తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, November 12, 2009

ఛందస్సుతో నడక - 2

క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా పాటలు తీసుకుందాం. ఒక రెండు సినిమా పాటల పల్లవులని క్రింద ఇస్తున్నాను, "తనన" భాషలో. ఆ పాటలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!

మొదటిది:

తనన తనన తనన తనన తానానా
తనన తనన తనన తనన తానానా
తననన తననన తానన తానానా
తననన తననన తానన తానానా
తనన తనన తనన తాన

రెండోది:

తానా తననననన తానా
తానాన తానాన తాన తనానా
తానా తానా తానా
తానా తానా తానానా (అమెరికావాళ్ళ "తానా"కీ దీనికీ ఏ సంబంధం లేదని మనవి :-)

సరే, ఇంక అసలు విషయంలోకి వద్దాము. ఒక వాక్యమో లేదా వాక్య సముదాయమో పలికేటప్పుడు, అందులో ప్రతి అక్షరం పలకడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది అని ముందటి టపాలో చెప్పాను. ఒకో అక్షరాన్ని పలకడానికి తీసుకునే సమయం, ఆ అక్షరాన్నిబట్టి మారుతుంది కదా. ఉదాహరణకి దీర్ఘాలు ఉన్న అక్షరాలు, మామూలు అక్షరాల (హ్రస్వాలు) కన్నా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఉదాహరణకి "ఆకాశము" అన్నప్పుడు "శ", "ము" అనే అక్షరాలు పలకడానికి తీసుకునే సమయం కన్నా, "ఆ", "కా" అనే అక్షరాలు పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే "సంగతి" అన్నప్పుడు "సం" అనే అక్షరం ఎక్కువ సమయం తీసుకుంటుంది పలికేటప్పుడు. ఇలా పలకడానికి మామూలు కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలని "గురువులు" అని ఒక పేరుపెట్టారు. ఎక్కువ సమయం తీసుకోని మిగతా అక్షరాలని "లఘువులు" అని అంటారు. ఈ గురులఘువుల గురించి ఇంతకు ముందు "పెద్దోడు చిన్నోడు" అనే టపాలో వివరంగా వ్రాసాను. ఒక లఘువు పలకడానికి కావలసిన సమయాన్ని ఒక మాత్ర అని అంటారు. గురువుకయితే రెండు మాత్రల సమయం పడుతుందని సుమారుగా సంస్కృత ఛందస్సు వ్రాసినవాళ్ళు నిర్ణయించారు. తమిళ ఛందస్సులలో అయితే మరో కేటగిరీ కూడా ఉంది. తెలుగు ప్రధానంగా సంస్కృత ఛందస్సునే అనుసరిస్తుంది కాబట్టి మనకి ఉన్నవి గురువు, లగువు అని రెండే కేటగిరీలు.

అంచేత ఒక వాక్యంలో ఉన్న గురు లఘువుల క్రమం, లేదా మాత్రల క్రమం, ఆ వాక్యపు నడకని పట్టి ఇస్తుందన్న మాట. ఈ గురు లఘు క్రమంలో ఒక నియమాన్ని పెడితే, అది దాని నడకలో ఒక ప్రత్యేకతని తెస్తుంది. అలాంటి వాక్య సముదాయాలు పద్యం అవుతాయి. అయితే పద్యాన్ని నిర్వచించేటప్పుడు వాక్యాల ప్రసక్తి కాకుండా, పాదాలను నిర్వచిస్తాం. ఒక ప్రత్యేకమైన నడక కలిగిన అక్షర సముదాయాన్ని ఒక పాదం అంటాం. అలాంటి రెండు లేక అంత కన్నా ఎక్కువ పాదాల కలయిక ఒక పద్యం అవుతుంది. దీని గురించి నా మొదటి టపాలోను, "ఛందస్సు - కథా కమామీషు" టపాలోనూ మరి కొంచెం వివరించాను.

మనకి స్కూల్లో పరిచయమయ్యే మొదటి వృత్తం ఉత్పలమాల. "భరనభభరవ" అని కంఠస్థం చేస్తాం కదా. అంతకన్నా ముందే "యమాతారాజభానసలగం" అన్నది కూడా కంఠస్థం చేస్తాము. ఏమిటీ ఛందస్సు? ప్రతి పాదంలోనూ ఉండే గురు లఘువుల క్రమాన్ని నిర్దేశించే ఒక ఛందస్సు ఇది.
UIIUIUIIIUIIUIIUIUIU - ఇదీ ఆ గురు లఘువుల వరస. ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు. ప్రతి పాదంలోనూ అక్షరాలు సరిగ్గా ఇదే గురులఘువుల క్రమంలో ఉండాలన్నమాట. చిన్నప్పుడు మీ తెలుగు టీచరు ఇలాగే ఇదంతా చెప్పేటప్పుడు మీకు బోరుగా అనిపించలేదూ? అనిపించే ఉంటుంది! ఇప్పుడూ అలాగే ఉందా? సరే మనం మరికాస్త సరదా కోసం, కాస్త గ్రాఫిక్కుల జిమ్మిక్కులు చేద్దాం. ఈ గురులఘువుల క్రమాన్ని ఒక గ్రాఫులా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం:


