తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, September 23, 2010

ఆదిన్ శ్రీసతి కొప్పుపై...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!

పోతన భాగవతంలో వామనావతార ఘట్టం తెలియని వాళ్ళు అరుదు. ఇందులో చాలా ప్రసిద్ధమైన పద్యాలే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. దానమియ్యవద్దని బోధించిన శుక్రాచార్యునితో బలిచక్రవర్తి అంటున్న మాటలు. వచ్చినవాడు వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువని శుక్రాచార్యుడు కనిపెట్టాడు. అదే బలిచక్రవర్తికి చెప్పాడు. నిజానికీ విషయం చూచాయగా బలిచక్రవర్తికి కూడా తెలిసింది. లేకుంటే, ఒక బాల వటువు తన యజ్ఞశాలకు వస్తే, "ఇయ్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్, గడు ధన్యాత్ముడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె, నా కోరికల్ గడతేఱెన్" అని అనడంలో ఔచిత్యమేముంది? అయితే ఆ జ్ఞానం పరిపూర్ణమవ్వలేదు. అందుకే వెంటనే, "వర చేలంబులొ, మాడలో, ఫలములో..." ఏవి కావాలంటే అవి కోరుకోమన్నాడు. సరే శుక్రాచార్యుడు చెప్పిన తర్వాత అతడు శ్రీమహావిష్ణువే అన్న ఎఱుక పూర్తిగా స్థిరపడింది. రాక్షసుడైనా, బలిచక్రవర్తి విష్ణు భక్తుడే! అతనికి తన తాత ప్రహ్లాదుని పోలికలే వచ్చాయి మరి. అటువంటి విష్ణుమూర్తి స్వయంగా తన దగ్గరకి వచ్చి దానం అడుగుతూంటే, అంత కన్నా అదృష్టం మరేముంది అనుకున్నాడు. ఎందుకు? ఎవరా విష్ణుమూర్తి? సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి పెనిమిటి. అంటే ప్రపంచంలోనున్న సర్వ సంపదలతో నిత్యభోగాన్ని అనుభవించే వాడు. మరొకళ్ళకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం తెలియనివాడు. ఆ వైభోగాన్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. భార్య అయిన లక్ష్మీదేవి కొప్పుపైన శరీరంపైన పైటకొంగుపైన పాదాలపైన బుగ్గలపైన పాలిండ్లపైన ఉండే చెయ్యి ఆయనది. అలా ఉండడం వల్ల ఆ చేయికి ఎప్పుడూ నూత్న మర్యాద కలుగుతుందట! ఇదొక వింత మాట! ఇక్కడ విష్ణువుని ఒక మామూలు పురుషుడిగా లక్ష్మీదేవిని మామూలు స్త్రీగా ఊహించుకొని, ఇక్కడ వర్ణించినది ఆ భార్యాభర్తల శృంగారాన్ని అనుకుంటే, ఈ "నూత్న మర్యాదన్ జెందు" అనే మాట పొసగదే! ఇది వట్టి సాంసారిక శృంగారమైతే, ఆ చేతికి కొత్త మర్యాద ఎక్కడనుండి వస్తుంది? రాదు. ఇక్కడ వర్ణించిన లక్ష్మీదేవి అంగాలన్నీ వివిధ రకాలైన సంపదలని మనం భావించాలి. అలాంటి సంపదలని లోకానికి ఎప్పుడూ దానం చేస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఆ చేతికొక కొత్త గౌరవం వస్తుందన్నమాట. అలా ఎప్పుడూ పైనే ఉండే చెయ్యి ఇప్పుడు కిందయ్యింది! తన చేయి ఆ చేతిపైన ఉంది. అంటే లోకానికి సమస్త సంపదలనీ అందించే విష్ణువుకి కూడా తాను ఇవ్వగలిగింది ఏదో ఉందన్న మాట. అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఏముంటుంది! ఇక రాజ్యం గీజ్యం ఉంటేనేం పోతేనేం. కాయము (శరీరం) ఎప్పటికైనా నశించేదే కదా. ఈ జ్ఞానం బలిచక్రవర్తిలో పరిపూర్ణంగా ఏర్పడింది.

