తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, October 22, 2014

తెలుగు యతి - తిరుగు మతి!

"మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"

నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బ్లాగులో పోస్టు పెడదామనే దురాలోచన వచ్చింది. :-)  దీనికి స్ఫూర్తినిచ్చిన పంతుల గోపాలకృష్ణగారికి ముందుగా కృతజ్ఞతలు. వారు ఛందస్సు ఫేసుబుక్కు గ్రూపులో యతి గురించి పెట్టిన చర్చ దీనికి కారణం. కొన్ని కారణాలుగా FBని read-only మాత్రమే చేసాను కాబట్టి, దీని గురించి అక్కడ కాకుండా యిక్కడ నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను. దీనికి వారికి అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నాను. గోపాలకృష్ణగారు సంస్కృత తెలుగు యతుల మధ్య చెప్పిన భేదాలతో నాకు భేదాభిప్రాయమేదీ లేదు కాబట్టి, దాన్ని ఇక్కడ తిరిగి ఉట్టంకించడం లేదు. వారు లేవదీసిన ముఖ్యాంశం గురించి వారు చెప్పిన విషయాలు మాత్రం యథాతథంగా యిక్కడ పెడుతున్నాను, ఈ బ్లాగు చదివేవాళ్ళకు వీలుగా:

