నిన్న చంద్రమోహన్ గారి బ్లాగులో శివుడు పార్వతి చేత మొట్టికాయ తిన్న సందర్భాన్ని చదివినప్పుడు, అదే హరవిలాసంలో మరో సందర్భం, మరో పద్యం గుర్తుకువచ్చింది.
శివపార్వతులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని చివరికి పెళ్ళిచేసుకున్నాక, శివుడు సపరివారంగా హిమగిరిపైనే, మావగారింటనే నివాసమున్నాడట. "శివుడికి తన భార్యంటే ఎంత ప్రేమో, అలా ఇల్లరికం ఉండిపోయాడు!" అని ఆశ్చర్యపడతాడు శ్రీనాథుడు. అయితే ఆ సంబడం ఎంతో కాలం సాగదు. కొన్నాళ్ళు గడిచాక అత్తమామమలకి అతనిమీద చిరాకు కలుగుతుంది.
ఏవండీ, అల్లుడు ఒక్కడే తమ ఇంట్లో ఉండి కార్యనిర్వాహకుడై అన్నీ చూసుకుంటూ ఉంటే ఏ అత్తమామలైనా ఎన్నాళైనా అతన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. విష్ణుమూర్తి మాత్రం ఇల్లరికపుటల్లుడు కాదూ! పాలకడలిపై శేషతల్పమున హాయిగా సంసారం సాగించుకుంటాడు కదా. అతనిమీద ఎప్పుడైనా సముద్రుడికి చిరాకు కలిగిందా? మరి హిమవంతుడికి శివుడిమీద ఎందుకొచ్చింది చిరాకు?
అసలే శివుడు బిక్షపతి! దానికి తోడు, తన పరివారాన్నంతా మావగారింత్లో దింపాడు. ఆ పరివారం ఎవరయ్యా? భూత పిశాచగణం, పశుగణమూను. వాళ్ళు చేసే భీభత్సం ఇక అంతా ఇంతానా! రాత్రీ పగలు కల్పలతాప్రసూన మాధ్వీకాన్ని తాగి తందనాలాడారు. ఇంకా చాలా చాలా గందరగోళం చేసారు. దానితో హిమవంతుడికి చిఱ్ఱెత్తుకొచ్చింది. రాదు మరీ! కానీ ఏం చేస్తాడు పాపం. తన కూతురు కోరి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అల్లుడాయె! వెళ్ళి తన కూతురిదగ్గరే మొరపెట్టుకుంటాడు.
ఇలా శివుడి బంధుగణాన్నీ, శివుడినీ ఆక్షేపిస్తూ హిమవంతుడన్న మాటల్లో శివుడి ఆకారాన్ని వెక్కిరించే మాంచి అందమైన చమత్కార పద్యం ఒకటి మనకందించాడు శ్రీనాథుడు. అవధరించండి మరి:
తలమీద చదలేటి దరిమీల దినజేరు
కొంగలు చెలగి కొంగొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
భూతి మై జిలికిన బుస్సు రనగ
దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!
సీసమంటే శ్రీనాథుడే అన్నదానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. శ్రీనాథుడు సంస్కృతానికి "డు ము వు లు" చేర్చి తెలుగు పద్యాలు రాసేస్తాడనే వారికి ఇదో చురక. ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! ఆ ఎత్తుగడే ఎంత ఒయ్యారంగా ఉందో మరొక్కసారి చదివి అనుభవించండి!
శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణిస్తున్నాడు.
తలమీద ఉన్న "చదల ఏరు"(అంటే ఆకాశ గంగ)లో దరిమీనులు (ఇవో రకం చేపలు) ఉన్నాయట! జుమ్మని ఎగసిపడే గంగలో చేపలేంటని చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు. శివుడి తలే పెద్ద మడుగైపోయి ఉంటుంది. అందులో చేపలు చేరి ఈదులాడుకోవచ్చు కదా. వాటిని తినడానికి కొంగలతని తల చుట్టూ మూగుతున్నాయట. అవి "కొంగు కొంగు" అని చేసే గోల అంతా ఇంతానా!
మెడలోనేమో పుఱ్ఱెల మాల. శివుడు కదులుతూ ఉంటే, ఆ పుఱ్ఱెలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ చేసే "బొణుగూ బొణుగూ"మనే శబ్దం ఒకటి. అంతేనా! కట్టుకున్న పులితోలు కొంగుచివర, శివుడెక్కి కూర్చున్న నందిని తాకుతూ ఉంటే అది చిరాకుతో (భయంతోనో) చిఱ్ఱుబుఱ్ఱు లాడుతోంది. చేతికి కడియాలుగా కట్టుకున్న పాములు, చేతిలో ఉన్న కకపాలలోని విభూది మీద తుళ్ళినప్పుడల్లా బుస్సు బుస్సు మంటున్నాయి. అంతా గోల గోల!