మీరొక నాటకం వేస్తున్నారనుకుందాం. అందులో మీదొక చక్రవర్తి పాత్ర. అద్భుతంగా నటిస్తున్నారు. అందులో ఎంతగా నిమగ్నమైపోయారంటే, నిజంగానే మీరొక చక్రవర్తి అన్న భావం కలిగింది. దానిలో పూర్తిగా లీనమైపోయారు. కాని నాటకానికి ఒక కథ ఉంటుంది కదా. దానికి అనుగుణంగానే కదా పాత్రలు ప్రవర్తించాలి. మీరీ పాత్రలో లీనమైపోయి చేస్తూ ఉండడంతో నాటకం దారితప్పే సూచనలు కనిపించాయి. దాంతో డైరెక్టర్ లాభం లేదు, ఈ పాత్రని బయటకి రప్పించడం కన్నా మార్గం లేదనుకున్నాడు. కాని ఎలా? అందుకోసం తన స్క్రిప్టులో లేని ఒక పాత్రని హఠాత్తుగా సృష్టించాల్సి వచ్చింది. తనే మేకప్ వేసుకొని రంగస్థలమ్మీదకి అడుగుపెట్టాడు. ఆ వచ్చింది డైరెక్టరే అని మీరు గుర్తుపట్టారు. "అర్రే! నేను నాటకం వేస్తున్నాను కదూ" అని జ్ఞాపకం వచ్చింది. మీరు వేస్తున్న పాత్రని నాటకం నుంచి తప్పించాలి కదా. ఇప్పుడు నువ్వు నాటకంలో నే చెప్పినట్టు చేస్తే, ఈ ఏడాది నీకే ఉత్తమనటుడిగా బంగారునంది గ్యారెంటీ అని మీతో దర్శకుడు చెప్పేడు. చెయ్యాల్సింది ఏమిటంటే, ఆ రాజుగారి పాత్ర తన రాజ్యాన్ని వదిలేసి అరణ్యాలు పట్టుకొని పోవాలి. అప్పుడు మీరేం చేస్తారు? వచ్చింది స్వయానా డైరెక్టరాయె! మీకు ఉత్తమనటుడిగా నంది వచ్చే అవకాశం ఉందాయె. "ఓ, తప్పకుండా!" అనే కదా అంటారు. పక్కనున్న మంత్రి, "అదేంటి రాజా! నీ రాజ్యాన్నీ, సంపదనీ వదిలేసి అడవులకి పోతావా" అని నచ్చజెప్పబోయాడనుకోండి. మీరేంటంటారు? "ఓరి పిచ్చివాడా! ఇది నాటకంలో పాత్రరా. ఈ రాజ్యం గీజ్యం ఏమైనా శాశ్వతాలా. స్వయాన వచ్చి అడిగినవాడు డైరెక్టరు. కావలిస్తే నేనీ పాత్రలో చచ్చిపోడానికైనా రెడీనే!" అని అనరూ? సరిగ్గా బలిచక్రవర్తి కూడా అదే అన్నాడు.

"రాజ్యము గీజ్యము" అని ఒక అచ్చమైన తెలుగు కవే అనిపించగలడు. అంతకుముందే శుక్రాచార్యుడు బలికి హితబోధ చేస్తూ "కులుమున్ రాజ్యము దేజమున్ నిలుపు..." అన్న పద్యంలో "వలదీ దానము గీనమూ" అంటాడు. సరిగ్గా దానికి సమాధానంగా ఈ పద్యంలో "రాజ్యము గీజ్యమున్ సతతమే" అని బలి చేత అనిపించాడు పోతన. ఇదొక చక్కని వాక్శిల్పం.

