తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, December 5, 2010

వేటూరి పాట - ఒక "మాత్రా"కావ్యం

మొన్న కార్తీక సోమవారంనాడు పుణ్యంపురుషార్థం కలిసొస్తాయని నాకు బాగా ఇష్టమైన (ఆమాటకొస్తే ఎవరికిష్టం కాదు!) భక్త కన్నప్ప సినిమాలో కిరాతార్జునీయం పాటని నెట్లో వెతికి మరీ విన్నాను. మా చిన్నప్పుడీ పాట రేడియోలో ఉదయాన్నే భక్తిరంజని కార్యక్రమంలో చాలాసార్లు వచ్చేది, ముఖ్యంగా సోమవారాల నాడు. ఒకో దేవుడికి ఒకో రోజు ప్రత్యేకం కదా. అలా ఆ రోజు బట్టి ఆ దేవుడి పాటలు వేసేవారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు ఇలా. ఇదొక సినిమా పాటని, భక్త కన్నప్ప సినిమాలోదని తెలీని వయసునుండే ఈ పాటని వింటూ వచ్చాను. మనసులో అలా పట్టేసింది. ఇప్పుడు రేడియో భక్తిరంజని లేకపోయినా ఇంటర్నెట్టూ గూగులూ ఉన్నాయి కదా! కాబట్టి వెతికిపట్టుకొని వినగలిగాను. అప్పటి రేడియో కన్నా ఇప్పటి ఇంటర్నెట్ మెరుగైన ప్రసారసాధనం. అయితే దాన్ని వాడుకొనే బాధ్యత మాత్రం మనదే. ఉదయాన్నే రేడియో వేస్తే చాలు, ఎంపికచేసిన మంచి పాటలు మనకోసం వినిపించేవి. ఇప్పుడు వెతుక్కొని వేసుకోవలసిన బాధ్యత మనమీద పడింది.

ఈ పాటలో వేటూరి తన విశ్వరూపం చూపించారు. శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించింది. అకాలప్రళయ జ్వాల కనిపించింది. అప్పుడేమయ్యిందో చూడండి:

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

పార్వతీదేవి నివ్వెరపోయింది, శివుని మొహమంతా నవ్వు పరచుకుంది - అని ఎంత సొగసుగా చెప్పాడు వేటూరి.

ఈ పాట నిజంగా ఒక కాప్స్యూల్ కావ్యమే. అయినా ఇది పాట కాని పద్యం కాదు కదా, తెలుగుపద్యంలో దీని గురించి ఎందుకు అని చొప్పదంటు ప్రశ్న వెయ్యొద్దు. నచ్చిన ఈ పాట గురించి నాకిక్కడ చెప్పాలనిపించింది చెపుతున్నానంతే. :-)

ఇంతకుముందు ఎప్పుడో నా బ్లాగులోనే చెప్పినట్టు, ఛందస్సన్నది పద్యాలకి పరిమితం కాదు. పాటల్లో కూడా ఛందస్సుంటుంది. అందులోనూ ఇది శివుని గురించిన పాటాయె. తనికెళ్ళ భరణిగారు అన్నట్టు, శివుడే ఒక యతి. గణాలు అతని చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పైగా అతను "లయ"కారుడు. జాగ్రత్తగా చూస్తే పై రెండు పాదాలూ ఇంచుమించు సీస పద్యపాదాలే, యతి మైత్రితో సహా! ఈ పాటలో చాలా చోట్ల ఈ సీసలక్షణాలే కనిపిస్తాయి. వేటూరికి ఛందోధర్మాలు ఎంతగా తెలుసో యీ పాట నిరూపిస్తుంది. ఎలాంటి గణాలు వేస్తే పాటకి ఎలాంటి నడక వస్తుంది, భావానికి తగిన నడక ఎలా రప్పించాలి అన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే కాని ఇలా రాయలేరు. తాండవానికి తగిన తాళం "తకిటతక తకతకిట"తో మొదలుపెట్టారు పాటని. ఇది అయిదు మాత్రల గణాలు, 3-2/2-3 విరుపుతో సాగుతుంది. దీన్ని సంగీత భాషలో ఖండ చాపు అంటారనుకుంటా (సంగీతం తెలుసున్నవాళ్ళెవరైనా చెప్పాలి).

