తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, January 24, 2013

సాపుటేరుపై సరదా పద్యం


చిన్నప్పుడు మన బళ్ళో తెలుగు తరగతిలో ప్రకృతి-వికృతులని చదువుకున్నాం గుర్తుందా?

ఆశ్చర్యము - అచ్చెరువు
భాష - బాస
పుస్తకము - పొత్తము

యిలా... ఇవన్నీ సంస్కృతంనుండి ప్రాకృతానికీ అక్కడినుంచి తెలుగుకీ వచ్చిన పదాలు కొన్ని, నేరుగా సంస్కృతం నుంచి వచ్చినవి కొన్నీను. వీటిలో మూల పదాల స్వరూపం మన భాషాస్వరూపానికి తగ్గట్టుగా మారడం గమనించవచ్చు. ఇవన్నీ ఎవరో తీరికూర్చుని తయారుచేసినవి కావు. ప్రజల నోళ్ళల్లో నలుగుతూ ఏర్పడిన మాటలు. ఇలా వేరే భాషనుంచి రూపాంతరం చెంది తెలుగులోకి రావడం, ఒక్క సంస్కృత ప్రాకృతాలకే పరిమితం కాదు. ఆధునిక కాలంలో హిందీలాంటి యితర భాషల నుండి కూడా ఎన్నో పదాలు వచ్చాయి. ఇటీవల ఇంగ్లీషునుండి కూడా వచ్చిన పదాలు మనకెన్నో వాడుకలో ఉన్నవే. Car - కారు, Bus - బస్సు, Hospital - ఆసుపత్రి, యిలా. అయితే మన వ్యాకరణ పండితులు సంస్కృత ప్రాకృతాలనుండి వచ్చిన వాటిని తత్సమ, తద్భవాలనీ మిగిలిన భాషలనుండి వచ్చినవాటిని అన్యదేశ్యాలనీ వర్గీకరించారు. ఈ వర్గీకరణ వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు కాని ఒక రకంగా చూస్తే అది కృత్రిమమైన వర్గీకరణే.

ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వాటిని, యిలా మన భాషారూపంలోకి దిగుమతి చేసుకోడం తప్పుకాదని నా అభిప్రాయం. ఆ దృష్టితో software రంగానికి సంబంధించిన కొన్ని పదాలని వాడుక భాషలోకి ఎలా అనువదించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటే మనసులో కొన్ని పదాలు మెదిలి, ఆ పదాలతో ఒక పద్యం అల్లుకుంది. ఇలాంటి అనువాదం కొంతమందికి రుచించకపోవచ్చు. ఇది ఇంగ్లీషు భాషని భ్రష్టుపట్టించడంగా కొంతమంది భావించవచ్చు. ఇంగ్లీషుతో సంకరం చేసి తెలుగుని భ్రష్టుపట్టించడం అని మరికొందరు అనుకోవచ్చు. ఇందులో తప్పుపట్టేందుకేమీ లేదు. అది వారివారి అభిరుచి, అంతే. అలాంటి వారు దీన్ని కేవలం ఒక సరదా పద్యంగా తీసుకొని మరిచిపోవలసిందిగా మనవి. కానివారు ఈ తరహా అనువాదాన్ని గురించి ఆలోచించవచ్చు. స్ఫూర్తికూడా పొందవచ్చు. అయితే ఇలాంటి పదాలు సృష్టించినప్పుడు, అవి తెలుగుభాషా స్వరూపానికి తగినట్టుగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి.

కాపీపేసుటు చేసిచేసి పలు ప్రోగ్రాముల్ లిఖించున్ మరిన్
మాపున్‌దోపును బగ్గులెన్నొ తుదకుం బ్రాప్తించు స్థానోన్నతుల్
ఆపై దొంతరదొంతరల్ వరడుపత్రాళుల్ మరింకెన్నొ సొం
పౌ పీపీటులు గళ్ళపొత్తములు తయ్యార్ చేయుచున్ గాలమున్
దీపిన్ బుచ్చును సాపుటేరు బ్రతుకింతేకాదటోయ్ చూడగన్!

