తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, February 8, 2009

Digital Library లో విశ్వనాథ + నా సోది


సి.బి.రావుగారి బ్లాగులో ఈ మధ్య విశ్వనాథ గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించడం, దాని గురించి వాదనలు చెలరేగడం కొంతమందికి తెలిసే ఉంటుంది. సి.బి.రావుగారు విశ్వనాథ భావజాలం గురించి రాద్దామనుకుంటున్నానని, Digital Libraryలో విశ్వనాథ రచనలకి లంకెలిమ్మని అడిగారు. DLIలో విశ్వనాథ రచనలు చాలా కొద్దిగానే ఉన్నాయి. అయినా అవి అక్కడ వ్యాఖ్యగా ఇవ్వడానికి ఎక్కువే! అంచేత ఇదిగో ఇలా నా బ్లాగులో టపాగా పెడుతున్నాను. ఇవి విశ్వనాథ రచనలు, విశ్వనాథ రచనలగురించిన ఇతర రచనలు.
విశ్వనాథ భావజాలాన్ని అర్థం చేసుకోడానికి "నా రాముడు" అన్న అతని రచన బాగా ఉపయోగపడుతుంది. అది DLIలో లేదు.
DLIలో ప్రస్తుతం ఉన్న పెద్ద అసౌకర్యం, పుస్తక వివరాలలో ఒక consistancy లేకపోవడం. విశ్వనాథ రచనల గురించి వెతకాలంటే, Author అన్న దాన్లో "visvanatha", "viswanatha", "vishwanatha", "viswanadha" ఇలా రకరకాల పదాలతో వెతకాలి. అంచేత నాకు కనపడనివి ఇంకా ఏమైనా ఉండవచ్చు. DLIలో మరొక అసౌకర్యం, పేజి పేజీ Download చేసుకోవాలి.

విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు
కావ్యపరీమళము
లలితాపట్టణపు రాణి
శ్రీకుమారాభ్యుదయము
వల్లభమంత్రి
అల్లసానివని అల్లికజిగిబిగి
ఏకవీర
శ్రీమద్రామాయణ కల్పవృక్షము-యుద్ధకాండము
విష్ణుశర్మ ఇంగ్లిషు చదువు
విశ్వనాథ మధ్యాక్కరలు
ఆంధ్ర ప్రశస్తి
శ్రీమద్రామాయణ కల్పవృక్షము : కిష్కింధ కాండము వొల్.4
కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి
మా స్వామి(విశ్వేశ్వర శతకము)
విశ్వనాథ జీవిత సమగ్రము
విశ్వనాథ నవలలు మనస్తత్వచిత్రణ
విశ్వనాథ సాహిత్య దర్శనం
విశ్వనాథవారి_భక్తి-దేశభక్తి
జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్య వైభవము
విశ్వనాథ శబరి

సరే, ఎలాగూ టపా రాస్తున్నాను కాబట్టి నా సోది కూడా కొంత చెప్పుకుందామనుకున్నాను.
విశ్వనాథ కవిత్వం రాసారు, గేయాలు, పద్యాలు. కథలు రాసారు. నవలలు, నాటకాలు, విమర్శ వ్యాసాలు రాసారు. నేనన్నీ చదవలేదు. చదివిన వాటిలో అన్నీ నచ్చలేదు. విశ్వనాథ నవలలు, కొన్ని కథలూ నాకూ నచ్చలేదు, ముఖ్యంగా అతని శైలి. అతను చేసిన విమర్శతో నేను పూర్తిగా ఏకీభవిస్తాననీ చెప్పలేను. నేను విశ్వనాథని అభిమానించేది కవిగా. నా ఉద్దేశంలో విశ్వనాథ సహజంగా కవి. ఇతర ప్రక్రియలలో కూడా అతని కవిత్వ గుణం చొచ్చుకు రావడం వల్ల వాటి స్థాయి తగ్గిందని నా అభిప్రాయం.
కవిగా మాత్రం అతని స్థాయి చాలా గొప్పదని నా నిశ్చితాభిప్రాయం. దీని గురించి వివరంగా మరో సారి.