ఇదిగో ఇలా ఉంటుంది! లఘువుకి విలువ 2, గురువుకి విలువ 4 ఇచ్చానిక్కడ. ఎందుకో మరికొంత సేపట్లో తెలుస్తుంది. మొదలు చివరలని స్పష్టంగా చూపించడం కోసం ముందొకటి వెనకొకటి సున్నాలు తగిలించాను. బావుందా! ఉత్పలమాలలో ఉన్న ఏ పద్యాన్ని తీసుకుని ఈ గ్రాఫు గీసినా కచ్చితంగా ఇలాగే ఉంటుంది.

సరే ఇప్పుడిలాగే చంపకమాలని కూడా చూద్దాం:


ఉత్పల చంపకమాలలోని పోలిక ఇట్టే గుర్తుపట్టారు కదా!

సరే ఇంతకీ ముందు టపాలో మనం Pattern Recoginition వగైరా వగైరా మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఛందస్సుకీ ఇలాంటి గ్రాఫొకటి తయారుచేసుకుని, ఇచ్చిన పద్యానికి ఒక గ్రాఫు వేసి పోలిస్తే ఇట్టే తెలిసిపోతుంది, అవునా? మరి ఇందులో ఇంతగా ఆలోచించడానికీ ఏముంది? ఏమీ లేదంటే లేదు, ఉందంటే ఉంది. వృత్త పద్యాలని తీసుకుని చిన్నప్పుడు బడిలో చేసినట్టు గురువు లఘువు గుర్తుపట్టి, దాన్ని వృత్త నిర్వచనలాతో పోల్చి ఏ వృత్తమో సులువుగానే చెప్పవచ్చు. గురు లఘువులని గుర్తుపట్టడమే కొంచెం క్లిష్టమైన పని కాని, అది చేసిన తర్వాత కంప్యూటరు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ Pattern Recognition ఏమీ లేదు. గుర్తుపట్టాల్సిన సమాచారమంతా అచ్చు గుద్దినట్టు ఒకే మూసలో ఉంటే చాలా తేలికగా గుర్తుపట్టెయ్య వచ్చు. సమాచారంలో వైవిధ్యం ఉండి, కొంత శాతం గోల గజిబిజి ఉన్నప్పుడు, అందులోంచి నమూనాని వెలికి తియ్యడం అసలైన ఛాలెంజి. మరి ఇలాంటి వృత్త పద్యాలలో ఆ వైవిధ్యం ఎక్కడనుంచి వస్తుంది?

ఎక్కడ నుంచి వస్తుందంటే, పద్యాన్ని చదివేటప్పుడు వస్తుంది. మనం పద్యాన్ని చదవగానే, లేదా వినగానే ఆ ఛందస్సుని గుర్తుపట్టాలంటే ఎలా? పలికినప్పుడు ప్రతి ఉత్పలమాల పద్యం మనకి ఒకేలా వినిపించదు. ఒకో పద్యం ఒకోలా వినిపిస్తుంది. ఈ వైవిధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రధానమైన కారణాన్ని తెలుసుకుందాము. మనము పద్యం చదివేటప్పుడు, సాధారణంగా ఒకే గుక్కలో చదువుకుంటూ పోము కదా. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటాము. ఎక్కడ? ప్రతి పదం తర్వాత ఒక అతి చిన్న విరామం తీసుకుంటాము. అలాగే వాక్యం పూర్తయినప్పుడు కూడా కొంత విరామం తీసుకుంటాము. మధ్య మధ్యలో తీసుకునే ఈ విరామాలు పద్యపు నడకలో చాలా తేడాలని కలిగిస్తాయి. ఉదాహరణకి ఉత్పలమాల పద్యాలలోవే, ఈ రెండు పాదాలు చదివి చూడండి:

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బోంకుచే

నీ కనుదోయి వెన్నెలలు నిండిన నా హృదయాంగణమ్ములో

చదువుకున్నారా. ఇంక వీటినే గ్రాఫుల రూపంలో చూద్దాము. విరామాలని ఒక అక్షరంగా భావించి, దాని విలువ 1 ఇచ్చి గ్రాఫుని గీస్తే, అవి ఇలా ఉంటాయి:



ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకటే నమూనాకి (ఛందస్సుకి) చెందిన పద్య పాదాలని గుర్తించడం అంత సులువంటారా? కాదు కదా. పద్యాలని విని, వాటి నడకబట్టి ఛందస్సుని కనుక్కోవడంలో ఉన్న కష్టం చాలావరకూ దీని వల్లనే వస్తుంది. ఇలా పదాల మధ్య వచ్చే విరామాలలో తేడాల వల్ల, ఒకే ఛందస్సులోని పద్య పాదాలకి అనేక వేల రకాల నడకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిలోనూ ఉన్న విరామాల గోలని తొలగించి, అసలు నమూనాని గుర్తుపట్టడం ఒక పెద్ద సవాలు. ఆ పనిని మన మెదడు చక్కగా చెయ్యగలదు, తగిన సాధన చేస్తే!
కొంతమంది ఏం చేస్తారంటే, చదివినప్పుడు పదాలతో సంబంధం లేకుండా మూడేసి అక్షరాలని కలిపి చదువుకుని, నడకేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకి, "నీ కనుదోయి..." పాదాన్ని, "నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి. గుర్తుపట్టడం కాస్త సులువవుతుంది. దీని కన్నా కూడా మేలైన పద్ధతి మన మెదడనే కంప్యూటరుకి సాధ్యమైనంత ఎక్కువ "డాటా"ని అందివ్వడమే. అంటే ఒకే వృత్తంలో ఉన్న బోలెడు పద్యాలని మనం కంఠస్థం చేస్తే, ఆ వృత్త నడకని వినగానే గుర్తుపట్ట గలిగే ప్రజ్ఞని మన మెదడు సంపాదిస్తుంది. చక్కని నడకతో పద్యాలని వ్రాయడానికీ, ఆశువుగా పద్యాలని అల్లడానికీ ఈ ప్రజ్ఞ చాలా అవసరం.

వృత్తాలలో నడకని గ్రాఫులలో చూసే ప్రయత్నం చేసాము. వృత్తాల నిర్వచనంలో ఉన్న నిర్దిష్టత, వాటిని పద్యంగా నిర్మించేటప్పుడు (తద్వారా చదివేటప్పుడు) ఎలా లోపిస్తుందో తెలుసుకున్నాము. ఆ గోల ఎక్కడనుంచి వస్తుందో కూడా చూసాము. చేరాగారు వీటిని మూడు స్థాయిలగా వివరించారు ఒకచోట - నిర్వచనము, నిర్మాణము (రచించడం), నిర్వహణ (చదవడము). మనం నిర్మాణము, నిర్వహణ ఒకేలా ఉంటుందని అనుకున్నామిక్కడ. ఈసారికి ఇక్కడతో ఆపుదాం.

తర్వాత టపాలో మన తెలుగు ఛందస్సులని ఇలాగే పరిశీలిద్దాం. ఆటవెలది, తేటగీతి, కందం లాంటి ఛందస్సులని ఇలా గ్రాఫులలో ఎలా చూపించాలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీకేమైనా మంచి ఆలోచన వస్తే, నాతో పంచుకోండి. ఎందుకంటే ఎలా చూపించాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు.

10 comments:

  1. భైరవభట్ల కామేశ్వర రావుగారూ,

    మీ వ్యాసము చాలా ఆసక్తికరముగా ఉన్నది. ఛందస్సు గురించి చిన్నప్పుడు నేర్చుకున్నది unlearn చెయ్యటానికి కొంచెము సమయము పడుతున్నది. ప్రయత్నస్తున్నాను.

    ధన్యవాదములు


    పోతే, మొదటి పాట?

    కన్నే పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు

    ReplyDelete
  2. padyam goes the digital way! పద్యం 2.0 :)

    ReplyDelete
  3. బాగుంది భైరవభట్ల గారూ "తానా" "తన్నా" కార్యక్రమం. నెత్తికెత్తుకున్న పనికి అభినందనలు. మీలాటి కొద్దిమంది , వేలమంది కావాలని ఆశిస్తూ.

