తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, March 24, 2011

మరో పండుటాకు రాలిపోయింది!

ఆ మధ్యనే సంపత్కుమార, ఈ మధ్యనే వడలి మందేశ్వరరావుగారు. విశ్వనాథ సాహిత్యాం, ముఖ్యంగా రామాయణకల్పవృక్షం, లోతులను దర్శించి మనకి చూపించగల/చూపించిన దక్షులు - ఒకొక్కరే రాలిపోతున్నారు. కిందటి వారం అఫ్సర్ గారి బ్లాగు చూసేదాక మందేశ్వరరావుగారి అస్తమయం గురించి నాకు తెలియనే లేదు! బహుశా విరిగే వార్తల వెల్లువలో అదెక్కడో కొట్టుకుపోయి ఉంటుంది. ఇలాంటివారి గురించిన వార్తలు ఎంతమందికి ఆసక్తినిస్తాయి గనక!

నాకు మందేశ్వరరావుగారు పరిచయమయ్యింది వారి "ఇది కల్పవృక్షం" పుస్తకంతో. కల్పవృక్షం కన్నా ముందే నాకీ పుస్తకం పరిచయం. కల్పవృక్షాన్ని నాకు పరిచయం చేసిన పుస్తకమది. ఒక కవి గురించి బాగా తెలిసినప్పుడే అతను వ్రాసిన కవిత్వాన్ని సరిగాను లోతుగాను అర్థం చేసుకోడానికి వీలవుతుంది. కవి గురించి తెలియడమంటే అతని పుట్టుపూర్వోత్తరాలో, అతని వ్యక్తిగత అలవాట్లో కాదు. ఆ కవి సమస్త సాహిత్యంతోనూ పరిచయం. అందులో దాగిన మూలసూత్రం అంతుబట్టడం. ఈ విషయం నాకు బాగా తెలిసింది "ఇది కల్పవృక్షం" చదివాకనే.

ఈ పుస్తకంలో "మఱలనిదేల రామాయణంబన్న..." అనే ఉపోద్ఘాత వ్యాసంలో, ఆకాశమంత విశ్వనాథభారతిని అద్దంలో చూపించే ప్రయత్నం చాలా సమర్థవంతంగా చేసారు మందేశ్వరరావుగారు.

"వేషాలెన్ని మారినా మనిషిలోని నాడీ స్పందనలో చరకుని నాటినుండి నేటి దనుక సామ్యాన్ని పసిగట్టగలం. అలాగే నాగరికత మారినా, విలువలు మారుతున్నా, జాతియొక్క జీవనాడి ఎక్కడో అవిచ్ఛిన్నంగా స్పందిస్తూనే ఉంటుంది. అది కృతయుగాదినుండి నేటిదాకా ఒక్కలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ జాతికొక అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉంటుంది. అదికాస్తా స్తంభించిపోతే, జారిపోతే ఆ జాతి నశించినట్లే. అది మరో జాతో, జీవరాశో అవుతుంది. ఇట్టి దర్శనం కల విశ్వనాథకు రామాయణం త్రేతాయుగం నాటి కథ అవదు."

అని, విశ్వనాథ దర్శనాన్ని స్పష్టంగా సంగ్రహంగా మన ముందుంచారు. విశ్వనాథ సాహితీమూర్తిమత్వాన్ని వివరించాక, "మరి ఇంతటి కవి ఒక కావ్యాన్ని వ్రాయాలని సంకల్పిస్తే - మిల్టన్ చెప్పినట్ట్లు - తర్వాతి తరాలవారు కోరి మరచిపోకుండా ఉండే మహాకావ్యాన్ని వ్రాయ సంకల్పిస్తే, దాని వస్తువు ఎట్టిదై ఉండాలి?" అని ప్రశిస్తారు. దానికి సమాధానం కోసం ఇలా ఆలోచిస్తారు:

