్శించినవాడు. అతని మాదిరిగా శ్రీనాథుడుకూడా ఎన్నో చాటువులు చెప్పాడు. అతని కవిత్వ ధార కూడా శ్రీనాథుని బాగా ఆకట్టుకున్నట్టుగా ఉంది. "వచియింతు వేములవాడ భీముని భంగి నుద్దండ లీల నొక్కొక్క మాటు" అని చెప్పుకున్నాడు!
భీమకవి దర్శించిన రాజులలో మైలమ భీముడు ఒకడు. భీమకవికి మైలమ భీమునితో చాలా మైత్రి కలిగింది. మైలమ భీముడు విజయనగర (అంటే రాయల విజయనగరం కాదు, గజపతుల విజయనగరం, మా ఇజీనారం :-) రాజులయిన పూసపాటివారికి పూర్వీకుడు. "ఏరువ భీమ", "భండన భీమ", "చిక్క భీమ" అనే మొదలయిన పేర్లున్నాయితనికి. దేవవర్మకీ మైలమదేవికీ జన్మించినవాడు మైలమ భీమన. ఇతను చాలా పరాక్రమశాలి, సాటిలేని ధైర్యసాహసాలు కలవాడిగా చరిత్ర ప్రసిద్ధుడు. ఇతను పిడుగు పడుతూంటే సాహసంతో దానిని తన కత్తితో నరికినట్లు "పిడుగు నర్కిన చిక్కభీమావనీపతి" అని మరో చాటుపద్యంలో ఉంది. ఇంతటి ప్రసిద్ధమైన ఈ ఖడ్గం కొన్ని సంవత్సరాల కిందటి వరకూ పూసపాటి రాజుల సంస్థానంలో భద్రంగా ఉన్నట్టు చెప్పేవారు. మరి ఇప్పుడది ఉందో లేదో నాకు తెలీదు!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Thursday, December 23, 2010
ఖడ్గసృష్టి
Subscribe to:
Post Comments (Atom)
ఊ..బావుంది, బావుందండి. మా ఆవిడ వాళ్ళ పల్లెలో ఎప్పుడో ఏ కాలంనాటిదో ఖడ్గం ఉంది. అది ఏమేం చేసిందో మరి తెలియదు.
ReplyDelete"వాణి నా రాణి" అని వేములవాడ భీమకవి యేనా అన్నది? ఎప్పుడో విన్నమాట.
పద్యం చాలా బాగుందండీ. ఎక్కడ దొరికింది మీకు? :)
ReplyDelete@రవి : ఆ మాటన్నది పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.
ఈ పద్యం నాకు భలే ఇష్టం. లయకారుడు కమ్మరి అంటె ఎందుకనో నా మనసులో యముణ్ణి ఆ పాత్రలో ప్రతిష్ఠీంచేశాను, కానీ శివుడు ఉండడమే సముచితంగా ఉంది పద్యంలో ఉన్న రూపకాలంకారం సంపూర్ణమయ్యేందుకు.
ReplyDeleteనన్నయ భట్టుని గురించిన నోరివారి నవలలో ఈ వేములవాడ భీమకవి ప్రస్తావన కొద్దిగా వస్తుంది అన్నట్టు గుర్తు.
మంచి పద్యాన్ని పరిచయం చేసారు, ధన్యవాదాలు- సనత్
ReplyDeleteఖడ్గం తయారీకి ముందుగా కావలసింది, ఇనుములాంటి some metal. అదే మొదటి పాదం కడనున్న సమ్మెటల్. భీమకవి పణ్-డితుడే!
ReplyDelete@చంద్రమోహన్ గారూ, పోస్టులో చెప్పినట్టు ఇది శ్రీశ్రీ "ఖడ్గసృష్టి" పుస్తకంలో ఉంటుంది. దీని గురించి వివరణ "తెలుగు చాటువులు-పుట్టుపూర్వోత్తరాలు" (బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారిది) పుస్తకంలో ఉంది. బహుశా చాటుపద్యాల గురించిన ఏ పుస్తకంలోనైనా ఉండవచ్చు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్య మణిమంజరిలో కూడా ఉంది. మనకి తెలుగులో లభిస్తున్న మొట్టమొదటి చాటుపద్యాలు వేములవాడ భీమకవివే!
ReplyDelete@కొత్త పాళీగారూ, అవును శివుడే సరిగా కుదురుతుంది. కావలసిన వస్తువులన్నీ అతని దగ్గరే కదా ఉన్నాయి! ఇది రూపకం కాదు ఉత్ప్రేక్ష అనుకుంటా.
@రాకేశ్వర, హ...హ... మొత్తానికి భీమకవికి కూడా ఇంగ్లీషులో చెప్పే బాధ తప్పలేదంటారా! :-)
అన్నట్టు, ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ పద్యం నాల్గవ పాదంలో యతిని గమనించండి.
బలే.....ఎంత గొప్ప పద్యమండీ...ఇందులో చెప్పిన ఆ తయారీని ఊహించుకుంటే నిజంగానే ఒళ్ళు గగుర్పొడిచింది.
ReplyDeleteమంచి పద్యాన్ని పరిచయం చేసారు. ఓహో భండన భీమ అంటే ఈయనేనా... ఈయన పేరు చాలాసార్లు వినాను. మన ఈజీనారం ఆయనే కదా!
