ఏడాదైపోతోంది కదా మూసని మారుద్దామని మొన్నీ మధ్యనే అనుకున్నాను, మార్చాను కూడా. కొత్త మూస గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకో హఠాత్తుగా ఉప్పుకప్పురంబు పద్యం గుర్తుకు వచ్చింది. అరే ఈ పద్యాన్ని గురించి ఎప్పుడూ బ్లాగులో ప్రస్తావించనే లేదే అనిపించింది! తెలుగు పిల్లలందరూ మొట్టమొదట నేర్చుకొనే పద్యమాయె. దానికి సముచిత స్థానం కల్పించాలని బ్లాగు శీర్షికలో చేర్చాను.
తెలుగువాళ్ళకి ఈ పద్యం అర్థాన్ని చెప్పాల్సి వస్తే అంత కన్నా దుస్థితి మరొకటుండదు! ఇది అంత సులువైన పద్యం.
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
అయితే ఇందులో ఒక చిన్న విశేషం దాగుంది. నా చిన్నప్పుడెవరో (మా అమ్మగారో, మా ముత్తాతగారో అయ్యుంటారు బహుశా) చెప్పినంత వరకూ నాకీ విషయం తెలీదు. ఒక రోజు నేనీ పద్యం చదువుతూ ఉంటే ఆపి, "ఒరేయ్, ఇక్కడ రుచి అంటే అర్థమేవిటిరా?" అని అడిగారు. చిన్నతనం కదా, వాళ్ళ వంక ఓ తేలిక చూపు విసిరుంటానా ప్రశ్నకి. "రుచి అంటే taste" అని అనుంటాను, అప్పటికే నే చదువుకుంటున్న ఇంగ్లీషు మీడియం పాండిత్యం వంటబట్టి ఉంటుంది (ఈ రోజుల్లో ఇలా తెలుగు పదాలకి ఇంగ్లీషర్థాలు చెప్పి పిల్లలకి బోధపరచడం సర్వసాధారణమైపోయిందనుకోండి!). నా సమాధానానికి ఒక చిరు మందహాసం చేసి, "పప్పులో కాలేసావ్"అన్నారు. నేను తికమక మొహం పెట్టుంటాను. "రుచి అంటే ఇక్కడ కాంతి అని అర్థం. కర్పూరానికి ఉప్పు కన్నా మెరుపెక్కువ" అని వివరణ. మనదసలే లాజిక్ బుఱ్ఱ, "రుచి అంటే కాంతి అని కూడా అర్థం ఉండి ఉండొచ్చు. కాని ఇక్కడ రుచి అంటే మాములు రుచి ఎందుకవ్వదూ?" అని పాయింటు లేవదీసుంటాను. "చూడ చూడ అన్నాడు కదా వేమన. పోని అది రుచి చూడ్డం అనుకుంటే, దాన్ని మరీ అంతగా పరిశీలించి, పరిశీలించి చూడక్కరలేదు. ఒకసారి రుచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలని చెప్పాడు కాబట్టి, అది దీక్షగా చూడ్డమే. అలా చూస్తే ఆ రెంటి మధ్యనున్న మెరుపులో తేడా తెలుస్తుంది. మామూలు కంటికి అది వెంటనే కనిపించకపోవచ్చు." అని ఓర్పుగా నాకు బోధపరిచారు.
ఇంతకీ పురుషులు, పుణ్యపురుషులు కూడా అంతే. చూడ్డానికి ఒకలాగే ఉంటారు. పరికించి చూస్తే వాళ్ళలోని భేదం కనిపిస్తుంది. ఈ తేడాని గమనించి తెలుసుకోడమే విచక్షణ.
ఆటవెలది పద్యాలు రాయాలనుకున్నవారికి వేమన పద్యాలు మంచి మూసని ప్రసాదిస్తాయి. వేమన పద్యాలన్నీ కంఠస్తం చేస్తే దాని నడక పట్టుబడుతుంది. అప్పుడు ఆటవెలది చేత అందంగా నాట్యం చేయించవచ్చు. ఆ నడక పట్టుబడకుండా రాద్దామని ప్రయత్నిస్తే బ్రేక్ డాన్సరు భరతనాట్యం చేసినట్టుంటుంది.
