మిత్రుల కోరిక మీద శతావధానం విశేషాలు మరికొన్ని.
ఇంతకు ముందు ఒక టపాలో శతావధానం కన్నా అష్టావధానమే కష్టమని అన్నాను. కాని ఈ శతావధానం చూశాక దేని కష్టం దానిదే అని తెలిసింది. 75 పద్యాలను సరిగ్గా వరసలో గుర్తుకుపెట్టుకోవడం చాలా కష్టమైన పని. దీనికి చాలా సాధన అవసరం. దీని గురించి గరికిపాటి వారు చిన్నచిన్న విషయాలు చెప్పారు. ప్రతి పద్యానికి ఒక keyword (కీలక పదం) గుర్తుపెట్టుకుంటారుట. పద్య సంఖ్య, కీలకపదం కలిపి గుర్తుపెట్టుకుంటారు. ఇది అవధానం చేస్తున్నంత సేపూ మాటిమాటికీ మననం చేస్తూ ఉంటారు. దీనికి తోడు పృచ్ఛకుని పేరు కాని, అతని ఆకారంలోని ఏదైనా విలక్షణతని కాని ఇచ్చిన అంశంతో గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి "భవశీర్షము ద్రుంచె రాగతత్పరమతియై" అనే సమస్య ఇచ్చిన అతనికి గుండుంది. అందులోని "శీర్షము" పదానికీ ఆ గుండుకీ లంకెపెట్టుకుంటారు. మూడు రోజుల్లో జుట్టొచ్చెయ్యదు కాబట్టి, అతన్ని చూడగానే ఆ సమస్య గుర్తుకువస్తుంది! పద్య నియమాలైన గణ యతి ప్రాసలు పద్యాలని గుర్తుపెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందులోవాడే పదాలు కూడా సులువుగా గుర్తుండేటట్టు వేసుకూంటారు. ఉదాహరణకి "చిద్వేద్యమై హృద్యమై" లాంటి అనుప్రాసలు. మననం చేసుకోవడంలో ఒక పద్ధతేదో ఉంటుంది. ఒకసారి ముందునుంచి వెనక్కి, మరోసారి వెనకనుంచి ముందుకి ఇలా. సాధన చెయ్యడమే ధారణకి మార్గం. గరికిపాటి వారు ఎంత సాధన చేస్తే 75 పద్యాలు 32 నిమిషాల్లో చెప్పగలిగారో!
మూడు రోజులు శతావధానం చెయ్యడంలో మరో కష్టం ఉంది. అది మూడు రోజులూ, ఆరు పూటలూ పృచ్ఛకులనీ, ప్రేక్షకులనీ రంజింప చెయ్యడం. ఇది సాధనతో సాధ్యమయ్యేది కాదు. స్వతహాగా ఉండాల్సిన ప్రతిభ. గరికిపాటివారికది పుష్కలంగా ఉంది. చమత్కారాలతో ఎప్పుడు నవ్వించాలో, ఆర్ద్రతతో ఎలా ముంచెత్తాలో, ఆవేశంతో ఏలా ఊగించాలో అతనికి చాలా బాగా తెలుసు. పాత అవధానాలలోని పద్యాలు, తన సాగరఘోషలోని పద్యాలు, శంకరాచార్యులు, కాళిదాసు మొదలైనవాళ్ళ సంస్కృత శ్లోకాలు సందర్భోచితంగా చెప్పి వివరిస్తూ ఉంటే అలా ఎంత సేపైనా వినాలనిపిస్తుంది.