ఆ తర్వాత అర్జునుడు తపోదీక్షలో చూపిన ఉత్సాహాన్ని ధ్వనిస్తూ, "అతడే అతడే అర్జునుడూ" అని మొదలుపెట్టి, "అనితర సాధ్యము పాశుపతాస్త్రము" అంటూ పాటని పరుగులు తీయించారు. "తకధిం తకధిం", "తకధిమి తకధిమి" అనే తాళాలు (ఛందస్సులో చెప్పుకోవాలంటే, స, నల గణాలు) పరుగులాంటి నడకనిస్తాయి, పాటకైనా పద్యానికైనా. గజేంద్రమోక్షంలో "సిరికిం జెప్పడు" అని సగణంతో మొదలయ్యే పద్యం గుర్తు తెచ్చుకోండి. నాలుగు మాత్రల పదాలతో వచ్చే ఈ నడకని చతురస్ర గతి అంటారు. "UII, IUI, UU" కూడా నాలుగు మాత్రల గణాలే. కాని ఒకో దానికి ఒకో ప్రత్యేకత ఉంది. వేటూరి ఈ పాటలో వాడిన IIU, IIII మాత్రమే వీటిల్లో పరుగులాంటి నడకనిస్తాయి.

అలా పరిగెత్తిన పాట ఒక్కసారి మళ్ళీ శివుని రూపంలోని మార్పుని వర్ణించడం కోసం సీసపు తూగుని సంతరించుకుంటుంది. శివుని రూపాన్ని వర్ణించే ఆ పాదాలన్నీ ఇంచుమించుగా సీసపద్య పాదాల మొదటి భాగాలే! అయితే ఇందులో మరో గమ్మత్తుంది. సీసపద్యంలో ఇంద్రగాణాలు ఏవైనా రావచ్చు అంటే "నల, నగ, సల, భ, ర, త"లు. కాని ఇందులో నల, భ గణాలు నాలుగు మాత్రలు. మిగతావి అయిదు మాత్రలు. ఇక్కడ వచ్చేవన్నీ ఈ అయిదు మాత్రల గణాలే. అంటే మళ్ళీ ఖండ గతి. అయితే దీని నడక తకిట-తక అన్న విఱుపు లేకుండా తకధింత/తద్ధింత అనే వస్తుంది. నడకలోనే కాదు, భాషలో కూడా ఎంత తేడా చూపించారో వేటూరి. భావానికి అనుగుణమైన భాష. తాండవం దగ్గర సంస్కృత పదాల సమాసాల పొహళింపు చూపిస్తే, ఇక్కడ చక్కని జాను తెనుగు కనిపిస్తుంది. అంత శివుడూ ఎఱుకలవానిగా మారుతున్న సందర్భం కదా. ఎంతో నిసర్గ సుందరంగా ఉంటుందీ వర్ణన.

నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా (ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎఱుకలవానిగా మారాడు!)
తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

పై వర్ణన శ్రీనాథుని యీ సీసపద్యానికి ఏమాత్రం తీసిపోదు. (ఇంకా పైనుంటుందన్నా తప్పులేదు!)