[
అందులోని పాత్రలలో వైవిధ్యముండాలి. ఒక్క రాముడూ, ఒక్క రావణుడే కాదు - మనకు అంతుపట్టని ఒక కుంభకర్ణుడూ, ఒక శబరీ ఉండాలి. దగ్గర దగ్గరగా ఉంటూనే తేడా విస్పష్టంగా కనపడే సుమంత్రుడూ మాతలీ ఉండాలి. వీరికి దీటుగా అటు రావణుని సారథి ఒకడు ఉండాలి. శీలాన్ని తీర్చే తన దక్షతనంతనూ సవాలు చేసేటట్టు, ఏ కైక పాత్రకో గుండె మార్పిడి చేసి, ఆమెను సరికొత్త పాత్రగా దిద్దాలి. నగరంలో ఒక అరుంధతి, అడవిలో ఒక అనసూయా, కిష్కింధలో తార, లంకలో మండోదరీ మనకు కనబడాలి. లోక రక్షణకై వ్రతాన్ని పూనిన అగస్త్యుడూ, సీతారక్షణకై ప్రాణాలు వదలిన జటాయువూ ఉండాలి. మాత్సర్యానికి ప్రతీక అవాలొక పర్వతం. మరొక రాక్షసుడు దున్నపోతే కావాలి. ఇలా ఎందరు? ఎందరో పాత్రలు అవసరమవుతారు. వారందరికీ తలమానికంగా ఉండే మహా జ్ఞాని, మౌని, వాగ్మి, కార్యకరణ దక్షుడు, ఇత్యాది లక్షణాలుండే ఏ ఆంజనేయుడో ఉండాలి.
వీళ్ళందరినీ తనచుట్టూ పరిభ్రమింప చేసుకొనే ఒక నాయకుడు, రాముడు కావాలి. అట్టి రాముడు ఎవరి గవేషణము తన జీవితానికి పరమార్థమనుకున్నాడో, అట్టి లోకమాత, సీతాదేవి, కూడా ఒక పాత్ర అవాలి. అంటే అదొక లోకం అవ్వాలన్న మాట. అందులో మానవలోకం అంతా ప్రతిఫలించాలి.
]

ఇది విశ్వనాథ కల్పవృక్షంలో పాత్రలని ఎలా తీర్చిదిద్దారన్నదానికి పరిచయం. మానం పాత్రలని ఎలా పరిశీలించాలన్న దానికి సూచన. ఇలా పరిచయం చేస్తునే మరింత ముందుకి సాగి ఇలా వివరిస్తారు:

[
ఇక విశ్వనాథ ప్రధానంగా, వస్తుతః కవి. వస్తువు ఎట్టిదైనా, అది ఆయన కవిత్వానికి నికషోపలంగా ఉండాలి. అంతటి కవిత్వమున్న వస్తువేది? అంతటి రససృష్టి కాకరమైన కథ ఏది? అట్టి కవి ఏడి? అంటే ఆయనకు వాల్మీకి తప్ప మరెవ్వరూ సుకవి శబ్ద వాచ్యునిలా కనబడలేదు. సర్వకావ్య వాక్కు ఆ మౌని వదన సీమనుంచే పుట్టింది.

"అచ్చమైన యమృత మమరులు త్రావినా
రోయి! దానికే నసూయ పడను
పరమమౌనియైన వాల్మీకి కృత రామ
సత్కథా సుధారసంబు ద్రావి"

ఇన్ని లక్షణాలున్న మహాకావ్యాన్ని రచించడానికి సమకట్టే కవి, కేవలం కొత్త కథను కట్టడంతోనే కాలం సరిపోయే ఏ కళాపూర్ణోదయం వంటి కథనో శ్రమపడి నిర్మించ దలచుకోలేదు.

