తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, October 25, 2009

ఛందస్సుకి పురస్కారం

భాషా సంబంధమైన విషయాలలో విశేషమైన కృషి చేసినవారికి ప్రతి ఏడు సి.పి.బ్రౌన్ పేరు మీద శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారు పురస్కారాన్ని ఇస్తున్నారు, 2007 సంవత్సరం నుంచీ అనుకుంటాను. ఈ ఏడాదికి ఈ అవార్డు శ్రీ జెజ్జాల కృష్ణ మోహన రావు గారికి, ఛందస్సులో వారు చేసిన, చేస్తున్న కృషికి గాను ఇస్తున్నారని మొన్ననే తెలిసింది.

ఈ వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. మూడు రకాలుగా సంతోషం (త్రిగుణీకృతం అన్నమాట!). నాకిష్టమైన అంశం ఛందస్సు గురించి చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వడం ఒకటి. నేనెంతో గౌరవించే సహృదయులు మోహనగారికి రావడం రెండు. భాషాశాస్త్రంలో ప్రత్యేకమైన డిగ్రీలు లేని ఔత్సాహికునికి గుర్తింపు రావడం మూడు. ఇది ఔత్సాహికులందరికీ ఎంతో ప్రోత్సాహకరం.

ఈమాట పాఠకులకి, రచ్చబండ ఛందస్సు గ్రూపులలో ఉన్నవాళ్ళకి మోహన రావుగారు పరిచితులే అయ్యుంటారు. నాకు తెలిసి, సుమారు పదేళ్ళుగా మోహన రావుగారు ఛందస్సు గురించి అనేక విశేషాలని ఈ గ్రూపులలో పంచుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవలసినవాటిలో కొన్ని:

1. ఎన్నో కొత్త కొత్త వృత్తాలని పరిచయం చెయ్యడం. ఒక వృత్తానికి ప్రతి పాదంలోనూ నియతమైన అక్షర సంఖ్య, గురులఘు క్రమం ఉంటాయి. గురు లఘు క్రమంలో చూపగలిగే వైవిధ్యం వల్ల, కొన్ని వేల వృత్తాలు ఏర్పడతాయి. అలాంటి వృత్తాలలో చాలా కొన్ని వాటిని మన పూర్వకవులు విరివిగా వాడారు. అంత విరివిగా వాడని వృత్తాలు కొన్నైతే, అసలు వాడనివి చాలా ఉన్నాయి. అలా విరివిగా వాడని వృత్తాలని, అసలు వాడని వృత్తాలని (కొత్తగా పేర్లు పెట్టి) ఎన్నిటినో వారు సోదాహరణంగా పరిచయం చేసారు. వృత్తాలే కాక, అనేక ఉపజాతి పద్యాలు, రగడలు పరిచయం చేసారు.

2. గర్భ బంధ కవిత్వాలలో విశేషమైన కృషి చేసారు. ఏ ఛందస్సులో ఎలాంటి గర్భ కవిత్వం సాధ్యమవుతుందో గణిత శాస్త్రాధారంగా నిరూపించారు. దీనికోసం వీరు చందన అనే సాఫ్ట్వేరుని కూడా తయారు చేసారు.

3. ఛందోమృతబిందువులు అనే శీర్షికతో ఛందస్సులోని విశేషాలని ఎన్నిటినో చిన్న చిన్న పాయింట్లుగా అందించారు.

4. మోహన రావుగారి మాతృభాష కన్నడం! అది చాలా ఏళ్ళు నాకు తెలియదు. వారికి కన్నడ తెలుగు భాషలలో ఉన్న గొప్ప ప్రావీణ్యం వలన, కన్నడ తెలుగు భాషల్లోని ఛందస్సులని తులనాత్మకంగా పరిశీలిస్తూ చక్కని పరిశోధన చేసారు.

5. అన్నిటికన్నా ప్రత్యేకించి చెప్పుకోవలసినది నన్నెచోడుడు కుమారసంభవంలో ఉపయోగించిన ఛందస్సు ఆధారంగా నన్నెచోడుని కాల నిర్ణయం గురించి చేసిన ప్రతిపాదనలు. ఇది ఈమాటలో చదవవచ్చు.