వేమన పద్యాలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. సంస్కృతంలో నాకు తెలిసిన ఒక అనువాదం శ్రీ శ్రీరామ దేశికన్ అనే అతనిది. ఉప్పుకప్పురంబు పద్యానికి వీరి సంస్కృత అనువాదం ఇది:
కర్పూరే లవణే చైవ రూపమేకం రుచిః పృథక్
తథైవ పుణ్యపురుషః పరస్మాత్ భిధ్యతే ధియా
నాకు సంస్కృతం రాదు కాబట్టి ఇది తెలుగు పద్యానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పలేను కాని, ఇది అనుష్టుప్ ఛందస్సు. అనుష్టుప్ కూడా ఆటవెలదిలా చిన్న పద్యం. అందుకే ఆటవెలదిని అనువదించడానికి ఇది అనువైన ఛందస్సు.
వేమన పద్యాలకి ఒక రకమైన శాశ్వతత్వం కలగడానికి కారణం అవి చెప్పే విషయాలు కాలానికి నిలబడ్డం. అవి సార్వకాలికాలుగా అనిపిస్తాయి. ఉదాహరణకి ఈ "ఉప్పుకప్పురంబు" పద్యం ఈ ఇంటర్నెట్ యుగానికి కూడా ఎలా వర్తిస్తుందో చూడండి! మనకి ఇటీవల తెలుగు బ్లాగుల్లో ఐడీ తస్కరలు మొదలయ్యారు. వీళ్ళు రాసే కామెంటు అసలు వాళ్ళు రాసినట్టే కనిపిస్తుంది. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. కాని చూడ చూడ, జాగ్రత్తగా పరిశీలిస్తే తేడా గ్రహించ వచ్చు. Blogger icon కనపడకపోవడం లాంటివి బాహ్యమైన తేడాలు. అవికాదు ముఖ్యం. వాటిలో ఉండే కాంతి భేదం, రుచి భేదం అదీ ముఖ్యం! అసలువాళ్ళ కామెంట్లలో సంస్కారపు వెలుగుని చూడగలం. డూప్లికేటు వాళ్ళ కామెంట్లలో అది కొరవడుతుంది. విచక్షణ ఉన్న బ్లాగర్లు దీన్ని గుర్తించగలరు.
అంచేత ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, దొంగ ఐడీలతో రాసే వ్యాఖ్యలని ఇట్టే పసిగట్ట వచ్చు. ఈ పద్యం అర్థం చేసుకుంటే ఎవరూ దొంగ ఐడీలతో వ్యాఖ్యలని రాసే ప్రయత్నం చెయ్యరు కూడా! ఎందుకంటే ఎంత ప్రయత్నించినా ఉప్పు కర్పూరం కాలేదు కదా! ఒక వేళ పెరిగిన టెక్నాలజీతో ఉప్పుకికూడా మెరుపుని తెద్దామని ప్రయత్నించినా అదీ వృధాయే. చిన్న నిప్పు కణిక అంటిస్తే తేడా ఇట్టే తెలిసిపోతుంది. ఉప్పు టప్పుటప్పు మంటూ పేలిపోయి తుళ్ళిపోతుంది. కర్పూరం తాను కరిగి మరింత వెలుగుని విరజిమ్ముతుంది. ఇక్కడ కూడా వాటి రుచుల(కాంతుల) జాడ వేరే!
చెడుని వేరుచెయ్యడానికి విచక్షణకి మించిన ఆయుధం లేదని ఈ వేమన పద్యం చెప్పే నీతి.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, February 16, 2009
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు...
Subscribe to:
Post Comments (Atom)
అదరహో!
ReplyDeleteఈ ఐ.డి. తస్కరులనుంచి రక్షణ కల్పించే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించారు. ధన్యోస్మి.