నాకు చిన్నపటినుంచీ ఈ వామనావతారం కథ విన్నప్పుడల్లా ఒక్కటే అనుమానం. ఒక అడుగుతో భూమినీ మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసాడు వామనుడు. మరి మూడో అడుగు ఎక్కడ అంటే తన శిరస్సుపైన పెట్టమని బలి అంటాడు కదా. ఇక్కడే నాకు సందేహం. భూమీ ఆకాశాన్నీ మొత్తం ఆక్రమించేసాడు కదా. మరి బలిచక్రవర్తి శిరస్సు కూడా అందులో భాగమే కదా! మరి ఆ రెండడుగుల భాగంలో అతని శిరసు మాత్రం ఎందుకు లెక్కలోకి రాదు? దీని గురించి ఆలోచించగా ఆలోచించగా, ఈ మధ్యనే ఒక సమాధానం తట్టింది. శిరసు అంటే ఇక్కడ మనసుకి సంకేతం అయ్యుండాలి. ఈ "మనసు" అన్నది భూమ్యాకాశాల్లాగా భౌతిక పదార్థం కాదు. కాబట్టి అది వాటి లెక్కలోకి రాదు. మూడో అడుగుకి తన మనసునే అర్పించాడు బలి. అంతకన్నా కావలిసిందేముంది! బలిని పాతాళానికి అణగదొక్కడం అంటే, అతడిని అంతర్ముఖుణ్ణి చెయ్యడం. మనసంతా ఎప్పుడైతే శ్రీహరి ఆక్రమించుకున్నాడో, అతనికి సమస్తమైన ఆలోచనలూ బాహ్యమైన ప్రాపంచిక విషయాల వైపు కాక, తనలోని ఆత్మ వైపుకి ప్రయాణిస్తాయి. అలా మనసు తన ఆత్మలో కలిసిందంటే అది నిర్మలమైన జ్ఞానానికి చిహ్నం. పైగా ఆ శ్రీహరికి తన భక్తుడంటే ఎంత ఇష్టమో చూసారా! స్వయయంగా అతని దుర్గానికి తానే కాపలాదారుడిగా మారాడు. అంటే మరే ఇతర చింతనలు అతనిలోకి జొరబడకుండా తను కాపలా ఉన్నాడన్నమాట!
కాబట్టి, ఏదో దేవతల కోసం విష్ణువు బలిని అణిచేసి పాతాళానికి పంపేసాడు అనుకోవడం వట్టి తెలియనితనమే. బలి శ్రీహరి భక్తుడే అని, తన భక్తుడికి జ్ఞానాన్ని ప్రసాదించడానికే విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తాడనీ మనకి భాగవతం చదివితే స్పష్టంగా బోధపడుతుంది. బలిచక్రవర్తి గురించి ఆ విష్ణువే అన్న మాటలివి:

బద్ధుండై గురుశాపతప్తుడయి తా బంధువ్రజ త్యక్తుడై
సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యమున్ గరుణయున్ సొంపేమియున్ దప్ప డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుండితం డల్పుడే

30 comments:

  1. చాలా చాలా బాగుందండి.
    మనవాళ్ళు గొప్ప అలౌకికమైన భక్తి వైరాగ్య చింతనలోకూడా పరమలౌకిక వ్యవహారాల్ని భలే చక్కగా చొప్పించారు. ఈ సందర్భంలో దానమివ్వడం పుచ్చుకోవడం చెయ్యి పైనా కిందా అనే ఆలోచన బలి నోటిద్వారా చెప్పించారు. ఆముక్తమాల్యద మంగళకైశికిలో మాలదాసరి అంటాడు, అశాశ్వతమైన శరీరాన్ని ఇచ్చేసి (అమ్మేసి), శాశ్వతమైన ముక్తిని పొందడం (కొనుక్కోవడం) మేలుకాదా!

    ReplyDelete
  2. నిన్ననే ఈ పద్యమెందుకో గుర్తుకొచ్చింది. మా తెలుగు మాస్టారు ఈ పద్యాలన్నీ భలే చెప్పేవారు

    ~సూర్యుడు

    ReplyDelete
  3. చెప్పడం మర్చిపోయాను, మీరు చాలా బాగ వ్రాసారు, వీలైతే ఇంతింతై వటుదింతై గురించి కూడా వ్రాయగలరు.

    అన్నట్లు మూడో పాదాంలో ఎమైనా మార్పులుచేశారా?

    ~సూర్యుడు

    ReplyDelete
  4. కరంబు క్రిందై మీదై నా కరంబుంట అని ఉండాలనుకుంటా.

    ReplyDelete
  5. నాకు చాలా ఇష్టమైన పద్యం ఇది...ఆ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చి చెయ్యిసాచాడని బలిచేత ఎంత అందంగా పలికించారో పోతన్నగారు...మీ వ్యాఖ్యానం చాలా బాగుంది...ముఖ్యంగా మూడో అడుగుకి..ఇదే అనుమానం చిన్నప్పుడు నాన్న గారిని అడిగేవాణ్ణి..సరిగ్గా ఇలానే చెప్పేవారు నాన్న.."అక్కడ బలి తన అహంకారాన్ని తొక్కమన్నాడని"....