కావ్యంలో కావలసింది కవిత, రసభావాలు. వీనికి పుష్కలంగా అవకాశమిస్తూ, పాత్రలలోని వైవిధ్యాన్నీ, వర్ణనలలో రామణీయకతనూ, అలంకారంలో వైదగ్ధ్యాన్ని సాధిస్తూ, దుష్టశక్తుల ప్రాబల్యం వల్ల, పరాయిపాలన తీవ్రతవల్ల, నిర్జీవమైన సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికి, సంశయగ్రస్తుడైన ఆధునిక మానవుణ్ణి, మహోత్తుంగ శృంగంలా పెరిగిన మానవుణ్ణి చూపడానికి, ఒంటరిగా మిగిలిన కుంటి కాలుమీద నిలబడలేక కుప్పగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ధర్మాన్ని సంజీవితం చేయడానికి, వస్తువెట్టిదై ఉండాలన్న ప్రశ్న విశ్వనాథకు ఎదురైనప్పుడు -
ఆయనకు కనబడింది ఈ రామాయణం. అందుకే "మఱల నిదే రామాయణం"! అందుకే ఆయన ప్రతిజ్ఞ:
"ముని ఋణము దీర్ప నీ కావ్యమును రచింతు"నని. ఆ ప్రతిజ్ఞ నుంచి పుట్టిందే "కల్పవృక్షము".
]

రామాయణకల్పవృక్షానికి ఇంతకన్నా గొప్ప పరిచయం సాధ్యమా? కల్పవృక్షం ఒకో కాండనూ తీసుకొని, అందులో ఉన్న ఎత్తులను, లోతులనూ తల స్పర్శిగానే అయినా, ఎంతో సమర్థవంతంగా అద్భుతంగా వివరించారీ పుస్తకంలో. ముగింపు వ్యాసంలో వారి ముగింపు మాటలివి:

[
ఇన్ని మహార్థాలను వివరించడం చేతనే కల్పవృక్షం మహాకావ్యమైంది. ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ఇమిడ్చానని విశ్వనాథ అనేవాడు. వాట్లన్నింటినీ వెదుక్కోడానికి ఇంకో ప్రయత్నం చేయాలి. కావ్యాన్ని మరోసారి ఆ దృష్టితో అనుశీలన చేస్తేనే ఆ అర్థాలు ఆవిష్కృతమవుతాయి.
కల్పవృక్షంలో ఉన్న అర్థం ఒక పొరలో లేదు. అందులోని అర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి. భావకుని భావయత్రీ శక్త్యవధికంగా, వ్యుత్పత్తిని అనుసరించి ఒక్కొక్క పొరలోని అర్థమూ ఆవిష్కృతమవుతుంది.
ఇన్ని ఇమిడి ఉండబట్టే ఇది కల్పవృక్షమైంది.
ఇందులో ఉన్నది సద్యోనిర్గతమైన సర్వకవితా సంభారము.
ఇది కల్పవృక్షం!
]

మందేశ్వరరావుగారు ఇంకో ప్రయత్నం చెయ్యలేదు. చేసారేమో, మనదాకా అందలేదు. ఇక వారు చేసే అవకాశం లేదు. మరెవరో చేస్తారన్న ఆశకూడా లేదు.

శిశిరంలో ఆకులు రాలిపోవడం సహజం. వసంతం వస్తే మళ్ళీ కొత్త చిగురులు వేస్తాయి. అలాంటి వసంతం ఎప్పుడో!