వికటపాటల జటామకుటికా భారంబు
కఱకైన జుంజుఱు నెఱులు గాగ
జారు సుధాధామశకలావతంసంబు
పెడకొప్పుపైనుండు పీకెగాగ
ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు
గైరికద్రవ తిలకంబు గాగ
భుజమధ్యమున గ్రాలు భుజగహారంబులు
గురిజపూసల గుబ్బసరులు గాగ

శంకరుండు కిరాతవేషంబు దాల్చి
యగజ చెంచెతయై తోడ నరుగుదేర
బాణి నోంకార దివ్యచాపము ధరించి
వచ్చె వివ్వచు వరతపోవనము కడకు

ఆ తర్వాత మూకాసురుడు వరాహరూపము ధరించి రావడం, అలా చిచ్చర పిడుగై వచ్చిన దాన్ని రెచ్చిన కోపంతో అర్జునుడు కొట్టడం, అది విలవిలలాడుతూ అసువులు వీడడం. ఆ పైన కిరాతార్జునుల వాదులాట, వాళ్ళ యుద్ధం, చివరికి తాడియెత్తు గాండీవంతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపంతో అతిపవిత్రమైన శివుని తలని మోదేసరికి, ఆ దెబ్బకి శివుడు ప్రత్యక్షమవ్వడం. ఒకో సందర్భానికి ఒకో నడక, దానికి తగ్గ యతిప్రాసలతో - ఎన్నెన్ని హొయలు పోతుందో! మొత్తం జరుగుతున్న కథంతా మన కళ్ళకి కట్టేస్తుంది, మనసుకి పట్టేస్తుంది!

వేటూరీ నీకు మరోసారి జోహార్! పాట పూర్తి సాహిత్యం ఇదిగో. చదువుకొని, వింటూ చదువుకొని, చూస్తూ వింటూ చదువుకొని ఆనందించండి.

తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా (వికటమైన గంగ దూకిన జట అనే సంకెల గలవాడు అని)

హరిహరాంచిత కళా కలిత నిలగళా (ఇది సరిగా అర్థం కాలేదు!)
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా (దట్టని కాంతుల సమూహంతో వెలిగే నిటలమున్న చంద్రకళాధరుడు)

జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా

అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!

అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు

నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా

చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే

తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ

కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు

వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ

చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ

ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
(ఇక్కడ "ఘన" అంటే గొప్పది అనే అర్థమే కాకుండా మేఘం అన్న అర్థం కూడా వస్తుంది. మేఘంలాంటి ధనుస్సు ఉఱుములా ధ్వనిస్తూ బాణ వర్షాన్ని కురిపించింది అని అర్థం.)

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె

అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల (అలోకంబౌ పెంజీకటికవ్వల నేకాకృతి వెల్గు!)
గంగకు నెలవై, కళ కాదరువై (కళకి అంటే చంద్రకళకి ఆదరువై అంటే ఆధారమైనదై)
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై (అఘము అంటే పాపం. లవిత్రము అంటే కొడవలి. కొడవలి గడ్డిని కోసినట్టు పాపాన్ని కోసేస్తుందని అర్థం!)
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా,
సృష్టి చెదరగా,

తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే

తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!

19 comments:

  1. అతడే అతడే అర్జునుడూ పాండవ వీర యశోధనుడు
    అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునకై అహోరాత్రములు చేసెను తపస్సు
    అంటూ పాడిన బాలసుబ్రహ్మణ్యం పాడడంలో చిన్న తప్పు చేశాడు. పాదం ఎక్కడికి విరచాలో తెలియక
    అనితర సాధ్యము పాశుపతాస్త్రము
    కోరి ఇంద్రగిరి
    చేరి శివునకై
    అహోరాత్రములు చేసెను తపస్సు

    అని విరిచాడు. పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అనేది సరైన విరుపు. సంగీతం కోసమో, పాడే వేగంలో గమనింపలేదోగాని అర్జునుని చేత ఇంద్రగిరిని కోరించారు. శివుని చేరి తపస్సు చెయించారు. గమనించారా...

    ఇక
    తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
    దగ్గర ప్రశ్నార్థకం పెట్టారు. శివుడు తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడే. అంటే తల్లిదండ్రుల ఆర్ద్రతే (ప్రేమయే) శరీరంగా కలవాడు. అంటే సాకారమైన ప్రేమమూర్తి అనేది దాని అర్థం.

