తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, April 1, 2012

జానక్యాః కమలామలాఞ్జలిపుటే...


జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

పూర్వం తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం. పెళ్ళి శుభలేఖ మీద యీ శ్లోకం ఎందుకంటే, సీతారాముల పెళ్ళంత వైభవంగానూ తమ పెళ్ళివేడుక జరగాలని ఆకాంక్ష. సీతారాముల పెళ్ళంటే తెలుగువాళ్ళకి ఒక పండగ, ఒక సంబరం. ఈ శ్రీరామనవమి రోజు, సీతారాములు కొలువున్న ప్రతి హృదయమూ ఒక భద్రాచలమే. ప్రతి గుండెలోనూ మంగళవాద్యాలు మ్రోగవలసిందే.

పెళ్ళికన్నా ముందు శివధనుర్భంగ ఘట్టం మదిలో మెదులుతుంది. ఆ దివ్యమోహనమూర్తి, వినీలనీరదశ్యాముడు, విశ్వామిత్రుని వెనుకగా నిలబడి కనిపిస్తాడు. అదుగో చూడండి:

ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా, రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియసోదరుతో అభిరామమూర్తియై.   

కరుణశ్రీగారి కవిత్వంలో మూర్తికట్టిన మనోజ్ఞ రూపం అది. కరుణశ్రీగారి గడుసుదనం గమనించండి. వీరరసం ఆకృతిగొన్నట్టుగా ఉన్నాడని వీరరసాన్ని గురించి వాచ్యంగా చెప్పి, నిలుచున్న తీరులోని నాజూకుదనంలో శృంగారరసాన్ని వ్యగ్యంగా చెప్పారు! ఆ అభిరామమూర్తి వీరశృంగార రసాకృతి.

అదుగో వినండి. జనకమహారాజు తన సింహాసనమ్మీద నుండి లేచి నిలుచుని యేదో ప్రకటన చేస్తున్నారు:

స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే మది ప్రహర్ష పరిప్లుతమయ్యె, యీ ధను
ర్యాగమునందు శంకరుశరాసన మెక్కిడు నెవ్వ డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్

జనకమహారాజా! ఓ రాజర్షీ! ఆనందంతో ఉరకలువేస్తున్నది నీ మనసొక్కటే కాదయ్యా. మా అందరి మనసులూను. ఎప్పుడెప్పుడు రామయ్య ఆ శంకరుని విల్లు ఎక్కుపెట్టి మా సీతమ్మను పెళ్ళాడతాడా అని మేమందరమూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. అవునయ్యా అవును! నీ అనుగుపట్టి, మా సీతమ్మ, వరించినది కాబట్టే మా రామయ్య మహాభాగుడు, మహా భాగ్యవంతుడు అయ్యాడు. కాదన్నదెవరు! మా త్యాగయ్య స్పష్టంగా తేల్చిచెప్పాడు కదా, "మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి" అని. సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన సీతమ్మని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది. సీతలేని రాముడు లేడు. సీతమ్మవారిని తెలుసుకోకుండా రాముడు అర్థం కాడని అశోకవనంలో సీతని చూసిన తర్వాతనే హనుమంతునికి తెలిసివచ్చిందట (మాకు మా విశ్వనాథవారు చెప్పారులే):

చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్లుగా
నే తలపోసినాడ, నిపుడీయమ గాంచినయంత సర్వ మ
జ్ఞాతము గాగనుండెనను సంగతి నా కెరుగంగ నయ్యెడున్
సీత నెరుంగకుండ రఘుశేఖరు డర్థము కాడు పూర్తిగా 

అరే, అదేమిటీ! రామయ్య కాకుండా ధనుస్సు వద్దకు వేరెవరెవరో వెళుతున్నారేమిటి!

బిగువు నిండారు కొమ్ముటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు

అయితేనేం,

శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు!

అంతేకదా మరి. శివధనుస్సుని సాధించడం ఆషామాషీ వ్యవహరమా! వశిష్ఠ విశ్వామిత్రులవంటి గురువుల దగ్గర యోగవిద్యని అభ్యసించిన గొప్ప సాధకుడైన రామయ్యకే అది సాధ్యం.
ఆఁ! ఎక్కడనుండి వస్తోందా సింహధ్వని?! ఓహో లక్ష్మన్న ఏదో ఎలుగెత్తి చాటుతున్నాడు. అదేమిటో మొల్ల మనకు చెపుతోంది:

కదలకుమీ ధరాతలమ! కాశ్యపి బట్టు ఫణీంద్ర! భూవిషా
స్పదులను బట్టు కూర్మమ! రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి! ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు! భూవరుడీశుని చాప మెక్కిడున్

రామయ్య చాపాన్ని ఎక్కుపెట్టబోతున్నాడట. భూమిని, భూమిని భరించే ఆదిశేషు, ఆదికూర్మ, ఆదివరాహ, దిగ్గజాలకి బహుపరాకు చెపుతున్నాడు లక్ష్మన్న. ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా పట్టుకోమని. అదరవద్దని, బెదరవద్దని. రాముడు విల్లెక్కు పెట్టబోతూ ఉంటే యింతటి ఆర్భాటం దేనికంటారా? రామయ్య ఆ ధనువుని ఎక్కుపెట్టగానే అది దిక్కులదిరే పెనుసవ్వడితో విఱిగిపడుతుందని లక్ష్మన్నకి తెలుసుగా. అందుకే ఆ హెచ్చరిక! అదిగదిగో, రామయ్య సదమల మదగజ గమనముతో స్వయంవర వేదిక చెంతకి వేంచేసాడు. వచ్చి:

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుండలర, కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్

అంతే! సముద్రఘోషతో ఫెళ్ళుమని ఆ విల్లు విరిగింది. అప్పుడేమయింది?

ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె
జానకీదేహ మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర!

నయము, జయము, భయము, విస్మయము - రెప్పపాటు కాలంలోనే అన్ని రకాల భావాలు ఒకేసారి విజృంభించాయట!

శివధనుర్భంగమైన ఆ క్షణంలోనే రామయ్య శ్రీరాముడయ్యాడు. జానకీరమణుడయ్యాడు. సీతారాముల విషయంలో విశ్వనాథవారి నిశ్చయం యిది:

ఆయమ పుట్టె పాల్కడలి నంగనగా దనవంతు తీసికోన్,
ఈయమ ధాత్రిలోన జనియించెను విల్లునువంప బెండ్లమై,
ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము, తానె యామయై
ఆయమ కంటి యాన బడి యాచరణం బఖిలంబు చేయుచున్

ఈ పద్యంలో "ఆయమ" అంటే లక్ష్మీదేవి. "ఈయమ" అంటే సీతాదేవి. ఆమె యేమో క్షీరసాగర మధన సందర్భంగా, విష్ణువు తన వంతుగా స్వీకరించడంకోసం పాలకడలిలో పుట్టుంది. ఆమె శ్రీవారి మాటలని అనుసరించేది. కాని యీమె? ఈమె భూమిజాత. అయాచితంగా లభించినది కాదు. శివధనుస్సుని విఱిచిన ఫలంగా రాముని యీమె వరించినది. ఈమె వేదతత్త్వము. ఈమె కంటి ఆన చేతనే రాముడు అఖిల కార్యాచరణమూ చేస్తాడు. అందుకే, ఆ క్షణమే శ్రీరాముడు సర్వశక్తిమంతుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. అప్పుడే అసలు రామాయణం, సీతాయాశ్చరితం మొదలయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన పెండ్లి వేడుకంతా మనకోసం మనం చేసుకొనేదే!
ముఖ్యంగా మన మన తెలుగువారికి తలంబ్రాల ముచ్చట ఎంతో సరదా! అందులోనూ సీతారాముల కల్యాణమంటే అవి మామూలు తలబ్రాలు కావుకదా! ముత్యాల తలంబ్రాలు. మామూలు ముత్యాలా! ఆణిముత్యాలు! అలాంటి ఆణిముత్యాల కాంతులు ఎన్నెని వింత వింత పోకడలు పోయాయో వర్ణించే శ్లోకమే పైన చెప్పుకున్నది. అది శంకరాచార్యుల విరచితమని కొందరంటారు కాని, నాకయితే ఎవరో అచ్చమైన తెలుగు కవి వ్రాసినదే అని గట్టి నమ్మకం! ఆ కవిత్వానికి నా పైత్యం కొంత కలిపి చేసిన అనువాదం ఇదిగో:

కెందామరౌ జానకీదేవి దోసిట
పద్మరాగమ్ములై పరిఢవిల్లి
రఘురాము తలపైని రహి నుంచినంతనె
మొల్లలై వెలుగులు వెల్లివిరిసి
అటనుండి జాఱి యా శ్యామలతనురుచి
నింద్రనీలమ్ములై యింపుమీరి
కరిమబ్బు చిరుజల్లు కురిసిపోయినయట్లు
నేలపై చినుకులై జాలువారి