    అసందర్భం అనుకోకపోతే, నా చిన్నప్పటి స్నేహితుడు విశ్వనాథం - వాళ్ళ నాన్న సోమయాజిగారు, వాణ్ణి (చేసిన తప్పుడు పనికి) చచ్చేట్టు కొట్టారని ఆగ్రహంతో ఊగిపోతూ మా వద్ద వెళ్ళబోసుకున్న శ్లోకం ఇది. అప్పుడు చిన్నవారం కాబట్టి అర్థం పూర్తిగా తెలియకపోయినా, వాడు దీన్ని చదివిన పద్ధతి చూసి వాడికి పీకలదాకా కోపం వచ్చిందనీ, కదిలిస్తే కసుక్కున పొడిచి పక్కనున్న కాలువలో పడేస్తాడనీ, వాళ్ళ నాన్నగారిని ఏదో చేసెయ్యాలన్న కోపంతో ఉన్నాడనీ మాత్రం అర్థమైంది.

    ఈ మధ్య, అంటే మూడేళ్ళ క్రితం వాడిని కలిసినప్పుడు వాడిచేత రాయించుకున్న అదే పద్యం ఇదిగో మీకోసం. రామేశ్వర శర్మ మా ఇంకో స్నేహితుడి నాన్నగారు. :)

    విశ్వంబొట్టో సోమయాజో జ్యేష్టబిడ్డః
    ఆగ్రహోదగ్రః చక్కగా తన్నె బాబున్
    గోమయమ్మట్టే అంటుకొన్ వంటినిండన్
    రామేశ్వర్పట్టీ వచ్చెన్ ఆగమంగాన్

    మీరు చెప్పిన తానా పద్ధతి కాకపోయినా నాకు అనుభవమయిన ఆగ్రహోదగ్ర పద్ధతి అని ఇక్కడ ఇలా చెప్పవలసి వచ్చింది

    జలసూత్రం విక్రమార్క శాస్త్రి

    ReplyDelete
  4. Very interesting. I think there are some other telugu bloggers who are trying in the similar lines to analyze poetry. Good attempt.

    ~sUryuDu

    ReplyDelete
  5. ""నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి..."

    నేనీ పద్ధతి లోనే కుస్తీ పడుతుంటాను. పద్యాలు చదువుకుని ఆనందించాలనే తపన తప్ప, సొంతంగా పద్యాలు రాయాలనే తపన లేదు కాబట్టి అది సరిపోతుందనుకున్నా నాకు. అయితే "విశ్వదాభి రామ వినుర వేమ" వినీ వినీ, ఆటవెలదిని గుర్తు పట్టటం కాస్త సులువనిపిస్తుంది.

    మంచి ప్రయత్నం, కొనసాగించండి.

    మొదటి పాట :- "తకిట తధిమి తకిట తధిమి తందానా, హృదయ నయన..."

    ReplyDelete
  6. this is too good sir, this is too good. అరగంట నుండు ప్రయత్నిస్తున్నాను.

    ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ రెండు లయలూ చూసినతరువాత నాకు గుర్తుకొచ్చిన మొదటి వ్యక్తి కమల హసన్ , ఎందుకో ఏమిటో తెలియదు. ముందు నాకు కూడా కన్నెపిల్లవని కన్నులున్నవని అనే పాట గుర్తువచ్చింది. కానీ అది ఆందులో వారు ఆడే ఈ ఆటవల్ల అని గమనించి, వేంటనే దానిని త్రోసి పుచ్చాను.

    ఇలా కాదని నేనే రెండు పాటలు వ్రాసుకున్నాను. క్షమించాలి.

    తెలుపు నలుపు పసుపు ఎఱుపు రంగుల్లో
    కలిసి కురిలి మెరిసి విరిసి పాడంగా
    తనువులు మనసులు తామర తూగుల్లా
    పడవలు నదులతొ నెయ్యము పొందంగా
    వలపు కలువ మొగలు విచ్చెఁ


    రాలే చినుకులజడి నాదే
    కోనేటి ఆడేటి నీరది నాదే
    పొంగే వాగూ నాదే
    జల్లూ యేరూ నావేగా


    కొంత సేపు పైపాటలు పాడుకున్నాక, నాకు తట్టిన పాట. (మొదటిదాని ౩,౪ పాదాలకు)
    అలరులు కరియగ ఆడెనదే
    అలకల కులుకుల అలమేల్ మంగా
    అన్న అన్నమయ్య మాట
    ప్చ్ కుదరలేదు.
    తరువాత (మొదటిదాని ౧,౨ లైన్లకు)
    నరుని బ్రతుకు నటన
    ఈశ్వరుని తలపు ఘటన
    ప్చ్
    ఇంక కుదరదులే అని వదిలేశాను. క్రింది కొచ్చి రవి గారి జవాబు చూసి నెత్తీనోరూ బాదుకున్నాను.