అయితే, కవిత్వాన్ని ఆస్వాదించడంలో రెండు రకాలు. ఒకటి కవి చెప్పే విషయం మనసుకి దగ్గరైనదైతే దాని మీద సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. అలానే ఆ కవి భావజాలం ఇష్టం లేకపోతే ఆ కవిత్వాన్ని ఆస్వాదించ లేరు. ఇలాటి సందర్భంలో విమర్శ చేసేటప్పుడు, కవిత్వం (శైలి, రూపం వగైరాల) జోలికి పోకుండా, విమర్శ భావజాలానికి పరిమితమై ఉండాలి.
ఇక రెండవది, కవి భావజాలంతో ప్రసక్తి లేకుండా అతని కవిత్వాన్ని ఆస్వాదించగలగడం, లేదా అది నచ్చకపోవచ్చు. ఇలాటి సందర్భంలో అతని భావజాలం ప్రసక్తి తేకుండా కేవలం అతని కవిత్వ రూపాన్ని గురించిన విమర్శ సరిపోతుంది. నాకంటూ ఒక ప్రత్యేక భావజాలం లేదు (అని నేననుకుంటున్నాను) కాబట్టి సాధారణంగా నా ఆసక్తి కవిత్వాన్ని భావజాలంతో సంబంధం లేకుండా ఆస్వాదించడం, విమర్శించడం. నాకు విశ్వనాథా ఇష్టమే, గురజాడ ఇష్టమే, శ్రీశ్రీ ఇష్టమే. వాళ్ళ రచనలని చదివి నేను ఆనందించగలను.
వస్తు రూపాల రెంటి గురించీ విమర్శ చేసినప్పుడు అది నిజానికి సమగ్రమైన విమర్శ అవుతుంది. అయితే అలా చెయ్యాలంటే ఆ భావజాలం గురించిన మంచి అవగాహన ఉండాలి. లేకపోతే అది పొగడ్తగానో తెగడ్తగానో మిగిలిపోతుంది తప్ప ఉపయోగకరమైన విమర్శ అవ్వదు. అయితే, ఈ భావజాలం గురించి చేసే విమర్శ గురించి నాకు అంత సదభిప్రాయం లేదు. ఎందుకంటే, ఇది విమర్శ చేసే వ్యక్తి భావజాలమ్మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి.

ఉదాహరణకి విశ్వనాథపై వచ్చిన విమర్శనే తీసుకుందాం. నార్లవంటి వారు, ఇతర అభ్యుదయవాదులు (ఆవంత్స సోమసుందర్ వంటివారు కూడా) విశ్వనాథని సాంప్రదాయవాది, తిరోగమనవాది అన్నారు. ఇక్కడ సౌలభ్యం కోసం Rationalistsని కూడా అభ్యుదయవాదూల లెక్కలోకి తీసుకున్నాను. జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారు విశ్వనాథది నవ్య సాంప్రదాయం అన్నారు. ఈ రెండు విమర్శలూ రెండు వేర్వేరు దృక్పథాల నుండి చేసినవి.
వేదాలు, పురాణాలు, కావ్యాలు మొదలైన ప్రాచీన భారతీయ సంప్రదాయానికి చెందిన సమస్త సాహిత్యం పూర్తిగా మానవ సమాజానికి హానికరమని, వాటిలో మంచి ఏమాత్రమూ లేదని అభ్యుదయ వాదుల నమ్మకం. అంచేత వాటిని విలువైనవని భావించే ఎవరైనా వాళ్ళ దృష్టిలో తిరోగమన వాదులే.
జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించ లేని వాళ్ళు. సంప్రదాయంలో కూడా మంచి కొంచెమైనా ఉందని దాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉన్నదని భావించే వారు. అంచేత విశ్వనాథ వాళ్ళకి "నవ్య" సాంప్రదాయ వాదిగా కనిపించారు. విశ్వనాథ సంప్రదాయంలోని నవ్యత వాళ్ళకి కనిపించింది. సంప్రదాయంలోని మంచిని గ్రహించి, చెడుని విడిచిపెట్టి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పడమే విశ్వనాథ భావజాలం అని జి.వి. సుబ్రహ్మణ్యం గారు నిరూపించడానికి ప్రయత్నించారు.
ఈ రెండు రకాల విమర్శలలోని ఏది సరైనది అంటే, దానికి జవాబు లేదు. "అభ్యుదయ వాదుల" భావజాలం నచ్చిన వాళ్ళకి వాళ్ళ విమర్శ సరైనదనిపిస్తుంది. సంప్రదాయమ్మీద గౌరవం ఉన్నవాళ్ళకి రెండవ వాళ్ళ విమర్శ నచ్చుతుంది. ఇక్కడవరకూ బాగానే ఉంది. నాకు హాస్యాస్పదంగా కనిపించే విషయం ఏవిటంటే, ఒకరు మరొకరి విమర్శ తప్పనడం, అది తప్పని ఋజువు చెయ్యబూనడం. ఇది పూర్తిగా నిరర్థకమైన పని! మరొక దురదృష్టకరమైన విషయం ఏవిటంటే, భావజాల విమర్శ పేరుతో కవిత్వ రూప విమర్శకి, ఇంకా ముందుకి వెళ్ళి వ్యక్తి దూషణకీ దిగడం.
సద్విమర్శకీ, కువిమర్శకీ తేడా సి.బి.రావుగారు తన బ్లాగులో లేటెస్టుగా పెట్టిన నార్లగారి విమర్శ, అంతకుముందు రెండు విమర్శలు. నార్లవారిది సద్విమర్శ. మరికొంత వివరంగా ఉంటే ఇంకా బావుండేది. దీనితో నాకు విభేదమూ లేదు, అంగీకారమూ లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు నాకు "భావజాల" విమర్శ మీద (దాని ప్రయోజనమ్మీద) సదభిప్రాయం లేదు.