ఛందస్సు మాత్రమే కాక, వీరికి ప్రాచీన శాసనాలు, కావ్యాల గురించి మంచి పరిజ్ఞానం, తెలుగు కన్నడ తమిళ భాషలలో చక్కని ప్రావీణ్యం ఉన్నాయి. వీరి రచనలు ఈ-గ్రూపులలోనూ ఈమాటలోనూ (బహుశా మరికొన్ని అమెరికా పత్రికలలోనూ) తప్ప ఇంతవరకూ పుస్తక రూపంలో రాలేదు. పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అది ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ చాలా విలువైనది అవుతుందనడంలో సందేహం లేదు.

మోహనగారికి నాకూ కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలున్నా (వ్యావహారిక భాషలో పద్యాలు వగైరా విషయాలలో) అవి మా ఆత్మీయతకి ఎప్పుడూ అడ్డు రాలేదు. ఎవ్వరినీ ఎప్పుడూ నొప్పించ కూడదనుకునే స్వభావం వారిది. వృత్తి రీత్యా Biologist అయినా, మాతృభాష కన్నడమైనా, తెలుగు భాషా సాహిత్యాలపై వారికున్న విశేష అధికారం, అభిమానం అమోఘమైనవి. సి.పి.బ్రౌన్ పురస్కారం వీరి కృషికి తగిన గుర్తింపు. ఈ సందర్భంగా వారికి నా బ్లాగు ముఖంగా శుభాకాంక్షలు!


పూర్తిగా చదవండి...

Tuesday, September 29, 2009

విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు (కించిత్తు లేటుగా:-).
ఈ లేటుకి ఒక (మంచి)కారణం ఇవాళ సాయంత్రం మా అమ్మాయి సంగీతపాఠశాలవాళ్ళ కార్యక్రమానికి వెళ్ళడం. ఇక్కడ తమిళనాట విజయదశమి రోజు విద్యాదేవి పూజ చాలా నమ్మకంతో చేస్తారు. అందుకే ఇవ్వాళ చాలా స్కూళ్ళకి సెలవు కూడా లేదు. కొత్త పాఠాలు ప్రారంభిస్తారు! అలాగే సంగీతం, నాట్యం మొదలైనవి నేర్పించే "కళా"శాలలు (ఒక ఏరియాలో కనీసం ఒక మూడైనా ఉంటాయి!) యీ రోజొక వేడుకగా కార్యక్రమాలను నిర్వహించి పిల్లల చేత స్టేజిమీద ప్రదర్శనలిప్పిస్తారు. అలాంటి ఒకానొక కార్యక్రమంలో కాస్త హడావిడిగా ఉండి, ఇదిగో ఇప్పుడు తీరిక దొరికింది! మా అమ్మాయి స్కూలువాళ్ళు ఏర్పాటుచేసిన వేదిక కొంచెం చిన్నదే కాని, అది జనంతో కిక్కిరిసిపోవడం నన్ను చాలా ఆశ్చర్యంలో ముంచెత్తింది! ఆ గురువుల ఉత్సాహం (ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు ఒక డైబ్భయ్యేళ్ళ ముత్తైదువ), తల్లిదండ్రులలో ఉన్న అభిరుచి చూస్తే చాలా ఆనందం అనిపించింది.

సరే, నా గోల పక్కన పెడదాం. నవరాత్రులలో కొలిచే ముగురమ్మలు, ఆ ముగురమ్మల మూలపుటమ్మ గురించిన పద్యమాలిక ఇదిగో. ఇందులో కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలే. మిగిలవి ఎవరివో పోల్చుకొనే ప్రయత్నం చెయ్యండి! వీటి అర్థ తాత్పర్యాలు మరోమారు తీరిగ్గా ముచ్చటించుకుందాం.

అంబనవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ భా
వాంబర వీథి విశ్రుత విహారి ననున్ గృపజూడు భారతీ!