    ఇలా కాదని రెండో పాట ఎలాగైనా పట్టాలి అని నిశ్చయించుకొని, నా ఇళయరాజా మహదేవన్ పాటల చిట్టా బయటకు తీసా.
    ముందు రుద్రవీణ ప్రయత్నించి, ఇందాకటి దాని నుండి దూరంపోడులే ఈయన అని అనుకొని, సాగరసంగమం చూస్తే..
    వేదం అనువణువున నాదం
    నాపంచ ప్రాణాల నాట్య వినోదం
    నాలో రేగే ఎన్నో
    హంసా నందీ రాగాలై..
    sweet vindication !


    సోపాన రేఖా చిత్రాల గుఱించి
    ------------------
    మీరు గ్రాఫులో అక్షరానికో ష్టార్లు కూడా పెట్టాల్సింది.
    ఉదాహరణకు ననన అన్నకాడ రెండున్నాయో మూడున్నాయో తెలుసుకోవడం కష్టమయ్యింది. లేదా హిష్టోగ్రాములు వాడవలసింది.

    నేను వాడిన సోపాన రేఖా చిత్రాలు చూసేవుంటారు.
    వృత్తాలకు
    కందాలకు
    లయగ్రాహి
    లయవిభాతి
    గీతపద్యాలకు కూడా అనుకున్నాను కానీ తీఱిక దొరకలేదు.

    ReplyDelete
  7. తండులాని గృహమందు న సంతి
    తిండికైతె బహు మంది వసంతి |
    కుండలెల్ల గదిలోన లుఠంతి
    ముండ నా కొడుకు లెల్ల హసంతి ||
    ఆగ్రహోదగ్ర అజ్ఞాత గారు చెప్పిన విశ్వంభొట్టో శ్లోకం చూశాక నేను చిన్నప్పుడు విన్న పై శ్లోకం గుర్తొచ్చింది. ఇలా వేరు వేరు భాషాపదాలతో వ్రాసే పద్డతిని మణిప్రవాళం అంటారు.a

    ReplyDelete
  8. కామెంటిన అందరికీ నెనరులు.

    రవిగారికి ఒకటి, రాకేశ్వరగారికి రెండూ వీరతాళ్ళు!
    సినిమాపాటలు ఇద్దామనుకున్న వెంటనే గుర్తుకొచ్చింది కన్నెపిల్లవని పాటే. అయితే అందులోనే తననలు ఉన్నాయి కాబట్టి అది మరీ సులువైపోతుందని వదిలేసాను. ఆ వెంటనే గుర్తుకొచ్చింది "తకిట తధిమి". తర్వాత పాట అదే సినిమాలోది దానంత సులువుగా తెలియనిది ఇద్దామని "వేదం అణువణువున నాదం" పాట ఇచ్చాను.

    రాకేశ్వరగారు, మీ జానుతెలుగు పలుకులు హాయిగా ఉన్నాయి. మీరు వ్రాసిన రెండు పల్లవులను అసలు పాటల ట్యూనులో పాడుకుని రెండిటిలో ఏది ఎక్కువ బాగుందో, ఎందుకనో, చెప్పండి చూద్దాం?

    గ్రాఫుల గురించి: Pattern చూపించడం ముఖ్యమని అక్షరాలని చుక్కలతో గుర్తించ లేదు. ఈమారు పెట్టి చూస్తాను. హిస్టోగ్రాములు మొదట ప్రయత్నించాను కాని అందులో pattern అంత బాగా కళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపించ లేదు.
    మీ వృత్తాల టపా చూసిన గుర్తులేదు కాని తక్కినవన్నీ చదివాను. మీరు x-axisలో పదాలని తీసుకున్నారు. ఈ పద్ధతిలో పరిమితి ఏమిటంటే ఇందులో పద్యాలని (నిర్మాణ స్థాయిని) చూపించడమే సాధ్యమవుతుంది. ఛందస్సు (నిర్వచనం/నమూనా) చూపించలేము, అందులో పదాల ప్రసక్తి ఉండదు కాబట్టి. అయితే మీరు చూపించిన విధానాన్ని మరో రకంగా వాడుకోవచ్చని ఆలోచిస్తున్నాను. చూడాలి, అది ఎంతవరకూ వీలవుతుందో!

    ReplyDelete
  9. నాకూ "కన్నెపిల్లే" గుర్తొచ్చింది :)


    అప్రస్తుతం గానియండీ , బాలు గారి గొంతులోనే .. తనన తనన పాటా ఒకటి ఉంటుంది - అందులో - "భావనలొకటై సాగి పోయే వేళ" అని లయ కి సాహిత్యం.. ఆ పాట గురించి చాన్నాళ్లనుంచి వెతుకుతున్నాను

    ReplyDelete