తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, February 15, 2013

నన్నయ్యగారి గడుసుదనం


మన పూర్వకవుల రూపురేఖలు కానీ, వారి స్వరూపస్వభావాలు కానీ మనకి తెలియదు. వారివారి కవిత్వ లక్షణాల బట్టి కొంతా, వారి గురించి లభిస్తున్న ఇతరత్రా సమాచారం ద్వారా కొంతా, అనూచానంగా వచ్చే కథల ద్వారా మరికొంతా, కొందరికి కొన్ని ఊహాచిత్రాలను మనం కల్పించుకున్నాం. నన్నయ్యగారు అనేసరికల్లా ఒక శాంతగంభీర స్వరూపం మన మనసులో మెదులుతుంది. తిక్కన  అనేసరికి, ఒక నిండైన విగ్రహం, ఒకింత తీక్ష్ణమైన చూపు, నిటారుగా నిలబడి కనిపిస్తారు. శ్రీనాథుడైతే నిగనిగలాడే పచ్చని మేనితో విబూధిరేఖలతో తాంబూలంతో ఎఱ్ఱబడ్డ నోటితో చిలిపి నవ్వు నవ్వుతూ కనిపిస్తాడు (ఎంటీవోడి పంఖాలకైతే అతనే కనిస్తాడనుకోండి :-)). పోతనగారంటే మాత్రం నాగయ్యగారే, మరో మాట లేదు. అదే పెద్దనగారైతే పండుమీసంతో, చిరుబొజ్జతో, కప్పురవిడెము సేవిస్తూ, ఊయల ఊగుతూ కనిపిస్తారు. ఇక తెనాలి రామకృష్ణుడైతే సరేసరి! 

అయితే, వారివారి స్వరూపాలకు విరుద్ధమైన లక్షణాలు వారి కవిత్వంలో కనిపించినప్పుడు మనకి ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. ఉదాహరణకి, నన్నయ్యగారు ఒక గడుసైన పద్యాన్ని, కొన్ని పాత్రల దుస్థితిని గడుసుగా వెక్కిరిస్తూ, వ్రాసారంటే ఆశ్చర్యం వెయ్యదూ! నాకైతే వేసింది. ఆ పద్యమేమిటో చూద్దామా? ఆ పద్యంలోకి వెళ్ళే ముందు శబ్దశక్తిని గురించి - అభిధ, లక్షణ, వ్యంజన - అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇద్దామనుకున్నాను కానీ అవన్నీ చెప్పి యిప్పుడు సుత్తికొట్టడం దేనికని నేరుగా పద్యంలోకే వెళుతున్నాను. అది కుమారాస్త్ర ప్రదర్శనా ఘట్టం. అంటే కురుపాండవ రాజకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ తమ విద్యలనీ, శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్నీ ప్రదర్శించే సన్నివేశం.

సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క
నెంతయును సంతసంబున గుంతిదేవి
రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి
కెలన నుండె, నున్మీలితనలిననేత్ర

ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం! 

"కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది. అందమైన కళ్ళని పద్మాలతో పోల్చడం మామూలుగా ప్రాచీన కవిత్వం అంతటా కనిపించేదే. ఇక్కడ మామూలు పద్మాలు కాదు, బాగా విచ్చుకున్న పద్మాలు. అంటే కుంతి కళ్ళు అంతగా విచ్చుకొని ఉన్నాయన్న మాట! పద్యం మొదట్లో చెప్పనే చెప్పాడు కాదా - ఆమె వేడ్కతోనూ సంతోషంతోనూ తన కుమారుల విద్యని చూడాలని కూర్చుంది. ఆ ఉత్సాహమూ ఆ సంతోషమూ, బాగా విచ్చుకున్న ఆమె కన్నుల్లో కనిపిస్తున్నాయన్న ధ్వని యీ విశేషణంలో ఉంది. ఇలా సార్థకమైన విశేషణాల ద్వారా ఒక విషయాన్ని ధ్వనింపజేయడం మంచి కవిత్వ లక్షణం.
బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొంది. అంచేత పాపం వాళ్ళు తమ పుత్రుల విద్యా ప్రవీణతని కళ్ళారా చూడలేరు. చూడగలిగింది కుంతి మాత్రమే. కుంతి సంతోషానికి అది కూడా కారణమేమో కూడానూ! ఇద్దరు చూడలేని వాళ్ళ పక్కన కుంతిని కూర్చోబెట్టి, ఆమె బాగా విచ్చుకున్న కళ్ళతో ఆనందంగా తన పుత్రుల విద్యానైపుణ్యాన్ని చూస్తోంది అని నొక్కి చెప్పడం ద్వారా, పాపం ఆ చూడలేని వారి దుస్థితిని వెక్కిరించినట్టు లేదూ! పైగా, అదెక్కడా పైకి తేలకుండా, పోలీసువాళ్ళ దెబ్బల్లాగా, కేవలం పద్యనిర్మాణం ద్వారా, చివర్న వేసిన విశేషం ద్వారా ధ్వనింపజేసారు నన్నయ్యగారు. అద్గదీ ఆయనగారి గడుసుదనం!

