ఒకోసారి కొంతమందితో మనకి ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మన మీద గాఢమైన ప్రభావాన్ని చూపుతారు, మనకి ఆత్మీయులవుతారు. సాధారణంగా ఇలాంటి బంధం ఒక రచయితకీ పాఠకునికీ మధ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏకపక్షం. పాఠకునికి రచయితతోనే ఉండేది. నన్నలా ప్రభావితం చేసిన వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్యగారు.
ఛందస్సులో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి దోహదం చేసిన పుస్తకాలలో కోవెలవారి తెలుగు ఛందోవికాసము ముఖ్యమైనది. ఇది ఛందస్సుకి సంబంధించిన మామూలు లక్షణగ్రంథంలా కాకుండా, తెలుగు ఛందస్సు మూలాలను పరిశీలిస్తూ, తెలుగు ఛందస్సుని తమిళ కన్నడ ఛందస్సులతో పోలుస్తూ, గణవిభజన, యతి, ప్రాసల వెనకనున్న వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని వచనంలో సాగే పుస్తకం. ఛందస్సు గురించిన అవగాహనకి ఈ పుస్తకం నాకెంతో ఉపయోగపడింది.
అలాగే వీరికీ, చేరాగారికీ మధ్య వచన పద్యాలలో ఛందస్సు గురించి చాలా కాలం కిందట వ్యాసపరంపరలతో ఒక చర్చ జరిగింది. ఈ చర్చ ఎంతో ఆసక్తికరమైనది, అంతకు మించి ఆరోగ్యకరమైనది. వారిరువురి మధ్యనా ఆ చర్చ ద్వారా ఏర్పడిన అనుబంధం ఆదర్శవంతం. ఈ చర్చలోని వ్యాసాలన్నిటినీ "వచన పద్యం - లక్షణ చర్చ" అనే పుస్తకంగా సంకలించి ప్రచురించారు. ఈ చర్చలో వారిద్దరూ అనేక విషయాల్లో విభేదించుకున్నప్పటికీ వారి మధ్యన స్నేహబంధానికి ఆ విభేదాలు అడ్డురాలేదు. ఈ వాదనవల్ల ఏర్పడిన బంధం ఎంతదాకా వెళ్ళిందంటే, ఆ తర్వాత ఒకరు వ్రాసిన పుస్తకాలు మరొకరికి అంకితం ఇచ్చుకొనేంతదాకా!
అన్నిటికన్నా కూడా విశ్వనాథని అర్థం చేసుకోడానికి శ్రీ సంపత్కుమారాచార్యగారి పుస్తకాలు వ్యాసాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి. దానికి నేనతనికి ఎప్పటికీ ఋణపడిపోయాను. విశ్వనాథ సాహిత్యాన్ని గురించి "విశ్వనాథ సాహిత్య దర్శనం" అన్న పుస్తకాన్ని వారు వ్రాసారు. విశ్వనాథ కవిత్వాన్ని గురించి ఇంకా చాలాచోట్ల చాలా వ్యాసాలు వ్రాసారు. విశ్వనాథ జీవితచరిత్రకి (పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు వ్రాసిందని గుర్తు) సంపాదకత్వం వహించారు.
చాలా ఏళ్ళ కిందట దూరదర్శన్ "పద్యాల తోరణం" కార్యక్రమంలో పాల్గొనడానికి టీవీ స్టూడియోకి వెళ్ళినప్పుడు వారుకూడా వచ్చారు. నేను పెద్దగా కలుపుగోలు మనిషిని కాకపోవడంతో వారికి నమస్కారం మాత్రం పెట్టి ఊరుకున్నాను కాని, అంతకుమించి పరిచయం పెంచుకోలేదు. అయినా వారి రచనల ద్వారా వారు నాకెంతగానో దగ్గరయ్యారు.
ఆ సంపత్కుమారాచార్యగారు మొన్ననే పరమపదించారన్న వార్త విని చాలా బాధపడ్డాను. ఛందస్సు, విశ్వనాథ కవిత్వం నాకు నేర్పిన పరోక్ష గురువు వారు. ఈ కాలంలో తెలుగు పద్యసాహిత్యమ్మీద గొప్ప అధికారం ఉన్నవాళ్ళలో ఆయనే పెద్ద. రామాయణకల్పవృక్షానికి వ్యాఖ్యానం వ్రాయగల సామర్థ్యం ఉన్న చాలా కొద్దిమంది విమర్శకులలో సంపత్కుమారాచార్య ఒకరని నేను నమ్ముతాను. ఇప్పుడు వారు కూడా పరమపదించారని తెలిసి, ఇక కల్పవృక్షానికి వ్యాఖ్యానం వచ్చే అవకాశం మరింత తగ్గిపోయిందని చాలా బాధగా ఉంది. ఇకపై వారి రచనలు చదివే అవకాశం లేదన్న ఊహ కష్టంగా ఉంది!