    నరసింహగారు,ఎనానిమస్ గారు...
    కామేశ్వరరావుగారు రాసింది కరక్టేనండీ..."కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట"

    ReplyDelete
  6. కామేశ్వరరావు గారూ
    ఈ క్రింది పోస్టునోసారి చూడగలరు.
    http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82

    ReplyDelete
  7. @ సూర్యుడు. భైరవభట్ల మాష్టారిని కాకాపట్టండి. దసరాలకి పద్య కవితా సమ్మేళనానికి అతిథిగా ఆహ్వానిస్తారేమో. ఇదిగో ముందే చెబుతున్నా, నా తప్పేం లేదు. :)

    ReplyDelete
  8. మూడో అడుగు అంతరార్థం, గరికపాటి వారు ఆముక్తమాల్యదలో చెప్పినట్టు చక్కగా వివరించారు.

    ఈ పద్యానికి చాలా యేళ్ళక్రితం కరుణశ్రీ గారు వ్యాఖ్యానం వ్రాశారు. అందులో సీక్వెన్సు - కొప్పు, తనువు, భుజాలు, పాదాలు, కపోలతటి - ఇలా ఓ వరుసలో లేకుండా ఉన్నవాటి వెనుక అర్థం చెప్పారు. మీకు తెలిస్తే వివరించండి.

    ReplyDelete
  9. Potana sahajakavi mahanubhvudu, akaranajanmudu. Padyam vivrana bagundi. Malli kottaga vinnanta vintala vundi. amarokati cheppandi

    ReplyDelete
  10. >> "రాజ్యము గీజ్యము"

    When you want to deride something, then you use this form

    నిందార్ధమునకు గిగీలగు!
    ex: పుచ్చు-గిచ్చు, రాముడు-గీముడు

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. కామేశ్వరరావుగారు,
    మంచి పద్యాన్ని గుర్తుచేసారు. నేను కూడా ఇదే ప్రశ్నని నాకుతెలిసిన వారినందరినీ అడిగితే ఒక్కొక్కరూ, ఒక్కొక్క విశేషాన్ని తెలియజేశారు. ఆ వివరాలు గుర్తుచేసుకుని త్వరలోనే బ్లాగుతా...


    రవీ !
    న్యాసం చేసేప్పుడు శిఖతో మొదలుపెట్టి, పాదాల వరకూ వెళ్ళి మళ్ళీ మూర్ధ్ని వరకూ రావటం ఉంటుంది కదా, దానికి సంకేతంగానే కాశీలో గంగతెచ్చి రామేశ్వరంలో అభిషేకంచేయాలనీ, ఆ తర్వాత రామేశ్వరం ఇసుకని తీసుకెళ్ళి విశ్వేశ్వరుడికి రాయాలని, అప్పుడే యాత్రా ఫలం దక్కుతుంది అని సంకేతం గా సూచించారని మా నాన్నగారు చిన్నప్పుడెప్పుడో చెప్పిన గుర్తు. దీనివెనుక భావం కూడా అదేనేమో, తెలీదు..

    ReplyDelete
  13. వ్యాఖ్యలు రాసిన అందరికీ నెనరులు.
    మూడవ పాదం సరిగానే ఉంది. వేరే ఏమైనా పాఠాంతరం ఉందేమో నాకు తెలియదు.
    కొత్తపాళీగారు, ఈ మాత్రం దానికి కాకాలు బాకాలు ఎందుకండీ! :-) అయినా ఎవరిని ఆహ్వానించాలన్న నిర్ణయం పొద్దువారిది, నాకు సంబంధం లేదు. నేను కేవలం ఉత్సహ విగ్రహాన్నే. :-)