ఈ శతావధానంలో పృచ్ఛకులు ఇచ్చిన అంశాలలో చాలా వైవిధ్యం కనిపించింది. ముందుగా నేనిచ్చిన సమస్య గురించి. కిందటి టపా వ్యాఖ్యల్లో చెప్పినట్టు ఇది మత్తేభ/శార్దూల పద్యపాదం. ఒక అక్షరం చేరిస్తే శార్దూలం, రెండక్షరాలు చేరిస్తే మత్తేభం. ఇది ముందు పోల్చుకోవాలి. అవధానిగారికి ఇది పెద్ద కష్టం కాదు. అయితే ఇక్కడ కీలకమైన విషయం యతి నిర్వహించడం. యతిని నిర్వహిస్తూ "భూతమ్ము"ను దేవతలు చూసేదిగా చెయ్యాలి. దీనికి నేననుకున్న పూరణ "ఆవిర్భూతమ్మగు" అని వేసుకోవడం. అప్పుడు ప్రాస "ర్భ" అవుతుంది. ఇది మరింత క్లిష్టం. అవధానిగారి పూరణ ఇచ్చేముందు నా పూరణ ఇది:
దుర్భావ్యమ్మగు క్షీరవార్థి మథనోద్యోగమ్మునన్ బుట్టె మున్
దుర్భాగ్యమ్మన కాలకూటము వెసన్ గ్రోలెన్ శివుం డంతటన్
గర్భీభూత సుధానిధుల్ భుగభుగల్గా పొంగి యేతెంచె నా
విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్
అయితే అవధానిగారు తెలివిగా ఈ క్లిష్ట ప్రాసని తప్పించుకున్నారు. అయితే అతను భూతాన్ని ఎలా మారుస్తున్నారన్నది రెండుపాదాలు చెప్పిన తర్వాత కూడా నాకు అంతుబట్టలేదు. అవధానిగారి పూరణలోని మొదటి రెండుపాదాలు ఇవి:
శ్రీభూదేవుల కేది యింటివెలుగై చిద్వేద్యమై హృద్యమై
శోభిల్లున్ సకలాగమాంత పదమై శుద్ధ ప్రకాశమ్మునై
మూడవ పాదం ఏమిటో, భూతం ఏమైందో మీరేమైనా ఊహిస్తారేమిటి?
నేనిచ్చిన సమస్య ఒక్క ఛందోగోపనమే అయితే, ఛందోగోపనంతో పాటు అచ్చు ప్రాసతో కూడిన మరో సమస్య ఒకరిచ్చారు. సమస్యలన్నిటిలోకీ అత్యంత క్లిష్టమైనది ఇదే.
ఉగము పైనున్న లోకరక్షకు గొల్తున్
ఇది కందపద్య పాదం. అయితే మొదటి అక్షరం లోపించింది. పైగా రెండో అక్షరం "ఉ". అది ప్రాసాక్షరం. ప్రాసాక్షరం అచ్చు అయినప్పుడు, మిగతా పాదాల్లో కూడా అచ్చు అక్షరమే రావాలన్నది నియమం. అది ఏ అచ్చైనా ఫరవాలేదు. ఇలాంటి పద్యాలు ప్రాచీన కావ్యాలలో ఎక్కడా ఉన్నట్టు లేవు. లాక్షణికులు మాత్రం ఒక ఉదాహరణ పద్యమేదో ఇచ్చారు. తర్వాత శ్రీశ్రీ ఒక్కడే తన సిరిసిరిమువ్వ శతకంలో అచ్చు ప్రాసతో పద్యం రాశాడు. అది ఇక్కడ చదువుకోండి: http://www.eemaata.com/em/issues/201001/1530.html/3/.
ఇందులో ఉన్న చిక్కేమిటంటే, సాధారణంగా ఇలా అచ్చుతో మొదలయ్యే తెలుగు పదాలకి, ముందు పదాలతో అచ్చు సంధి జరుగుతుంది. అలా జరగనప్పుడు యడాగమం వచ్చి అచ్చు కాస్తా "య"కారంగా మారుతుంది. అలా చెయ్యకపోవడం సమంజసం కాదు. అంచేత సంస్కృతాన్ని ఆశ్రయించాలి. లేదా ఇంకేమైనా కిట్టుంపు చెయ్యాలి. అలా కిట్టించి అవధానిగారు పూరించిన పూరణ ఇది:
అ ఉ మాహేశ్వరుడిట్లనె
"స ఇనో మంతవ్యయేవ సహసా భక్త్యా
స ఉదేతి" యనుచు, బ్రోవ పు
ర ఉగము, పైనున్న లోకరక్షకు గొలుతున్
ఇక్కడ "అ ఉ మాహేశ్వరుడు" అంటే "అవసరాలో", "అరిపిరాలో" ఇంటిపేరున్న ఉమా మహేశ్వర రావనే వ్యక్తి. అతను చెపుతున్నాడు. పేర్లని పొట్టిచేసేటప్పుడు సంధులు రావు కదా! రెండు మూడు పాదాలు సంస్కృతం. సూర్య స్తుతి. పుర ఉగము - ఉగము అంటే సంవత్సరమనే అర్థం వస్తుందిట. పుర ఉగము అంటే రాబోయే సంవత్సరము అని. రాబోయే సంవత్సరం అందరినీ రక్షింపమని సూర్యుడిని స్తుతిస్తూ, పైనున్న ఆ లోకరక్షకుడిని గొలిచెదనని ఆ సదరు ఉమామహేశ్వరుడు అన్నాడుట!
