నిన్న రాత్రి కలలోకి రావుగోపాల్రావు వచ్చి, "బ్లాగన్నాక కూసింత ఇంటరేక్షనుండాలి. ఉత్తినే రాసూరుకుంటే బ్లాగుకీ వెబ్సైటుకీ తేడా ఏటుంది." అని తనదైన స్టైల్లో నా చెవిలో ఉదేసరికి నాకు తెలివి తెల్లారింది! సరే అలాగే చూద్దామనిపించింది. అందుకే నేను మొదలుపెట్టిన "ఛందస్సు - కథా కమామీషూ" పరంపరని కాస్తంత ఇంటరేక్టివ్వుగా నడపాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ కాస్త తలో చెయ్యావెయ్యాలి.
నేను చెప్పదలచుకొన్న విషయాన్ని కాస్తంత టూకీగా చెప్పి ప్రశ్నలడిగి ఊరుకుంటాను. దానికి తెలిసిన వాళ్ళు
కామెంట్లలో జవాబులు రాయాలి. వేరే సందేహాలుంటే అవికూడా రాయొచ్చు. జవాబులు తెలీనివాటికి నాకు తెలుసున్న మేరకు నేను జవాబులిస్తాను. వీకెండు టైము. ఇదేమీ పరీక్ష, పోటీ కాదుకాబట్టి, జవాబులు తెలుసున్న వాళ్ళు నిస్సంకోచంగా రాయవచ్చు. తెలీని వాళ్ళు చదివి తెలుసుకోవచ్చు. సరేనా మరి!
కిందటిసారి "మాత్ర"ల గురించి మాట్లాడుకున్నాం కదా. కేవలం మాత్రలమీదే ఆధారపడి ఉండే ఛందస్సుని మాత్రా ఛందస్సు అంటారు. అంటే ఒక పాదానికి ఇన్నే మాత్రలుండాలీ, లేదా ఇలాటి మాత్రల వరుస ఉండాలీ అని నిర్దేశించే ఛందస్సన్నమాట. ఊదాహరణకి మనందరికీ తెలిసిన "దేశమును ప్రేమించుమన్నా" అన్న గురజాడ గేయం ముత్యాలసరం అనే ఛందస్సులో ఉన్నది. ముత్యాలసరం మాత్రాఛందస్సు. దీనిలో పాదాలు ఈ కింద మాత్రా సంఖ్యలుగల పదాలతో ఏర్పడతాయి.
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 4 (మూడు నాలుగు మూడు నాలుగు)
3, 4, 3, 2 (మూడు నాలుగు మూడు దో!)
చివరి పాదంలో కొన్ని రకాలున్నాయి, అది వేరే విషయం. ముఖ్యంగా మాత్రాఛందస్సులో ఉండే పద్యాలు, పాడుకోడానికి గేయాల్లా ఉంటాయి. వీటి గురించి తర్వాత వివరంగా చూద్దాం.
ఒక అక్షరానికి ఒకటికానీ రెండు కానీ మాత్రలుంటాయని చెప్పానుకదా. దీనిబట్టి వాటికి మన పూర్వులు "గురువు" "లఘువు" అని నామకరణం చేసారు. రెండు మాత్రలున్న అక్షరం "గురువు". ఒకటే మాత్రున్న అక్షరం "లఘువు". గురువంటే పెద్దదనీ, లఘువంటే చిన్నదనీ అర్థం కాబట్టి అలా పేర్లు పెట్టారు. అన్నిటికన్నా పెద్ద గ్రహానికి "గురు"గ్రహం అని పేరు పెట్టినట్టుగా.
ఒక అక్షరాన్ని గురువా లఘువా అని నిర్ణయించడంలో కొన్ని తిరకాసులున్నాయి. అయితే, ఈ నిర్ణయం ఆ అక్షరాన్ని ఉచ్చరించే సమయాన్ని బట్టి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకొంటే, తికమక ఉండదు. ఏ అక్షరాన్ని పలకడానికి మామూలుకన్నా ఎక్కువ సమయం తీసుకొంటామో అది గురువు. తక్కినవి లఘువులు.
ఇప్పుడు మీకు ప్రశ్నలు:
1. కొన్ని రకాలైన అక్షరాలు సహజంగా ఎప్పుడూ గురువులే. ఏమిటా అక్షరాలు?
2. కొన్ని సార్లు, "స్థానబలిమి కాని తనబలిమి కాదయా" అన్నట్టు, సహజంగా లఘువులైన అక్షరాలు కూడా గురువులుగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎందువలన చేత?
3. పై రూలుకి కొన్ని చోట్ల మినహాయింపు ఉంది. ఎక్కడ ఎందుకూ?