24 comments:

  1. నన్నయ్యగారి గడుసుదనాన్ని కనిపెట్టిన మీ గడుసుదనాన్ని మెచ్చుకోవాలి. ఆదిపర్వము చదువుతున్నప్పుడు ఈ పద్యాన్ని చదివాను కానీ మీరు విడమరిచిన తరువాతనే అసలు విషయం బోధపడింది. కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. So even in those days in India it was not EOE/AA? :-)

    ReplyDelete
  3. నన్నయ ఆంతర్యమునకు
    మిన్నగ వ్యాఖ్యానము నిడు మీ ప్రతిభా శ్రీ
    ఎన్నగ హిమ వన్నగ సమ
    మన్నది సత్యము! కొనుమిదె అభినందనముల్!

    ReplyDelete
  4. గిరిగారూ, ఆచార్య ఫణీంద్రగారూ, ధన్యవాదాలు.
    అనానిమస్‌గారూ, ఇందులో EOE/AA లేకపోవడమన్న ప్రసక్తే లేదు! "రాజు సన్నిధి" అన్న పదం ఏమిటి చెపుతోంది? అంధుడైనా ధృతరాష్ట్రుడు రాజయ్యాడు కాదా! :) పైగా దివ్యదృష్టితో విశ్వరూపాన్ని కూడా చూసాడు!

    ReplyDelete
  5. చాల చక్కగా విశదీకరించారండి. మీ ప్రతిబకు అబివాధములు.

    ReplyDelete
  6. చాలా బాగా వివరించారు..

    http://ruchulu65.blogspot.in....

    ReplyDelete
  7. Interesting explanation. What is the expansion of EOE AA?

    Regards,
    Anon

    ReplyDelete
  8. అనానిమసులందరికీ ధన్యవాదాలు.
    చివరి అనానిమస్‌గారూ, "EOE/AA" అని గూగులించండి తెలుస్తుంది. :)

    ReplyDelete
  9. చాలా బాగా వివరించారు భైరవభట్లగారూ ! అభినందనలు.

    ReplyDelete
  10. చాలా బాగా విశ్లేశించారండీ. సాధారణంగా పద్యము చదివితే మీరన్నట్లుగా మామూలు అర్థమే తోస్తున్నది కానీ, మీరు ఎత్తి చూపేంతవరకు నన్నయ్య గారి గడుసుదనము గోచరించడము లేదు.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  11. సత్యనారాయణగారు, సంపత్కుమార్‌గారూ, ధన్యవాదాలు.

    ReplyDelete
  12. goppagA vivariMchAru...mAmUlugA chUstE asalu A ardhamE taTTalEdu,
    meeru cheppAkanE telsiMdi :)

    ReplyDelete
  13. CHALA CHAKKAGA VIVIRINCHINADUKU DANYAVAADAMULU.

    ILANTIVI MARIKONNI UNTE MATHO PANCHUKOGALARANI MANAVI.

    ReplyDelete
  14. చదివే విషయాన్ని పరిశీలనాత్మకంగా చూడటం నిజంగా మంచి జిజ్ఞాసువులకే కుదురుతుంది. మంచి విషయాన్ని గమనించారు. "కెలన" అంటే ఏమిటండీ?

    ReplyDelete
  15. సందీప్‌గారూ, ధన్యవాదాలు. "కెలను" అంటే ప్రక్క అని అర్థం. కెలనన్ అంటే ప్రక్కన అని.

    ReplyDelete
  16. అసలు సంగతి కుంతీమాత కర్ణుని అస్త్రవిద్యా ప్రావిణ్యం అంతలేసి కన్నులతో చూచినది.

    ReplyDelete
  17. Telugu comedy show like latest patas show , jabardasth , anubavi raja Etv show , enjoy the experience HREF=”https://telugucomdeyshow.blogspot.in”>Click Here

    ReplyDelete
  18. Great info...here about telugu

    అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలు part-1
    https://bit.ly/2w2iqpN

    ReplyDelete