13 comments:

  1. అయ్యో మొన్ననే ఆంధ్రభూమి సాహితి పుటలో(http://www.andhrabhoomi.net/sahiti/vadaliponi-vimarshakudu-145) వారిపై వచ్చిన వ్యాసం చదివి మరొకసారి "ఇదీ కల్పవృక్షం" చదువుతూ అనందిస్తున్నాను. ఆ వ్యాసంలో మందేశ్వరరావుగారు కీర్తిశేషులైనట్టు చెప్పలేదు. ఇంతలోనే మీ బ్లాగులో (అఫ్సర్ గారి బ్లాగు చూడలేదు) ఈ వార్త.
    భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ
    సూర్యప్రకాష్

    ReplyDelete
  2. ఇపుడు మీరు చెప్పకముందు, సూర్యప్రకాశ్ గారి వ్యాఖ్య చూసి ఆంధ్రభూమిలో వ్యాసం చదవకముందు నాకు వడలి మందేశ్వరరావుగారి గుఱించి తెలియదండీ. ఊఁ, ఒక తరం వెళ్లిపోతోంది. ప్చ్!

    ఇక శిశిరానన్తరవసంతం గుఱించి... ఒకరే చదివి విశ్లేషిస్తే అది ఒకరి వ్యాఖ్యానమే ఔతుంది. కనీసం ఇద్దరు ముగ్గురు కలిసి చదివి విశ్లేషిస్తే అది కొంతైనా సమగ్రంగా ఉంటుంది. మనతరంలో మనమే పూనుకోవాలి.

    ReplyDelete
  3. "కవి సత్తముల పరిచయం కలగటం పూర్వజన్మ సుకృతం, అది పరోక్షమైనా/ ప్రత్యక్షమైనా... " అనేవారు మా నాన్నగారు.

    సత్కవిని పరిచయం చేశారు. "ఇదీ కల్పవృక్షం" పుస్తకం ఏ పబ్లికేషన్? ఎక్కడదొరుకుతుందో తెలియజేయగరు. :-)

    ReplyDelete
  4. సూర్యప్రకాష్ గారు, ఆంధ్రభూమి వ్యాసానికి లంకె ఇచ్చినందుకు నెనరులు. ఆ వ్యాసం మరో మారు కల్పవృక్షం గురించి మందేశ్వరరావుగారు వ్రాసినట్టు చెపుతోంది. ఆ పుస్తకాన్ని గురించి నాకిప్పటి దాకా తెలియదు. వెతకాలి. "ఇది కల్పవృక్షం" లాగా దాన్ని కూడా ఎవరైనా పునర్ముద్రిస్తే బాగుంటుంది.

    సనత్ గారు, "ఇది కల్పవృక్షం" పుస్తకం గురించిన వివరాలు ఇక్కడున్నాయి:
    http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=2

    రాఘవా, ఎక్కువమంది విశ్లేషిస్తే కొంతైనా సమగ్రమవ్వడం గురించి మీరన్నది నిజమే. కల్పవృక్ష విశ్లేషణ చెప్పుగోదగినంత చేసినవాళ్ళని ఆంధ్రభూమి వ్యాసంలో ప్రస్తావించారు. మొత్తం కలిపితే ఐదుగురు! అందరూ పండుటాకులే! మనతరంలో తప్పకుండా మనమే పూనుకోవాలి. కాని దానికి తగ్గ సామర్థ్యం కావాలి కదా! నాకైతే ప్రస్తుతానికి అంత సామర్థ్యం లేదు. ముందసలు కల్పవృక్షానికి టీకా తాత్పర్య సహిత వ్యాఖ్యానం చాలా అవసరం. ఇది కూడా బహుశా ఒక్కరు చెయ్యడం సాధ్యం కాదేమో. అలాంటి శక్తిసామర్థ్యాలున్న వాళ్ళు మన ముందుతరంలో కొంతమందైనా ఉన్నారు. వాళ్ళీ పని చెయ్యగలిస్తే అది మన తరానికి మార్గదర్శకమవుతుంది. ఎవరికైనా ఈ పండితులతో పరిచయముంటే ప్రయత్నం మొదలుపెట్టవచ్చు. నేనూ ఆ ప్రయత్నంలో ఉన్నాను.