4. కొన్ని పదాల ఉచ్చారణ కాలానుగుణంగా మారుతుంది. ఈ ఛందస్సు వల్ల ఒక ప్రయోజనం, వాటి పూర్వరూపం ఏమిటో చూచాయగానైనా తెలియడం. అలా గురు లఘు నిర్ణయం వల్ల తెలిసే ఒక ఉదాహరణ ఇవ్వగలరా? (క్లూ: ఇప్పటి చాలామంది పలికే విధానంబట్టి చూస్తే ఒక రకమైన అక్షరం గురువవ్వాలని అనుకొంటాం, కానీ అది ఛందస్సు ప్రకారం లఘువు!)
వీటికి సమాధానలు తెలిసికూడా మీరు చెప్పకపోతే, ఈ భేతాళుడు చెట్టెక్కి మళ్ళీ దిగడు:-)
మొత్తానికి జనాలందరూ కొంచెం కొంచెంగా జవాబులిచ్చేసి చేతులుదులిపేసుకున్నారు! సరే కానీండి, ఏంచేస్తాం, నాకు తప్పుతుందా మరి!
1. స: దీర్ఘాచ్చులతో కూడినవి (కా), "ఐ", "ఔ"ల తో కూడినవి (కై, కౌ), బిందువుతో కూడినవి (కం), విసర్గతో కూడినవి(దుః) అచ్చులుకాని, హల్లులుకాని. ఒక అక్షరం సహజంగా లఘువా గురువా అన్నది అందులోని అచ్చే నిర్ణయిస్తుందని గమనించే ఉంటారు.
2. స: ఒక అక్షరం పక్కన పొల్లున్నప్పుడు ఆ పొల్లుకూడా ముందటి అక్షరంలో భాగమై, ఆ అక్షరం గురువౌతుంది (రన్, చల్).
ఒక అక్షరం వెనకాల సంయుక్తాక్షరం ఉన్నప్పుడు ఆ అక్షరం గురువౌతుంది. ("కర్త" లో "క" గురువు, దీనిని "కర్" "త" అని పలుకుతాం కాబట్టి).
ఈ సందర్భాలలో ముందటి అక్షరమ్మీద ఊనిక ఎక్కువై, అవి పలకడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుందికాబట్టి ఈ రూలు వర్తిస్తుంది.
3 స: ఏవుంది, ఏ చోట్లయితే వెనకాల సంయుక్తాక్షరం ఉన్నా, ముందు అక్షరానికి ఊనిక ఉండదో అలాటి చోట్ల ఈ రూలు వర్తించదు. రెండు పదాలున్నాయనుకోండి ఉ: "ఆమె స్త్రీ". ఇవి పలికేటప్పుడు "ఆమె"కి "స్త్రీ"కి మధ్య పలకడంలో కొంత సమయం ఉంటుంది కాబట్టి, మొదటి పదం చివరి అక్షరానికి ("మె"కి) సాధారణంగా ఊనిక ఉండదు. కాబట్టి అలాటప్పుడు పై రూలు వర్తించదు (ఇక్కడ "మె" లఘువే). అయితే కొంతమంది పద్యాలలో మీరు కలిపే చదవండి సుమా అని చెప్పి ముందు అక్షరాన్ని గురువు చేస్తూ ఉంటారు!
అలాగే కొన్ని సార్లు ఒకే పదమైనా (రెండుపదాలు సంధి జరిగి) కూడా సమ్యుక్తాక్షరం ముందలి అక్షరానికి ఊనికపడకుండా పలకే అవకాశం ఉంటుంది. అలాటప్పుడు వాటికి ఈ రూలు వర్తించకుండా ఉండవచ్చు!
4 స: "అద్రుచు", "విద్రుచు", "ఎద్రుచు", "పద్రిచి", "చిద్రుప" పదాలలో మొదటి అక్షరం మీద ఊనిక లేకుండా పలకాలి. కాబట్టి అవి లఘువులు. ఈ పదాలు "అదురుచు", "విదురుచు" మొదలైన పదాలకి రూపాంతరాలు.
వట్రసుడికి ముందున్న అక్షరానికి ఊనిక ఉండదు. కాబట్టి అవి సహజంగా లఘువులైతే, లఘువులే అవుతాయి (ఉ: సహృదయడు లో "స" లఘువే).
సరే, మరిది మీకెంతవరకూ అర్థమయ్యిందో తెలుసుకోడానికి కొన్ని ప్రశ్నలు. ఈ కిందవాటికి గురులఘువులని గుర్తించండి:
1. విష్వక్సేనుడు
2. ప్రకృతి
3. ప్రాణముల్ బయటకివచ్చి ముగ్ధాకార
4. నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె
5. దెరదీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిథి యగుచు
6. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా
పూర్తిగా చదవండి...