భావజాలాన్ని గురించి మరొక రకమైన విమర్శ కూడా ఉంది. అది మార్క్సిస్టు విమర్శ. గతి తార్కిక భౌతిక వాదాన్ని సాహిత్య విమర్శలో ఉపయోగించడం. కొన్ని పరిమితులున్నా, ఇది సాహిత్య విమర్శని నిస్సందేహంగా పరిపుష్టం చేసింది. అయితే దీని ద్వారా సాహిత్యాన్ని "విలువ" కట్టడం కుదరదు. ఒక రకమైన సాహిత్యం వెలువడడానికి కారణమైన సాంఘిక, చారిత్రక, ఆర్థిక పరిస్థితుల గురించి విశ్లేషించేది మార్క్సిస్టు విమర్శ. నాకు తెలిసి విశ్వనాథ సాహిత్యం గురించి అటువంటి విమర్శ రాలేదు. అది దురదృష్టకరం. విశ్వనాథ మొదట్లో అభ్యుదయ భావాలు కనపరచినా, పోను పోను కరుడుగట్టిన సంప్రదాయవాదిగా మారిపోయారని చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. మార్క్సిస్టు విమర్శ గురించి క్షుణ్ణంగా తెలిసిన విమర్శకులు కూడా, విశ్వనాథలోని ఆ మార్పుని అతని వ్యక్తిత్వానికి వదలిపెట్టేసి అతన్ని తిరోగమనవాది అని ఊరుకున్నారు కాని, అటువంటి మార్పు వెనకనున్న కారణాలని సహేతుకంగా విశ్లేషించే ప్రయత్నం చెయ్యలేదు, నాకు తెలిసి. అలాటి విమర్శ, ఆనాటి సామాజిక సాహిత్య వాతావరణం గురించి మరింత లోతుగా తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
సి.బి. రావుగారు చెయ్యాలనుకొంటున్న విశ్లేషణ ఆ దిశగా సాగితే బావుంటుంది.

9 comments:

  1. మీరు సూచించిన విధంగా విశ్వనాధ తత్వాన్ని, రచనలను వివరిస్తూ మరికొన్ని రచనలు ప్రచురిస్తాను. ఇక్కడ (అమెరికాలో) తెలుగు పుస్తకాలు పాతవి లభించటం కష్టం. భారత దేశం వచ్చాక పాత పుస్తకాల అన్వేషణ చెయ్యాలి. మీరు వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు సహేతుకంగా ఉన్నాయి.

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు. నా(మా)లాంటి వాళ్ళకి మీ ఆలోచనల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ వ్యాసం విశ్వనాథవారి గురించి జరుగుతున్న చర్చని ఒక మేలి మలుపు తిప్పగలదని ఆశిస్తున్నాను.