వేడ్క సీతమ్మ రామయ్య పెండ్లినాడు
అలరు తలబ్రాల చినుకుముత్యాలజల్లు
తెలుగువారిండ్ల సిరిసంపదలును శుభము
బ్రగతి గూర్చుత శ్రీరామరక్ష యగుచు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

17 comments:

  1. మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ...ధన్యవాదములు మంచి పద్యాలు అందచేసినందుకు

    ఆరుద్ర గారు సీత కల్యాణం లో జానక్యా పద్యానికి అనువాదం చేసారుట
    ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది.
    తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి.
    కెంపులనుకున్నవి, రామయ్య మైచాయ సోక గా నీలమ్ములైనాయి.
    ఇన్ని రంగులు చూసి ఇంతి తెల్లబోయింది. ఇనకులుడు చిరునవ్వు నవ్వాడు

    ReplyDelete
  2. శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకు కూడా.. మంచిపద్యాలను గుర్తుచేశారు. ధన్యవాదాలు మీ అనువాద పద్యం కూడా సొంపుగానున్నది

    ReplyDelete
  3. ఆ శ్లోకంలో భావాన్ని కాపీ కొట్టి ఎవరో మరో శ్లోకం రాశారు.

    ఏకో‌ऽపి త్రయ ఇవ భాతి కందుకోऽయం కాన్తాయాః కరతలరాగరక్తరక్తః |
    భూమౌ తచ్చరణనఖాంశుగౌరగౌరః స్వస్థః తన్నయనమరీచినీలనీలః ||

    నేను చూసిన పెళ్ళిపత్రికలలో "కల్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే.." ఉన్నట్టు గుర్తు.

    ReplyDelete
  4. @ రవి గారు
    కృష్ణ కర్ణామృతం లో కూడా రుక్మిణీ కళ్యాణం ఘట్టం లో ఇలాంటి పద్యమే ఒకటి వున్నట్లు విన్నాను మరి

    ReplyDelete
  5. కామేశ్వరరావుగారు,
    చక్కగా వర్ణించారు. ముళ్ళపూడి వెంకటరమణగారు రచించిన శివధనుర్భంగ కథ (కథపేరు గుర్తులేదు), నారాయణరెడ్డిగారు స్వాతిముత్యం చిత్రానికి వ్రాసిన హరికథ జ్ఞాపకం వచ్చాయి.మీ అనువాదంతో కలిపి అన్ని పద్యాలూ బావున్నాయి.
    శ్రీరామనవమి శుభాకాంక్షలు..

    ReplyDelete
  6. అద్భుతం. వొళ్ళూ కళ్ళూ మనసూ పులకరించాయి.

    ReplyDelete
  7. చాలా బాగున్నాయి... పద్యాలు


    -ఇంద్రకంటి పినాకపాణి

    ReplyDelete
  8. అనువాదం బాగా వచ్చిందండీ.... సీసాన్ని ఎలా ఎంచుకున్నారబ్బా అని బుర్ర గోక్కుంటున్నాను..

    గిరి గారూ,
    వాగ్దానం లో హరికధ కూడా గుర్తు రావాలి కదా..

    ReplyDelete
  9. anniTikee moolaM samudraala ni maricipOtE elaa anDee?? seetaaraama kalyanamO?? hannaa !!

    ReplyDelete
  10. anniTikee moolaM samudraala ni maricipOtE elaa anDee?? seetaaraama kalyanamO?? hannaa !!

    ReplyDelete
  11. సముద్రాలగారి పాటకి కూడా ఈ శ్లోకమే కదండీ మూలం! :-)

    ReplyDelete
  12. పెళ్ళైన కొత్తలో సీతమ్మ రాముల వారితో:

    సీతమ్మ: మీ వూళ్ళో పాయసం తాగితేనే పిల్లలు పుడతారట గదా (గడుసుగా)

    రామయ్య: మీ వూళ్ళో పుట్టకుండానే భూమిలో దొరుకుతారట గదా

    గరికిపాటివారి వ్యాఖ్యానం లోనుండి

    ReplyDelete
  13. ఇంతులు పాయస మానిన కలుగుదురే పుత్రులంచు క్ష్మాసుత నవ్వన్,పొలమున దొరకుదురంచును రఘురాముడు సీత చూసి పక్కున నవ్వెన్.

    ReplyDelete
  14. ఇంతులు అనే చోట లలనలు అని వుండాలి - PVR SANKAR

    ReplyDelete
  15. హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.

    https://youtu.be/bc8QQqX0UiI?si=IhfEdcRZ93BvsQWH

    హరిః ఓమ్.

    ReplyDelete