===
పాద ప్రథమాక్షరమే ఏ మార్పు లేకుండా తిరిగి యతి స్థానంలో ప్రయోగింపబడడమే తెలుగులో యతి చెల్లించడమంటే. ఇది ప్రాచీనమైన పద్ధతి. ఆ విధంగా సంస్కృతంలో యతి స్థానంలో విశ్రాంతి తీసుకుంటుండగా తెలుగులో అదే అక్షరాన్నితిరిగి ప్రయోగించడం ద్వారా ఒక కొత్త అందాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్న మాట. ఈ ప్రయోజనం అక్కడ పద విఛ్ఛేదనం జరిగి కొత్త పదం అదే అక్షరంతో తిరిగి ప్రారంభమయితేనే ఒనగూరుతుంది. అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. ఇంతటితో ఆగలేదు.పాదాద్యక్షరాన్నే తిరిగి యతిస్థానంలో అలాగే ప్రయోగించాలంటే కష్టమని భావించి ఆ అక్షరంతో మైత్రిగల ( అంటే ఉచ్చారణలో సారూప్యం గల) అక్షరాన్ని వేసుకున్నా సరిపోతుందని సరిపెట్టుకున్నారు. నిజానికి ఇది సరిపెట్టుకోవడమే గాని అదే అక్షరాన్ని యతిగా చెల్లించడం లోని అందాన్ని తీసుకు రాదు. అలాగే పదమధ్యంలో ఉన్న అక్షరంతో యతి చెల్లించడం వలన ఒక నియమాన్ని పాటించడం జరుగుతోందే తప్ప పద్యానికి ఏ విదమైన శోభనీ చేకూర్చడం లేదు. ఇది మన మహా కవులకు తెలియదని కాదు. కాని పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలల్లుతున్నప్పుడు యతి స్థానంలో పద విఛ్ఛేదనం జరగాలంటే కుదరదు. సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు. అందుకే పద మధ్యం లోని అక్షరంతో సరూపాక్షర యతి మొక్కుబడిగా చెల్లిస్తూ వచ్చారు. సరూపాక్షర యతి ఉండడం మంచిదే. కాని దాని ప్రయోజనం యతిస్థానంలో పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే ఒనగూరుతుంది . నియమాలూ కట్టబాట్లూ సంఘానికి మేలు చేసేవిగా ఉండాలి. అలానే ఛందో నియమాలు పద్యానికి అందం చేకూర్చేవిగా ఉండాలి. నిష్ప్రయోజనంగా ఉండ కూడదు. ఒక జాతి స్త్రీలు అందమైన మెడ కోసం జీవితంలో చాలా భాగం మెడ చుట్టూ బరువైన రింగులు దిగేసుకుని సంచరిస్తారు. పెరుగుతున్నకొద్దీ మరికొన్ని రింగులు చేరుస్తూ ఉంటారు. వారు సాధించుకునే అందమేమిటో గాని ఆ స్త్రీల జీవితాలకవి నిశ్చయంగా గుదిబండలే. తరతరాలుగా వచ్చినంత మాత్రాన అన్నీ మంచివే కాదు. వాటి ప్రయోజనాన్ని సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చర్చలో మన మహాకవులు ఛందో నియమాల్ని అవలీలగా పాటించారనీ ఇప్పుడు అది చేతగాక యతి నియమం వద్దంటున్నాననీ ఏదేదో వ్రాసేరు. నేను యతి నియమం వద్దన లేదు. యతి ప్రయోజనం ఒనగూరాలంటే పద మధ్యంలో కాకుండా పదారంభంలో యతి చెల్లిస్తే అక్కడ పద విచ్ఛేదం జరిగి పద్యానికి ఒక కొత్త అందం వస్తుందన్నదే నా అబిప్రాయం. పెద్ద పెద్ద వృత్తాలలో పద మధ్యంలో మొక్కుబడి గా యతి చెల్లించిన పద్యాలూ, పద విఛ్చేదనంతో పాటు యతి చెల్లించిన వేమన పద్యాలూ కంద పద్యాలూ గమనిస్తే ఈ సంగతి స్పష్టంగా బోధ పడుతుంది. ఎంతటి మహా కవులకైనా ఈ నియమాలు ఎలా ఇబ్బంది పెడతాయో చూపిస్తాను చూడండి.
సిరి గల వానికి చెల్లును
తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
శ్రీనాధ మహా కవిది- ఎంత చక్కటి పద్యం. అయినా చూడండి-సిరిగల వానికి పదహారువేలమందిని
పెండ్లాడడం చెల్లుతుంది, చెల్లును- అంటే తగును అనే కదా అర్థం? మరి మళ్ళా తగ పెండ్లాడన్ ఏమిటి? ఇది యతి చెల్లించడానికి పడ్డ తిప్పలు. ఇలా బయటకు స్పష్టంగా కనిపించక పోయినా, పద్యాల్లో యతి చెల్లించడానికి ముందో వెనకో అక్కర్లేని పదాలో విశేషణాలో వేయడమో లేక పోతే చక్కగా భావయుక్తంగా ఉండే పదాల్ని వదులుకుని ఏదోఒక పదం వేసి సరిపెట్టుకోవడమో జరుగుతూనే ఉంటుంది. పద్యం హృద్యంగా ఉండాలంటే యతి చెల్లించడంతో పాటు అక్కడ పద విఛ్ఛేదనం కూడా జరిగితేనే అందమన్నది నా అభిప్రాయం.అలాజరగనప్పుడు అది మొక్కుబడి
చెల్లింపే. లేదు దాని వన ఫలానా ప్రయోజనం ఒనగూరుతున్నాదని ఎవరైనా చూపిస్తే చాలా సంతోషం. చర్చ పదమధ్యంలో అక్షరంతో యతి చెల్లించడం- దాని ప్రయోజనం-గురించి మాత్రమే జరపాలని నా విన్నపం.
============

ఇది గోపాలకృష్ణగారు లేవదీసిన చర్చ. వారితో నేను ఏకీభవించే విషయాలను ముందుగా ప్రస్తావించి, ఆ తర్వాత విభేదించే అంశాలూ, వాటిపై నా ఆలోచనలూ పంచుకుంటాను. నేను ఏకీభవించే అంశాలు:

1. పదవిచ్ఛేదన జరిగే విశ్రాంత యతి పద్యానికి ఒక స్పష్టమైన లయని చేకూరుస్తుంది. తెలుగులో యతి (విరామాన్ని పాటించవలసిన అవసరం లేనందువల్ల) అలాంటి ప్రయోజనాన్ని యివ్వదు.
2. పద విరామంతో కూడిన అక్షరసామ్య యతి, ఆ అక్షరసామ్యాన్ని మరింత ప్రస్ఫుటం చేసి అక్షరసామ్యంలో గల శ్రావ్యతను చక్కగా ఆవిష్కరిస్తుంది. అలా లేనప్పుడు ఆ అక్షరసామ్యం అంతగా చెవులకి యింపు కలిగించదు.