    ReplyDelete
  5. శుభస్య శీఘ్రమ్ :)

    ReplyDelete
  6. ఇది కల్పవృక్షము మందేశ్వరుల వారి పుస్తకమును నేను విశాలాంధ్ర పుస్తకాల అంగడిలో కొన్నాను. వడలి మందేశ్వర రావు గారు చక్కని పరిచయ మిచ్చారు కల్పవృక్షానికి. నేను యింకా విశ్వనాధ వారి కల్పవృక్షమును చదువ లేదు. మిత్రులు చంద్రశేఖరులు నాకు బహుమతిగా తెచ్చారు. మొదలు పెడతాను. కామేశ్వర రావు గారూ ,చక్కని వ్యాసము వ్రాసారు. మీ వంటి యువకుల భాషా జ్ఞానము తత్పరత చూస్తూంటే జీవనాడి పై నాకు యెట్టి అనుమానము లేదు. కాకపోతే మీ వంటి వారల సంఖ్య పెరగ వలసిన అవసరము ఉంది. కాలము మారినా విలువలు మారవు. ఒక తరము క్రితము ఆర్ధిక పరిస్థితుల వలన తెలుగు భాషపైన అనాదరణ ఎక్కువయినా యిప్పుడు మన దేశములో ఆర్ధికంగా పురోభివృధ్ధి చెందుతున్నది కాబట్టి మన సంస్కృతి పైన మనము శ్రధ్ధ వహించ వలసిన అవసరము ఉంది. మన తెలుగు ఉపాధ్యాయుల పైన కూడా యీ బాధ్యత ఉంది.

    ReplyDelete
  7. Простите за русский, но все таки как вы добились PR3

    Да от меня - Be Happy!

    ReplyDelete
  8. అనుకోకుండా ఓపెను అయిన మీ బ్లాగు చూసి అహా ఏమి అదృష్టము కవి, సహృదయులు, మహాత్ములు, భైరవభట్ల వారిని చూడగలిగాను అనుకున్నాను. మరుక్షణం ఇంత విషాద విషయంచూసాను. అవసరానుసారమే నెట్టు చూస్తున్న నాకు ఇది ఒక ఝలక్ ఎలా చూసిన. మహామహులు గురువులకే ఉన్నతగురువు సంపత్కుమారాచార్య పరిచయభాగ్యం కాదుకాదు దర్శన భాగ్యము ఒక్కసారి పొందిన మహాభాగ్యవంతుడను. అదికూడ అనామకుడనై ఉండి. నా చిరుప్రయత్నం కలిగించిన మహోత్కృష్టమైన కానుకలలో ఒకటిది అనుకుంటాను. నాకే అర్హత లేకపోయినా రామాయణకల్పవృక్షముపని కూడ చూడన్నారు. అది మహాపండితుల మహాత్ముల విశాలహృదయము.
    అట్టి మహాపురుషులను గుర్తు చేసుకొనెడి అదృష్టము కలిగించిన మీకు ధన్యవాదములు. నమస్కారములు. భగవంతుడు మీకు మేలు కలిగిస్తుండుగాక.
    - సాంబశివరావు, భాగవతగణనాధ్యాయి

    ReplyDelete
  9. Bangaaru thalli, saakshaath Saraswathy gonthulo koorchoni paa1dinattundi. My heartful blessings to the little girl.

    ReplyDelete
  10. నమస్కారం,
    నేను ఈ రోజు అనుకోకుండా మీ బ్లాగు చదవటం జరిగింది. మీలో చాల మంది విశ్వనాధ వారి రచనల కోసం ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది.
    మీరు 9885400751/9885400752/9885400753 నెంబర్ కు ఫోన్ చేస్తే సత్యనారాయణ గారి మనుమడు సత్యనారాయణ, మీకు పుస్తకాలను అందించాగలడు.

    ReplyDelete
  11. కుమారశర్మగారు, మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు

    ReplyDelete
  12. లవ్లీ పోస్ట్. నేను నిజంగా ఈ పఠనం ఆస్వాదించాను.

    ReplyDelete