    ReplyDelete
  2. (space సరిగా రాలేదని మళ్లీ post చేస్తున్నాను.

    అతడే అతడే అర్జునుడూ పాండవ వీర యశోధనుడు
    అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునకై అహోరాత్రములు చేసెను తపస్సు
    అంటూ పాడిన బాలసుబ్రహ్మణ్యం పాడడంలో చిన్న తప్పు చేశాడు. పాదం ఎక్కడికి విరచాలో తెలియక
    అనితర సాధ్యము పాశుపతాస్త్రము
    కోరి ఇంద్రగిరి చేరి శివునకై అహోరాత్రములు చేసెను తపస్సు
    అని విరిచాడు. పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి శివునికై అనేది సరైన విరుపు. సంగీతం కోసమో, పాడే వేగంలో గమనింపలేదోగాని అర్జునుని చేత ఇంద్రగిరిని కోరించారు. శివుని చేరి తపస్సు చెయించారు. గమనించారా...

    ఇక తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
    దగ్గర ప్రశ్నార్థకం పెట్టారు. శివుడు తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడే. అంటే తల్లిదండ్రుల ఆర్ద్రతే (ప్రేమయే) శరీరంగా కలవాడు. అంటే సాకారమైన ప్రేమమూర్తి అనేది దాని అర్థం.

    ReplyDelete
  3. thanku very much andi.. ipppudu nenu ade panilo unna.. aakaasavanilo show lo.. meeru cheppinatte morning air fm vandana (just like bhaksti ranjani) program chestunna.) bad luck emitante ippatike bhookailas lo deva deva .. song last song ga play chesesa.oka 5 min. chuste mee pata vesedanni. no prob.s next progrm lo tappaka vesta eee pata. really good song. bhale gurthu chesaru thaks very much... pata mottam opigga rasu abhinandanalu.....keep on doing.....

    ReplyDelete
  4. కామేశ్వర రావు గారికి, శత సహస్ర అభివం(నం)దనలు. మీ విశ్లేషణ ఏదో భావోద్వేగం కలిస్తోంది. మహా మహుడు వేటూరి తెలుగు వారికి ఒక వరం. తెలుగు లెస్సు అవుతున్న తరుణంలో "ధిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర సితకంధరా నీలకంధరా! క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా! విని తరించరా! అని నోరు తిరగదనుకున్న వాళ్ళ నోటిలో కూడ ఆడేలా చేసాడు. భక్త కన్నప్ప లోని కిరాతార్జునీయం ఆయన పదాల గారడీకి, సరళ, సహజ భావ ప్రకటనకు దర్పణం పడుతుంది. శ్రీ పండిత్జీ గారు మరి కొన్ని మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. నిన్నే చదివానండి - వ్యాఖ్య వ్రాయాటానికి మాటలు తోచలేదు. ఇప్పుడు కూడ అదే పరిస్థితి.

    ReplyDelete
  6. "నడకలోనే కాదు, భాషలో కూడా ఎంత తేడా చూపించారో వేటూరి. భావానికి అనుగుణమైన భాష. "

    చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  7. చాలా బావుంది అని చెప్పడం understatement మాత్రమే

    ReplyDelete
  8. కామెంటిన అందరికీ నెనరులు.

    @పండిట్జీగారు, మీరన్నది నిజమే. పాట వేగం వల్ల మీరన్న అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఇలాగే "నెలవంక తలపాగ నెమలి యీకగ మార" అన్న చోట "నెలవంక అనే తలపాగా" అని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది. నెలవంక - "తలపాగికి ఉన్న నెమలి యీకగా" మారిందన్నది సరైన అర్థం. "తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు"కి మీరిచ్చిన వివరణ బాగుంది.

    @పద్మకళగారు, FMలో కూడా భక్తిరంజనిలాంటి కార్యక్రమం చేస్తున్నారన్న మాట! చాలా సంతోషం.