దీనికి టీకా టిప్పణి:

కాపీ - Copy, పేసుటు - Paste, ప్రోగ్రాము - Program, మాపున్ - fix, దోపున్ - insert, బగ్గు - bug, వరడుపత్రం - Word Document, పీపీటి - PPT(PowerPoint) (బహువచనం పీపీటులు), గళ్ళపొత్తం/గళ్ళపుస్తకం - Excel Workbook, సాపుటేరు - Software.

ఇంతకన్నా దీని అర్థం వివరించాల్సిన అవసరం లేదనుకుంటా! ఏ పనీ యిచ్చిన గడువులోపల పూర్తి చేసే అలవాటు బొత్తిగా సాపుటేరు వాళ్ళకి లేదనే విషయం, పద్యం నాలుగు పాదాల్లో పూర్తికాక అయిదవ పాదానికి సాగడం ద్వారా ధ్వనింపజేసానని పద్యాన్ని "లోనారసి"న సారమతులు గ్రహించిగలరు. :)


25 comments:

  1. అనగ యనగ రాగమతిశయిల్లుచునుండు
    తినగ తినగ వేము తియ్యనుండు
    చేశి చేశి జాబు చేదౌను నిజమయా
    విశ్వదాభిరామ యిసుకలో తేమ :)

    ReplyDelete
  2. తెలుగున నింగ్లీషు పదము
    లలవోకగ వాడు చుండ , ననువాదపు మా
    టలతో క్లిష్టత లేలా ?
    చెలువము చెడు , బమ్మి తిమ్మి చేయగ నేలా ?

    ReplyDelete

  3. పోర డు రేయింబవళ్ళు కడు పేస్టు 'ప్రోగ్రాముల్ '
    పోరది సొగసున మేనేజు చేయు 'ప్రోగ్రాముల్'
    సాపుటేరు లోకమున జిలేబీ ల జిమ్మిక్కుల లో
    హార్డు వేరు కన్నా 'హార్ట్ వేరు' ఎక్కువమ్మా!


    జిలేబి.

    ReplyDelete
  4. పద్యాలన్నీ బాగున్నాయి :)

    ReplyDelete
  5. "ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వాటిని, యిలా మన భాషారూపంలోకి దిగుమతి చేసుకోడం తప్పుకాదని నా అభిప్రాయం" నాదీనూ!!
    ఈ మధ్య నేను ఇంగ్లీషులోంచి తెచ్చుకున్నమాటలని thatసమములనీ, thatభవములనిన్నీ "ప్రపోజుడు", ఏదీ తత్సమములు, తద్భవముల మాదిరి.

    ReplyDelete
  6. బాగున్నాయి పద్యాలు. సాఫ్ట్‌వేర్ వాళ్ళకు ఒక లైను ఎక్కువ వాడుకోవడానికి కన్సెసను :). అయితే శ్రీ శ్రీ (ఇంకా ఆయనలాగ రాసిన కవులందరు)కూడా సాఫ్ట్‌వేర్ వారే :)

    ReplyDelete
  7. వైద్యులము మాకు మిక్చరు లివ్వడము అలవాటే కాబట్టి లంగ్వేజీ మిక్చరు మమ్మలను బాధించవు !

    స్కోపుల్ పెట్టుచు వైద్యులున్ నెరకులన్ శోధింపరే స్కిల్లుతో
    రేపున్ మాపును నల్ట్రసౌండు మొదటన్ లేకుండ పేషంటుతో
    తాపంబుల్ పడనేల రోగి యెదలన్ దా పెట్టు స్టెత్స్కోపుతో

    నే పారంగత డాక్ట్రు జబ్బు ( డబ్బు ) తెలియు న్నే స్కానులున్ జేయకన్ ?

