తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, July 20, 2009

అర్జునుడిపై ద్రౌపది అభిమానం

మాగంటి వంశీగారు మొదలుపెట్టిన ఆడియో పుస్తకాల ప్రయత్నంతో నాలో నాటుకున్న ఆలోచన, మొన్న కొత్తపాళీ, రవిగార్ల ప్రయత్నాలు చూసి మొలకెత్తి, భాస్కర రామిరెడ్డిగారు మొన్నటి టపాలో పెట్టిన కామెంటుతో చిగురించి, ఇదిగో ఇప్పుడిలా ఫలించింది.
నాకు సంగీతం రాదు, నేను రాగయుక్తంగా పద్యాలని పాడలేను. కాబట్టి అవి "వినసొంపు"గా అయితే ఉండవు. అసలందుకే వీటిని వినిపించడం ఎందుకని ఊరుకున్నాను. కాని భాస్కర్ గారు అన్నట్టు కనీసం పదాల సమాసాల ఉచ్చారణ, ఆసక్తి ఉన్నవాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందని ఇప్పుడిలా సాహసం చేస్తున్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వినవచ్చు :-)

ప్రస్తుతం మనం విరాటపర్వంలో ఉన్నాం కదా. ద్రౌపది తనకు కీచకునివల్ల కలిగిన అవమానాన్ని భీముడికి వివరించి, తన బాధని అతనికి చెప్పుకుంటున్న సన్నివేశం. ఎలాంటి పాండవులు ఎలా అయిపోయారు అని దుఃఖపడుతోంది ద్రౌపది. ధర్మరాజు గొప్పతనం గంభీరంగా వర్ణించింది. అలాంటి అతను ఇప్పుడిలా పరుల పంచన చేరాడే అని వాపోయింది. భీముని బలపరాక్రమాలు సొగసుగా వర్ణించింది. అలాంటివాడు గరిటపట్టుకున్నాడే అని బాధపడింది. ఇప్పుడు అర్జునుడి వంతు.



తొడరిన హరునైన దోర్బలంబున దన్ను
మిగులంగనీడను మేటి మాట
యమరేంద్రు నర్ధాసనమునకు నైన న
ర్హుండెంతయును నను రూఢిమాట
జమునిల్లు సొచ్చిన జంతువు నైనను
గాచు నెమ్మెయి నను రాచమాట
దను గోరి యూర్వశి దాన వచ్చిననైన
లోలుండు గాడను మేలిమాట

శౌర్యవైభవప్రాభవశౌచములకు
నొరులకైన గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె
యెందు గలుగునె యర్జును నీడువాడు

ఇది కాస్త సులువుగా అర్థమయ్యే పద్యమే.

తొడరిన = ఎదిరించిన, హరునైన = శివుడినైనా, దోర్బలంబున = తన భుజబలంతో, మిగులంగనీడు = మించనియ్యడు, అను మేటి మాట
ఎదిరించినవాడు శివుడైనా తన భుజబలంతో తనని ఓడించనివ్వకుండా చెయ్యగలవాడు. అంటే అతనితో సరిసమానంగా తన శక్తి చూపించగలడు అని అర్థం. అలాంటి గొప్ప మాట,

అమరేంద్రున్ = ఇంద్రుని, అర్ధాసనమునకైన = అర్ధ సింహాసనానికైనా, అర్హుడు ఎంతయు = ఎంతైనా తగినవాడు, అను రూఢి మాట = అని నిశ్చయంగా చెప్పగలిగే మాట
ఇంద్రుని అర్ధ సింహాసనానికి కూడా అర్హుడితను అని నిశ్చయంగా చెప్పగలిగిన మాట,

జమునిల్లు సొచ్చిన = యముని ఇంట్లోకి వెళ్ళిపోయిన, జంతువు నైనను = జంతునునైనా సరే, కాచు నెమ్మెయి = ఎలాగైనా రక్షిస్తాడు, అను రాచమాట = అనే క్షత్రియోచితమైన మాట
యమపురికి వెళ్ళిన జంతువునైనా ఎలాగైనా కాపాడగలడనే క్షత్రియోచితమైన మాట,

తను గోరి యూర్వశి = తనని వరించి ఊర్వశి, తాన వచ్చిననైన = తానే వచ్చినా కూడా, లోలుండు కాడను = చంచలుడు కాడనే, మేలి మాట = మంచి మాట
ఊర్వశి స్వయంగా తనని కోరివచ్చినా చలించడనే మంచిమాట,

శౌర్య, వైభవ, ప్రాభవ శౌచములకు = శౌర్య, వైభవ, ప్రాభవ, శీలములకు సంబంధించి
ఒరులకైన = వేరేవాళ్ళకైతే, కైవారమై = పొగడ్తగా వట్టి స్త్రోత్రంగా, ఉల్లసిల్లున్ = ప్రకాశిస్తాయి
శౌర్యము, వైభవము, ప్రాభవము, శీలముల గురించిన యీ మాటలన్నీ వేరేవాళ్ళకైతే (అర్జునుడికి కాకుండా), అవి వట్టి స్తోత్రాలుగా మాత్రమే ప్రకాశిస్తాయి.

ఒక్కరునికి ఇవియెల్లను నిక్కము అట్టె = ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే

అర్జును ఈడువాడు = అర్జునుడికి సమానమైనవాడు, ఎందు కల్గునె = ఎక్కడైనా ఉంటాడా!

ఇది దీని అర్థం. ఎవరి శౌర్యాన్నైనా పొగడాలంటే "వీడు శివుడినైనా ఎదిరించగల మొనగాడురా అంటాం". ఇది అతిశయోక్తి. నిజంగా శివుడు యుద్ధానికి వస్తే ఎదురించగల నరుడెవడు? ఒక్క అర్జునుడు తప్ప! అర్జునుడు పాశుపతాస్త్రం గురించి తపస్సు చేసినప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసిన సంగతి మనకి తెలుసు కదా. కాబట్టి అర్జునుడి విషయంలో ఆ మాట అతిశయోక్తి కాదు, నిజమే. మిగతా విషయాలు కూడా అంతే. ఇంద్రుని అర్ధాసనం, జంతు రక్షణ, ఊర్వశి వలచి వచ్చినా కాదనడం. ఇక్కడ అర్జునుడు జంతువుని రక్షించిన కథ ఏమిటో తెలియడం లేదు. వ్యాఖ్యానాలలో "గో రక్షణ" అని మాత్రం ఇచ్చి ఊరుకున్నారు.

ఈ పద్య రచనని ఇంతకుముందు పద్యాలతో పోల్చిచూడండి. ధర్మరాజు గురించిన పద్యంలో గాంభీర్యమూ, భీముని గురించిన పద్యంలో సొగసూ ఉంటే, ఈ పద్యంలో అభిమానంతో కూడిన గర్వం కనపడటం లేదూ! ఆ భావమంతా "ఎందు గలుగునె అర్జును నీడువాడు!" అనడంలో ఉంది. ధర్మరాజంటే ద్రౌపదికి చాలా గౌరవం. అంతకు మించి ఆ పద్యంలో మరేమీ కనిపించదు. అదే భీముడైతే, కాస్త చనవుంది. అయినా అతడంటేనూ ప్రేమతోకూడిన గౌరవం ఉంది. వాళ్ళిద్దరూ దైవాంశ సంభూతులనే దృష్టి ఎక్కువగా ఉంది. అదే అర్జునుడి దగ్గరకి వచ్చేసరికి, ఈ పద్యంలో అతడు అచ్చంగా మనిషే. మామూలు మనుషులకి సాధ్యం కాని పనులని చేసిన గొప్ప మనిషి. అంచేత అతనికి సాటి రాగలవాడు మరొకడు లేడు. అతణ్ణి భర్తగా పొందడం ద్రౌపదికి గర్వం. అందుకే అతను చేసిన పనులన్నీ వివరంగా వర్ణించింది. ధర్మజ భీముల విషయంలో అతిశయోక్తి అవసరమయ్యింది. అదే అర్జునుడి విషయంలో అవసరం లేదు. మిగతావాళ్ళ విషయంలో అతిశయోక్తులు కూడా ఇతని విషయంలో స్వభావోక్తులైపోతాయి కదా మరి! ధర్మజ భీముల విషయంలో భాషకీ, చెప్పే తీరుకీ ప్రాధాన్యం ఉంది. ఠీవిగా, సొగసుగా పద్యాలు నడిచాయి. అదే అర్జునుడి విషయంలో అది అవసరం లేదు. అతను చేసిన పనులు వివరిస్తే చాలు. అందుకే భాష, పద్యపు నడక యీ పద్యంలో సాధారణంగా ఉన్నాయి.
జాగ్రత్తగా గమనిస్తే, చివరన "ఒక్కడి విషయంలో మాత్రం ఇవన్నీ నిజమే" అన్న తర్వాత, ఆ ఒక్కడూ ఎవరన్నది ద్రౌపది చెప్పిందా? "ఎందు కలుగునె అర్జును నీడువాడు" అని అనేసింది. అంటే అక్కడ ఆ ఒక్కడూ అర్జునుడు అని మనం అన్వయించుకోవాలి. ఇది ద్రౌపది మనస్థితిని అద్దంపడుతూ, సహజంగా సాగే సంభాషణా శైలి. అర్జునుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ మైమరచిపోయింది ద్రౌపది. ఆ ఒక్కడూ అర్జునుడే అని ప్రత్యేకించి చెప్పాలని ఆమెకి తట్టనే లేదు! అలా అర్జునుడి గురించిన తలపులలో మునిగిపోయిన ఆమె, "అర్జునుడికి ఈడైనవాడు ఎక్కడా లేడు" అని తనలో తానే ఆనందపడుతూ, గర్వపడుతూ ఆ మాటే బయటకి అనేసింది!