వారిని సంస్మరిస్తూ, వారు వ్రాసిన "కల్పవృక్షము - యుద్ధ శిల్పావతారిక" అనే వ్యాసం నుండి ఒక చిన్న భాగం ఇక్కడ ఇస్తున్నాను. మీరుకూడా వారి విమర్శ పటిమని రుచిచూడండి.
***
రామాయణగాథ నీ సంసారానికి - నిత్యప్రస్రవణ శీలమయిన లోకానికి - అందించిన వాల్మీకిమహర్షి పరమమౌని. కల్పవృక్షావతారికలో వాల్మీకి స్మరణ సాగిన పద్యత్రయిలోనూ ఆయన "మౌని"గానే విశేషణింపబడినాడు. గాథనందించిన మహర్షి "మౌని" కాగా, గురువుగారి మౌనవ్యాఖ్యానంలో శిష్యులు ఛిన్నసంశయులు కావలసి ఉంటుంది. ఎల్లాంటివారయితే, ఏం చేస్తే వారు ఛిన్నసంశయులు అయ్యే స్థితి కలుగుతుంది? మొదట కావలసింది వారు గాఢప్రతిభులు. తద్ద్వారా ఆ గాథను, దానిలోని రహస్యాలనూ, కథాకథనశిల్పానేక మార్గాలనూ పౌనఃపున్యంగా ఉపాసించి, ఆ కావ్యవాక్కు సర్వశిల్పభూమి అని తెలిసి సర్వశాస్త్ర లక్ష్యమని ఎరిగి, సంప్రదాయావగాహనతో మననం చేసి, అనంతమయిన వ్యుత్పన్నత లోకజ్ఞత కలిమితో అనేకాంశాలను సమన్వయపూర్వకంగా ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే ఛిన్న సంశయత్వం. కృష్ణశాస్త్రి అన్నట్లు "గాఢప్రతిభు"లయిన సత్యనారాయణగారు ఆ విధంగా చేసినారు.
"--- వలయు విద్యకైగాగ్ర్య మభ్యసనవేళ
జనును బహుముఖత్వము ప్రదర్శనము వేళ"
-రామాయణకల్పవృక్షం, యుద్ధ నిస్సంశయ ఖండం
రామాయణ మహావిద్యా విషయకంగా ఆయన చేసిన అభ్యాసమా విధమైనది. రామాయణాన్ని కల్పవృక్షంగా విరియించిన వేళ ప్రదర్శించిన బహుముఖత్వం అనంతముఖమయింది.
...
రామాయణకల్పవృక్షం యుద్ధకాండతోనే సమగ్రమయింది. కావలసిందిగూడా ఆ విధంగానే. వాల్మీకావతారికా సర్గల్లో - "రఘువరచరితం మునిప్రణీతం, దశశిరసశ్చ వధం నిశామయధ్వం" అనీ, "కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్" అనీ చెప్పబడింది. నిజాని కది రఘువర చరితమా? సీతామహచ్చరితమా? నిజానికా చరితలు "రెండు" కావు - ఒకటే రెండుగా భాసించినా ఒకరు లేకుండా మరో టనిపించే చరిత లేదు; కారణం సీతారాములు అభిన్నులు కావటమే. ఇద్దరూ ఒకే వెలుగు.