    రవీ, కరుణశ్రీగారి వివరణ నాకు తెలియదు. ఎవరిదో తెలియదు కాని నేను విన్న ఒక వివరణ - శ్రీహరి లక్ష్మీదేవితో సరససల్లాపాలాడేటప్పుడు, శ్రీదేవికి అలక వచ్చి వెళ్ళబోతే, ముందు జడ పట్టుకున్నాడనీ, అది జారిపోతే పైట కొంగు, అదీ జారిపోయాక పాదాలమీద పడ్డాడనీ... ఇలా సాగుతుంది. నాకిది పెద్దగా నచ్చలేదు. ఇక్కడ ప్రత్యేకించి లక్షీనారాయణుల శృంగారాన్ని వర్ణించాల్సిన అవసరమూ ఔచిత్యమూ లేదు కదా! అంచేత విష్ణువు వైభవాన్ని విపులంగా వర్ణించడానికే ఆ రెండు పాదాలు అని నేను భావిస్తున్నాను. ఇక్కడ సనత్ గారు చెప్పిన వివరణ కూడా నాకు పెద్దగా అవసరమనిపించడం లేదు.

    Wit Realగారూ, అవును తెలుగులో ఉన్న ప్రత్యేక పలుకుబడి ఇది. దీన్నే పింగళివారు మాయాబజార్ లో "తల్పం" "గిల్పం", "కంబళి", "గింబళి" అని తమాషాగా వాడుకున్నారు! ఇక్కడ నేను వాక్శిల్పం అని చెప్పింది ఇలా "రాజ్యం గీజ్యం" అనడం కాదు. శుక్రాచార్యుడు "దానము గీనము" అని దానాన్ని తేలికచేసి రాజ్యాన్ని కాపాడుకొమ్మని అంటే, అతనికి సమాధానమిస్తూ బలి "రాజ్యము గీజ్యము" అని అలాగే రాజ్యాన్ని తేలిక చెయ్యడం.

    ReplyDelete
  14. కామేశ్వర రావు గారు: ఇదే. మీరన్న వివరణే నేను చదివాను. ఆంధ్రప్రభలో ఈ శీర్షిక వచ్చేది. అయితే ఈ వివరణ, సనత్ చెప్పిన విషయమూ ఇక్కడ పొసగట్లేదు, మీరన్నట్లు.

    ReplyDelete
  15. @ రవి
    బాబూ రావీ!
    "గరికపాటి వారు ఆముక్తమాల్యదలో చెప్పినట్టు"
    ఇట్లాంటి స్టేట్మెంట్లు రాసేముందు కొంచెం జాగ్రత్త. తరవాత వచ్చి చదివే మహానుభావులు గరికపాటివారే ఆముక్తమాల్యద రాశారని రేపణ్ణించీ ప్రచారం మొదలెడతారు!!

    @ కామేశ్వర్రావు - పాపం సూర్యుడు గారు గత రెండు మూడేళ్ళుగా కవిసమ్మేళనం ప్రత్యక్ష సభలో పాల్గొనాలని ఉబలాట పడుతున్నారు. అంచేత మీ సభలో కవులే కాకుండ అతిథుల్ని ఆహ్వానించే వీలుంటే ఆయనని తప్పక పిలవండి.

    ReplyDelete
  16. కొత్తపాళీ గారు, మీ సిఫారసుకి ధన్యవాదాలు :-)

    గత రెండు సంవత్సరాలుగా కవి సమ్మేళనం ప్రత్యక్షంగా చూద్దామనుకుంటున్నది నిజమే.

    కామేశ్వరరావు గారు, :-(

    ~సూర్యుడు

    ReplyDelete
  17. కామేశ్వర రావు గారికి మీ సాహితీ సదస్యులకు నమస్కారములు.
    కంజజుఁ డమరులు వేడగ
    కంజాక్షుఁడు కుబ్జు డయ్యెఁ గడిమిని బలికిన్
    ముంజేయి ముందు జాచెను
    కుంజర యూధంబు .........

    పోతన వామనావతార ఘట్టము ఓ అపూర్వ సాహిత్య కళా ఖండము. ప్రహ్లాద చరిత్ర,గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము ఒక ఎత్తు. వామనావతార పద్యాలొక ఎత్తు. ఆ పద్యాలు చదువుకొనేటప్పుడు తెలుగు వాడిగా జన్మనెత్తి ఆ పద్యాలతో అనుబంధము ఏర్పడడము ఒక అదృష్టముగా తలుస్తాను. మీ వ్యాసము,పరిశీలన చాలా అందంగా ఉన్నాయి.ధన్యవాదములు.

