తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, November 26, 2012

మృత్యుంజయా!


శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.

పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి వినిపిస్తుందా అని. ఎందుకా అనుమానమంటే చెపుతున్నాడు కవి:

మెడ నాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా
బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీ చంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం
బడుటేలాగునొ మా మొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా!

ఓ వైపు పాముల బుసబుసలు, మరోవైపు అర్థాంగితో గుసగుసలు. అది చూసి నెత్తినున్న గంగమ్మకు రుసరుసలు! ఈ గోలలో తనలాంటి భక్తుల మొఱలు ఆయనకెలా వినిపిస్తాయని కవిగారి సంశయం. "అప్పా" అన్న సంబోధనలో ఎంత ఆత్మీయత ఉంది! శివయ్య తనను కన్నతండ్రి అని పరిపూర్ణంగా నమ్మిన భక్తుడీ కవి. ఆ చనువుతోనే ఇంకా ఏమంటాడంటే:

ఒక లంబోదరుడైన పుత్రకుడు మున్నున్నట్టిదే నీకు జా
లక కాబోలును సృష్టి జేసితివి యీ లంబోదరుం గూడ, దీ
గకు గాయల్ బరువౌన, కాని, కుడుముల్ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్ మొల్పింతు మృత్యుంజయా!

"ఏమయ్యా మృత్యుంజయా! నీకు లంబోదరుడైన పుత్రుడు ముందే ఒకడున్నాడు కదా (గణపతి అన్న మాట!). అతడు చాలక కాబోలు మరో లంబోదరుడైన నన్ను పుట్టించావు! (కవిగారిది బానపొట్ట కాబోలు :-)) సరే, తీగకు కాయలు బరువా? పుట్టించావు. బాగానే ఉంది. కానీ, ఆ కుమారునికేమో చక్కగా కుడుములు పెడతావు. ఈ కోడుకుని మాత్రం యిడుములపాలు చేస్తున్నావే, ఇదేమి న్యాయం?" అంటూ నిలదీస్తాడు కవి.

ఒక గాఢమైన తాత్త్విక విషయాన్ని కూడా లేలేత నవ్వులలో ఎలా పలికించ వచ్చో యీ పద్యం చూస్తే తెలుస్తుంది:

సరిలే! మానవకోటి యీ వెలుపలన్ సంసారచక్రాననే
దొరలన్ లేకిటులుండ, లో నొకటి రెండున్ గావె షడ్చక్రముల్
వరుసన్ జేర్చి బిగించినావుగద అబ్బా! నాగపాశాలతో
దరియింపన్ దరమౌనె నీ కరుణచేతన్ గాక మృత్యుంజయా!

"సరిసరి! మేము బయటనున్న సంసారమనే ఒకే ఒక చక్రంలో పడి అందులోనుంచే బయటపడలేక సతమతమవుతూంటే, అది చాలదన్నట్టు, మా లోపల ఒకటికాదు రెండుకాదు ఆరు చక్రాలను నాగపాశాలతో బిగించేసావు కదా! అబ్బా! నీ కరుణ లేకుండా వీటిని భేదించడం మాకు సాధ్యమవుతుందా చెప్పు!" అంటున్నాడు. మాట్లాడే భాషలోని కాకువు, నుడికారంలోని సొగసు, అవలీలగా పద్యంలో నిబంధించడం ఈ కవిగారికి బాగా తెలిసిన విద్య అనిపిస్తుంది యీ పద్యాలు చూస్తే.

వీరి పద్యాలలో హాస్యమొక్కటే కాదు, గాఢమైన అనుభూతీ ఆర్తీ కూడా ఉన్నాయి.

ఏ బైకిన్ దెగపండితుండనను పేరే గాని నాలోని కే
బో బోవంగను జెప్ప లజ్జయయిపోవున్ నేను నా బుద్ధికే
యే బొడ్డూడని బిడ్డనో యగుదు తండ్రీ! నిక్క మీపాటిదే
నా బండారము, త్రోవ నీవిడక యున్నంగాదు మృత్యుంజయా!