మరికొన్ని మంచి సమస్యలు:
భవశీర్షము ద్రుంచె లోకతత్పరమతియై (ఇక్కడ యతి సరిపోలేదు. అది కుదిరేటట్టు అవధానిగారు పూరించాలి)
మేరీమాతసుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే
బ్రతికిన పుత్రునిచ్చెద, భవన్మృత పుత్రిక నిమ్ము సోదరీ!
మగనిన్ గొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకంబునన్ (సమస్యలలో ఉన్న ఒకే ఒక పృచ్ఛకురాలు ఇచ్చిన సమస్య ఇది! చాలా సరసమైన పూరణ చేశారు గరికిపాటివారు)
మగవారికిన్నొక్కటుండున్ మగువలకమరన్ మంచిగన్ రెండునుండున్ (ఇది మహా స్రగ్ధర వృత్తం. ఇందులో రెండు యతులు. ఇందులోని అశ్లీల ధ్వనిని చక్కగా పరిహరించారు.)
ఖాట్మండూపుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నాణమౌ
దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందుల్ పుట్టే నుగ్రాకృతిన్
(పై రెండూ దుష్కర ప్రాస సమస్యలు)
గోవిందుడు క్రైస్తవులకు కులదైవంబౌ
దత్తపదులలో కొన్ని విశేషమైనవి:
వారాయ్, నానుని, వందే, నినవు - భారతార్థంలో (చంద్రముఖిలో పాట ఆధారంగా ఇవ్వబడిన పదాలు)
ఎడిసన్, థాంసన్, న్యూటన్, వాట్సన్ - భారతార్థంలోనే
బ్రాకెట్, లాకెట్, రాకెట్, క్రికెట్ - బాల కృష్ణుని లీలలు
దాశరథీ, శరధీ, రథీ, ధీ - విజయనగర వైభవం
కలివిడి, చలిమిడి, పిడికిలి, తిరగలి - సరిహద్దు జవానుల గొప్పతనం
అత్త, మామ, అమ్మ, నాన్న - ఆవే అర్థాలలో రాకుండా, శివధనుర్భంగం
రామ, భీమ, ప్రేమ, నీమ - ఇది అడిగిన పృచ్ఛకుని అవధానిగా స్తుతిస్తూ పద్యం!
టమోటా, పొటేటో, క్యాబేజి, కారెటు - భారతార్థం
గరికి, సరిక, రారిక, మరిక - ప్రస్తుత అవధానం గురించి
నయనతార, భూమిక, ప్రియమణి, దీపిక - ధనుర్మాసం (దీనికి ముందు దీపిక బదులు ఇచ్చిన మాట అనుష్క. కాని ఈ మాట అర్థ రహితం కాబట్టి మారిస్తే బాగుంటుందని అవధానిగారు సూచిస్తే, మార్చి దీపిక ఇచ్చారు పృచ్ఛకులు. దానికి బదులుగా దీపిక పూర్తిపేరు, "దీపిక పడుకొనె"ని పద్యంలో తెప్పించారు గరికిపాటివారు!)
వర్ణనలలో కొన్ని విశేషమైనవి:
శ్రీకృష్ణుని అష్టభార్యల సేవలు సీస పద్యంలో వర్ణించమని
దోమలు లేని భూమిని ఊహిస్తూ చంపకమాల
ఆడపిల్లలపై జరుగుతున్న అమానుషమైన దాడులని నిరసిస్తూ ఒక పద్యం
పృచ్ఛకులంతా అవధానులైతే అవధానం ఎలా ఉంటుంది?
వేదవాణి వైశిష్ట్యాన్ని గురించి
నాశనమవుతున్న పర్యావరణం
రుక్మిణీకల్యాణ సమయంలో కృష్ణుడు రుక్మిణిని గతజన్మలో బంగారు సీతగా ఊహించడం
తెలుగుభాష గొప్పదనం, మాధుర్యం
అదృశ్యమవుతున్న పల్లెటూళ్ళు
మీరు ముఖ్యమంత్రి అయితే ఏమిటి చేస్తారు?