    ReplyDelete
  9. ఇంకొక చిన్న పొరపాటు కూడా ఉంటుంది బాపు దర్శకత్వం లోనో, వేటూరి వారి అన్వయంవల్లనో తెలీదు కానీ "అస్త్రములే విఫలమాయె శస్త్రములే విఫలమాయె" అన్నారు అర్జునికి. మరి అలాంటప్పుడు ఈ వినోదాన్ని గమనిస్తున్న శివుణ్ణి చూపిస్తూ "దిగంతాల కవతల వెలిగే తల" ఎందుకు అకారణం గా (ఉరఫ్ అసంకల్పిత ప్రతీకారచర్యగా) అదరాల్సి వచ్చిందో ...? ఆ తరువాత "తాడియెత్తు గాండివంతో .. అర్జునుడు కొత్తినంతనే" అన్నది బహుశా దానికి సందర్భం గా చెప్పినా ఇది సరైన అన్వయం కాదేమో కదా...

    నేను అనుకోవటం అసలు పాట రాసినప్పుడు వేటురి వారు ముందు అర్జునుడి అనాలోచిత చర్య, తత్ఫలితంగా అతడు ఎంతటి ఘోర అపరాధాన్ని చేశాడు అన్నది వర్ణిద్దాం అనుకోవటం (దూర్వాసుడు విష్ణుమూర్తి హృదయాన్ని తన్నినప్పుడు జరిగినంత తప్పిదమో, అలసిపోయి ఉన్న పరీక్షిత్తు చచ్చిన పాముని ముని మెడలో వేసినప్పుడు జరిగినంత తప్పిదమో అర్జునుడూ చేశాడు అన్నట్టు చెబుదామనుకుని వర్ణించటం) దానితో శివుడి తల అదరటం, సృష్టి చెదరటం, ఆపై అర్జునుడు మూర్చపోవటం, శివుడు స్వస్వరూపం తో ప్రత్యక్షమవ్వటంగా రాసి ఉంటారు కథని. కానీ చిత్రీకరించే సమయం వచ్చినప్పుడు శివుడంతటివాడిని అర్జునుడు కొట్టటం ఏమిటి, తీరా కొట్టాడే అనుకున్నా అంతసేపు దెబ్బ తగిలిన తలని "అంతటి తల, ఇంతటి తల" అని వర్ణన చేస్తూంటే ఎబ్బెట్టు గా ఉండదూ అని నాబోటి వాడెవడొ చెబితే "చరణాలని అటునిటుగా మారిస్తే సరి" అని సరిపెట్టుకున్నారేమో అని అనిపిస్తుంది.

    ఇంకొకటి: తల అదరగా, సృష్టి చెదరగా అన్న తర్వాత అసంపూర్తి గా వదిలేసినట్టు ఉంది అర్జునుడి ప్రస్తావన మొదలౌతుంది. సృష్టి చెదిరిన కారణం చేత, (బహుశా అర్జునుడి మతి భ్రమించి) కొట్టాడు అన్న అర్ధాన్ని అన్వయిస్తున్నట్టు ఉంటాయి ఆరెండు చరణాలు. అర్జునుడు తాడియెత్తు గాండివం తో కొట్టిన కారణం చేత కదా తల అదిరి ఉండాలి....

    ఏది ఏమైనా, ఎల్లా చూసుకున్నా మిగిలిన చరణాలు ఒకదానితో ఒకటి బిగి పట్టున అల్లికతో ఉన్నట్టుగా కనిపించినట్టు గా, ఈ చివరాఖరవి అనిపించవు. మధ్యలో కొన్ని చరణాలు పాట నిడివి మరీ ఎక్కువయ్యింది అని ఎవరైనా కామెంటేస్తే కత్తిరించేశారో, లేక వేటూరి వారి బదులు వారి శిష్యగణం ఎవరైనా 'చెయ్యిచేసుకున్నారో' అని అనుమానం వస్తూంటుంది...