నిజమైన ఆత్మవిమర్శా ఆత్మావలోకనమూ చేసుకున్నప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోతుందనడాన్ని యీ పద్యం చెపుతోంది. "పైకి నేను తెగ పండితుడనన్న పేరుంది కానీ, నిజంగా లోలోపల తొంగిచూసుకుంటే నా మీద నాకే సిగ్గువేస్తుంది. నేను నాకే ఒక బొడ్డూడని బిడ్డలాగా కనిపిస్తాను. నా బండారం నిజంగా అంతే! అంచేత నువ్వే నాకు తోవ చూపించాలి" అంటున్నాడు కవి. లోలోపలకి తొంగి చూసుకుంటే మన పరిమితులు మనకి స్పష్టంగా బోధపడతాయి. అనంతమైన ఈ విశ్వంలో విస్తరించిన శక్తి ముందు మన శక్తి ఎంత అల్పమైనదో మనకి తెలిసివస్తుంది.

శివునికీ వెన్నెలకీ ఉన్న విడదీయలేని సంబంధం మనకీ కవి పద్యాలలో కూడా కనిపిస్తుంది:

ఎల్లన్ నీవయిపోయి నీవు తలపై ఏ చిన్నిపువ్వట్లొ జా
బిల్లిం దాలిచియుండ, వెన్నెలలుగా విశ్వాన నీకాంతులే
వెల్లింగొల్పెడునట్టులున్నయవి యీ వేళా విశేషమ్ముచే
వెళ్ళంబుచ్చకు మింక దీని మనసే వేఱయ్యె మృత్యుంజయా!

లోకమ్మందునగాక వెన్నెలలు లోలో గాయునట్లుండె, న
య్యాకాశమ్మున నున్న జాబిలియు నాయందున్న డెందమ్ము ని
ట్లేకాకారత నొంద నేమి కతమో! యీ యాత్మ సంబంధమున్
నీ కారుణ్యముచేత నేర్పడుటగానే తోచు మృత్యుంజయా!

జగత్తంతా శివమయమయ్యింది. ఆతని తనుకాంతి విశ్వమంతా వెన్నెలలై విరాజిల్లింది. మామూలు మనిషికి వెన్నెల బయట లోకంలో మాత్రమే కనిపిస్తుంది. అంతా శివుడే అయిన భక్తునికి తనలోపల కూడా వెన్నలలు విరబూస్తాయి. ఆకాశంలోని జాబిలి తనలోని మనస్సూ ఒకటే అయిపోతాయి(చంద్రుడు మనసుకి అధిపతని అనేది ఇందుకేనేమో!). అప్పుడా కరుణామయుడైన పరమేశ్వరుడు ఆ భక్తుని మనస్సునే తలపూవుగా ధరిస్తాడు కాబోలు!

14 comments:

  1. నిజంగా ఎంత బాగున్నాయండీ ఈ పద్యాలు!!

    ReplyDelete
  2. తెలుగు పద్యాలలోని మాధుర్యం తెలిసేలా చేస్తున్నారు కామేశ్వరరావుగారు! ధన్యులం! :)

    ReplyDelete
  3. చాలా బాగున్నది కామేశ్వర రావు గారు !!

    ReplyDelete
  4. శ్రీ బుచ్చి సుందరరామశాస్త్రి గారు శివుడిని స్తుతిస్తూ చెప్పిన పద్యాలలో, పద్యం చెప్పడంలో ఆయన ప్రతిభకు అద్దం పట్టేదిలా అనిపించే మరొక గొప్ప పద్యం వుంది కామేశ్వరరావు గారూ! ఆ పద్యం మీ దృష్టికి వచ్చిందో లేదో అన్న సందేహం కలిగి, ఇది వ్రాస్తున్నాను. ఆ పద్యం ఇది:

    "చూడం జూడ మహాశ్మశాన మనిపించున్ నాకు నీ లోక
    మిందేడన్ గాలిడబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
    లో డక్కయ్యెడిగాని నీ మహిమ యాలోనే నివారించి, నీ
    క్రీడారంగమటన్న మాట స్మృతికిం గీలించు మృత్యుంజయా!"