యతికి యీ రెండు ప్రయోజనాలూ తప్ప మరేమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి అన్నది గోపాలకృష్ణగారి ప్రశ్న. దాన్ని గురించి వివరించే ముందు, ఆ ప్రశ్నలో భాగంగా వారు ప్రస్తావించిన మరికొన్ని అంశాలు, నాకు ఇబ్బందికరంగా తోచిన వాటిని ముందుగా చర్చిస్తాను.

"అయితే సంస్కృతంలో లాగా పద విఛ్ఛేదనం జరగడం దానితో పాటు సరూపాక్షర యతిచెల్లించడం రెండూ కావాలంటే అవి పద్య రచనకు గుదిబండలవుతాయనే ఉద్దేశంతో మన వారు సరూపాక్షర యతితో సరిపెట్టుకుని పద విఛ్ఛేదనమనే నియమానికి మంగళం పాడేరు. "

ఇక్కడ పదవిచ్ఛేదన నియమానికి "మంగళం పాడడం" అనే విషయం గురించి వారు ఒక ఊహ చేసారు. అది వారి ఊహ మాత్రమే. కాని అది "ఊహ" అని ధ్వనించకుండా, కచ్చితమైన విషయంగా వారు ప్రస్తావించడం నాకు అభ్యంతరకరంగా అనిపించింది. పద విచ్ఛేదన యతికి మన పూర్వకవులు ఎందుకు "మంగళం పాడేరో" మనకిప్పుడు కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. దాని గురించి ఎవరు ఏమనినా అది కేవలం ఊహ మాత్రమే అవ్వగలదు. దీని గురించి నా ఊహలు ఇలా ఉన్నాయి. పదవిచ్ఛేదన పద్యపాదానికి ప్రస్ఫుటమైన లయని చేకూర్చడం ప్రధానంగా రెండు సందర్భాలలో మాత్రమే జరుగుతుంది - ఒకటి, పద్యపాదం మరీ పెద్దది కాకపోవడం. దీనికి మంచి ఉదాహరణ కందం రెండవ పాదం. "ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ!" కందం కదను తొక్కే గుఱ్ఱంలా పరిగుపెట్టడానికి దాని చతుర్మాత్రా గణాలూ, జగణంతో పాటు, యతిస్థానంలో విరామం చక్కని లయని చేకూరుస్తుంది. అలాగే తేటగీతి పాదం కూడా.
"ఇనకరంబులలో వెల్గు ఎందుకొరకు?
ఇందుకిరణంబులను చల్వ ఎందుకొరకు?
ఋక్షసంతతిలో మిన్కు లెందు కొరకు?
ప్రేమ కొరకు ప్రేమ కొరకు ప్రేమ కొరకు"

తేటగీతికి ఆటవెలది వంటి విలక్షణమైన లయ లేదు. కాని యతి స్థానంలో విరామం ఒక లయని కలిగిస్తుంది.
ఇక విరామయతి పద్యానికి చక్కని లయని చేకూర్చే మరొక సందర్భం - పద్య ఛందస్సులోనే ఒక విలక్షణమైన లయ ఉండడం. ఆటవెలది, మత్తకోకిలా, తరలం, భుజంగప్రయాతం - ఇలాంటి ఛందస్సులన్నీ వీటికి ఉదాహరణలు. మాత్రాఛందస్సులు కూడా లయప్రధానమైనవే కాబట్టి వాటిలో కూడా విరామయతి ఆ లయ చెడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అయితే ఇక్కడ గమనించ వలసిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఆయా పద్యాలలో యతిస్థానంలోనే కాక, వాటి సహజలయని అనుసరించి పదాలు విరిగితేనే వాటిలో ఆ లయసౌందర్యం కనిపిస్తుంది.