సమస్య, దత్తపది, వర్ణన మొత్తం డెబ్భై అయిదు పద్యాలు కాకుండా, ఆశువుగా చెప్పిన పద్యాలు ఇరవై ఆరు. మొట్ట మొదటే ఒక అందమైన ఆశువు వచ్చింది. అవధానాన్ని శతపత్ర కమలంగా పోలుస్తూ ఆశువుగా పద్యం చెప్పమన్నారు. అప్పుడు చెప్పిన పద్యం:
అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్
పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై
సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగున్ గదా యజ్ఞ మా
అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై
ఇక్కడ "బాల రవి" అంటే ఈ అవధాన సంచాలకులు శ్రీ రవికుమార్ గారు. రాముని గురించి చెప్పి లక్ష్మణుడి గురించి చెప్పకపోవడం ఎంత తప్పో, ఈ అవధానంలో గరికిపాటివారి గురించి చెప్పి రవికుమార్ గారి గురించి చెప్పకపోవడం అంత తప్పు! శతావధానంలో సంచాలకులది చాలా ముఖ్యమైన పాత్ర. అవధాని వేగమైన ధార ఒడ్డులు తెగి ప్రవహించకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత సంచాలకులది. అంటే వేగంగా చెపుతున్న పద్యంలో ఒక చిన్న యతిభంగమో, వ్యాకరణ దోషమో పొరపాటున పడవచ్చు. దానిని పృచ్ఛకులు, ప్రేక్షకులు గ్రహించి ఎత్తిచూపేలోపు, సంచాలకులు గ్రహించి అవధానిగారిని జాగ్రత్తగా హెచ్చరించాలి. అవధానిగారు పద్య పూరణ చేసేటప్పుడో, ధారణ చేసేటప్పుడో ఎప్పుడైనా ఒక క్షణం ఆగితే, దాన్ని జాగ్రత్తగా మాటలతో కప్పిపుచ్చాలి. అలాగే మధ్యలో అవధానిగారు మననం చేసుకొనేటట్టుగా పద్యాన్ని మరోసారి చెప్పమనడం వంటివి చేస్తూ ఉండాలి. ఈ సంచాలకత్వాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు రవికుమార్ గారు. మరో విశేషం ఏమిటంటే, వీరు అవధానిగారి పద్యాలలోని గొప్పతనాన్ని (భావంలో కాని భాషలో కాని) కూడా వివరించేవారు. అక్కడక్కడా ఒక పదం కన్నా మరొక పదం మరింత ఔచితీమంతంగానో, సమంజసంగానో ఉంటుందని సూచనులు కూడా చేసేవారు. ఆ సూచనలని గరికిపాటివారు సంతోషంతో ఆమోదించేవారు. దీని వల్ల పద్యాలలో అందం మరికాస్త పెరిగింది.
వృద్ధాశ్రమాల గురించి చెప్పిన ఆర్ద్రమైన ఒక ఆశువు:
ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు
పెట్టబోక ఏడిపించు నేడు
వృద్ధి జెందుచుండె వృద్ధాశ్రమమ్ములు
ఆశ్రమమ్ములందు అయిదవదది!
ఇక అప్రస్తుత ప్రసంగంలో ప్రస్తావించబడిన విషయాలు, చమత్కారాలు అనేకం. వాటిని ఇక్కడ వివరించడం సాధ్యం కాదు. చప్పున గుర్తుకు వస్తున్నవి కొన్ని:
రాకెట్, లాకెట్ మొదలైన దత్తపదిని పూరించే సమయంలో ఒక అప్రస్తుత ప్రసంగకుడు అడిగిన ప్రశ్న. ఇంగ్లీషు వస్తువుల పదాలని తెలుగులో వాడినప్పుడు సాధారణంగా, చివరన "ఉ"కారం చేరుతుంది కదా, లాకెట్టు, రాకెట్టు ఇలా. మరి "వాచ్"ని మాత్రం తెలుగులో "వాచు" అనకుండా "వాచీ" అనెందుకంటాము? దీనికి అవధానిగారు హాస్యంగా చెప్పిన సమాధానం. అది నిరంతరంగా పెట్టుకుంటే మన చెయ్యి "వాచి"పోతుందని చెప్పడానికి. ఈ సందర్భంలో గడియారం గురించి ఒక పిట్ట కథ చెప్పారు. గరికిపాటివారు భువనవిజయంలో తెనాలి రామకృష్ణుని పాత్ర వేసేవారట. అలాంటి ఒక సభలో, వేషం బాగానే కుదిరింది కాని చేతికి వాచీ ఉండిపోయిందట. దీన్ని గమనించిన ఒక ప్రేక్షకుడు, అదేమిటి తెనాలి రామకృష్ణునికి వాచీ ఎక్కడనుంచి వచ్చిందని అడిగాడట. అప్పటికప్పుడు ఏదో సమర్థించుకోవాలి కదా. అష్ట దిగ్గజ కవులు భూలోకం వచ్చి భువనవిజయం చేస్తున్నారన్నది ఆ భువనవిజయం జరిగే సందర్భం. అంచేత గరికిపాటివారు ఇలా సమర్థించుకున్నారట. "నేను భూలోకానికి దిగినప్పుడు, ఈ సభకి వస్తున్న తోవలో ఒకని చేతికి ఈ గడియారాన్ని గమనించి వింతగా తోచి, దాని గురించి వివరాలడిగాను. అతనా గడియారం గురించి వివరించాడు. అప్పుడు ఆశువుగా దానిగురించి ఒక పద్యం చెప్పాను. నా పద్యానికి మెచ్చి ఆ వ్యక్తి దీన్ని నాకు బహూకరించాడు." అని. ఆ ప్రేక్షకుడు ఘటికుడు. అయితే ఆ పద్యమేమిటో చెప్పమన్నాడట. అప్పుడు ఆశువుగా ఒక పద్యం చెప్పారు గరికిపాటివారు. ఆ పద్యం నాకు గుర్తు లేదు కాని. దాని తాత్పర్యం ఇది - గడియారంలో నిరంతరం తిరిగేది సెకన్ల ముల్లు. ఎప్పుడో గంటకొకసారి మాత్రమే కదిలేది పెద్ద ముల్లు. అయినా సమయం మనం పెద్దముల్లు చూపించే గంటలలోనే చెప్పుకుంటాం. వాచీ విషయంలో కూడా శ్రమకి తగిన గుర్తింపు లేదన్నమాట, అని విచారించే పద్యమది.
గరికిపాటివారు చెప్పిన మరో పిట్ట కథ. శ్రీశ్రీ, ఆరుద్ర ఒకసారి గయోపాఖ్యానం నాటకానికి వెళ్ళారట. అందులోని నటుడు (కృష్ణ పాత్రధారి అనుకుంటా) "పాతాళంబున దాగియుండినను..." అన్న పద్యం చదువుతూ, అలవాటుగా చెయ్యి పైకెత్తి పాడుతున్నాడట! ఆరుద్ర శ్రీశ్రీని అడిగాడట, "మావా, ఇతను పాతాళం అంటూ చెయ్యి పైకెత్తి చూపిస్తున్నాడేమిటి" అని. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు, "మన నాటకరంగ పరిస్థితి అథఃపాతాళంలో ఉంది. అంటే పాతాళం కన్నా కిందనన్న మాట. అందుకే అతను పాతాళం తన పైనుందని చూపిస్తున్నాడు!".
మరేదో సందర్భంలో మరో సంఘటన వివరించారు. సాధారణంగా సాహిత్యమ్మీద కాని భాష మీద కాని ఏమాత్రం అధికారం లేనివాళ్ళు కవి రచయితలని పొగిడేస్తూ ఉంటారని, అవి ఒకోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక సభలో ఒక రచయిత్రికి సన్మానం జరుగుతోంది. ఆ సభలో మాట్లాడే ఒక వక్త ఆ రచయిత్రిని గురించి ఊరికే పొగిడేస్తూ, "ఈవిడ నిజంగా పుంభావ సరస్వతి" అన్నాడట! :-)
గరికిపాటివారిని చాలామంది పలకరించేటప్పుడు వేసే ఒక చచ్చు ప్రశ్న, ఈ మధ్యన ఇంకేం రాశారు, ఏమీ రాయలేదా అన్నది అని చెప్పారు. కవి అంటే ఎప్పుడూ ఎదో రాస్తూనే ఉండాలా? పోనీ అతను రాసినవి ఈ అడిగే వ్యక్తి చదివాడా అంటే ఉండదు. ఊరికినే ఏమైనా రాశాడో లేదో తెలుసుకోడానికే అడుగుతారు! ఇదే సందర్భంలో గరికిపాటివారు మరో మంచి విషయాన్ని చెప్పారు. ప్రతివాడికీ ఏదో రాసేద్దామనే ఉత్సాహమే తప్ప చదువుదామనే ఆసక్తి ఉండదు. అందరూ రాయడం కన్నా చదవడం మీద ఎక్కువ దృష్టిపెట్టడం చాలా అవసరం అన్నారు. నిజమే కదా! దీన్ని ఈ ఏడాది న్యూ ఇయర్ రిజల్యూషన్ గా నేను పాటించాలని అనుకుంటున్నాను. చదవాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. అంచేత ఈ ఏడాది రాయడం బాగా తగ్గించి, చదవడం మీద ఎక్కువ దృష్టిపెట్టాలని ఆలోచన. ఎంతవరకూ అమలు చేస్తానో చూడాలి!
పూర్తిగా చదవండి...