వాణికి జరణానత గీ
ర్వాణికి నేణాంకశకల రత్నశలాకా
వేణికి బుస్తక వీణా
పాణికి సద్భక్తితో నుపాస్తి యొనర్తున్

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుకవారిజపుస్తక రమ్యపాణికిన్

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

సామజయుగ్మ మింపలర జల్లని నీరు పసిండికుండలన్
వేమఱు వంచివంచి కడు వేడుకతో నభిషిక్త జేయగా
దామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా
కామునితల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్

హిమధరాధరమండలేశ్వరు కులపాలి
కా మణితనువల్లికా ప్రసూన
యసితకంధర సింధురాజనాంబర ఘోర
గంధబంధనకర గంధలహరి
సంతత శివభక్తి సామరస్యజ్ఞాన
సారమరంద నిష్యంద ధార
పరమహంసోత్తంస భావభృంగవ్రాత
తన్మయావస్థ ప్రదానకేళి

నిఖిలవిద్యా రహస్య వాణీపరాగ
పాలికాపూరితాఖండ పద్మజాండ
పేటియై యొప్పు చంద్రార్థ జూటకోటి
జోటి గొల్చెద జ్ఞానప్రసూన కలిక

కాసరాసురరాజ కంఠ నిర్గతరక్త
పంకంబు శ్రీపాదపద్మలాక్ష
చండముండాహవ సంభ్రమస్తనజాత
ఘర్మవాఃకణరాజి కంఠమాల
రక్తబీజాది మర్దన సమయాట్టహా
సము మోమునకు లోధ్ర సుమరజంబు
శుంభనిశుంభ రక్షోవీర సంహార
వేళ గప్పిన ధూళి మేలుముసుగు

గాగ నేదేవి వీరశృంగారమూర్తి
యగుచు శోభిల్లు నట్టి దుర్గాంబ గొలుతు
గనకముఖరీ సమాఖ్య గంగాప్రతీర
హాటకాచలతుంగ శృంగాగ్రగేహ

చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే
సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల
నవతంస కుసుమంబు నందున్న యెలదేటి
రుతి కించి దంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడి
దుందీఫలంబు దుందుడుకు జెంద
తరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు
లింగిలీకపు వింతరంగు లీన

నుపనిషత్తులు బోటులై యోలగింప
బుండరీకాసనమున గూర్చుండి మదికి
నించు వేడుక వీణవాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుగాత!

కనకస్తనోపరి గ్రైవేయ మణికాంతి
కర్ణతాటంకంబు గాడిపఱుప
కమ్రనితంబాగ్ర కాంచికింకిణులతో
గరకంకణధ్వనుల్ కలతబూన
మౌళిక్లప్త శశాంక మాలాతపములపై
ఫాలస్థలీజ్యోతి పాఱువెట్ట
తత్కాల విచలితాధర హాస మాధుర్య
మాత్మప్రసన్నత నగడుపరుప

పాలితాన్యోన్య లంఘన స్పర్థములును
చాలితాన్యోన్య సౌందర్య సరసములును
నైన పలుకులగూడిక ననగ నొప్పు
శారదామూర్తి నా యెద జాలుగాక

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్ ,
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురిణాః ఫణితయః


పూర్తిగా చదవండి...

Saturday, September 19, 2009

శారద రాత్రులు

ఇవాళనుంచి శరన్నవరాత్రులు మొదలువుతున్నాయి. శరదృతువు మొదలయ్యిందన్నమాట. వెన్నెల నెలలు.
శరత్తుకీ శారదకీ ఎంత దగ్గర సంబంధమో, వెన్నెలకీ కవిత్వానికీ అంతటి స్నేహం. చంద్రునికి మనస్సుని మైమరపించే మహత్తేదో ఉంది. పున్నమి జాబిలిని, పిండారబోసినట్టు నింగి అంతా పరుచుకొనే చల్లని వెన్నెలని తనివితీరా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందా మహత్తు.

శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరిపూరితంబులై

ఇది నన్నయ్యగారి మొదటి పద్యం. ఇదేంటి ఇదతని ఆఖరి పద్యం కదా అని అప్పుడే ఆశ్చర్యపడ్డారా! మొదటి పద్యమంటే, నా బ్లాగులో నన్నయ్యగారి గురించి నేను వ్రాస్తున్న మొదటి పద్యం యిది అని. అతని చివరి పద్యంతో యిలా మొదలు పెట్టడం, యిదియొక చమత్కారము :-)

ఈ పద్యాన్ని మీరు రాగయుక్తంగా చదువుకోవలసిన అవసరం లేదు, మామూలుగా చదువుకున్నా చాలు. ఒక రెండు మూడు మార్లు మళ్ళీ మళ్ళీ చదువుకొని ఆ పదాలపొహళింపు, ఆ ధార, ఆ అక్షర మాధుర్యంలో మునకలు వెయ్యండి.
నన్నయ్యగారు తన కవిత్వానికున్న లక్షణాలు అని చెప్పుకున్నవాటిలో అక్షర రమ్యత ఒకటి. రమింప జేసే అక్షరాల సంఘటన అని అర్థం. ఆ రమ్యత్వమంతా యీ పద్యంలో కనిపించడం లేదూ! ఇది ఎలా సాధించారు అంటే, అది ఒక ఆల్కెమీ. ఏదో - "ర" అన్న అక్షరం పదేపదే వచ్చినందువల్లనో, మొదటి రెండు పాదాలలో ప్రాస స్థానంలో "స" అక్షరానికి ఇచ్చిన ఊనిక వల్లనో - ఇలా రకరకాలుగా అనుకోవడం వొట్ఠి మన పరిమితమైన బుద్ధికి తట్టే పైపై అంశాలే తప్ప అసలు రహస్యం అంతుపట్టదు. ఇందులో గమనిస్తే మరో విశేషం - అనునాసికాక్షర శబ్దాలన్నీ యిందులో వినిపిస్తాయి, జాగ్రత్తగా వింటే (పంక్తులంజారు అన్న పదాలలో ఙ్, ఞ్, ఇలా...). ఇవన్నీ కూడా ఇందులోని మధుర నాదానికి కారణమయ్యుండవచ్చు.

అవి శారద రాత్రులు. ఉజ్వలంగా ప్రకాశించే తారహారాలతో అందగించిన రాత్రులు. అప్పుడే వికసిస్తున్న తెల్లకలువల పుప్పొడి దట్టంగా అలుముకున్న తెమ్మెర కమ్మదనం నిండిన రాత్రులు. కప్పురపు తావిలా తెల్లగా అంతటా పరచుకున్న అమృతాంశుని (చంద్రుని) వెన్నెలతో పరిపూర్ణమవుతున్న రాత్రులు. వెన్నెల తెల్లగా చల్లగా ఉంటుంది కర్పూరంలాగా. మరి కర్పూరపు సువాసన వెన్నెల కెక్కడిది? కలువపూల పుప్పొడి నిండిన వెన్నెల కాబట్టి దానికా సుగంధం కూడా అబ్బింది!

ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళకే యిలాంటి రాత్రులలోని మధురిమ అనుభవానికి వస్తుంది.

ఈ "శారద రాత్రులు..." అన్న పద్యానికి ముందు యింకొక పద్యం ఉంది. అది శరదాగమనాన్ని వర్ణించే పద్యం. అదొక పరమాద్భుతమైన పద్యం:

భూసతికిన్ దివంబునకు బొల్పెసగంగ శరత్సమాగమం
బా సకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో
పాసిత రాజహంసగతి భాసి(తి) ప్రసన్న సరస్వతీక మ
బ్జాసన శోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై

దీనికి అర్థం చెప్పడం చిన్నపని కాదు.

భూదేవికి స్వర్గానికీ శరత్కాలంలో అందమైన కలయిక జరిగింది (లేదా భూమ్యాకాశాల రెంటితోనూ శరత్తు కలిసింది). ఆ కలయిక సర్వానందకారియై (ప్రమోదము అంటే సుగంధము అనికూడా అర్థం వస్తుంది) విలసిల్లినది. అది ఎలా ఉంది? మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతోంది. లేదా, మహర్షి సమూహం చేత ఉపాసింపబడే రాజహంస నడకలా ఉంది. ప్రసన్న సరస్వతితోను, అబ్జాసనుడైన బ్రహ్మతోను శోభిస్తున్న బ్రహ్మ వాహనమైన హంసలాగా ఉంది. లేదా, మహర్షి మండలము చేత ఉపాసింపబడే రాజహంసలా వెలుగుతున్న ప్రసన్న సరస్వతితోను, బ్రహ్మతోను శోభిస్తున్న హంసలాగా ఉంది.