రుచి అంతే కాంతి అని నాకింతవరకు తెలీదండి. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్కుల ప్రకారం కాంతే అయి ఉంటదనిపిస్తుంది. చెప్పినందుకు సంతోషం. ఇంత సులువైన పద్యానికి కూడా కరెక్ట్ అర్థం తెలియదే అని కాస్త విచారంగా కూడా ఉంది :)
ReplyDeleteకామేశ్వరరావు గారు,
ReplyDeleteమీ పోలిక సందర్భానుగుణంగా చక్కగా ఉంది. ఓ సందేహం. రుచికి కాంతి అనే అర్ధం ఉన్నా, కానీ పద్యం విషయంలో మీరిచ్చిన వివరణ నేను మొదటిసారి వింటున్నాను. ఎంచేతంటే, ఒక్కపోలికనుండు అని చెప్పినప్పుడే వాటి రూపం గూర్చి చెప్పేసినట్లే కదా. మళ్ళీ రుచిలో రూపం గురించిన వివరణ ఎందుకు చెప్తాడు శతకకారుడు. ఉప్పు, కప్పురము చూడటానికొకేలా ఉన్నా, వాటి రుచులు వేరు అనే అర్ధంతోనే చదువుకున్నా. అర్ధసహితంగా ఉన్న పాత వేమన శతకం కోసం వెతికితే అందులో మొదటి ౧౦౦లో ఈ పద్యం లేదు. మీరు చెప్పిన వివరణకి ఎక్కడైనా ఆన్లైన్లో లభించేట్లయితే చెప్పగలరు.
సాహసాన్ని క్షమించగలరు.
బాగా వ్రాసారు. రుచి అంటే కాంతి అని నాకు తెలియని విషయం - అయితే పాదాంతంలో విరగగొట్టకుండా మరోలా చదువుకుంటే రుచి రుచిలానే ఉంటుందేమో?
ReplyDelete"ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు చూడ, చూడ రుచుల జాడ వేరు"
వికటకవిగారు, వేమనని శతకకారుడు అనడంకన్నా షట్సహస్రకారుడు అనవచ్చునేమో - ఆయన వ్రాసిన పద్యాలు (లభ్యమైనవి) ఆరువేలకి పైగా ఉన్నాయకుంటా..
ReplyDeleteఅద్భుతంగా చెప్పారు మాస్టారూ!
ReplyDeleteబాగుంది. ప్రస్తుత పరిస్థితికి అన్వయించిన తీరు మరీ బాగుంది.
ReplyDeleteస్వామీ !!
ReplyDeleteమంచి భావం మల్లె పొద పై ఆరవేసిన వేసిన ఉత్తరీయం లాంటిది. కప్పి ఉంచినంత సేపూ గాలి తెంపరలకి పరిమళం వ్యాపిస్తూనే ఉంటుంది. తీసి వేసిన తర్వాత కూడా గుప్పు మని గుబాళిస్తూనే ఉంటుంది. 'రుచి ' అన్నది వ్యాఖ్యో, రహస్య ప్రకాశమో తెలియదు కానీ గమ్మత్తు గా బాగున్నది.
దీనిపై నా స్పందన నా బ్లాగులో రాస్తా..
ఆశ్చర్యం! ఈ రోజే మా పిల్లలకు ఈ పద్యాన్ని చెప్పాను. వారికి తమిళంలో అర్థాన్ని వివరించాలి మరి. మా అబ్బాయి అడిగాడు - "కర్పూరాన్ని ఎవడు రుచి చూస్తాడు?" అని. అప్పుడే నాకు ఈ రుచి అంటే నాలుక చూసే రుచి కాదేమోనన్న సందేహం కలిగింది మొదటిసారిగా. "అది పచ్చ కర్పూరంలేరా, మనం లడ్డూలో వేస్తాం చూడు" అని అప్పటికి సర్దిచెప్పాను. ఇప్పుడు మీ టపా చదివాక భావం అర్థం అయింది (అచ్చ తెలుగులో చెప్పాలంటే ’ఇప్పుడు క్లియర్ గా ఉంది’:-) )
ReplyDelete”ఉప్పుకప్పురంబు” పద్యం వెనక కూడా ఎంత కథుంది!
ఈ పద్యం చదివినప్పుడు "కర్పూరానికి రుచి ఏమిటా?" అని అనుకున్నరోజులు లేకపోలేదు. అలాగని ఇదొక పెద్ద సందేహంలా ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. కాని మీరు ఇచ్చిన వివరణ చూసిన తరువాత, పద్యం యొక్క అర్ధమే మారిపోయింది. ఇప్పుడు కవి వాడిన అలంకారానికి కొత్త శోభ వచ్చింది.
ReplyDeleteకామేశ్వరరావు గారికి,
ReplyDeleteఎప్పటిలాగే చక్కగా చెప్పారు. అందరికీ తెలిసిన పద్యంలోనే దాగిఉన్న కాంతులని వెలికితీశారు కనుక ఇంకా బావుంది.