ఈ రెండూ కాని చోట్ల విరామయతికి ప్రయోజనం ఏమిటి? ఉదాహరణకు శిఖరిణి వంటి వృత్తంలో స్పష్టమైన లయ కనిపించదు. "స్పష్టమైన లయ" అంటే ఒకే పాదంలో ఒకే రకమైన గురులఘుక్రమం లేదా మాత్రల ఆవృత్తి. ఉదాహరణకి ఆటవెలదిలో మూడు మాత్రలు మూడుమార్లు వరసగా వస్తాయి. మత్తకోకిలలో మూడు, నాలుగు మాత్రల గణాలు తిరిగి తిరిగి వస్తాయి. ఇలాంటి ఆవృత్తి "స్పష్టమైన లయ"ని ఇస్తుంది. శిఖరిణి వంటి వృత్తాలలో అది లేదు. అలాగే మాలా విక్రీడిత వృత్తాలు కూడా. ఒకే మాత్రలు/గురులఘుక్రమం కలిగిన (కనీసం మూడక్షరాల)గణాలు రెంటికి మించి వరసగా వాటిల్లో రావు. కాబట్టి వాటికి పైన ఉదాహరించిన యితర వృత్తాలలో మాదిరి స్పష్టమైన లయ లేదు. కాబట్టి యీ పద్యాలలో పాదవిరామం ప్రత్యేకంగా ఒక చక్కని లయని సాధిస్తుందని అనడం సరికాదు.
పద్యానికి లయని చేకూర్చడంతో పాటు, విరామయతికి  ఉన్న మరొక ప్రయోజనం, పద్యానికి పఠనసౌలభాన్ని కల్పించడం. అంటే చదివే వాళ్ళకి కాస్త విరామం, విశ్రాంతి కలిగించడం.
"దాసీభూతసమస్తదేవ వనితాం!" అని ఒక పెద్ద సమాసం చదివేవారు, ఒక్కసారి ఊపిరిపీల్చుకొని "లోకైకదీపాంకురాం" అని చదివే వెసలుబాటు అక్కడ విరామయతి కలిగిస్తోంది. ఇది స్తోత్రాలు చదివే వారికి చాలా అవసరం.

బాగుంది. ఇప్పుడు మరి తెలుగు పద్యాలకి యీ మూడు ప్రయోజనాలూ అవసరం లేకుండా పోయాయా? పోయాయి అన్నదే నా ఊహ. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి. తెలుగు కవులు, నన్నయ్యాగారితో మొదలుపెట్టి - చెప్పే విషయానికీ, పద్యపు నడకకూ ఒక సంబంధాన్ని కలిగించే ప్రయత్నం చేసారు - అన్ని చోట్లా కాకపోయినా, కొన్ని విశేష సందర్భాలలో. అంటే, పద్యపు నడకను, ఆ పద్యంలోని భావాన్ని ఉద్దీపింప జేసేందుకు ఉపయోగించడం అన్నమాట. మనకి ఎక్కువ చంపూ కావ్యాలు రావడం వెనకకూడా బహుశా ఇదే కారణం అని నేననుకుంటున్నాను. ఇది నాకు తెలిసి సంస్కృత కవిత్వంలో పెద్దగా కనిపించదు. రామాయణ మహాభారతాలు చాలావరకూ అనుష్టుప్ ఛందస్సులోనే సాగుతాయి. తర్వాత కావ్యాలు కూడా ఒకో సర్గా మొత్తం ఒకే వృత్తంలో సాగేవే ఎక్కువగా కనిపిస్తాయి. క్షేమేంద్రుడు వృత్తౌచిత్యాన్ని గురించి ఫలానా ఛందస్సు ఫాలానా భావాన్ని వ్యక్తపరచడానికి ఎక్కువగా ఉచితమని చెప్పాడు. అయితే అతను దానికి కారణం అందులో ఉండే గురు లఘు సంఖ్య ఆధారంగా చేసినదే కాని, పద్యపు నడకని నాకు తెలిసి ప్రస్తావించ లేదు. తెలుగు ఆలంకారికులు కూడా ఎక్కువగా సంస్కృతాలంకారశాస్త్రాన్నే అనుసరించారు కాబట్టి, వారు కూడా దీని గురించి విశ్లేషించినట్టు నాకు తెలియదు. దీని గురించి ఆధునికకాలంలో కొంతమంది కొన్ని విశ్లేషణలు చేసారు. వాటన్నిటినీ పూర్తిగా నేను ఒప్పుకోకపోయినా, పద్యపు నడకని (నడక అంటే ఒక ప్రత్యేకమైన "లయ" కాదు, పద్యం సాగే తీరు మాత్రమే) తెలుగు కవులు ప్రత్యేకంగా వాడుకొన్నారని నేను బలంగా నమ్ముతాను. దీని గురించి ఇంతకు ముందు కొన్నిచోట్ల (ఈ బ్లాగులోనూ, ఇతరత్రా వ్యాసాలలో) నేను ప్రస్తావించి కొన్ని ఉదాహరణలు ఇచ్చిన గుర్తు.
పై కారణాలవల్ల లయప్రాధాన్యం కాక, పద్యపు నడకలో స్వేచ్ఛకే పూర్వకవులు ఎక్కువ మొగ్గుచూపడం వల్ల, ఆ స్వేచ్ఛకి అడ్డంకి అయిన కారణంగా విరామయతిని పాటించ లేదన్నది నా ఊహ.