దీని గురించి వి.వి.ఎల్. నరసింహారావు గారు తన "నన్నయ్య కవిత్వము - అక్షరరమ్యత" అనే పుస్తకంలో యిలా వివరించారు:
---

శరత్సమాగమ విలాసము షడ్విధముగా భావింపబడినది.
1. భూసతికిని దివంబునకును పొలుపు గూర్చుట. ఇది నేలకు నింగికి అందమగు సంబంధము గూర్చుట.
2. ప్రసన్న సరస్వతీకమై ఉండుట. వానకాలపు వరదల ఉరవడివలని బురద అడగిపోగా కలతదేరి సరస్వతి (నది) సుప్రసన్నముగా నుండుట.
3. సరస్వతి మహర్షిమండలోపాసిత యగుట. తీర్థ సంసేవన వ్యాజమున మహర్షులు సరస్వతిని శరత్తులో నుపాసించుట.
4. సరస్వతి రాజహంసగతి భాసిని యగుట. సరస్వతీ నది యందు రాయంచ లందముగా నడచుట యని భావము. ప్రసన్నమగు కవితా సరస్వతి రాజహంస గమనము కలది యనియు భావము.
5. అబ్జాసన శోభితంబగుట. అబ్జాసనుడనగా బ్రహ్మ. ప్రసన్న సరస్వతీకమగు శరత్తు బ్రహ్మమయముగా నుండె ననుట.
6. శరదాగమము అబ్జజుయానముతో సమానముగా నుండెను. యానమనగా గజాది వాహనమనియు నర్థము. అబ్జజు యాన మనగా బ్రహ్మవాహనమగు దివ్య హంస మనియు నర్థము. బ్రహ్మ సంచారము గలది యగుటయే కాక శరదాగమము దివ్య హంసముతో సమానముగ ఉన్నదనియు భావము.

తత్త్వమరసి చూడ బ్రహ్మాధీన గతియైన సరస్వతీ తత్త్వము యిందు లక్షింపబడినట్లు దోచును. ఇది మహర్షి మండలోపాసితమైన తత్త్వము. ఈ తత్త్వము సుదూర మన్వేషింప దగినది.

---

పైనిచ్చిన రెండు పద్యాల గురించీ, దానికి ముందరి పద్యాల గురించీ మోహన రావుగారు ఈమాటలో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

ప్రకృతి పరంగా చూస్తే, శరత్కాలంలో మేఘాలు తొలగి, ఆకాశం నిర్మలంగా మారుతుంది. దానితో నక్షత్రాలూ చంద్రుడూ చక్కగా ఆకాశంలో ప్రకాశిస్తాయి (రాజహంస - రాజు అనే హంస = చంద్రుడనే హంస అనికూడా అర్థం స్ఫురిస్తుంది). నదులు వరద ఒత్తిడి తగ్గి, తేటబారి ప్రసన్నంగా ఉంటాయి. అందులో కలువపూలు (అబ్జము అంటే కలువపూవని కూడా అర్థం వస్తుంది) బాగా వికసిస్తూ కనిపిస్తాయి. హంసలు మానస సరోవరాన్ని చేరుకొనేది కూడా యీ శరత్తులోనే (పక్షుల వలస). మొత్తమంతా తెల్లని వెన్నెలతో నిండిపోయి ఉంటుంది.

