తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, April 11, 2013

వసంతవిజయం


పదిరోజుల కిందట హఠాత్తుగా మా యింటి మందారం, నిండా మొగ్గలతో నిండుగా కనిపించింది. అబ్బా! వసంతం వచ్చేసింది అనుకున్నా. ఆరునెలలయి ఒక్క పువ్వు కూడా పూయనిది రోజూ పూలతో కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో! అదే కదా మరి పూల ఋతువు మహిమంటే!
"పేరంటమున కేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత" వసంతం వచ్చిందని తెలిసిందంటారు విశ్వనాథ, తన తెలుగు ఋతువులలో. వసంతమంటే కవులకి ఒక ప్రత్యేక అభిమానం. ఎక్కడెక్కడి కవికోకిలల గొంతుకలూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి.

పూర్వకవులకి వసంతమంటే, మన్మథుడు పూలబాణాలతో చిగురాకుబాకుతో చిలుకతేజీనెక్కి జైత్రయాత్ర చేసే కాలం. వసంతవిజయమంటే మన్మథవిజయమే!

అత్తఱి చిత్తజాత విజయాంబుజమందిర కాటపట్టు నా,
గొత్త మెఱుంగు గ్రొన్ననల గుంపుల చక్కలిగింతనా, శుభా
యత్తత నొప్పె బుష్పసమయంబు సమంచిత చంచరీక లో
కోత్తరవిత్తమై, వనసముజ్జ్వల పైకవధూ సదుక్తమై

మన్మథుని విజయలక్ష్మికి (అంబుజమందిర అంటే పద్మనిలయ లక్ష్మి) ఆటపట్టులాగా ఉందట పుష్పసమయం. అప్పుడే విరిసి మెరిసే పూలగుంపుల చక్కిలిగింతలాగా కూడా ఉన్నదట. తుమ్మెదలు కూడబెట్టిన లోకోత్తరమైన విత్తం (అంటే తేనెపట్టు) వసంతం. "పైకవధూ" అన్న పదం దగ్గర కొంతసేపు ఆగిపోయాను. పైకము అచ్చ తెలుగుపదం. అయితేగియితే పైకపువధూ అని ఉండాలి కాని సమాసంలో "పైకవధూ" ఏమిటి? - అని పెద్ద అనుమానం వచ్చేసింది. కాస్త ఆలోచించిన మీదట తట్టింది. "పైకము" అంటే పిక సంబంధమైనది అనే అర్థం వస్తుంది. పికమంటే తెలుసు కదా, కోకిల. పైకవధూ అంటే ఆడకోయిల. ఆడకోయిలలల చక్కని గాత్రాలు ప్రతిధ్వనించే అడవులతో వెలిగిపోతోంది వసంతం - అని తాత్పర్యం. పద్ధెనిమిదవ శతాబ్దానికి చెందిన తక్కెళ్ళపాటి లింగన అనే కవి రచించిన సూర్యతనయాపరిణయం అనే కావ్యంలోని పద్యమిది. ఎప్పుడూ పేరైనా వినని కావ్యంలోంచి నాకీ పద్యం ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఇలా ఎన్నో తెలియని (తెలిసినవి కూడా) కావ్యాలనుండి రకరకాల అంశాలకి సంబంధించిన వర్ణనలను ఏర్చికూర్చి దాసరి లక్ష్మణస్వామిగారనే అతను "వర్ణనరత్నాకరము" అనే పుస్తకాన్ని నాలుగు భాగాలుగా ప్రచురించారు. ఆ పుస్తకంలోనే చదివానీ పద్యాన్ని. Digital Libraryలో నాలుగుభాగాలూ రెండు పుస్తకాలుగా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు అక్కణ్ణుంచి దింపుకోవచ్చు. ఇటీవల యీ పుస్తకానికి "పాఠకమిత్రవ్యాఖ్య" అనే బేతవోలు రామబ్రహ్మంగారి చిరు వ్యాఖ్యానంతో మూడు భాగాలు ప్రచురించారని విన్నాను. ఇంకా అది నా కంటపడ లేదు.

