తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, March 2, 2011

మహాశివరాత్రి శుభాకాంక్షలు!

మహాశివరాత్రి శుభాకాంక్షలు!

మహేశ్వరునికున్న అనేకానేక విశిష్టతలలో అతని నటన్మూర్తి ప్రత్యేకమైనది. అతను నటనానికే రాజు. శివుని పద నర్తనలో విశ్వమంతా సంచలిస్తుంది. ఆ చైతన్య తాండవ హేలా విలాసంలో అణువణువూ లయాన్వితమవుతుంది. ఆ నటరాజ స్వరూపం ఊహకే పరమాద్భుతం! ఎందరో కవులా స్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం చేసారు. వారిలో నన్నెచోడుడు కుమారసంభవంలో చేసిన వర్ణన లయగ్రాహి, లయహారిణి వృత్తాలలో ఎంతో లయబద్ధంగా సాగుతుంది.

విశేషమేమిటంటే ఇది దక్షుడు చేసే శివస్తోత్రం. దక్షాధ్వర ధ్వంసానంతరం శాంతించిన శివుడు కరుణించి దక్షుడిని క్షమించిన తర్వాత భక్త్యావేశంతో దక్షుడు చేసిన స్త్రోత్రమిది.

ఫాలతల విస్ఫురిత లోలతర భాసుర వి
శాల భయ దాసుర కరాళ నయనాగ్ని
జ్వాలలొకొ? పింగళ జటాళి యొకొ? నా బెరసి
తూలి, దివి భూషణ చయాలుళిత దీర్ఘ
వ్యాళ నికరంబొకొ? కరాళి యొకొ? నా దనరి
క్రాల, వర నృత్య పరిలోలుడగు శ్రీకం
కాలధరు, నుజ్జ్వలకపాలధరు, సన్నిశిత
శూలధరు, నీశ్వరు, దయాళు నుతియింతున్

శివుడు తాండవమాడుతూంటే, తలపై ఎఱ్ఱని జటలు ముడివిడి, వ్యాపించి, సంచలించిపోయున్నాయి. అవి ఘోర రాక్షస భయంకరములైన ఫాలనేత్ర జ్వాలలా అన్నట్టుగా ఉన్నాయి! నాట్య భంగిమలతో అతని నాలుగు చేతులూ ఆకాశంలో కదలాడుతూంటే అవి చేతులా నాగుపాములా అన్నట్టుగా ఉన్నాయి. అలాంటి కంకాలధరుడు, శూలధరుడు, దయాస్వరూపుడు అయిన నటరాజుని భకితో స్తుతిస్తున్నాడు దక్షుడు.

ఉర్వర చలింప, గులపర్వతచయం బడర,
బర్వ భువి నంబునిధు లౌర్వశిఖి యాడన్
బూర్వసుర నాగ సుర పూర్వదిగధీశ యమ
వార్విభు ధనేశ్వరుల గర్వము లడంగన్
సర్వగణ ముఖ్యులును, సర్వగణ భూతములు
నార్వ, నహిభూషణము లార్వ, దిశలం గం
ధర్వతతి పాడగ, నపూర్వనటనాదిగురు,
సర్వగతు, సర్వమయు, శర్వు నుతియింతున్

ఆ తాండవార్భటికి భూమి సంచలిస్తోంది. కులపర్వతాలు అదిరిపోతున్నాయి. సప్తసముద్రాలు ఉప్పొంగుతున్నాయి. బడబాగ్ని అతలాకుతలమవుతోంది. రాక్షసుల, నాగుల, దేవతల, అష్టదిక్పాలకుల గర్వమంతా అణిగిపోతోంది. గణాధీశ్వరులు, సమస్త భూత గణము అదిరిపోతోంది. ఆభరణాలైన సర్పాలు అలసిపోయి నిట్టూర్పులు విడుస్తున్నాయి. దిశలన్నిటా గంధర్వగానం వినిపిస్తోంది. నటనకి తొలిగురువు, సర్వజ్ఞుడు, అంతటా నిండినవాడు అయిన శర్వుడిని భక్తితో నుతిస్తున్నాడు దక్షుడు.

తాళరుతి గీతిరుతి మేలి తత వాద్యరుతి
చాల రసవంతమయి యోలి నులియం, ద
త్తాలగతి మెట్టుచును గేల జరు లిచ్చుచును
జాలి యనురాగమున గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మే మఱచి వ్రాలుచును గెత్తుచును
లోలగతి నేత్ర భుజ చాలనముతో బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ నను
కూలగతి నాడు శివు శూలి నుతియింతున్

తాళా గీత ధ్వనులు రెండూ మేళవించిన సంగీతం చాలా రసవంతమై నినదిస్తోంది. ఆ తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, చేతులతో చఱుపులు చఱుస్తూ, అనురాగంతో ఉప్పొంగుతూ, సౌఖ్యసముద్రంలో తేలిపొతూ, మైమఱచి సోలిపోతూ, గంతులు వేస్తూ, నాట్యానికి అనుగుణంగా కన్నులు, భుజాలు కదిలిస్తూ శ్మశానంలో సంధ్యావేళ ఆనంద తాండవం చేస్తున్నాడు శివుడు. ఆ శూలిని స్తోత్రం చేస్తున్నాడు దక్షుడు.

కఱ గళము ఘనఘనము తెఱగనగ, నుఱికలును
గఱడియలు ద్రిపుదలును గిఱిడియలు బెల్లై
యుఱుము లన వడి జెలగ గొఱ నెలయు దనురుచులు
మెఱుగులన దశదిశల మెఱవ, దలమీదన్
వఱలు సురనది దొలకి నెఱి జినుకులును గిరియ
దఱిమికొని తొలుమొగులు తఱి యనగ నృత్యం
బొఱ వమర లలితగతి మెఱయు శివు డజు డమరు
డుఱుఫలము లొసగునని యెఱిగి నుతియింతున్

శివుడు నాట్యం చేస్తూంటే నల్లని కంఠము దట్టమైన మేఘంలాగా ఉంది. ఉఱికలు, కఱడియలు, త్రిపుదలు, కిఱిడియలు మొదలైన వాద్యవిశేషాలు చేసే ఢమఢమ ధ్వనులు ఉఱుముల్లాగా ఉన్నాయి. తెల్లని శరీరము, పైనున్న నెలవంక మెఱుపులా మెఱుస్తున్నాయి. తలమీదనున్న ఆకాశగంగ తొణికి చినుకులుగా కురుస్తోంది. అలా తొలకరి సమయాన్ని స్ఫురింజేస్తూ నాట్యం చేస్తున్న ఆ పరమేశ్వరుడు భక్తాభీష్ట ప్రదాత.

కరనికర మురు విటపవరము లన, గరతలము
కరుణరుచి దలిరు లన, గరజములు పుష్పో
త్కర మనగ, వనరుహజ హరి దనుజ ముని మనుజ
సుర గగనచర భుజగ గరుడ గణ యక్షే
శ్వరుల కతిదయ నొసగు వరఫలము లనిశమును
భరితమయి మధుసమయ సురవర మహీజ
స్ఫురణ కెన యన, దనరు వరదు, హితనటనరతు
బరమపరు, పరమగురు, బరము నుతియింతున్

ఆ నటరాజమూర్తి చేతులు పెద్దపెద్ద కొమ్మల్లాగా ఉన్నాయి. అఱచేతులు ఎఱ్ఱని కాంతితో మెఱుస్తూ చివురుల్లాగా ఉన్నాయి. చేతి గోరులు పువ్వుల్లా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, రాక్షసులు, మునులు, మనుష్యులు, దేవతలు, ఖేచరులు, నాగులు, గరుత్మంతుడు, ప్రమథ గణాలు, కుబేరుడు మొదలైన వాళ్ళకి ఇచ్చే వరములు ఫలముల్లా ఉన్నాయి. నిరంతరం ఫలభరితమైన వసంతకాల కల్పవృక్షాన్ని స్ఫురింపజేస్తున్న ఆ నటరాజ మూర్తికి, పరాత్పరునుకి, పరమగురువుకి పరమాత్మునికి భక్తితో అంజలి ఘటిస్తున్నాడు దక్షుడు.

ఆ దక్షుడితోపాటు మనమూ ఆ నటరాజ విరాణ్మూర్తిని ఆత్మలో భావించి భక్తితో సన్నుతిద్దాం!

ఓం నమశ్శివాయ

3 comments:

  1. నటరాజు స్వరూపం నిరుపమానం.

    పరమేశ్వర స్తుతి ఎప్పుడూ సంస్కృతపదాలతోనే అలరారుతుంటుంది. బహుశా ఆ స్వరూపమే కారణమేమో. ఒక్కసారైనా అచ్చమైన తేట తెనుగులో ఈశ్వర స్తుతి ఎక్కడైనా వినిపిస్తుందేమోనని వినాలని ఉంది.

    ReplyDelete
  2. శ్రీనాథుడు వ్రాసిన భీమఖండంలో అచ్చ తెలుగు పదాలతో, సంస్కృతానికి ఏమాత్రం తీసిపోకుండా కొన్ని పద్యాలు ఉన్నాయని అప్పుడెప్పుడో పద్యాల తోరణం కార్యక్రమంలో ఎవరో ఒకాయన కొన్ని పద్యాలు కూడా చదివి చెప్పారండి. ఆ పద్యాలేవో కామేశ్వర రావుగారే చెప్పగలరు.

    ReplyDelete
  3. అచ్చ తెలుగులో శివుని వర్ణన ఉత్తరహరివంశంలో ఉంది. భీమేశ్వరపురాణంలో కూడా ఉందని తెలియదు, చూడాలి. వచ్చే శివరాత్రి దాకా సమయం ఉంది కదా. :-)

    ReplyDelete