    ReplyDelete
  18. అద్భుతమైన సాహిత్య వ్యాసాలతో అలరించే నైపుణ్యమున్న మీరు వ్రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది అని అంటే సూర్యుఁడు భలే కాంతివంతంగా ఉంన్నాఁడు అనడమే ఔతుందనిపిస్తోంది. ఏది యేమైనా మంచి విషయంతో హృదయాన్ని స్పందింప చేసిన మీకు ధన్యవాదములు.

    ReplyDelete
  19. కామేశ్వర రావు గారు
    ,
    ఆదిన్ శ్రీసతి కొప్పుపై పద్యం లొ ఆదిన్ శబ్దానికి మొదటగ అనె అర్ధం తీసుకొవదంతొ మనం తోవ మారిపోయాము. అందుకె మనకు నూత్నమర్యాద అన్వయం కలవటం లేదు. ఆదిన్ అనే మాట వ్యర్ధంగా పోతన వాడడు. అక్కడ మనం ఆదిన్ అన్నదనికి ఆదివరాహవతారని చెప్పుకుంటె నూత్నమరియాద కూడ సరి పోతుంది. ఎమంటె వరాహవతరంలొ శ్రీహరి భూమిని ఉద్ధరించదం కుడా చేసేడు. భూమి నీటిలొ మునిగి ఉందికడా అప్పటికి. హిరణ్యాఖ్యుడుని చంపేడు. నీటినుంచి ఒక స్త్రీని కాపాడే విధానం పొతన ఈ పద్యం లొ చెప్పేడు. ఆభూమిని నీటినుంచి ఉద్ధరించిన చేయి కనక దానిని అంత పొగిడాడు. ఈసారి నూత్న మర్యాద సరిపోతుంది చూడండి.మరియాద అనగా రీతి, గౌరవం,
    పొకడ అనె అర్ధాలున్నాయికదా. నేను బ్లాగ్ కి కొత్త. తెలుగు రాయడం కష్టంగా ఉంది. చెప్పాలని ఉంది మనసు విప్పాలనిఉంది..కాని రాయడం.....

    ReplyDelete
  20. నాకు బ్లాగు కొత్త. ఈ యన్త్రము పై తెలుగు రాయడము కొత్త.రాయగలిగిన పదాలకొరకు ప్రయత్నము. రె౦డవ ప్రయత్నము ఇది. తప్పులన్ని నావె....................
    ఆదిన్ శ్రీ సతి కొప్పు పై జరుగుతున్న చర్చ కొన సాగుతున్నది............

    నీరున్న గ్రామాల దగ్గర ప్రమా దాలు సహజము. స్త్రీ ని కాపాడటము కొరకు దిగి న వారికి స్త్రీ జుత్తు దొరుకుతు౦ది. ఎ౦దుకనగా జుత్తు నీట పై తెలుతు౦ది. ము౦దు దానిని పట్టాలి.రె౦డవ చెయితొ తరువాత శరీరము పట్టాలి, పమిట ను౦చి వెనుకగా చెయి వెసి పట్టాలి. మొదటత చెతిని మెడకి౦ద చెర్చి,రె౦డ . కి౦ద పడ్కొనబెట్టగ, ముఖము తుడచి పాలి౦డ్ల పై బట్ట సరిచెస్తారు. పద్య క్రమము సరిపడలా ? పొతన శ్రీసతిని కూడ స్త్రీగా భావి౦చి నీటీ ను౦చి శ్రీహరి కాపాడటముగా భావి౦చారు. శ్రీహరి భూమిని కాపాడీ తన చయి తొ సరిపరచి నివాస యొగ్యము చెసె కదా.
    బలికి రె౦డవ తా రాలు తెలుసు. అ౦త ఘనకార్యము జరిగి౦చిన చెయి కనుక ఆ చెయి కి నూత్న మరియాద సరిపడవ లె కదా ?(స్వగతమ్. పదాలు ఎన్నుకొట ము లొ భావము పొతొ౦ది. చాల బాధగా ఉ౦ది). రాజ్యము గీజ్యము అని గురువుని కసరుకున్నాడని అనవద్దా? ( ఇ౦కారాయలని ఉ౦ది.) తరవాత మరొక పదము ము౦దుకీ పొయి రాజ్యము శాశ్వతమా అని కూడా అన్నారు పెరు ఉ౦దా అన్నారు.

    ReplyDelete
  21. నాకు బ్లాగు కొత్త. ఈ యన్త్రము పై తెలుగు రాయడము కొత్త.రాయగలిగిన పదాలకొరకు ప్రయత్నము. రె౦డవ ప్రయత్నము ఇది. తప్పులన్ని నావె....................
    ఆదిన్ శ్రీ సతి కొప్పు పై జరుగుతున్న చర్చ కొన సాగుతున్నది............

    నీరున్న గ్రామాల దగ్గర ప్రమా దాలు సహజము. స్త్రీ ని కాపాడటము కొరకు దిగి న వారికి స్త్రీ జుత్తు దొరుకుతు౦ది. ఎ౦దుకనగా జుత్తు నీట పై తెలుతు౦ది. ము౦దు దానిని పట్టాలి.రె౦డవ చెయితొ తరువాత శరీరము పట్టాలి, పమిట ను౦చి వెనుకగా చెయి వెసి పట్టాలి. మొదటత చెతిని మెడకి౦ద చెర్చి,రె౦డవ చెయి కాళ్ళ కిన్ద చెర్చి . కి౦ద పడ్కొనబెట్టగ, ముఖము తుడచి పాలి౦డ్ల పై బట్ట సరిచెస్తారు. పద్య క్రమము సరిపడలా ? పొతన శ్రీసతిని కూడ స్త్రీగా భావి౦చి నీటీ ను౦చి శ్రీహరి కాపాడటముగా భావి౦చారు. శ్రీహరి భూమిని కాపాడీ తన చయి తొ సరిపరచి నివాస యొగ్యము చెసె కదా.
    బలికి రె౦డవ తా రాలు తెలుసు. అ౦త ఘనకార్యము జరిగి౦చిన చెయి కనుక ఆ చెయి కి నూత్న మరియాద సరిపడవ లె కదా ?(స్వగతమ్. పదాలు ఎన్నుకొట ము లొ భావము పొతొ౦ది. చాల బాధగా ఉ౦ది). రాజ్యము గీజ్యము అని గురువుని కసరుకున్నాడని అనవద్దా? ( ఇ౦కారాయలని ఉ౦ది.) తరవాత మరొక పదము ము౦దుకీ పొయి రాజ్యము శాశ్వతమా అని కూడా అన్నారు పెరు ఉ౦దా అన్నారు.

    ReplyDelete
  22. If all you permit mi I shall write the message in english. Please permit. I am unable to type in telugu that is the problem. Acquainting telugu typing on computer for the past two days I have tried to write in telugu.

    ReplyDelete
  23. గన్నవరపుగారు, రామకృష్ణగారు, భాస్కరశర్మగారు, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
    గన్నవరపుగారూ, పద్యం బాగుంది.

    భాస్కరశర్మగారూ, పద్యాన్ని గురించి మీరిచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది కాని నాకది సంతృప్తిగా లేదు. "శ్రీసతి" అని స్పష్టంగా చెప్పినప్పుడు అది లక్ష్మీ దేవి అవుతుంది కాని భూదేవి ఎలా అవుతుంది? "ఆదిన్" అంటే "మొదటగా", "ఇంతకు ముందు" అనే అర్థాన్ని ఇస్తుంది. ఇంతకుముందు అలాంటి వైభవం చూసిన చేయి ఇప్పుడు కిందై నా దానాన్ని కోరింది అన్న అర్థం కోసం "ఆదిన్" పదం అవసరమే కదా. అలాగే ఆ చేయి ఇప్పుడు చేస్తున్న పని దానాన్ని వేడడం కాబట్టి ఇంతకుముందు ఆ చేయికున్న వైభవం, సంపద వర్ణిస్తే సారస్యమవుతుంది కాని, ఆత్రత్రాణ పరాయణత్వాన్ని వర్ణిస్తే అంత సందర్భోచితంగా ఉండదు కదా.

    ReplyDelete
  24. ఈ వ్యాసం ఇప్పటికి ఇది మూడోసారి చదవడం. చదువుతున్నంతసేపూ ఏదో లోకంలో అంటే హైస్కూల్ డేస్ లోకి తీసుకెళ్ళి మా తెలుగు క్లాసులో కూర్చోపెట్టారు. ఈ "ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై" పద్యం మాకు ఎనిమిదిలోనో తొమ్మిదిలోనో వున్న గుర్తు. చక్కగా వివరించారండి.