ఇంత ఆలోచించి పద్య రచన చేస్తాడు కాబట్టే తిక్కన గొప్ప కవి అనిపించుకున్నాడు! పూర్వం కవిత్వమంటే, ఆత్మాశ్రయమైన గాఢానుభూతి మాత్రమే కాదు. కథా కావ్యాలలో ఈ అనుభూతి పాత్రలని ఆశ్రయించుకొని ఉంటుంది. అందుకే, పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణలూ ఇవన్నీ విశిష్టంగా నిర్వహించడం గొప్ప కవిత్వ లక్షణంగా ఉండేది. ఈ కాలపు కవిత్వ నిర్వచనం వీటికి ఆపాదించి, ప్రాచీన కావ్యాలలో అక్కడక్కడే కవిత్వం కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయపడతారు. ఇది సమంజసం కాదని నా ఉద్దేశం. కావ్య రచన మొత్తాన్నీ కవిత్వంగానే పరిగణించాలి.
ఇక్కడ నాకు వీలునుబట్టి కొన్ని కొన్ని పద్యాలని ఎంచుకొని వివరిస్తూ పోతున్నాను కాని, ఆయా కావ్యాలలో ఇవే కవిత్వమున్న పద్యాలని ఎవరూ అనుకోకండి. ఇలా విడిగా పద్యాలు చదవడం కన్నా, మొత్తం కావ్యాన్ని చదివితే మరింతగా బావుంటుందది. ముఖ్యంగా తిక్కన విషయంలో మరీను. ఉదాహరణకి, పై పద్యం తర్వాత వచ్చే యీ పద్యాలు చూడండి. ఇందులో ద్రౌపది ఆర్తి ఎంతగా మనసుకి హత్తుకుంటుందో స్వయంగా అనుభవించండి.


అరయనతండు మానధను డక్కట రంగమునందు నిల్చి సుం
దరులకు నాట సూపెడు విధం బతిదీనము దాని జూచి యే
పురపుర బొక్కుదుం గడుపు బ్రోచికొనన్ లఘువృత్తి కిమ్మెయిన్
జొరనగువాడె దేవపతిసూనుడు దైవముచేత సూచితే!


మగలకు మేటియైన బలమర్దన నందను బేడిజేయగా
దగునె విధాత నీకునని దైవము దూరుదు నోర్వరాని నె
వ్వగ దలకొన్న నెంతయును వందుదు నిద్దురవస్థ యెన్నడో
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమిసేయుదున్

11 comments:

  1. waiting for video అంటున్నదండి... లంకె లేదు. ఒక్కసారి సరి చూస్తారా?

    ReplyDelete
  2. maa akkaya gariki compititiona eeeyyy
    bagundandi post

    ReplyDelete
  3. ధన్యవాదములు

    ReplyDelete
  4. రెండో దానిలో, వాక్రుచ్చిన పద్యానికి, రాతకెక్కిన పదానికి మొదటి పంక్తిలో తేడా ఉన్నది. అదన్నా సరిచెయ్యండి. ఇదన్నా సరిచెయ్యండి. క్లూ కావాలంటే, మళ్ళీ చూడటానికి వచ్చినప్పుడు సరికాకపోతే చూసి చెప్తా.

    ReplyDelete
  5. కామేశ్వరరావు గారూ ముందుగా నా మనవి ఆలకించినందుకు ధన్యవాదాలు.... మాలాంటి సోమరిపోతులకు చాలా పెద్దపని తప్పించారు.. ఇప్పుడు ఆఫీసులో కూడా ఎవరికీ తెలియకుండా పద్యాలు వినవచ్చు. సందర్భోచితంగా బాగానే పాడారండి.మరి తరువాత టపా ఎప్పుడు?

    ReplyDelete
  6. @Namelessగారు, సరిగానే పనిచేస్తోందండీ. IE, Firefox రెండిటిలోనూ చూసాను. Firefoxలో అయితే Windows media player plug-inని install చేసుకోవాలి. ఇక్కడ కామెంట్లు చూస్తే కొందరికి వినిపించినట్టే ఉంది.

    @Anonymous-1గారు, మీ మొదటి వాక్యం బోధపడలేదు. రెండో వాక్యానికి ధన్యవాదాలు.

    @కొత్తపాళీగారు, సురేష్ గారు, నెనరులు.

    @Anonymous-2గారు, తప్పు సవరించానండీ. చూపించినందుకు ధన్యవాదాలు.

    @భాస్కర్ గారు, నెనరులు. ఎందుకైనా మంచిదని మొదటి రెండు పద్యాలు మామూలుగా చదివాను. మూడో పద్యం చిన్న కూనిరాగం పెట్టాను (తేడా తెలీకపోవచ్చు! :-).

    విన్న అందరికీ చిన్న మనవి. కూనిరాగంతో బాగుందా, లేకుండా బాగుందా, అసలు బాగుందా లేదా నిస్సంకోచంగా తెలియజెయ్యండి.
    నాకు గాత్ర దానం చెయ్యడానికి ఎవరైనా సమర్థులు ముందుకొస్తే మరీ సంతోషం!

    ReplyDelete
  7. చాలా బాగుందండీ! మీ వివరణ చదివాక పద్యం మరోసారి చదివితే, ఇందులో ఇంత కావ్య ప్రతిభ దాగి ఉందా అనిపించింది. గైడ్ సహాయంతో హళెబీడు శిల్పాలను చూసినప్పుడు కలిగే అనుభూతి!

    మొదటి రెండు పద్యాలు వచనంలా చెప్పేశారు. అంత బాగాలేదు. మూడో పద్యం పాడిన విధానం అదుర్స్ !! వీలైతే మొదటి పద్యాన్ని మళ్ళీ పాడండి, రాగయుక్తంగా.

    ReplyDelete
  8. మాములుగా చదివిన మొదటి రెండు పద్యాల కంటే, చివరి పద్యమే భావ యుక్తంగా ధ్వనించింది. మీకు వేరొకరి గాత్ర దానం అవసరం లేదు.

    ReplyDelete
  9. ఈ నాటి సినిమా వీరో,వీరోఇన్ల లాగా గాత్రదానాలు ఎందుకండి.. రంగస్థల నటులుగా స్థిరపడిపోండి. కూనిరాగ పద్యమే బాగుందండి.గాత్రం స్థిరంగా ( హెచ్చు తగ్గులు/ వణుకుడు లాంటివిలేకుండా ) ఉంది.

    ReplyDelete
  10. కడప రేడియోలో నాగసిద్ధారెడ్డి మొదలైనవాళ్లు మహాభారతం గొప్పగా చదివేవాళ్లు. మీ గొంతు, వ్యాఖ్యానం ఇంచుమించు అట్లే వుంది మాస్టారూ.

    ReplyDelete
  11. పాడిన మూడవ పద్యం చాలా చక్కగా ఉందండీ. మొదటి రెండు పద్యాలని కూడా పాడడానికే ప్రయత్నించలేకపోయారా? :)

    ReplyDelete