    శ్రీ అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు వారి 'కవన కుతూహలం' లో (వారి జ్ఞాపకాలనుంచి గుర్తుచేసుకుని అనుకుంటాను) ఉదాహరించిన పద్యం ఇది. ఈ పద్యానికి సంబంధించిన సంగతులు ఏమిటంటే - ఒకనాడు తెనాలిలో కాలువ పక్కనుంచి వారిరువురూ నడిచి వెళుతుండగా, దారిలో రెండు మూడు బొమికలు కనబడితే, చూసి నడవమన్నట్లుగా (అప్పుడు ఆయన పాదాలకు చెప్పులు లేవట!) వరదరాజేశ్వరరావు గారు ఆయన చెయ్యి పట్టుకుని ఆపితే, ఆయన వాటివంక ఒకసారి చూసి,
    వరదరాజేశ్వరరావు గారి భుజం మీద చెయ్యి వేసి, ఆకాశంలోకి చూస్తూ (బహుశా ఆశువుగానే అనుకుంటాను) ఉఛ్ఛ స్వరంలో ఆలాపించిన పద్యం అట ఇది! 'నాకు కాళు వణికినై. భయం వేసింది' అని చెప్పుకున్నారు వరదరాజేశ్వరరావు గారు. పద్యం ఆలాపించడం అయిన తరువాత ఆయన ఒకసారి గట్టిగా నవ్వి 'వెనక్కి పోదాం పద, జీవితంలో ఎప్పుడూ ముందుకు పోలేం' అని అన్నారట. ఈ వ్యాఖ్యకు కారణం మీరు ఉదాహరించిన పద్యాలలోని రెండవ పద్యం చెప్పకనే చెబుతుందనుకుంటాను!

    ధన్యవాదాలు!

    ReplyDelete
  5. పూర్తి శతకమును క్రిందిచోట చదువగలరు -
    http://andhrabharati.com/shatakamulu/mRityuMjaya/index.html
    (Please use IE to browse the above page)

    ReplyDelete
  6. ఎంత అందమైన శతకమో!! మణిపూసలు ఏరి మీ వ్యాఖ్యానంతో కూర్చి చదివించారు. ధన్యవాదాలు!

    ఉమ నీకిచ్చి వివాహమున్ సలిపినారో చెప్పు మా మేనకా
    హిమవత్పర్వతరాజు, లేనటననో నీవామెఁ జేపట్టి యా
    యమచేతన్ సవతాలు గంగమనుమోయంజేయుచున్నావు పా
    పము! దేహార్ధమొసగినట్లొసంగి సేబాసయ్య, మృత్యుంజయా!

    (అర్ధనారీశ్వరుడేమంత అమాయకుడు కాదని నిరూపించేసారు కవిగారు! )

    బువ్వే పెట్టని కైతఁబట్టుకుని దేవుళ్ళాడఁగాలేక, నా
    కెవ్వల్లన్ మఱి ప్రొద్దువోక, బదులేమీ పల్కుటేలేని నిన్
    రవ్వంబెట్టెద నాల్కకుం దురదం తీరం దప్పు సైరింపుమీ
    అవ్వంబట్టి వసంతమాడుటిదియేనా స్వామి, మృత్యుంజయా!

    (బువ్వే పెట్టని కైతఁబట్టుకుని.. అత్తాకోడళ్ళొకచోట ఇమడరా!)

    ReplyDelete
  7. అందమైన పద్యాలు, వాటికి సరితూగే మీ వివరణ! అందజేసినందుకు ధన్యవాదాలు, మాస్టారూ.

    ReplyDelete
  8. వ్యాఖ్యానించిన అందరికీ నెనరులు.

    వెంకటరావుగారు, మరో మంచి పద్యాన్నీ, దాని వెనకనున్న కథనూ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. బహుశా యిది మీ బ్లాగులోనే కొంత కాలం కిందట చదివినట్టు గుర్తు.

    కోవాగారు,
    మరో రెండు ఆణిముత్యాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    "ఎంత అందమైన శతకమో!!" అవును నిజం!
    "బువ్వే పెట్టని కైతఁబట్టుకుని.. అత్తాకోడళ్ళొకచోట ఇమడరా!" - అంతే అనుకోవాలి మరి. కాని అది కలికాల మహిమే అనుకుంటాను :)
    "అవ్వంబట్టి వసంతమాడుటిదియేనా స్వామి" - హహహ! ఇలాంటి సజీవభాష వల్లనే యీతని పద్యాలు రవ్వల్లా మెఱుస్తాయి.

    శాయిగారు,
    ఈ టపా పెట్టేముందే ఆంధ్రభారతిలో యీ శతకం ఉందేమోనని చూసానండీ, కనపించలేదు! మీ వ్యాఖ్య చూసి ఎంతో ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. అవును కామేశ్వరరావు గారూ, ఇంతకు ముందు నా బ్లాగులో వ్రాశాను. అయితే, ఇక్కడ వారివి ఇన్ని మంచి పద్యాల మధ్య ఈ పద్యం గూడా వుంటే బాగుంటుందనిపించి, మళ్ళీ ఆ సంగతులతో ఇక్కడ కూడా చేర్చాను.