"సంస్కృత సమాసాల్ని యథా తథంగా దించేసుకుంటూ పద్యాలు వ్రాసుకున్న మన వారికి అసలు కుదరదు."
గోపాలకృష్ణగారు నన్ను క్షమించాలి, నేననుకున్నది చెపుతున్నాను. ఈ మాట నాకు కాస్త దురుసుగా అనిపించింది. ఇది పూర్వకవుల పట్ల నాకున్న వీరాభిమానం వల్ల కాదు. తార్కికంగా ఆలోచిస్తే, ఎంతశాతం అలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి కవులు ఎక్కువగా ఆపని చేసారు మొదలైన విషయాలని పరిశీలిస్తే, ఇలాంటి "generic statements" (సర్వకవులకూ ఆపాదించే మాటలు) అనడం కుదరదు. విరామయతిని కాదన్న నన్నయ్యగారి విషయంలో కాని, వారిని అనుసరించిన తిక్కనగారి విషయంలో కాని అసలు కుదరదు.

ఇక తెలుగులో ఉన్న అక్షరసామ్య యతికి అసలు ప్రయోజనం ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. అక్షరసామ్యం అనేది తెలుగు భాషకి ఒక సహజమైన అందాన్ని యిచ్చే అంశమని మన సామెతలూ, జానపదగేయాలు మొదలైనవి స్పష్టంగా రుజువు చేస్తాయి. బహుశా ఆ దృష్టితోనే పూర్వకవులు ఈ నియమాన్ని పెట్టి ఉండవచ్చు అని ఊహించడంలో నాకు అభ్యంతరం లేదు. అది పద్యాలలో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా సాధించలేదు అన్న విషయమూ స్పష్టమే (పైన నేను ఏకీభవించిన రెండో అంశం ఇది). మరి దీనికి వేరే ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని అడిగితే, ఉందని నా స్వానుభవం. ఇది ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అయినా మళ్ళి చెపుతున్నాను. ఈ ప్రయోజనం ఏమిటో మీరు సొంతంగా తెలుసుకోవాలంటే, మన కావ్యాలలోనుండి ఒక వంద పద్యాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక యాభై సంస్కృత శ్లోకాలు (పెద్ద వృత్తాలు) కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి. ఏది సులువో మీకు మీరు తెలుసుకోండి. నా విషయంలో తెలుగు పద్యాల కంఠస్థం సులువయింది. దీనికి తెలుగు భాషలో పద్యాలు సులువుగా అర్థమవడం, ఆ పదాలు ఎక్కువగా తెలియడం ఒక కారణం. అయితే నేను గమనించిన మరొక ముఖ్యకారణం అక్షరసామ్య యతి. అలాగే ప్రాస కూడానూ. ఒక పద్యంలో పదాలు గుర్తు పెట్టుకొనేటప్పుడు యతిస్థానంలో ఉండే అక్షరం మొదటి అక్షరంతో సామ్యం కలిగి ఉండడం వల్ల, అక్కడ వచ్చే పదమేమిటో సులువుగా గుర్తుంటుంది. ఇది నాకు చాలాసార్లు అనుభవంలోకి వచ్చిన సంగతి. ఇది కొంత తర్కసహంగానే అనిపించింది కాబట్టి, ఇతరుల విషయంలో కూడా యిది వర్తిస్తుందని నేను అనుకొంటున్నాను.
ఇంకొక విషయం - కొన్ని సందర్భాలలో పూర్వకవులు, చెప్పే విషయానికి ఒక ఉద్దీపన కలిగించడానికి కూడా యతిస్థానాన్ని వాడుకొన్నారని పండిత విమర్శకులు కొందరు విశ్లేషించారు. దీనిని కూడా నేను ఇంతకుముందు కొన్ని వ్యాసాలలో ఉదాహరించడం జరిగింది. ఇలాంటి విశ్లేషణతో అందరూ ఒప్పుకోవాలని లేదు కాని, యిది కూడా యతి ప్రయోజన విషయమై తప్పక ఆలోచించాల్సిన అంశమే.