>>> ఈ పద్యం నాల్గవ పాదంలో యతిని గమనించండి
ReplyDeleteఇది మవర్ణ విరామ యతి కదండీ? ('మ'కారానికి సున్నతో కూడిన య,ర,ల,వ,శ,ష,స,హ లకు మైత్రి).
పద్యంలో అందమూ అలంకారమూ వదిలి రాకేశ్వరరావుగారు పన్నుల మీదపడ్డారేమిటి :)
ReplyDeleteI think that wootz steel was famous product of some regions of Telangana. May be Bhima Kavi came from those regions. It was used in Damascus swords and even in later centuries Telangana steel ignots were exported via Masulipatam port:
ReplyDeletehttp://www.dnaindia.com/bangalore/report_search-for-tipu-sultan-s-metal_1366808
2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.
ReplyDeletechala baagundi
ReplyDeleteధన్యవాదాలు భైరవభట్ల కామేశ్వర రావు గారు , శ్రీ వేములవాడ భీమ కవి కేవలం కవినే కాదు ఈయన శ్రీ భీమలింగేశ్వర స్వామి గా ప్రసిద్దుడు .
ReplyDeleteఅనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్ గ్రామం లో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్తానం ఎంతో చరిత్ర గాంచినది . తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం నకు 4 క్రోసుల దూరం లో వేములవాడ గ్రామం లో సోమనాథ మాత్యుడు , మాచమ్మ ఆనే దంపతులకు క్రీ శ 1068 ప్రభావ నామ సంవత్సరము శ్రవణ శుద్ధ శ్రుక్రవారం నాడు జన్మించిన స్వామి తాను కవి గా చాల ప్రాముఖ్యత ను సంపాదించారు , తన ఆద్యాత్మిక బోదనల తో లోక పర్యటన గావించి జనులకు జ్ఞానోదయం చేస్తూ తన జన్మ ఆద్యాత్మిక చింతన కే అంకితమని ప్రకటించి సుమారు 101 ప్రాంతాల లో తన మహిమలను చూపిస్తూ ..........
ప్రతి సంవస్తరం సంవత్సరము ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు నుండి మూడు రోజుల పాటూ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి
మీకు ఎమైన శ్రీ భీమలింగేశ్వర స్వామి ( శ్రీ వేములవాడ భీమ కవి ) గురించి తెలిసివుంటే దిగువున పేర్కొన్న మెయిల్ కు గాని దూరవాణి కి గాని తెలియపరుస్తారని ఆశిస్తువున్నాం
మెయిల్: kacharagadla@gmail.com
దూరవాణి: +91 8008911848
ఓంకారం విశ్వాన్ని విచ్చిన్నంకాకుండ కాపాడుతుంది, వేదవిజ్ఞానం విశ్వంలోని మానవులకు జ్ఞానాన్ని పంచుతుంది మరియు జీవనగమనాన్ని తెలుపుతుంది. ఓంకారం, వేదవిజ్ఞానం మానవ జీవితాలకు అనుసందానంగా, మార్గదర్శకంగా ఉన్నాయి.
ReplyDelete“ ఓంకారం పరమశివుడి ప్రతిరూపం, వేదం బ్రహ్మ స్వరూపం ”
పరమాత్ముడు సృష్ఠిస్థితలయకారకుడు, ఈ సృష్ఠిలో జీవి తమ జీవనగమనంలో ముఖ్యంగా మానవజీవనంలో స్థబ్దత వచ్చిన ప్రతిసారి పరమాత్ముడు మానవరూపంలో అవతరిస్తున్నాడు, మానవజన్మ ఆవశ్యకతను తెలియపరుస్తున్నాడు.
అందులో భాగంగానే భరతఖండంలో రాజ్యహింసలు జరుగుతున్న తరుణంలో, ప్రజలు ప్రకృతి విపత్తులతో సతమతమవుతున్నప్పుడు పరమేశ్వరుడి ప్రతినిధిగా, ప్రతిరూపంగా తూర్పు గోదావరి జిల్లా, ధ్రాక్షరామమునకు 16 క్రోసుల దూరంలో గల వేములవాడ గ్రామమున శ్రీమతి మాచమ్మ మరియు శ్రీ సోమనాథమాత్యులు దంపతులకు ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా ఒక మగ శిశువు జన్మించాడు. ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా బిడ్డ జన్మించాడు కాబట్టి ఆ బిడ్డకు భీమన్న అని నామకరణం చెసారు.
ధ్రాక్షరామ భీమేశ్వర వరప్రసాదంగా, ప్రతిరూపంగా ఈ భువిపై మానవరూపాన జన్మిచాడు కాబట్టి జనజాగృతి చెయదలచి మెదటి దశలో కవిగా(వేములవాడ భీమకవి) తన పద్యకుసుమాలద్వారా మానవజన్మ ఆవశ్యకతను తెలియపరిచాడు. మలిదశలో పరమేశ్వరుడి ప్రతిరూపం భీమలింగేశ్వరుడిగా దేశాటనం చేస్తూ చివరగా అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామములో జీవసమాధినోందారు.
Visit : http://www.shribheemalingeswaraswamy.org/