    డిజిటల్ లైబ్రరీలో విశ్వనాధవారి పుస్తకాల లంకెలిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. స్థూల సూక్ష్మ తారతమ్యముచే బరంపరగా దేహబుద్ధీంద్రయాది సంఘమును క్షీరమును మరకతమణివలె నేకీభావమును జెందించి చైతన్యముగలదానినిగా జేయును...ఇంతకన్నా చెప్పేదేమీ లేదు కామేశ్వర రావు గారూ...అర్థం అయ్యిందనే అనుకుంటున్నాను...:)...

    ReplyDelete
  4. భైరవభట్లవారూ, మంచి లింకులిచ్చినందుకు ధన్యవాదాలు. అంతకంటా మీ సోది మరీ ఎక్కువగా ఉపయోగపడేట్టు ఉంది. అందుకు డబల్ ధాంకులు.

    కొన్నాళ్ళ క్రితంవరకూ హేతువాదులు అంటే నిజంగా హేతువుని ఆలంబన చేసుకున్నవాళ్ళు, అభ్యుదయవాదులు అంటే నిజంగా అభ్యుదయాన్ని కాంక్షించేవాళ్ళు అని ఒక అపోహ ఉండేది. అది పోగొట్టడంలో మన బ్లాగ్మిత్రులు చేసిన సాయం ఇంతా అంతా కాదు. ఒక కుందేలుని పట్టుకుని, దాని మూడు కాళ్ళు పట్టుకుని మిగిలిన మనకు కనిపించే కాలుకి హేతువాదం/అభ్యుదయవాదం అని పేరు పెట్టి - కుందేలుకి ఒకటే కాలు అని వాదించేవారు అని అర్థం అయ్యాక కొంత స్వాంత్వన కలిగింది.

    అయినా ఇంత ఘాటుగా అభిప్రాయాలు వెలిబుచ్చడం కూడా అనవసరం. ఇలా తెలిసీ తెలీకుండా వ్యాఖ్యలు వదలడానికి వంశీగారి దగ్గర కోచింగు తీసుకోవాలి. వంశీగారూ, కొంచెం సాయం చెయ్యరా ప్లీజ్...

    ReplyDelete
  5. (నామటుక్కు నేను చూసేంతలో) విమర్శ అన్నది కనీసం అసలు చదవాలా వద్దా అన్నది నిర్ణయించుకునే వఱకూ ఉపయోగపడితే చాలు. వ్యాఖ్యానం కంటె విమర్శకే విలువ ఎక్కువగా కనిపించినా ఏదైనా మనం చదివి ఒక అభిప్రాయాన్ని మనంతట మనం ఏర్పరుచుకోవడం అత్యుత్తమం అని నా అభిప్రాయం.

    విశ్వనాథవారివి ఇన్ని రచనలు అంతర్జాలంలో ఉన్నాయా? కృతజ్ఞతలు.

    ReplyDelete
  6. @Vamsi M Maganti,
    I can not understand your telugu. It is too confusing.

    ReplyDelete
  7. కామేశ్వర్రావుగారూ, బాగా చెప్పారు. ఐతే, విశ్వనాథ వచన రచన దేనికీ తీసికట్టు అని కూడా నేను ఒప్పుకోను. అది మనం వేరేగా మాట్లాడుకుందాము.
    సీబీరావుగారు, మీరు ఇండియ తిరిగి వెళ్ళాక విశ్వనాథ పుస్తకాలు కావాలి అంటే పాత పుస్తకాలు వెదక నక్కర్లేదు. ఆయన నవలలన్నీ తాజా తాజా పునర్ముద్రణలో సెట్టుగా దొరుకుతున్నాయి. కావ్య నాటక ఇతర రచనలు కూడా మళ్ళి వేస్తారు అంటున్నారు.
    చివుకుల .. హ్హ హ హ. మొత్తానికి బ్లాగస్తులతో సహవాసం మీ సెంసాఫ్ హ్యూమరుని బాగా పదును పెట్టినట్టుంది.

    ReplyDelete
  8. మీ కొత్త మూస చాలా అందంగా ఉంది.
    డిజిటల్ లైబ్రరీలో ఇన్ని లింకులు వెతికి పట్టుకోవాలంటే ఓ మూడు రోజులు పడుతుంది - చాలా శ్రమ తగ్గించారు.
    ఈ వ్యాసం చాలా బాగుంది.

    ReplyDelete