    సుందరరామశాస్త్రి గారిది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. కడియంలో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి దగ్గర శుశ్రూష చేశారు.

    "అగు నితడు స్వయం వ్యక్తుడు
    భగవంతుడు గురువు, వీని పాండితికేనో
    నగుబాటుం గురువును, వీ
    ని గుణాఢ్యత్వమ్ము మాన నీయమ్మెందున్."

    అని చెళ్ళపిళ్ళవారు చెప్పిన పద్యంలోని 'స్వయం వ్యక్తుడు' ఈ బుచ్చి సుందరరామశాస్త్రి గారు.

    '(తెనాలి) గాంధీ చౌకు దగ్గర ఒక... దుకాణంలో సాయంకాలం నాలుగైదు గంటలకల్లా ఒక ఆకర్షవంతమైన విగ్రహం కనుపించేది. కోరా రంగు ఖద్దరు లుంగీ, ఖద్దరు బనీనూ, ఓ చిన్న తువాలా...విశాల వదనం, పెద్ద కళ్ళూ నుదురూను, తాంబూల సేవనం వల్ల ఎర్రని నోరు, కళ్లలో కూడా ఓ రకం అయిన ఎర్రదనం ఉండేది' - ఇది రాజేశ్వరరావు గారి వర్ణనలో ఆయన రూపం.

    'పద్యం చదవడంలో...బుచ్చి సుందరశాస్త్రిగారి శైలి మనం వర్ణించలేం. విని ఆనందించవలసిందే...హరిజనోద్యమంలో ఆయన కొన్ని పాటలు రాయడం, వాటిని ఊరేగింపుల్లో పాడడం జరిగేది. ఒక సారి ఆయన్ని ఒక పాట పాడమని అడిగాను...ఆయన మెల్లగా---

    అంటరాని వా రెవరో కారు మా
    వెంట రానివారె....

    అంటూ కూచున్న కుర్చీమీద చేతికర్రతో తాళం వేస్తూ ఎంత మనోహరంగా పాడాడో నేను వర్ణించలేను'

    'కవిత్వం వల్ల తెలుగునాట బతకడం కల్ల అని గుర్తించి తపించా డాయన'

    ఇవి బుచ్చి సుందరరామశాస్త్రి గారిని గురించి రాజేశ్వరరావుగారు రాసిన చాలా సంగతులలో కొన్ని. ఇవి మీకు తెలియనివని కాదు, మరోసారి జ్ఞాపకం చేసుకోవడం, అంతే!

    ధన్యవాదాలు!

    ReplyDelete
    Replies
    1. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల" పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే www.cpbrown.org చూడండి

      Delete
  10. ఈశతకమేకాక, మరికొన్ని శతకాలు, కావ్యాలు, వ్యాసాలు తయారుగా ఉన్నా - సైట్‍ రూపురేఖల్ని మార్చాలని ఆగాను. అదీకాక, నిఘంటువుల పనిలోపడి మిగితావాటిని కాస్త పక్కనపెట్టటం జరిగింది.

    ఇంతమంచి మీ పరిచయమును చదివినవాళ్లకు, పూర్తిశతకమును అందిద్దామని వెంటనే "ఆంధ్రభారతి"లో పెట్టాను - ఇందుకు మీకు ధన్యవాదములు.

    కొన్ని సంస్కృత నిఘంటువులను వెతకటానికి వీలుగా పెట్టాము, వీలున్నప్పుడు చూసి మార్పులేమైనా చేస్తే బాగుంటుందేమో చెప్పండి.

    నమస్తే,
    శేషతల్పశాయి.

    ReplyDelete
  11. చాలా బాగున్నాయి మీ టపాలు.

    ReplyDelete
  12. వెంకటరావుగారు, సుందరరామశాస్త్రిగారి గురించి మరిన్ని మంచి విశేషాలను పంచుకున్నందుకు అనేక ధన్యవాదాలు.
    శాయిగారు, చాలా సంతోషమండి. మీ అసామాన్య కృషికి మరో సారి వందనాలు. ఈ శతకంలో కొన్ని చిన్నచిన్న అచ్చుతప్పులు కనిపించాయి. వాటిని మీకు విడిగా మైలు పంపిస్తాను.
    ప్రసాద్ గారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete