అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.
నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు - మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు. వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. అసలిదొక allegorical story అని నాదొక సిద్ధాంతం ఉంది. దాని గురించి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.
ప్రస్తుతానికి వస్తే, ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ touristగా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి, పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.
"శిరస్-సరజ్-ఝరీ" అన్నప్పుడు పైనుంచి కిందకి దూకే సెలయేళ్ళూ, "ముహుర్-ముహుర్-లుఠత్" అన్నప్పుడు ఆ సెలయేటి నీళ్ళు రాళ్ళకి తాకే సవ్వడీ, "అభంగ తరంగ మృదంగ" అన్నప్పుడు అవి చేసే మృదంగ నాదం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇలాటి రచననీ ఇంగ్లీషులో Onomatopoeia అంటారు. పదాలకుండే శబ్దాలు, వాటి అర్థాన్ని ప్రతిధ్వనించడం అన్నమాట. దీనినే "వికట కవిత్వం" అంటారని యు.ఎ.నరసింహమూర్తిగారు "కవిత్వ దర్శనం" అన్న పుస్తకంలో ప్రతిపాదించారు.
కిందటిసారి అన్నాను, వర్ణనలు సాధారణంగా కథలో విశ్రాంతి కోసం ఉంటాయని. ఇది అలాటి వర్ణన కాదు. ముఖ్య కథాభాగానికి ముఖ ద్వారం లాంటిది ఈ పద్యం. ఇది మనుచరిత్రలోని రెండవ ఆశ్వాసం(chapter) మొదట్లో వస్తుంది. ఆ ఆశ్వాసం మాంచి రసవత్తరంగా సాగే కథా భాగం, కథలో ముఖ్యమైన సంఘటనలు జరిగే భాగం. ఇందులో వరూధిని వాక్చాతుర్యం అమోఘంగా ఉంటుంది. వాటిల్లో ఉన్న సారం మాట ఎలా ఉన్నా, ఆ మాటలు మనలని మంత్రముగ్ధులని చేస్తాయి. ఈ పద్యమూ అంతే! ఇందులో అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!
శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు. మనుచరిత్రలో ఇలాటి పద్యాలని మనం ఈనాటికీ ఆనందిస్తున్నాం. ఇది యెక్కువైన ఇతర ప్రబంధాలూ, వాటిని రాసిన కవులూ మరుగునపడిపోయారు.
ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం, హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!
ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - "అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు? "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!
"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, "సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, "ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, "అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, "నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, "పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, "కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.
ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!
ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, "కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.
ఇదే "అల్లసానివాని అల్లిక జిగిబిగి"!
పూర్తిగా చదవండి...