    ReplyDelete
  25. కామేశ్వరరావు గారు
    చూసాను బ్లాగు
    అమ్మ తిట్టింది. నిజం. ౭౦ సంవత్సరాలనుంచి మాత్లాడుతున్న భాష లో ఈ యంత్రం లో రాయలేక నీ తప్పు కప్పి పుచ్చుకుని పరభాష లో రాస్తానంటావా. నీ మనుమరాలు ౪ ఏళ్ళది రోజూ పద్యం చెప్పమంటూఉందికదా. నీ ప్రయత్నం లేదు అంది. అంతే సిగ్గు పడ్డాను.దగ్గు రొంప వేధిస్తున్నా లెక్క చేయక ౩ గంటలు కుస్తీ పట్టాను. తప్పులు లేకుండా రాయడం నేర్చేసుకున్నాను. మీకు ధన్యవాదాలు. రామయణం లో పిడకలవేట ( పిఠకాల వేట ) ఏంటి అనుకోవద్దు.వేగంగా కూడా రాస్తున్నాను. కొత్తగా నేర్చుకున్నది కనక మీకు ఇంతగా చెప్పేను.
    నేను రాసినది కాదన్నారు మరి అన్వయం సరిపెడతారని అనుకుంటున్నాను.

    ReplyDelete
  26. భా.రా.రె.గారూ, నెనరులు.

    భాస్కరశర్మగారూ,
    చాలా సంతోషమండి. మీ పట్టుదలకి నా నమస్సులు. నా బ్లాగువల్ల మీరు కంప్యూటరులో తెలుగు రాయడం నేర్చుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాలని ఇలాగే తెలుపుతూ ఉండండి. అన్వయానికేముంది, ఒకోరికి ఒకో రకమైన స్ఫురణ కలుగుతుంది. అందరూ అన్నిటితో అంగీకరించాలని లేదు. ఒక కొత్త దృక్కోణాన్ని తెలుసుకోడమూ, కొత్త ఆలోచనలని రేకెత్తించడమూ - అదే ముఖ్యం.

    ReplyDelete
  27. కామేశ్వర రావు గారు
    మీ ప్రత్యుత్తరం చూసాను. నాకు రామాయణ, భారత,భాగవతాల పై విషయం తెలుసుకోవాలనే తపన తప్ప మరొకటికాదు. నేను చెప్పిన అన్వయం ఎవరో పెద్దలు చెప్పగా విన్నదే. అదే మీకూ చెప్పేను. అందరికీ అన్ని విషయాలు నచ్చాలని లేది కదా. మరియొక సారి ధన్యవాదాలు.

    ReplyDelete
  28. బలిని బలిజేయ వామనుడవతరించెననెడి అపప్రధను ఖండిచి, బలి పై అవ్యాజమయిన ప్రేమ తోడనే, బలిని బ్రోవగనే అవతరించెనని చెప్పుట బహు లెస్సగానున్నది.

    జ్యోతిష్యపరముగా, గురువు (జూపిటర్) వామనుడిని సూచిస్తాడు.
    గురువు వివేకము, జ్ఞానములను కలిగిస్తాడు. అందుచేత, వామనుడు జ్ఞాన ప్రతీక మరియు జ్ఞాన వైరాగ్నములనుపదేసించగా అవతరించాడనుట కడు సమర్థనీయము.

    ReplyDelete
  29. కారే రాజులు, రాజ్యముల్‌ కల్గవే, గర్వోన్నతిన్‌ చెందరే, వారేరీ? ఇదికూడ పోతన భాగవతంలోదే ననుకుంటానూ - subject to correction.

    ReplyDelete
  30. శ్రీసతి అంటే లక్ష్మీదేవే. ఆమెతో సరసాలు ఆడిన చేయి కిందై నా చేయి పై నవడమే నాకు గొప్ప కదా, అంతకు మించిన గొప్పతనం రాజ్యంలో వుందా, రాజ్యమూ, గీజ్యమూ సతతమా, కీర్తి, ప్రత్యేకించి నైతిక విజయం గొప్ప కదా కనుక నేను మాట తప్పను అని బలి భళీఅనిపించుకొనేలా అంటాడన్నమాట.

    ReplyDelete