శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.
పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి:
మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం
బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!
ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎంత ఆత్మీయత ఉంది! శివయ్య తనను కన్నతండ్రి అని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడీ కవి. ఆ చనువుతోనే ఇంకా ఏమంటాడంటే:
ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు జా
లక కాబోలును సృష్టి జేసితివి యీ లంబోదరుం గూడ, దీ
గకు గాయల్ బరువౌన, కాని, కుడుముల్ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్ మొల్పింతు మృత్యుంజయా!
"ఏమయ్యా మృత్యుంజయా! నీకు లంబోదరుడైన పుత్రుడు ముందే ఒకడున్నాడు కదా (గణపతి అన్న మాట!). అతడు చాలక కాబోలు మరో లంబోదరుడైన నన్ను పుట్టించావు! (కవిగారిది బానపొట్ట కాబోలు :-)) సరే, తీగకు కాయలు బరువా? పుట్టించావు. బాగానే ఉంది. కానీ, ఆ కుమారునికేమో చక్కగా కుడుములు పెడతావు. ఈ కోడుకుని మాత్రం యిడుములపాలు చేస్తున్నావే, ఇదేమి న్యాయం?" అంటూ నిలదీస్తాడు కవి.
ఒక గాఢమైన తాత్త్విక విషయాన్ని కూడా లేలేత నవ్వులలో ఎలా పలికించ వచ్చో యీ పద్యం చూస్తే తెలుస్తుంది:
సరిలే! మానవకోటి యీ వెలుపలన్ సంసారచక్రాననే
దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావె షడ్చక్రముల్
వరుసన్ జేర్చి బిగించినావుగద అబ్బా! నాగపాశాలతో
దరియింపన్ దరమౌనె నీ కరుణచేతన్ గాక మృత్యుంజయా!
"సరిసరి! మేము బయటనున్న సంసారమనే ఒకే ఒక చక్రంలో పడి అందులోనుంచే బయటపడలేక సతమతమవుతూంటే, అది చాలదన్నట్టు, మా లోపల ఒకటికాదు రెండుకాదు ఆరు చక్రాలను నాగపాశాలతో బిగించేసావు కదా! అబ్బా! నీ కరుణ లేకుండా వీటిని భేదించడం మాకు సాధ్యమవుతుందా చెప్పు!" అంటున్నాడు. మాట్లాడే భాషలోని కాకువు, నుడికారంలోని సొగసు, అవలీలగా పద్యంలో నిబంధించడం ఈ కవిగారికి బాగా తెలిసిన విద్య అనిపిస్తుంది యీ పద్యాలు చూస్తే.
వీరి పద్యాలలో హాస్యమొక్కటే కాదు, గాఢమైన అనుభూతీ ఆర్తీ కూడా ఉన్నాయి.
ఏ బైకిన్ దెగపండితుండనను పేరే గాని నాలోని కే
బో బోవంగను జెప్ప లజ్జయయిపోవున్ నేను నా బుద్ధికే
యే బొడ్డూడని బిడ్డనో యగుదు తండ్రీ! నిక్క మీపాటిదే
నా బండారము, త్రోవ నీవిడక యున్నంగాదు మృత్యుంజయా!
నిజమైన ఆత్మవిమర్శా ఆత్మావలోకనమూ చేసుకున్నప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోతుందనడాన్ని యీ పద్యం చెపుతోంది. "పైకి నేను తెగ పండితుడనన్న పేరుంది కానీ, నిజంగా లోలోపల తొంగిచూసుకుంటే నా మీద నాకే సిగ్గువేస్తుంది. నేను నాకే ఒక బొడ్డూడని బిడ్డలాగా కనిపిస్తాను. నా బండారం నిజంగా అంతే! అంచేత నువ్వే నాకు తోవ చూపించాలి" అంటున్నాడు కవి. లోలోపలకి తొంగి చూసుకుంటే మన పరిమితులు మనకి స్పష్టంగా బోధపడతాయి. అనంతమైన ఈ విశ్వంలో విస్తరించిన శక్తి ముందు మన శక్తి ఎంత అల్పమైనదో మనకి తెలిసివస్తుంది.
శివునికీ వెన్నెలకీ ఉన్న విడదీయలేని సంబంధం మనకీ కవి పద్యాలలో కూడా కనిపిస్తుంది:
ఎల్లన్ నీవయిపోయి నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా
బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టులున్నయవి యీ వేళా విశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!
లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్న జాబిలియు నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్
నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!
జగత్తంతా శివమయమయ్యింది. ఆతని తనుకాంతి విశ్వమంతా వెన్నెలలై విరాజిల్లింది. మామూలు మనిషికి వెన్నెల బయట లోకంలో మాత్రమే కనిపిస్తుంది. అంతా శివుడే అయిన భక్తునికి తనలోపల కూడా వెన్నలలు విరబూస్తాయి. ఆకాశంలోని జాబిలి తనలోని మనస్సూ ఒకటే అయిపోతాయి(చంద్రుడు మనసుకి అధిపతని అనేది ఇందుకేనేమో!). అప్పుడా కరుణామయుడైన పరమేశ్వరుడు ఆ భక్తుని మనస్సునే తలపూవుగా ధరిస్తాడు కాబోలు!
పూర్తిగా చదవండి...
Monday, November 26, 2012
మృత్యుంజయా!
Monday, November 19, 2012
దివ్వెలనెల
దివ్వెలనెల మొదలయ్యింది. నేలమీద నువ్వుల దివ్వె, నింగిపైన వెన్నెల దివ్వె. ఆకాశంలో వెలిగే ఆ రత్నదీపం శంకరునికి ఆభరణం. ప్రమిదలో దీపం అచ్చంగా జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే యిది పరమశివునికి యిష్టమైన నెల. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరం. అంచేత యీ రోజు శివుని గురించిన పద్యం చదువుకుంటే పుణ్యంపురుషార్థమూను!
తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!
శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!
ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".
ఈ పద్యంలో ఎంతటి భక్తి ఉందో అంతటి కవిత్వముంది. ఈ శతకమంతా అంతే! సంపదని మెరుపుతో పోల్చడంలో ఎంతో ఔచిత్యం ఉంది. సంపద కూడా మెరుపులాగే మనసుని ఆకట్టుకుంటుంది. కళ్ళను జిగేల్మనిపిస్తుంది. మెరుపు లాగానే అది కూడా అతి చంచలం. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పలేం. అతి తక్కువ కాలం నిలుస్తుంది. సంపద అనే మెరుపు లేకపోతే సంసారమనే మేఘానికి అందమే లేదు. ఒక చిన్న పోలికలో లోతైన భావస్ఫూర్తి నిబంధించడం గొప్ప కవిత్వ లక్షణం! ఇక్కడ మరొక చమత్కారం ఉంది. కావ్యాలని శ్రీకారంతో మొదలుపెట్టడమనేది ఒక ఆనవాయితీ, "శ్రీ" శుభాన్ని సూచిస్తుందని. ఇక్కడ కూడా కవి శ్రీకారంతోనే శతకాన్ని మొదలుపెట్టాడు. అయితే అది శుభసూచకంగా కాక చంచలమైన సంపదని సూచించేందుకు వాడుకొని, దానినుండి తనని రక్షించమని ఈశ్వరుణ్ణి కోరుకొంటున్నాడు! అంటే సంపదమీద కవికి ఎంతటి తిరస్కృతి ఏర్పడిందో దీనివల్ల స్ఫురిస్తుంది. ఈశ్వరుని కరుణను శరత్కాలంగా వర్ణించడం కూడా మనోజ్ఞమైన పోలిక. చల్లని చూపుల వెన్నెలలు కురిపిస్తే అది శరత్తుకాక ఇంకేమవుతుంది. ఈ కార్తీకమాసమంతా ఆ ఈశ్వరుని కరుణాశరత్సమయమే కదా! ఈ మాసంలోనే భక్తుల హృదయసరసీరుహాలు నిండుగా విచ్చుకుంటాయి. వికసించిన ఆ పద్మాలలో శశిశేఖరుడు కొలువుంటాడు. అప్పుడిక బతుకంతా వెన్నెలే! చివరి పాదంలో "తామరతంపర" మళ్ళీ చక్కని అర్థస్ఫూర్తి కలిగిన పదం. "తామరతంపర" అంటే మంచి అభివృద్ధి, సౌభాగ్యం అనే అర్థాలు వస్తాయి. ఈ పదబంధానికి అసలు అర్థం "తామరల సమూహం". తామరల సమూహంతో ఎలా అయితే కొలను కళకళలాడుతుందో, అలాగే బతుకు శోభిస్తుందని వాడుకలో ఆ అర్థం స్థిరపడింది. ఇక్కడ సందర్భానికది చక్కగా అతికింది! శరత్కాలం కాబట్టి తామరతంపర. గణాలూ యతిప్రాసలూ సరిపోయినంత మాత్రాన అది పద్యమవుతుంది కాని కవిత్వం కాదు. ప్రతిపదమూ ఔచిత్యంతో కూడుకొని, లోతైన అర్థస్ఫూర్తితో, గాఢమైన అనుభూతిని మిగిల్చినప్పుడే అది చిక్కని చక్కని కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వమే నిలుస్తుంది. ధూర్జటి కవిత్వం అలాంటి కవిత్వం. అందుకే అతడు "స్తుతమతియైన ఆంధ్రకవి".
పూర్తిగా చదవండి...
Wednesday, October 24, 2012
అమ్మల పండగ
విజయదశమి శుభాకాంక్షలు!
దసరా అంటే అమ్మల పండగే. అది నవ దుర్గలు కావచ్చు, ముగురమ్మలు కావచ్చు, ముగురమ్మల మూలపుటమ్మ కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, శ్రీశైల భ్రమరాంబ కావచ్చు, తెలంగాణ బతుకమ్మ కావచ్చు, మా ఊరి పైడితల్లమ్మ కావచ్చు, ఇంటింట వెలసిన ఇలవేల్పులు కావచ్చు. ఎవరైనా అమ్మలే. వీరందరితో పాటు, మనకు ప్రత్యక్షంగా కనిపించే మనకు జన్మనిచ్చిన అమ్మ కూడా వారి అంశే. ఆ అమ్మను, తల్లిదనాన్ని పూజించే పండగ దసరా. ఆ మాతృమూర్తే శక్తి. సర్వ సృష్టికీ కారణభూతమైన శక్తి. చదువుల తల్లి, కలుముల తల్లి, శుభముల తల్లి. ఆ శక్తిని ఎందరు మహర్షులు ఎన్ని రూపాలుగా దర్శించారో! ఎందరు కవులు ఎన్ని రకాలుగా స్తుతించారో! ఆ శక్తే వేదమాత కూడా. వేద కాలానికి ముందునుండే భారతదేశంలో శక్తి ఉపాసన ఉందని చరిత్రకారులు చెపుతున్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటిసారిగా యీ శక్తి స్తుతి దేవీసూక్తంలో కనిపిస్తుంది. వాక్ అనే ఋషిపుత్రి (అంభృణి అనే ఋషి కుమార్తె) దర్శించిన సూక్తమిది. ఆ సూక్తాన్ని సస్వరంగా యిక్కడ వినండి:
ఆ తర్వాత కేనోపనిషత్తులో ప్రసిద్ధమైన ఇంద్రాగ్నివాయు గర్వభంగ సన్నివేశంలో ఆ పరాశక్తి యక్షిణి రూపంలో దర్శనమిస్తుంది. అటుపైన పురాణ వాఙ్మయంలో అనంతముఖాలతో విస్తరించి శంకరుల సౌందర్యలహరిలో పరమోత్కృష్టంగా విరాజిల్లింది.
మరొక విశేషమేమిటంటే, ఆంధ్ర కావ్యవాఙ్మయంలో లభ్యమవుతున్న తొట్టితొలి కావ్యమైన నన్నయ భారతంలో ప్రథమంగా ప్రస్తావించబడింది ముగురమ్మలే! శ్రీ వాణీ గిరిజ. ఈ ముగ్గురిని వక్ష, ముఖ, అంగములతో నిత్యమూ ధరిస్తారు వేదత్రయమూర్తులైన త్రిమూర్తులు. అంటే మనోవాక్కాయము లన్నమాట! త్రికరణశుద్ధిగా స్త్రీశక్తిని ఆరాధించమని మన ఆదిపురుషులు ముగ్గురూ చేసి చూపించారు :-) అప్పుడే యీ లోకం నడుస్తుంది. అలాంటి సందేశంతో ఆంధ్రకావ్య సరస్వతి అవతరించింది. కవులందరూ సారస్వతేయులు. అంటే సరస్వతీపుత్రులు. అందుకే చాలామంది కవులు తమ కావ్య అవతారికలలో ఆ చదువుల తల్లిని ప్రార్థించారు.
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంజేయుము నాదు వాక్కులను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!
అని పోతన భక్తితో ఆ తల్లిని తలచాడు. విచ్చుకున్న తామరలవంటి కన్నులు, పున్నమ చందమామవంటి మోము కలిగిన ఆ సరస్వతి జగన్మోహిని.
సింహాసనము చారు సితపుండరీకంబు
చెలికత్తె జిలుబారు పలుకుచిలక
శృంగారకుసుమంబు చిన్ని చుక్కలరాజు
పసిడికిన్నెరవీణె పలుకుదోడు
నలువ నెమ్మోముదమ్ములు కేళిగృహములు
తలుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత
యెపుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్రచందనమందార సారవర్ణ
శారదాదేవి మామకస్వాంత వీథి
నిండు వేడుక విహరించుచుండు గాత!
అని తెలుగుపలుకుల సొబగుమీర వర్ణించాడు శ్రీనాథుడు. ఆమె సింహాసనం తెల్లని తామరపూవు. పలుకుచిలక ఆమె చెలికత్తె, అందంగా అలంకరించుకున్న సిగపూవు నెలరాజు. పసిడి కిన్నరె వీణ తన పలుకులకు సైదోడు. బ్రహ్మదేవుని నెమ్మోము దమ్ములు (అందమైన మోము తామరలు) ఆమె ఆట నెలవులు. సత్కవుల మనసులే ఆమెను పరిపూర్ణంగా ప్రతిఫలించే తళుకుటద్దాలు. వేద విద్యలలో ఆమె విహరిస్తూ ఉంటుంది. చక్కని రాయంచ ఎక్కిరింత. వాహనానికి చక్కని అచ్చ తెలుగు పదం ఎక్కిరింత. ఆ తల్లిని చూస్తే జాబిల్లి, మల్లెపూలు, పచ్చకర్పూరం, మంచిగంధం, కల్పవృక్షం గుర్తుకువస్తాయి. అంతటి తెల్లని కాంతి ఆమెది. అంతటి చల్లని స్వాంతం ఆ తల్లిది.
ఆ పలుకుల తల్లిని మంజువాణిగా మా తల్లిగారు ఇలా స్తుతించారు (మంజువాణీ శతకంలో):
కప్పురంబువోలె కమ్మదావిని జిల్కి
మల్లెపోలవోలె మనసుదోచి
కఠినమైన మనసు కరగించు కవితతో
మమ్ము బ్రోవుమమ్మ మంజువాణి!
ఈ విజయదశమినాడు మా అమ్మనూ, ఆమె అర్చించిన పలుకులమ్మనూ, అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాతనూ మనసా స్మరించడం కన్నా భాగ్యమేముంది!
మా ఇలవేలుపు కామేశ్వరీదేవి రూపంలో ఉన్న ఆ తల్లిని, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి మాటల్లో యిలా అభ్యర్థిస్తున్నాను:
జననాభావమనుగ్రహింపు మది నీ శక్యంబు కాదేని పై
జననంబందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలే దీ యుదరంపు బోషణకునై భాషాంతరమ్ముల్; జగ
జ్జననీ దీనికి నింత వ్యర్థపు బ్రయాసంబేల కామేశ్వరీ!
పూర్తిగా చదవండి...
Monday, September 10, 2012
మృత్యుశోధన - శ్మశానం నుండి వైకుంఠం దాకా
ఈ మధ్య వరసగా మరణవార్తలు వినవలసి వచ్చింది. జువ్వాడి గౌతమరావుగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, నిన్నటికి నిన్న కొడవటిగంటి రోహిణీప్రసాద్‌గారు. యాదృచ్ఛికంగా నిన్ననే కలంకలలు బ్లాగులో యీ టపా చదివాను - వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా). అందులో పద్యాలు చదువుతూంటే నా మనసుకూడా ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయింది.
ఎవరైనా ప్రముఖులు కాలధర్మం చేస్తే సంతాపం ప్రకటిస్తాం. ఎవరికోసమా సంతాపం? వారి బంధువర్గానికా? వారెవరూ మనకి తెలిసుండకపోవచ్చు. వారి గురించి మనం సంతాపం ప్రకటించడం దేనికి? ఆ చనిపోయిన వాళ్ళు మన సమాజానికి ఏదో మేలు చేసినవాళ్ళయితే వాళ్ళనుండి యీ సమాజం మరింత మంచిని పొందే అవకాశం పోగొట్టుకుందని సమాజమ్మీద సంతాపమా అది? ఏమో! ఉదాహరణకు, భద్రిరాజుగారు భాషాశాస్త్రంలో, ప్రత్యేకించి ద్రవిడ, తెలుగు భాషల గురించి విశేషమైన, మౌలికమైన పరిశోధన చేసారు. తుదిశ్వాస విడిచేవరకూ దానికి సంబంధించి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అవన్నీ పూర్తయ్యేది ఎలాగ? రోహిణీప్రసాద్‌గారు, సంగీతమ్మీద, విజ్ఞానశాస్త్ర విషయాల మీదా ఎన్నెన్నో చక్కని వ్యాసాలు వ్రాసారు. కొద్ది కాలం కిందటి వరకూ వ్రాస్తూనే ఉన్నారు. అతనికి తెలుగుభాషంటే వల్లమాలిన అభిమానం. ఎన్నో అనువాదాలు కూడా చేసారు. వారు గతించడం వల్ల మరెన్నో మంచి వ్యాసాలను తెలుగుపాఠకులు కోల్పోయారు. అందుకు బాధగా ఉంది. అంటే ఇందులో ఎంతోకొంత స్వార్థం ఉందన్న మాట!
మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.
ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా. అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!
ఇచ్చోట నే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!
ఈ పద్యంలో వ్యక్తిదృష్టికన్నా కూడా ఒక సామాజికదృష్టి కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తావించబడినది - ఒక కవి, ఒక రాజు, ఒక యిల్లాలు, ఒక చిత్రలేఖకుడు. వీరందరూ సమాజంలో ఒక గుర్తింపబడిన స్థానం కలిగిన వ్యక్తులు. ఈ పద్యంలో విశేషమేమిటంటే, వారి మరణాన్ని కవి ఆయా వ్యక్తుల గొప్పదనానికి ప్రతీకలైన వస్తువులు నశించిపోవడాన్ని వర్ణించడం ద్వారా చెప్పాడు. కమ్మని కలము నిప్పులలో కరిగిపోయింది. అధికారముద్రలు అంతరించాయి. నల్లపూసల చక్కదనం గంగలో కలిసిపోయింది. కుంచె నశించింది! అంటే ఆయా వ్యక్తులు సమాజానికి అందించిన సేవలు అంతరించిపోయాయని కవి వాపోతున్నట్టు ఉంది, పైన చెప్పుకున్నట్టుగా. ఒక సత్కవి మంచి కావ్యాలను సృష్టిస్తాడు. ఒక రాజన్యుడు చక్కని పాలన చేస్తాడు. ఒక యిల్లాలు ఇంటిని నేర్పుగా చక్కదిద్దుతుంది. ఒక చిత్రలేఖకుడు మంచి బొమ్మలెన్నిటినో గీస్తాడు. వారి మరణం వల్ల ఆయా మంచి పనులు వారి ద్వారా మరింక జరిగే అవకాశం ఉండదు. అంచేత ఇలాటి వ్యక్తుల మరణానికి సమాజం బాధపడుతుంది. ఒక మామూలు వ్యక్తి మరణిస్తే, అతని బంధువర్గంలో వాళ్ళు మాత్రమే బాధపడతారు. చావనేది ఎవరికైనా తప్పనిదే! ఇంతవరకూ ఆలోచనలన్నీ ఒక దారిలో సాగాయి.
కవుల కలాలు గాయకుల కమ్మని కంఠములీ శ్మశానపుం
గవనుల తొక్కిజూచెడి, యొకానొకనా డల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపుడెంతలేసి రే
ణువులయి మృత్తికన్ గలిసెనోగద కుమ్మరివావి సారెపై.
ఈ పద్యం చదివేసరికి బుద్ధి మరో దోవ దొక్కింది! కాళిదాసు భారవి శరీరాలు ఇంతలేసి రేణువులైతేనేమి అంతలేసి రేణువులైతేనేమి? అసలు వాళ్ళ శరీరాలగురించి ఆలోచించాల్సిన పనేమిటి? దివంగతులైన కవుల కలాలు గాయకుల కమ్మని కంఠాలు భౌతికంగా లేకపోవచ్చు గాక. వారు రచించిన గొప్ప కవిత్వమూ, పాడిన కమ్మని పాటలూ మనకు మిగిలి ఉన్నాయి కదా. కాళిదాస భారవుల కావ్యాలు ఇప్పటికీ నిలిచి ఉండడం వల్లనే కదా మనం వాళ్ళను తలచుకుంటున్నది. "సుకవి జీవించు ప్రజల నాలుకలపైని" అని యీ కవే (జాషువా) అన్నాడు. అంచేత కవులకు గాయకులకూ, ఏ కళాకారునికైనా, వారి కళ యీ లోకంలో ఉన్నంత కాలం వారి అస్తిత్వం ఆయా కళారూపాలలో బతికున్నట్టే కదా! అలాగే మంచి పరిపాలన చేసిన ఒక రాజు మరణించినా, గౌరవార్థంగా రాతి విగ్రహాలలోనే కాక, ప్రజల గుండెల్లోనూ జీవించే ఉంటాడు. అతని పరిపాలను గూర్చిన కథలు తరతరాలుగా ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాగే ఒక నాయకుడు కాని, ఒక శాస్త్రవేత్త కాని, ఒక వైద్యుడు, ఒక ఇంజినీరు - ఎవరైనా, సమాజానికి మేలు చేసిన, సమాజంపై తమదైన ప్రభావం చూపిన ప్రతి వ్యక్తీను. చావు వారి అస్తిత్వాన్ని చెరిపి వెయ్యలేదు! పైగా, వారి స్ఫూర్తితో మరింతమంది అదే దోవలో ప్రయాణించి, వారికి వారసులుగా ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తారు కూడా. అంటే, ఎవరి జీవితమైతే కేవలం వ్యక్తిగతమైన బంధాలకు పరిమితం కాకుండా సమాజంతో ముడిపడిపోతుందో, అతని అస్తిత్వం కూడా సమాజంతో ముడిపడిపోతుంది. అపుడింక ప్రకృతిసిద్ధమైన, భౌతికమైన, వ్యక్తి మరణాన్ని గూర్చి చింతించాల్సిన అవసరమే లేదు!
ఈ ఆలోచనాసరళి, పూర్వకాలంలో మన దేశంలో ఉండేదేమోనని అనిపిస్తోంది. వ్యక్తినిష్ఠమైన దృష్టితో చూస్తే, వ్యక్తిగతమైన బతుకు, బంధాలు, జగత్తూ వట్టి మాయ అనీ, అనిత్యమనీ అనడం పెద్ద ట్రేష్ అనిపిస్తుంది. అదే, మనిషి అస్తిత్వాన్ని సమాజంతో ముడిపెట్టినప్పుడు అవి అర్థవంతంగానే అనిపిస్తాయి. పూర్వం కొన్ని కుటుంబాలు తరతరాలుగా ఒక పెద్ద ఆలయం వంటి నిర్మాణాన్ని చేపట్టి కొనసాగించేవి. ఆ కుటుంబాల వారు వారి జీవితాన్ని దానికే అంకితం చేసేవారు. వాళ్ళు తమ అస్తిత్వాన్ని ఆ కట్టడంతో ముడిపెట్టేసి ఉంటారేమో! తాము భౌతికంగా లేకపోయినా, ఆ నిర్మాణం కొనసాగుతుందనే నిబ్బరం, వారికి మృత్యుభయం లేకుండా చేసేదేమో! ఏమో! ఇదంతా నా ఊహ!
కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ
మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి!
ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు
ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము
ఈ శ్రీశ్రీ పద్యాలు చదివేసరికి ఎందుకో ఒక్కసారిగా నాకు పోతనగారి ప్రహ్లాదచరిత్రంలోని యీ పద్యం గుర్తుకువచ్చింది!
హరి సర్వాకృతులం గలండనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై యెందును లేడు లేడని సుతున్ దైత్యుండు దర్జింప, శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమస్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్
ఇదొక విచిత్రమైన పద్యం! ఎక్కడున్నాడురా నీ శ్రీహరి అని హుంకరించిన తండ్రితో, నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, భూమ్యాకాశాలలో ఉన్నాడు. దిక్కులన్నిటా ఉన్నాడు. ఇక్కడా అక్కడా అని వెతకడమెందుకు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అని చెపుతాడు ప్రహ్లాదుడు. ఆలా ఉన్నాడున్నాడని ప్రహ్లాదుడంటూ ఉంటే, లేడు లేడని హిరణ్యకశిపుడు అదిలిస్తూ ఉంటే, విష్ణువు నరసింహాకృతి ధరించి, చరాచర జగత్తంతటా ఉద్దండ ప్రభావంతో కాచుకుని కూచున్నాడట. అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూపించమంటాడో, ఆ అడిగిన ఉత్తరక్షణంలో నరసింహాకృతిలో బయటపడాలి కదా అని అలా ఉన్నాడు కాబోలు! - ఇది మామూలుగా అనుకొనే విషయం. కాని యీ సందర్భంలో నాకు మరొక చిత్రమైన విషయం స్ఫురించింది. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే, విష్ణువు హిరణ్యకశిపుని దృష్టిలో మృత్యు స్వరూపం! అసలు విష్ణువు గూర్చి హిరణ్యకశిపునికి తెలిసిందే తన తమ్ముని మరణంతో. తన తమ్ముని మరణానికి కారణమైన వాడు విష్ణువు. ఆ విష్ణువుకోసమే లోకమంతా గాలిస్తూ ఉంటాడు కాని ఎక్కడా కనిపించడు! ఎంతవెతికితే నేమిటి, మృత్యువు కనిపిస్తుందా! ఆ మృత్యువుని జయించాలనే, ఘోరమైన తపస్సు చేస్తాడు. తన బుద్ధిబలంతో మృత్యువుని జయించగలననుకొని చాలా తెలివిగా వరాలను కోరతాడు, వాటిని పొందుతాడు. త్రిలోకాధిపత్యం సంపాదిస్తాడు. అయితేనేం! అతని అంతరాత్మలో విష్ణువుపై, అంటే మృత్యువుపై దృష్టి మరలదు. అతని అన్వేషణ ఆగదు సరికదా, తన ఆత్మజుని రూపంలో మరింత ప్రజ్వరిల్లుతుంది. విష్ణువు సర్వవ్యాపకత గూర్చి, నిత్యత్వాన్ని గూర్చి కొడుకు ఎంత చెప్పినా, దాన్ని చెవినబెట్టడు. అతని దృష్టిలో విష్ణువు (అంటే మృత్యువు) తన దరికి రాలేడు! ఈ ఆలోచనలతో మళ్ళీ యీ పద్యం చదివితే అందులో కనిపించేదేమిటి? హిరణ్యకశిపుని మృత్యువు నరసింహాకృతిలో ఉంది. అది ఇక్కడా అక్కడా అని కాదు అంతటా ఉంది. అది ఎక్కడనుండి బయల్పడుతుంది అనేది హిర్ణయకశిపుని చేతిలోనే ఉంది! ఒకరకంగా ఆ నరసింహాకృతికూడా, తన వరాల ద్వారా స్వయంగా హిరణ్యకశిపుడే నిర్ణయించాడు.
ఆలోచిస్తే, ఇది మనుషులందరికీ వర్తించే విషయమే. మనిషి మృత్యువునుండి ఎంత దూరం పారిపోవాలనుకున్నా అది అతడిని వెన్నంటే వస్తుంది. తన బుద్ధి చాతుర్యంతో ఎలా తప్పించుకోవాలని చూసినా, రకరకాల రూపాలలో, విచిత్రమైన ఆకృతులలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఒకో వ్యక్తికి ఒకో రూపంలో వస్తుంది. అది ఎలా అన్నది కూడా ఆ వ్యక్తి ద్వారానే, తనకు తెలియకుండానే నిర్దేశింపబడుతుంది కూడా! మృత్యువుని వ్యక్తిగతమైన దృష్టితో చూసినంత కాలం అది తన అస్తిత్వాన్ని చెరిపేసే ఒక మహమ్మారిలా ఆ వ్యక్తిని భయపెడుతునే ఉంటుంది. తన అస్తిత్వాన్ని వేరే దానితో ముడిపెట్టినప్పుడు ఆ భయం వీడిపోతుంది. ప్రకృతితో అస్తిత్వాన్ని ముడిపెడితే, కృశించిన శరీరాన్ని నశింపజేసి నూతన తనువుతో, చైతన్యంతో ప్రకృతి తనని తాను నిరంతరం పునరుజ్జీవింప చేసుకొనే ప్రక్రియగా అది కనిపిస్తుంది. అప్పుడు, ఒక్క హిరణ్యకశిపునికే కాదు, శ్రీశ్రీ చెప్పినట్టు, మృత్యువు సర్వ జీవనాళికి వైకుంఠపథమే!
పూర్తిగా చదవండి...
Friday, August 3, 2012
విరటుని వాత్సల్యం
నేను తిక్కనగారి విరాటపర్వం కనీసం రెండు సార్లయినా చదివుంటాను. అయినా యింత చక్కని పద్యం ఇంతవరకూ నా దృష్టిలో పడకపోడం ఆశ్చర్యం. దృష్టిలో పడడమంటే ఆకట్టుకోడం. మనసుకు హత్తుకోడం. అందుకే కవిత్వాన్ని ఆస్వాదించడానికి సమయం సందర్భం నేపథ్యం చాలా అవసరమనేది. విరాటపర్వం అనగానే, ద్రౌపది "దుర్వారోద్యమ" లేదా "ఎవ్వాని వాకిట" పద్యమో, గోగ్రహణమప్పటి "సింగంబాకటితో", "వచ్చినవాడు ఫల్గునుడు" వంటి పద్యాలో గుర్తుకు వస్తాయి. ఇంకా అనేక ప్రసిద్ధ పద్యాలున్నాయి కాని, యీ పద్యం అంత ప్రసిద్ధమైనట్లు లేదు. అయినా, ఇదొక (నా మటుకు నాకు) అపురూపమైన పద్యం.
తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె
మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం
పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ
ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్
అర్జునుడు బృహన్నలగా విరటుని కొలువుకు వచ్చి, తాను నాట్యాచార్యుడినని, అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పుతానని, పని యిప్పించమని అడుగుతాడు. విరటుడు అతడి తీరును జాగ్రత్తగా గమనించి, సరైన వాడిలాగనే ఉన్నాడని నిశ్చయించి తన కూతురైన ఉత్తరను పిలిపిస్తాడు. ఆ ఉత్తర నర్తనశాల సినిమాలో లాగా పూర్తి యౌవనవతి కాదు. ఒక పన్నెండేళ్ళ బాలిక. ఆ తండ్రికి ముద్దులమూట. అలాంటి తన కూతురుని ఎంత మురిపెంగా విరటుడు దగ్గరకు తీసుకొన్నాడో వర్ణించే పద్యమిది! ఈ పద్యం మళ్ళా యిప్పుడు చదివేసరికి మా అమ్మాయే నా కళ్ళముందు నిలిచింది. "ఓరి వీడి అసాధ్యం గూలా! నేను మా అమ్మాయిని ఎలా దగ్గరకు తీసుకు ముద్దు చేస్తానో, సరిగ్గా చూసినట్టే వర్ణించాడే యీ తిక్కన!" అని పరమాశ్చర్యానికీ, ఆనందానికీ లోనయ్యాను!
తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో సవరించాడట.
తన కూతురేమో చక్కని చుక్క, బంగారు తల్లి. ఆమెకి యిప్పుడొక మంచి నాట్యాచార్యుడు దొరికాడు. తండ్రి మనసుకి ఎంత ఆనందం. ఆ పిల్ల మీద ఎంత ప్రేమున్నా తన రాచరిక వ్యవహారాల వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేడు కదా. అంచేత చూసినప్పుడల్లా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అపూర్వ విలోకనంబులు! తండ్రి మురిపెమంతా, అలా తల నిమురుతూ ముంగురులను సర్దడంలోనే ఉంది! ఎంత జగతీవిభుడయితే మాత్రం ఏమిటి. అతడొక ఆడపిల్లకు తండ్రి. ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది! అదీ పద్యంలో అచ్చుపోసి చూపించాడు కవిబ్రహ్మ తిక్కన. ఇలాంటి సందర్భంలో ఇంతటి సున్నితమైన సన్నివేశాన్ని ఊహించడం (యిది సంస్కృత భారతంలో లేదు), దాన్ని అంతే సుకుమారంగా, అత్యంత సహజంగా చిత్రించడం, తిక్కనకే చెల్లింది. ఇలాంటి పద్యాలు చదివినవాడెవడైనా, బుద్ధంటూ ఉంటే, ఆంధ్ర మహాభారతం వట్టి అనువాదం అని పెదవి విరుస్తాడా? ఇది నూటికి నూరుపాళ్ళూ అచ్చమైన కావ్య సృజన. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలలో ఒక చిన్న పాత్రకొక కొత్త వెలుగు తీసుకురావడమన్నది సామాన్య విషయం కాదు. కావ్యంలో పాత్రలను సజీవం చెయ్యడమంటే యిదీ. ఆ కల్పనలో కూడా ఔచిత్యం ఉండాలి. విరటునికి తన కొడుకుపైన ఎంత ప్రేమో, ఎంత గురో మనందరికీ తెలుసిన విషయమే. కౌరవులను గెలిచింది తన కొడుకు కాదంటే, ఆడుతున్న పాచికలు కంకుభట్టు మొహాన కొట్టేంత పిచ్చి ప్రేమ అది. మరి అంతటి ప్రేమ కూతురు మీద మాత్రం ఉండదా. ఉంటుందని ఊహించడమే ఔచిత్యం. కథకు అవసరమని కొడుకు ప్రేమను మాత్రమే వ్యాసుడు చిత్రించి ఊరుకుంటే, తాను వ్రాస్తున్నది కావ్యం కాబట్టి, ఆ పాత్ర స్వభావానికొక సంపూర్ణతనీ ఔన్నత్యాన్నీ, యీ ఒక్క పద్యంతో చేకూర్చాడు తిక్కన. అదీ తిక్కన కవితా శిల్పం.
ఈ టపా చదివి ఆడపిల్లలు లేని వాళ్ళు నా మీద అసూయపడితే అది నాకు ఆనందమే! :-)
పూర్తిగా చదవండి...