చివరిగా, ఈ అక్షరసామ్య యతి పద్యరచనకు ఒక ప్రతిబంధకం, "గుదిబండ" అని గోపాలకృష్ణగారు అభిప్రాయపడ్డారు. అది వారి వ్యక్తిగత అనుభవం అంటే ఇబ్బంది లేదు. చాలామందికి అది గుదిబండ అయ్యే అవకాశం ఉంది అన్నా ఒప్పుకోవచ్చు. కాని పూర్వకవుల పద్యరచనకి యిది యించుమించు అంతటా గుదిబండగా మారింది అనే ధ్వని వారి మాటల్లో ఉంది. ఇది కచ్చితంగా తేల్చగలిగే అంశం కాదు. ఒక పద్యంలో యతిస్థానం వచ్చే పదానికి ప్రయోజనం ఉందా, కేవలం యతి కోసమే వేసారా అనే చర్చ ఎటూ తేలని చర్చ. ఒకోరికి ఒకో పదం వ్యర్థంగా తోచవచ్చు. మరొకరికి అందులో మహార్థమేదో గోచరించ వచ్చు, అది మొదటి వారికి రుచించక పోవచ్చు! పైగా మొత్తం కావ్యంలో, కావ్యసర్వస్వంలో అలాంటి వ్యర్థపదాలు యతిస్థానంలో ఉన్న పద్యాలశాతం ఎంత అనే లెక్క తెలియకుండా అది పద్యరచనలో మనకవులకు "గుదిబండ" అయింది అనే సర్వసామాన్య సిద్ధాంతాలు చేయడం సాధ్యం కాదు. ఈ యతి ఎలా ఇబ్బంది పెడుతుందో చూపిస్తాను చూడండి అని గోపాలకృష్ణగారు ఒక ఉదాహరణ ఇచ్చారు. దాని గూర్చి ముచ్చటించడం అసందర్భం కాదనుకుంటాను. వారిచ్చిన ఉదాహరణలో "తరుణుల పదియారు వేల తగ పెండ్లాడన్" అనే పాదంలో "తగ" అనేది వ్యర్థ పదం. సరే అది వ్యర్థపదమా కాదా అనే చర్చలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పైన చెప్పినట్టుగా అది తేగే చర్చకాదు. మరొక ముఖ్యమైన అంశాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ పద్యం ఒక చాటువు. చాటుపద్యాలలో ప్రతి పదం సార్థకంగా వాడడం అనేది మనకి చాలా అరుదుగా మాత్రమే కనిపించే అంశం. మంచి నడకతో, ఝటితిస్ఫూర్తి కలిగించే భావంతో ఉండడమే చాటుపద్యాల ముఖ్య లక్షణం. కాబట్టి వాటిలో వ్యర్థపదాలు కేవలం యతి వల్లనే ఉంటాయని భావించడం పొరపాటు. చాటుకవిత్వపు సహజమైన లక్షణాలలోనే వ్యర్థపదాలు భాగాలు. నిజానికి అక్కడ వాటిని "వ్యర్థ" పదాలని అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ "వ్యర్థం" అనే తూనికని మార్గకవిత్వపు లక్షణాన్ని బట్టి నిర్వచిస్తున్నాం కాబట్టి. దాన్ని మరొక రకమైన కవిత్వానికి వర్తింప చెయ్యడం సరికాదు కదా!

అయ్యలారా, అమ్మలారా! ఇవీ యతి గురించి నా మతికి తోచిన కొన్ని ఆలోచనలు. మీమీ సులోచనాలను బట్టి వీటిని ఆమోదిస్తారో తిరస్కరిస్తారో (ఏదో ఒకటి చెయ్యాలని రూలేమీ లేదు!) మీ యిష్టం. 


మళ్ళీ ఎప్ప్పుడైనా ఎందుకైనా మరోసారి కలుసుకొనేదాకా స్వస్తి! అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

పూర్తిగా చదవండి...