    అయినా పూర్వులు చెప్పారు కదా ! " Whose crazyness is his happyness !"

    ReplyDelete
  8. "thatసమములనీ, thatభవములనిన్నీ" - హహహ బావుంది :) ఇంగ్లీషు దట్టూ సంస్కృతం తత్తూ తత్తుల్యమైనవేగా :) నాకు మాత్రం thatసమములు కన్నా thatభవములే యిష్టం.

    "అయితే శ్రీ శ్రీ (ఇంకా ఆయనలాగ రాసిన కవులందరు)కూడా సాఫ్ట్‌వేర్ వారే :)"
    :) కొంతమంది ఒకలైనూ అరలైనూ తక్కువ రాసిన కవులుకూడా ఉన్నారు. మరి వారేవారో? :)

    మూర్తిగారూ,
    :):) "మణిప్రవాళ శైలి" అన్న అందమైన పదబంధం ఉండగా "లంగ్వేజీ మిక్చరు" ఎందుకూ? అది కవుల భాష, యిది మీ వైద్యుల భాష అంటే నేనేం మాట్లాడలేను :) మీరు thatభవాలకన్నా thatసమాల పైనే మోజు చూపిస్తున్నట్టుంది!
    మీ పద్యం చదవగానే, మరొక పద్యం గుర్తుకు వచ్చింది, పూర్తిగా గుర్తు లేదు. ఇది జలసూత్రం వారిదనుకూంటా:

    టీజనితేన్స్పిరేషను పటిష్ఠ మహీయ గవాయిగాన వి
    ద్యాజిత పీరుసాబు నయనాంచిత గోల్డెను స్పెక్టికల్ ద్వయీ
    భ్రాజిత డాబు...

    ReplyDelete
    Replies
    1. భలేగుంది రావు గారు మీ సాపుటేరు కవిత

      Delete
  9. బాగు బాగు. వరడు పత్రం అర్ధమైంది గానీ పీపీటులు మీ టీకా చూస్తే గానీ అర్ధం కాలేదు. నా చిన్నప్పుడు కచేరీలు పెట్టే ఒక సంస్థ గుమాస్తా తిక్కెట్లిచ్చేందుకు మా యింటికి వచ్చేవాడు. ఆయన ప్రోగ్రాం కి ఫోగ్రాఁవు అనే వాడు. మీరూ వాడుకోవచ్చు కావాలంటే :)

    ReplyDelete
  10. quelle bonne idée, j'adore cette écriture !

    ReplyDelete
  11. ఓహోహో ...
    విందు భలే పసందు ...
    ఎంతెంత విషయమేతించిన అతిధులయందు ...
    అయ్యో యేల రాలేకపోయితినో మున్ముందు ...

    ReplyDelete
  12. Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppinavi gurtuvastundhi........Malli Ila mee bloglo Chustunnamu......Plz share Ur valuable views in our blog also www.teluguvaramandi.net

    ReplyDelete
  13. Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppinavi gurtuvastundhi........Malli Ila mee bloglo Chustunnamu......Plz share Ur valuable views in our blog also www.teluguvaramandi.net

    ReplyDelete
  14. very nice article.https://www.youtube.com/channel/UCtBSKcInlcMv8nytAit72OA"> news in telugu

    ReplyDelete
  15. good information
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete
  16. good poetry
    https://youtu.be/2uZRoa1eziA
    plz watch our channel

    ReplyDelete
  17. Nice Blog. I simply loved the Blog.
    Please watch my Emotional Telugu Shortfilm with English Subtitles
    https://www.youtube.com/watch?v=JD_PPmBOagc

    ReplyDelete
  18. పద్యానికి చక్కని అలంకారిక సొగసులు అందాన్ని చేకూరుస్తాయి..ఆచంటసూర్యనారాయణమూర్తి.నర్సీపట్టణం.

    ReplyDelete