తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, April 20, 2012

ముసలివాని ప్రేమలేఖ

మొన్నీ మధ్య మిథునం కథ గురించి చర్చ చదివినప్పుడు, నేనెప్పుడో పదమూడేళ్ళ కిందట వ్రాసిన యీ పద్యకవిత గుర్తుకు వచ్చింది. సరే, కవిత పాతదైనా కొత్త మిత్రులతో పంచుకుందామని యిక్కడ పెడుతున్నాను. ఇది వ్రాసిన తర్వాత కూడా ఎవో పద్యాలు వ్రాస్తూనే ఉన్నాను కాని, యింతగా మనసుకి హత్తుకొన్న కవిత మరేదీ యీ పదమూడేళ్ళగా రానే లేదు! అప్పట్లో మనసుకున్న సున్నితత్వం క్రమేపీ మాయమైపోతూ ఉండడం దానికి కారణమేమో!

ప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,
                                       నీ సదా,
                                       హృదయశ్రీ.

22 comments:

  1. మాస్టారూ... వృద్ధుల హృదయవేదనను అత్యంత ఆర్ద్రంగా చిత్రించారు.

    ReplyDelete
  2. బాగుందండి

    ReplyDelete
  3. ’వెతలకు బలియైన ముసలి
    బ్రతుకు’ కవిత చదువ, హృదియె బరువెక్కెనయా!
    నతులివె నీలోని సర
    స్వతి మాతకు; జయము నీకు ’భైరవభట్లా’!

    ReplyDelete
  4. "పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
    పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!"

    కరుణరసాన్ని కుండలతో తెచ్చి కుమ్మరించినట్టుంది చదువుతుంటే !

    ReplyDelete
  5. వ్యాఖ్య వ్రాసినందరికీ కృతజ్ఞతలు.
    ఫణీంద్రగారు, మీ పద్యాభినందనకు ధన్యోహం.

    ReplyDelete
  6. అందరి గోడిదే , ముదిమి నందలి దైన్యము లచ్చు గ్రుద్ది , యీ
    యందరి పక్షమున్నిలిచి , యద్భుత రీతి వచించి నట్టి మీ
    యందలి శ్రీ సరస్వతికి నంజలి , భైరవ భట్ల గారు ! యే
    బంధము 'భార్య తప్ప' భవబంధము లీడ్వ , దదృష్టమేరికో ?

    ReplyDelete
  7. మంచి ఖండికండీ... పంచుకున్నందుకు ధన్యవాదాలు ...

    ReplyDelete
  8. Very good attempt. I cannot comment on your leterature as I am not good at the language. The blog is good. The arrangement etc are nice. Thank you for sharing. Blog for Collection of articles| short real inspirational stories | Original Quotes & Jokes, A Very huge collection of the motivational and inspirational stories. Along with good emails, articles and jokes supported with images and original quotes. http://malenadugroup.blogspot.in/

    ReplyDelete
  9. Bavam or padyam or story chivariki vachesariki na kanllu nititho nindinayi..... Thalli thandrulanu veeru cheyakudadhu.... Naaku chethanayi nanthalo saayam chesthanu....

    ReplyDelete
  10. "పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
    పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!"

    "నీడవైన నీవే నను వీడినావు"

    పద్యానికి వస్తువు ఈ వియోగ భరిత వ్యధ కనుక వేదన పద్య పాదాలన్నిటా చిక్కగా పరుచుకుంది. గుండెని చిక్కబట్టేసింది. బావుంది చిన్నమాట - కలకాలం కంటితడిని ఖర్చు పెట్టిస్తుంది.

    "అప్పట్లో మనసుకున్న సున్నితత్వం క్రమేపీ మాయమైపోతూ ఉండడం" మీరు వ్యక్తం చేసిన ఈ భావన మాత్రం బాధగా ఉంది అంగీకరించేయాలంటే. పసితనం/లేతదనం, హాయైన నవ్వు/పచ్చదనం, సున్నితత్వం/విడివడని మొగ్గ - ఇలా మన పోకడలకి ప్రకృతిని ఆధారం చేసుకుని బతికేయగలమని నా ఆశ. అది నిలిచినంతకాలం మనని మనం నిలుపుకోగలమనే ధీమా.

    ReplyDelete
  11. Respected master
    namaskaram

    a veteran letter to his deceased wife. the thought is an innovative one. the concept eventhough old one , but by touching with your golden words your sir fixed it in a gold frame. waiting for death is miserable one. it came to my thoughts how the lord Hanuma is still living alone having lost his all companions of his age.
    chinranjeeva chinranjeeva should be accompanied with a word sukhibhava sukhibhava . else the blessing remains like your old hero. Once again i say thanks for your kind poem .
    with regards
    advocatemmmohan

    ReplyDelete
  12. sir............ you are simply superb..hats off!

    ReplyDelete
  13. sir............ you are simply superb..hats off!

    ReplyDelete
  14. చాలా రొజుల తర్వాత బ్లాగులు గమనిస్తున్నా. మీ ఖండిక చాలా బాగున్నది

    ReplyDelete
  15. అద్భుతం. చెప్పడానికి మాటలు కరువవుతున్నాయ్ నాకు.

    ReplyDelete
  16. chaalaa baadhagaa unnadhi


    ratnakar tadepalli

    ReplyDelete
  17. తల్లి తండ్రులన్ కాదన్నా వాడు కాటికి పోవున్

    మనకు జన్మ నిచ్చిన తల్లి తండ్రులను కాదన్నా వాడు బ్రతికి వేస్ట్

    ReplyDelete