ఈ చిత్రమంతా మనకి యీ పద్యంలో కనిపిస్తుంది. ప్రకృతి వర్ణన చేస్తూనే అంతర్గతంగా ఆధ్యాత్మిక చింతన చెయ్యడం మహర్షులైన మన కవులకి సొంతం. మన సనాతన ధర్మంలో కనిపించేది ప్రకృతి ఆరాధనే. ప్రకృతిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని దాని విధ్వంసానికి ఒడిగట్టే వాళ్ళని రాక్షసులన్నారు. మన కాలమానం ప్రకృతికిని అనుసరించి వెళ్ళేది. మన పండగలు మనలని ప్రకృతితో కలిపే సాధనాలు!

ఈ శరదృతువులో, అంటే వచ్చే రెండు నెలలూ వీలైనంత వెన్నెల నా బ్లాగునిండా నింపాలని ఒక ఆలోచన. వీలు చిక్కినప్పుడల్లా, మన కావ్యాలలో శరత్కాలానికి, చంద్రునికి, వెన్నెలకీ సంబంధించిన అందమైన వర్ణనలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
మీరు కూడా మీ మీ బ్లాగుల్లో ఆ పని చెయ్యవచ్చు. అంత కన్నా ముఖ్యంగా, ఈ రెండు నెలల్లో వచ్చే రెండు పున్నములలో కనీసం ఒక్క రోజు, ఆ పున్నమి జాబిలి వెండి వెలుగులని మనసారా ఆస్వాదించడం మాత్రం మరవద్దు.


పూర్తిగా చదవండి...

Saturday, August 29, 2009

తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!

చాన్నాళ్ళ కిందట ఛందస్సు యాహూ గ్రూపులో ఒక చిన్న సమస్య ఇచ్చాను. తెలుగు భాషలో అన్నిటికన్నా అందమైనవని మీకనిపించే పది పదాలు తీసుకొని వాటితో పద్యం రాయమని. అప్పుడు నేను రాసిన పద్యం, యీ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గుర్తుకువచ్చింది:

అలకలు నటియించి అటువైపు తిరిగిన
చెలి మోములోనున్న చిలిపిదనము
బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు
అమ్మదనములోని కమ్మదనము
ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ
జనపదమ్ములోని జానుదనము
వేసవి నడిరేయి వెన్నెల చిలికించు
నెలవంక నవ్వులో చలువదనము

కన్నె సరిగంచు పరికిణీ కలికిదనము
ఎంకిపాట పల్లవిలోని పెంకిదనము
కలిపి వడపోత పోసిన తెలుగుదనము!
తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె!

ఇప్పుడు మళ్ళీ యీ పద్యాన్ని చదివితే యిందులో యిష్టమైన ఆ పదిపదాలనీ గుర్తించడం కష్టమవుతోంది. అన్ని పదాలూ అందంగానే కనిపిస్తున్నాయి మరి!

తెలుగువాడిగా తెలుగుభాషని నరనరాన యింకించుకున్న భాగ్యం కన్నా యీ జన్మకి ఇంకేం కావాలి!


పూర్తిగా చదవండి...

Sunday, August 23, 2009

విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె...

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

కరుణశ్రీగారి ఉదయశ్రీలో తెలుగు పిల్లలకి వినాయకుని గురించి చెపుతున్న పద్యాలు:
(క్రిందటేడు ఈ పద్యాలని పూర్తిగా వినే తీరిక లేక వెళ్ళిపోయిన వినాయకుడు ఈ ఏడు గుర్తుపెట్టుకుని మరీ వినిపించమని అడిగాడు!)

ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరువెత్తివచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
'నల్ల మామా' యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ

తిలకమ్ముగా దిద్దితీర్చిన పూప జా
బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడుకోట్ల దేవతలపై
చల్లని చూపులు వెల్లివిరియ

గౌరికొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమొ
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు పట్ట
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము

కొలుచువారలకు ముంగొంగు బంగారమ్ము
పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతిచింతామణి
భావించువారల పట్టుగొమ్మ
దాసోహ మనువారి దగ్గర చుట్టమ్ము
దోసిలొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించిన వారి కానంద మందార
మర్థించు వారల కమృతలహరి

జాలిపేగుల వాడు లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు
చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు
అక్కరో! అర్ఘ్యపాత్రము నందుకొనవె

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు
పొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గు

పంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి

కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!


పూర్తిగా చదవండి...