ఇంత గోలా అవుతూండగానే, "తమ్మిపూ చూలి" (అంటే పద్మంలోంచి పుట్టిన బ్రహ్మ) కపాలాన్ని ఓ చేత్తో పట్టుకొని భిక్షాందేహీ అంటూ వీధివీధి తిరిగి బిచ్చమెత్తుకొంటాడు. అలాటి ముష్టెత్తుకున్న కూడు తప్ప శివుడికి మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా?
పాపం ఎంతగా ఇబ్బందిపడ్డాడో ఆ హిమవంతుడు. లేకపోతే ఇంత ఘాటుగా తన కూతురిముందే అల్లుణ్ణి మరే మావైనా గేలిచేస్తాడా! శ్రీనాథుడికి శివుడంటే ఎంత చనువులేకపోతే ఇలాటి పద్యాలు రాయగలడు!
భక్తి, తత్త్వం, వేదాంతం, మతం ఇవన్నీ పక్కన పెట్టీండి. తమకి తెలియని, ఎన్నడూ చూడని, ఒక నిర్గుణ నిరాకార శక్తికి ఇలాటి అద్భుతమైన ఆకారాన్ని ఊహించిన కల్పనా ప్రతిభకి "ఆహా!" అనకుండా ఉండగలమా? ఒకవైపు నెలవంక, మరోవైపు నీటి బుగ్గ. నుదుటి మధ్య నిప్పు కన్ను. మెడ చుట్టూ పాములు. కట్టుకునేది పులితోలు లేదా ఏనుగుతోలు. ఒక చేత త్రిశూలం, మరో చేత ఢమరుకం. ఇలాటి కల్పన చేసినవాడు ఎంత గొప్ప కవి అయ్యుంటాడు! ఆ కల్పనకి తోడుగా మరెన్ని కథలు, ఎన్ని చమత్కారాలు, ఎన్ని కావ్యాలు!
శ్రీనాథా! నీ ఈ పద్యానికి కనకాభిషేకం చేసే శక్తి నాకు లేదు కాని, నా ఆనందాశ్రువులతో నీకు నా మనసులోనే అభిషేకం చేసాను అందుకోవయ్యా!
చిన్న ప్రశ్న: ఎత్తుగీతి చివరి పాదంలో యతి ఎలా సరిపోయిందో చెప్పుకోండి చూద్దాం?
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Tuesday, February 24, 2009
ఇల్లరికపుటల్లుడు!
Subscribe to:
Post Comments (Atom)
"ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! "
ReplyDeleteనిజంగానే ఒళ్ళు పులకరించింది.
శ్రీనాథుని మీద మీకున్న మమకారం మీ మాటల్లో చక్కగా ప్రతిఫలిస్తూంది. ధన్యవాదాలు.
శ్రీనాధుని కవిత్వం నారికేళపాకం అని చిన్నప్పుడు చదువుకున్నా, కాని మీ మాటల్లో అది కదళీఫలపాకం ఐపోయిందంటే నమ్మండి. చాలా అద్భుతంగా వర్ణించారు, అభినందనలు
ReplyDelete"తలమీద చదలేటి దరిమీల దినజేరు"
ReplyDeleteచదువుతుంటే మస్తిష్కం లో సెలయేరొకటి లయబధ్ధం గా కదులుతున్నట్లు అనిపించింది.
శ్రీనాధా! సరిలేరు నీకెవ్వరూ!!
:-)
ReplyDeleteపైన లక్ష్మిగారి మాట చాలా బావుంది.
ReplyDeleteకామేశ్వర్రావుగారూ, అనితరసాధ్యంగా వివరించారు.
రూప వర్ణన విషయంలో శివుడు వైరుధ్యాల పుట్ట.
అదలా ఉండగా, సుమారొక ఏడాది క్రితం ఒక నాట్య వేడుకలో దక్షుడిపాత్ర వేసే సందర్భం కలిగింది. అందులో దక్షుడు తిట్టే తిట్లు ఇంత కవితాత్మకంగా కాదు గానీ మొత్తానికి అవీ రసవత్తరంగా ఉంటాయి.
ఆహా. ఈమాటలో మొన్ననే శ్రీనాథుడి చాటువుల మీది వ్యాసం చదివినప్పటి నుండీ శ్రీనాథుడికి పేద్ధ విసనకఱ్ఱనైపోయాను. ఇప్పుడు ఇదిగో ఇంకో విందు.
ReplyDeleteమెచ్చడు ఏ శివుడు శ్రీనాథుడి కవిత్వాన్ని? అంతే కదండీ కామేశ్వరరావుగారూ! :)
చాలా బాగుందండి మీ వివరణ.
ReplyDelete-మురళి
మెచ్చును+ఏ శివుండు..
ReplyDeleteఈ విరుపు వల్ల గుర్తుకొచ్చి, ఇంతకు పూర్వం చదివిన చాటుకవిత్వపు పుస్తకం తిరగేసి ఈ పద్యాన్ని పట్టాను..శ్రీనాథుడు సింగభూపాలుని పొగుడుతున్నాడో, తిడుతున్నాడో తెలియనీయలేదుట..కే పొగడ్త, ఏ తిట్టు..
సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావుసింగజనపాలునకే
యుర్వింజెల్లును, దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్కసామజమనుటే..