"ఇరువురము ఒక్క వెలుగున
చెరి సగమును, దీని నెఱుగు శివుడొకరుండే,
పురుషుడ వీ వైతివి, నే
గరితనుగా నైతి..." (కల్పవృక్షం, యుద్ధ.ఉపసంహరణ)
అగ్నిప్రవేశం చెయ్యబోతూ కల్పవృక్ష సీత చెప్పిన చివరి రహస్యమిది. కల్పవృక్షావతారికలో "కృత్స్నము రామ మహత్తు" శివుడెరుంగునని చెప్పిన అంశం ఇక్కడి అంశాన్ని స్పృశిస్తున్నది. ఈ విధంగా "పాలితాన్యోన్య లంఘన స్పర్థము"లయిన అంశాలు అనేకం. కాగా శివుడెరింగిన ఆ కృత్స్నత - సమగ్రత ఇది. అయితే ఒకే వెలుగు స్త్రీ-పుం రూపంగా వివర్తమానం కావటమెందుకు? రావణ వధార్థం. ఉదాహృత వాల్మీకి వాక్యాల్లో రఘువరచరిత మన్నప్పుడు, సీతామహచ్చరిత మన్నప్పుడు కూడా వెనువెంటనే తప్పనిసరి అంశంగా, ఫలభూతంగా చెప్పబడింది దశశిరస్క - పౌలస్త్య వధ. ఆ దశశిరస్కుడు పౌలస్త్యుడు భిన్నులు కారు. రఘువరుడు, సీత కూడా కారు. "రమ్" అన్న ధాతువునుంచి సుబంతపదం పుంలింగ రూపంలో నిష్పన్నమయితే "రామ" అని, స్త్రీలింగ రూపంలో నిష్పన్నమయితే "రామా" అని ఒకే వెలుగు ద్విధా పరిణతమయినట్లు, ఒకే మూలధాతువు ఈ రూపద్వయంగా పరిణతమయింది. ఒకటి పురుషరూపం, ఒకటి గరిత రూపం. అందుకనే తత్త్వతః అభేదం. ఈ కారణంగానే వాల్మీకం రఘువరచరితం గానీ, సీతా మహచ్చరితం గానీ కాక, "రామాయణ"మయింది. తాత్త్వికాభేదాన్ని రామాయణం గర్భీకరించుకుంది. "కావ్యం రామాయణం కృత్స్నం" అంటే ఆ కృత్స్నత ఇది. ఈ కృత్స్నమయిన రామాయణానికి ఫలం రాముడు సీతను పునర్లభించుకోవటం కాదు. ఈ అంశం కల్పవృక్ష రావణునికీ అర్థమయింది. అందుకనే,
"సీతం గొంచును బోవ నీతడిట వచ్చెన్నాగ వ్యాజంబు, వి
ఖ్యాతిన్ దానవవంశ నాశనము కార్యంబీ శివాద్వైతికిన్
సీతం గైకొనిపోవ వేవిధములం జేయంగ వచ్చున్, మహా
దైతేయోన్మథనంబు ముఖ్యము సముద్రాంభోవ్యధాకారికిన్" (యుద్ధ.నిస్సంశయ ఖండం)
అనుకుంటాడు. అట్లాగే, సీతను వదిలి పుత్రులను పొందటంగూదా కాదు. ఇవన్నీ అనుషంగికమయినవి. అసలు ఫలం దశశిరస్కుడు పౌలస్త్యుడు అయిన రావణుని వధ. దశశిరస్కత మానవ సృష్టిలోని ప్రకృతి వైపరీత్యానికి ప్రతీక, పౌలస్త్యత్వం మానవుని ఉదాత్త స్థాయికి సూచిక. ఆ స్థాయిలో వైపరీత్యం సృష్టి వ్యవస్థా భంజకం. ఆ భంజికమయిన దాన్ని ఉన్మూలించటం సృష్టియొక్క సుస్థితికి అభీష్టం. ఈ సుస్థితిని రక్షించుట ఆదిమ మహస్సులోని వైష్ణవీయతా లక్షణం కాబట్టి రావణవధ రామాయణఫలం. ఈ విధంగా యుద్ధకాండతోనే రామాయణ సమగ్రత.
...
రావణ వధానంతరం అగ్నిలో ప్రవేశించబోతూ సీత అనేకాంశాలను సువ్యక్తం చేస్తూ -
"--- కైక కోరక మహాప్రభు! నీ వని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్" (యుద్ధ,ఉప)
అంటుంది. "సీతాయాశ్చరితం మహత్" అని అనకుండా ఉండలేకపోవటం ఇందువల్లనే. రాముడు శుద్ధ తత్త్వ స్వరూపం. ఆయన క్రియాప్రవృత్తిని స్పందింప చేసింది కైకేయి. ఆ స్పందనను ఫలవంతం చేసింది సీత. అందుకే తిరిగి అయోధ్యకు వచ్చినాక కలుసుకున్నప్పుడు -
కైకెయి సీత గౌగిటికి గైకొని - "ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయనికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాదివధ కల్గునె యన్న ప్రశంసలోనికిన్ (యుద్ధ, ఉప)
అంటుంది. కార్య సాఫల్యం విషయికంగా అంతర్మథనం పొందిన లక్షణం కైక మాటల్లోనూ, నిశ్చయాత్మకత సీతమాటల్లోనూ వ్యక్తమై వారి వ్యక్తిత్వాలను సువ్యక్తం చేస్తుంది.
***
పూర్తిగా చదవండి...