రుచికి కాంతి అన్న అర్థమొకటుందని తెలిసేనాటికి నా కాలేజీ చదువయిపోయింది. తెలిసింది నాకెంతో ఇష్టమైన నవల మూలంగా; మనుచరిత్రలోని ఓ పద్యానికి ఓ తెలుగు రిసెర్చి స్కాలర్ భాష్యం చెప్పే సందర్భంలో!
సందర్భోచితమే అయినా, "సెక్సుని ఉద్రేకించే సంగతులు" ఉంటాయనే భయంతో ఉటంకించడం లేదు. తెలుగు పాఠకులు నవలను కొని చదువుతారని ఆశ.
ఆ సందర్భంలో శ్రీపతి అన్న మాటలు ఆలకించదగ్గవి: "బట్టీపడితేనూ వల్లిస్తేనూ భాష రాదు. అనుభూతిస్తూ చదివితే వొస్తుంది. డిగ్రీల కోసం చదువులు. యేదీ రాదు, డిగ్రీ తప్ప." -- అనుక్షణికం, పేజీ 693.
కొడవళ్ళ హనుమంతరావు
కామేశ్వరరావుగారూ, ఈ పద్యం గురించి ఎందుకు ఎత్తుకున్నారో ఏమిటో అనుకుంటూ చదివాను. చివరికి వచ్చేసరికి అర్థమైంది. భలే చెప్పారండీ :)
ReplyDeleteకర్పూరే లవణే చైవ రూపమేకం రుచిః పృథక్
తథైవ పుణ్యపురుషః పరస్మాత్ భిధ్యతే ధియా
"కర్పూరమునందూ లవణమునందూ (బహిఃరూపం) రంగు ఒకటే కానీ కాంతి (రుచి) వేరు. అలాగే బుద్ధిచేత తక్కినవారికంటె పుణ్యపురుషులను విడగొట్టవచ్చు". చక్కగా భాషాంతరీకరణ చేసారీ కవి.
వికటకవిగారూ, రుచి అంటే కచ్చితంగా ఇక్కడ కాంతే. పై శ్లోకం ఒక్క సారి చూడండి, మీకే అర్థమౌతుంది. ఒక్క పోలికనుండు అంటే రంగు ఒకటే అని చెప్పుకోవాలనుకుంటాను. రంగు ఒకటే ఐనా వెదజల్లే కాంతి వేర్వేరు కాబట్టి ఉప్పుని కర్పూరంకంటె వేరు అని గుర్తుపట్టినట్టుగానే పుణ్యపురుషుల బుద్ధులు మిక్కిలి కాంతివంతాలు కావడం చేత బుద్ధుల ద్వారా పురుషులలో పుణ్యపురుషులని వేరుచేయవచ్చు.
పైన hanuma గారి కామెంట్ కూడలి లో చూసీ చూడగానే (పూర్తిగా చదవకుండానే) ఆత్రంగా వచ్చాను, ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో...ఈ పద్యం మీద మీరు వ్యాఖ్యానించారేమో అని. :-)
ReplyDeleteచాలా కొత్త సంగతి చెప్పారు. రుచి అంటే, taste అన్న భ్రమలోనే ఉన్నా నేనూనూ.
3 వపాదం కొన్ని పాఠాల్లో ఇలా కూడా ఉన్నది (ఈ పాఠం ఎవరిది, ఎక్కడ అన్న డీటయిల్స్ ఇప్పుడు గుర్తు లేవు, చిన్నప్పుడు చదువుకున్నది మాత్రమే)
"పురుషులందరొకటె పుణ్యాత్ములును వేరు"
వేమన పద్యాలను మా మేనమామ గారు "వేమన వాణీ లహరి" పేరుతో హిందీ లో అనువదించారు. ఆ పుస్తకం మా ఇంట్లోనే ఎక్కడో మూలబడ్డది. వెతికి చూడాలి.
పైన
ReplyDelete"పురుషులందరునొకటె పుణ్యాత్ములును వేరు"
అని ఉండాలి కాబోలు.