అన్నట్టు మన్మథుడంటే గుర్తుకు వచ్చింది, సుజనరంజని పత్రికలో నేను నెలనెలా "పద్యాలలో నవరసాలు" అనే పేరుతో వ్యాసాలు (పద్యం-హృద్యం అనే శీర్షిక క్రింద) వ్రాస్తున్నాను. ప్రస్తుతం శృంగారరసం నడుస్తోంది. ఆసక్తిగల వాళ్ళు యిక్కడ చూడవచ్చు: http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr13/padyamhrudyam.html

ఇంతకీ, పూర్వకవుల తీరు అలా ఉంటే, నవకవులది ఎంతైనా మరి కొత్త దారి. వీరికి వసంతం అంటే కొత్తదనానికి ప్రతీక. లేత చివుళ్ళతో, విరిసే పూలతో నవకాంతులీనే ప్రకృతి క్రొంగొత్త ఆశలకి స్వాగతం పలుకుతుంది. సరిగ్గా అప్పుడే, కొత్త సంవత్సరం కూడా మన ముంగిట అడుగుపెడుతుంది.

క్రొత్తదనాలు పూవులయి గుత్తులుగట్టి యుగాది పందిటన్
మత్తిలి నృత్తమాడినవి, మామిడికొమ్మలు కొత్తగా చివు
ళ్ళెత్తి సుమించి కాచి ఫలియించెను, తీయని క్రొత్త కోరికల్
మెత్తని మన్మనః పథముమీది పదమ్ముల నూని సాగినన్

అని దాశరథివంటి నవకవి పులకించి పాడతాడు. దాశరథికి పూవులన్నిటిలోనూ మోదుగపూలంటే యిష్టం. "పల్లెపడుచు కచమ్ముల నుల్లసిల్లు మోదుగను మించినట్టి పువ్వేది జగతి!" అంటారాయన. అంతే కాదు,

కోట్ల చిలుక ముక్కు లిట్లేకమైనట్లు
కింశుకమ్ము లందగించె నేడు
పేదవాని మదిని పెకలివచ్చిన ఆశ
అరుణతరుణ మగుచు విరిసె ననగ

అని కూడా అంటారు. కోట్ల చిలుకల ముక్కులు ఒక్కదగ్గర చేరినట్లు ఉన్నాయట ఆ కింశుకాలు. అక్కడితో ఆగిపోతే అది దాశరథి కవిత్వం అవ్వదు. విరగపూచిన ఆ మోదుగపూలు, పేదవాని మదిలోని ఆశ పైకి పెకలివచ్చిన తొలిసంధ్య వెలుగులా ఉన్నాయనడం ఆయనకే చెల్లింది! పేదతనమనే చీకటి పూర్తిగా తొలగిపోయే కొత్త ఉషస్సునీ ఉగాదినీ ఆకాంక్షిస్తాడు అభ్యుదయ కవి. అతని దృష్టిలో వసంతవిజయమంటే అదీ.

ఏ పేరుతో వచ్చినా క్రొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించాలని దాశరథి నిష్కర్షగా అంటారు. "విజయ" అనే మంచి పేరుతో వచ్చిన యీ కొత్త సంవత్సరం కొత్త మంచిని తెస్తుందని ఆశిస్తూ దాన్ని స్వాగతిద్దాం. మంచిచెడుల సరిహద్దులు చెరిగిపోయిన యీ కాలంలో ఎవరు ఎవరిని జయించాలని కోరుకుంటాం? ఈ కాలంలో మనకు బాగా తెలిసిన Win-Win situation అనే పదబంధ స్ఫూర్తితో, అందరికీ విజయం చేకూరాలనీ, ఎవరికివారు తమలోని చెడుపైన విజయం సాధించాలనీ కోరుకుందాం, ప్రయత్నిద్దాం.

అందరికీ "విజయ"నామ సంవత్సర శుభాకాంక్షలు! విజయీభవ!

పూర్తిగా చదవండి...