తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, August 3, 2012

విరటుని వాత్సల్యం


నేను తిక్కనగారి విరాటపర్వం కనీసం రెండు సార్లయినా చదివుంటాను. అయినా యింత చక్కని పద్యం ఇంతవరకూ నా దృష్టిలో పడకపోడం ఆశ్చర్యం. దృష్టిలో పడడమంటే ఆకట్టుకోడం. మనసుకు హత్తుకోడం. అందుకే కవిత్వాన్ని ఆస్వాదించడానికి సమయం సందర్భం నేపథ్యం చాలా అవసరమనేది. విరాటపర్వం అనగానే, ద్రౌపది "దుర్వారోద్యమ" లేదా "ఎవ్వాని వాకిట" పద్యమో, గోగ్రహణమప్పటి "సింగంబాకటితో", "వచ్చినవాడు ఫల్గునుడు" వంటి పద్యాలో గుర్తుకు వస్తాయి. ఇంకా అనేక ప్రసిద్ధ పద్యాలున్నాయి కాని, యీ పద్యం అంత ప్రసిద్ధమైనట్లు లేదు. అయినా, ఇదొక (నా మటుకు నాకు) అపురూపమైన పద్యం.

తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె
మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం
పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ
ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్

అర్జునుడు బృహన్నలగా విరటుని కొలువుకు వచ్చి, తాను నాట్యాచార్యుడినని, అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పుతానని, పని యిప్పించమని అడుగుతాడు. విరటుడు అతడి తీరును జాగ్రత్తగా గమనించి, సరైన వాడిలాగనే ఉన్నాడని నిశ్చయించి తన కూతురైన ఉత్తరను పిలిపిస్తాడు. ఆ ఉత్తర నర్తనశాల సినిమాలో లాగా పూర్తి యౌవనవతి కాదు. ఒక పన్నెండేళ్ళ బాలిక. ఆ తండ్రికి ముద్దులమూట. అలాంటి తన కూతురుని ఎంత మురిపెంగా విరటుడు దగ్గరకు తీసుకొన్నాడో వర్ణించే పద్యమిది! ఈ పద్యం మళ్ళా యిప్పుడు చదివేసరికి మా అమ్మాయే నా కళ్ళముందు నిలిచింది. "ఓరి వీడి అసాధ్యం గూలా! నేను మా అమ్మాయిని ఎలా దగ్గరకు తీసుకు ముద్దు చేస్తానో, సరిగ్గా చూసినట్టే వర్ణించాడే యీ తిక్కన!" అని పరమాశ్చర్యానికీ, ఆనందానికీ లోనయ్యాను!

తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో  సవరించాడట.

తన కూతురేమో చక్కని చుక్క, బంగారు తల్లి. ఆమెకి యిప్పుడొక మంచి నాట్యాచార్యుడు దొరికాడు. తండ్రి మనసుకి ఎంత ఆనందం. ఆ పిల్ల మీద ఎంత ప్రేమున్నా తన రాచరిక వ్యవహారాల వల్ల ఆమెతో ఎక్కువ సమయం గడపలేడు కదా. అంచేత చూసినప్పుడల్లా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే అపూర్వ విలోకనంబులు! తండ్రి మురిపెమంతా, అలా తల నిమురుతూ ముంగురులను సర్దడంలోనే ఉంది! ఎంత జగతీవిభుడయితే మాత్రం ఏమిటి. అతడొక ఆడపిల్లకు తండ్రి. ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది! అదీ పద్యంలో అచ్చుపోసి చూపించాడు కవిబ్రహ్మ తిక్కన. ఇలాంటి సందర్భంలో ఇంతటి సున్నితమైన సన్నివేశాన్ని ఊహించడం (యిది సంస్కృత భారతంలో లేదు), దాన్ని అంతే సుకుమారంగా, అత్యంత సహజంగా చిత్రించడం, తిక్కనకే చెల్లింది. ఇలాంటి పద్యాలు చదివినవాడెవడైనా, బుద్ధంటూ ఉంటే, ఆంధ్ర మహాభారతం వట్టి అనువాదం అని పెదవి విరుస్తాడా? ఇది నూటికి నూరుపాళ్ళూ అచ్చమైన కావ్య సృజన. ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలలో ఒక చిన్న పాత్రకొక కొత్త వెలుగు తీసుకురావడమన్నది సామాన్య విషయం కాదు. కావ్యంలో పాత్రలను సజీవం చెయ్యడమంటే యిదీ. ఆ కల్పనలో కూడా ఔచిత్యం ఉండాలి. విరటునికి తన కొడుకుపైన ఎంత ప్రేమో, ఎంత గురో మనందరికీ తెలుసిన విషయమే. కౌరవులను గెలిచింది తన కొడుకు కాదంటే, ఆడుతున్న పాచికలు కంకుభట్టు మొహాన కొట్టేంత పిచ్చి ప్రేమ అది. మరి అంతటి ప్రేమ కూతురు మీద మాత్రం ఉండదా. ఉంటుందని ఊహించడమే ఔచిత్యం. కథకు అవసరమని కొడుకు ప్రేమను మాత్రమే వ్యాసుడు చిత్రించి ఊరుకుంటే, తాను వ్రాస్తున్నది కావ్యం కాబట్టి, ఆ పాత్ర స్వభావానికొక సంపూర్ణతనీ ఔన్నత్యాన్నీ, యీ ఒక్క పద్యంతో చేకూర్చాడు తిక్కన. అదీ తిక్కన కవితా శిల్పం.

ఈ టపా చదివి ఆడపిల్లలు లేని వాళ్ళు నా మీద అసూయపడితే అది నాకు ఆనందమే! :-)
పూర్తిగా చదవండి...