కామేశ్వరరావు గారు,
ReplyDeleteక్షమించండి. నాది పొరపాటే. కానీ అలా అలా వెదికితే ఓ అద్భుతమైన 5౦౦౦ వేమన పద్యాల పుస్తకం ఆన్లైన్లో దొరికింది, విశ్వనాధ వారి ముందుమాటతో. వేమన పద్యాల్లోని గణభంగాలు, అవసరమైన చోట వ్యాఖ్యలు, అదే అర్ధాన్ని వివిధ కవులు పలు సందర్భాలలో ఎలా వర్ణించారు వగైరా వగైరా... దాని లింకు ఇక్కడ ఇస్తున్నాను.
http://ia331306.us.archive.org/3/items/vemanapadyamulu024991mbp/vemanapadyamulu024991mbp.pdf
ఇకపోతే, ఈ ఉప్పుకప్పురంబు అన్న పోలికనే మరో రెండు వేమన పద్యాల్లో కూడా ప్రయోగించాడు వేమన. పై పుస్తకంలో 674,675 మరియు 676 చూడండి. ఈ మూడింటికీ క్రింద వ్యాఖ్యలో రుచులనగా స్వతస్సిద్ధ కాంతులని చెప్పారు కూడా.
మరోసారి కామేశ్వరరావు మరియు రాఘవ గారికి ధన్యవాదాలు.
గిరి గారు,
ReplyDeleteఅవునవును. ఈ అయిదువేల పద్యాలు చూసాక పంచసహస్ర శతక కారుడని చెప్పినా తప్పులేదు. దొరికినవే ఇవి, ఇంకెన్ని ఉన్నాయో దొరకనివి.
తప్పు తప్పు... శతకకారుడు కాదు పద్యకారుడు. 5000 * 100 అయిపోతాయి లేకపోతే.
ReplyDeleteకనకన రుచిరా కనక వసన నిను...
ReplyDeleteవేమన్ని గగన వసన అనాలేమో
వికటకవిగారు,
ReplyDeleteఇందులో పొరపాటేమీ లేదండి. భాషాకున్న శక్తి వల్ల ఒక పద్యానికి రకరకాల అర్థాలు స్ఫురించే వీలున్నప్పుడు ఎవరికి రుచికరమని తోచిన అర్థం వాళ్ళు గ్రహించడంలో తప్పులేదు. వేమన పద్యాలని ప్రకటించిన సి.పి.బ్రౌన్ వాటిని ఆంగ్లంలో అనువదించాడు కూడా. అతనిక్కడ తీసుకున్న అర్థం taste అనే! మంచి పుస్తకానికి లంకె ఇచ్చినందుకు నెనరులు.
హనుమగారు, రవిగారు,
రుచి అనగానే మీకు వరూధిని గుర్తుకొచ్చిందా, హా శ్రీహరీ! :-) ఆ పద్యం గురించి మరోసారి తీరిగ్గా ముచ్చటించుకుందాం.
హనుమగారు, చిన్నప్పుడు భట్టీయం వేస్తే తర్వాత తీరిగ్గా జీవితాంతం ఎప్పుడ కావలిస్తే అప్పుడు అనుభూతించవచ్చు కదండీ!
కామెంటిన అందరికీ నెనరులు.
ఊ.దం.గారూ,
ReplyDeleteభలే:-)
ఇంతకీ వేమన అంబరాంబరుడై కనిపించే మనకి తెలిసిన బొమ్మ అసలు వేమనది కాదని ఒక వివాదం ఉంది!
> ఇంతకీ వేమన అంబరాంబరుడై కనిపించే మనకి తెలిసిన బొమ్మ అసలు వేమనది కాదని ఒక వివాదం ఉంది!
ReplyDeleteకామేశ్వరరావుగారు,
ఆ బొమ్మ గురించి బోలెడు చర్చ జరిగిందని తెలుసు కానీ, అది వేమనది కాదు అనే వివాదం గురించి ఎప్పుడూ వినలేదు. కాస్త వివరిస్తారా!
-- శ్రీనివాస్
శ్రీనివాస్ గారు,
ReplyDeleteదీని గురించి నేను త్రిపురనేని శ్రీనివాస్ గారి ఈ పుస్తకాలలో చదివాను:
http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0036/067first=1last=330barcode=2020120036062
http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0002/306first=1last=312barcode=2020120002305
చాలా చాలా బాగుంది ఈ టపా
ReplyDeleteమాస్టారు వందనములు సార్ ఇంతవరకు రుఛి గానే అనుకున్నాను సార్ . అర్ధం తెలియజేసినందుకు కృతజ్ఞతలు
ReplyDelete