    మీరేమంటారు ??

    ReplyDelete
  10. యూ ట్యూబులో వీడియోని మీరు తిలకించండి..

    http://www.youtube.com/watch?v=BCPFEHPIrUk&p=8A780DF57ED96B99

    ReplyDelete
  11. సనత్ గారు,

    పాట విన్నప్పుడూ చూసినప్పుడూ నాకైతే మీరన్న అన్వయలోపం కనిపించ లేదు.
    "అదరగా, సృష్టి చెదరగా" అంటే "అదిరేట్టుగా, సృష్టి చెదిరేట్టుగా" అని అర్థం. ఇదే పాటలో "చిచ్చర పిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టుపెట్టగా" అన్న చోట, "మట్టుపెట్టడానికి" అని కదా అర్థం, "మట్టుపెట్టాక" అని కాదు. అలాగే ఇక్కడ "శివుని తల అదరగా, సృష్టి చెదరగా" అంటే శివుని తల అదిరింది, సృష్టి చెదిరింది అన్న అర్థం కాదు. శివుని తల అదిరేట్టుగా, సృష్టి చెదిరేట్టుగా తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపమున కొట్టాడు అని.
    ఇది ఈ క్రమంలో ఉండడమే సమంజసం. ఎందుకంటే తలని కొట్టబోయే ముందే అది ఎంత గొప్ప తలో వర్ణించి, అలాంటి తలని కొట్టాడు అని చెప్పడం సరైన పద్ధతి. మరొకటి, అర్జునుడు తాను సంధించడమే మరచిపోయేసరికి అతనికి ఎంత ఆవేశం కలిగి ఉంటుందో చూపిస్తే బాగుంటుంది. అది చూపించాలంటే సంధించడం మరచిపోవడం, తలని మోదడం మధ్య కొంత సమయం ఉండాలి. దానికోసం అతను శివుడి దగ్గరకి నడుచుకు రావడం చిత్రీకరించారు. ఆ సమయంలో పాట ఎలా సాగాలి? సరిగ్గా ఆ సమయంలో శివుని తల గురించి వర్ణిస్తే సరిపోతుంది. అక్కడ చరణాలలో మాత్రలని గమనించండి. "జగతికి సుగతిని..." అని పరుగులాంటి నడకతో మొదలుపెట్టి అర్జునుడు శివుని చేరేకొద్దీ ఆ నడకలో వేగం తగ్గుతూ వస్తుంది.

    మీరు "అదరగా, సృష్టి చెదరగా" అంటే "అదిరింది, చెదిరింది" అని అర్థం చేసుకోడం వల్ల ఇది గందరగోళంగా తోచినట్టుంది.

    ReplyDelete
  12. అయ్యా మీ బ్లాగులో వెతుకుపెట్టె లేదా?నాబోంట్లు ఏమిగావలె?

    ReplyDelete
  13. లేకేం. పేజీ పై...న ఎడం పక్కన చూడండి.

    ReplyDelete
  14. నిలగళా (ఇది సరిగా అర్థం కాలేదు!)..నీలగళా ayuundachchemo.. haalahaalam valla kantam nallagaa vuntundi kadaa

    ReplyDelete
  15. ... నీలకంధరా! క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా! విని తరించరా! ....

    శాంతమ్‌ పాపమ్‌. మహామహులారా! ఇన్నాళ్ళూ మీ‌ కెవ్వరికీ‌ తప్పుతోచటం‌ లేదా? నీలకంథరా.. విని తరించరా అనటం ఏమిటి దరిద్రం! శివుడు తరించటం ఏమిటో. ఈ‌కవిత్వపటుత్వానికి అందరూ మురిసి ముక్క లవ్వటం ఏమిటో‌! నాకైతే వెలపరంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఆ పాట ఒక నిందా స్తుతి కదండీ శ్యామలీయం గారు.. అంత వెలపరం ఎందుకండీ...

      Delete