తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, September 1, 2010

గ్లోబల్ దేవుడు గోవిందుడే!


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :-) తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! కాబట్టి మన "గ్లోబల్" దేవునిగా కృష్ణయ్యనే నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను. ఈ రోజతని పుట్టినరోజు సందర్భంగా బ్లాఙ్ముఖంగా ఆ "దేవదేవునికి" (చూసారా దేవుళ్ళకే దేవుడాయన!) జన్మదిన శుభాకాంక్షలతో పాటు "గ్లోబల్" దేవునిగా ఎన్నికైనందుకు నా అభినందనలని కూడా అందిస్తున్నాను.

అలనాడు ధర్మరాజు రాజులలో మాత్రమే అగ్రస్థానాన్నిచ్చి శ్రీకృష్ణుణ్ణి గౌరవించాడు. ఇప్పుడు నేనతనికి దేవుళ్ళందరిలోనూ కూడా అగ్రేసరస్థానాన్ని ఇచ్చి గౌరవించానంటే, నేనింకెంత ధర్మాత్ముణ్ణో అందరూ గ్రహించగలరు, నేను మళ్ళీ దాన్ని నొక్కి వక్కాణించనక్కరలేదు. పైగా ధర్మరాజు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు "బంధుప్రీతి" స్కాండల్ లేవదీసే అవకాశం లేకపోలేదు. నాకదీ లేదు. నేను కృష్ణుడి రెలెటివ్నీ కాను, నాకు ప్రతిపక్షమూ లేదు. అయినా నా తృప్తి కోసం, శ్రీకృష్ణుడు ఈ పదవికి ఎంచేత అర్హుడో ఇప్పుడు వివరిస్తాను. ఇదంతా చదివిన తర్వాత కూడా మీరు నాతో ఒప్పుకొని తల ఊపకపోతే, అలనాడు శిశుపాలుని తలకి ఏం గతి పట్టిందో తెలుసు కదా! ఆ తర్వాత నా పూచీలేదు.

శ్రీకృష్ణుడంటే చిన్నపిల్లల నుంచీ ముసలివాళ్ళ దాకా అందరికీ ఎంతో మురిపెం!

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు, పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి గొలుతు

అంటూ ఆ చిన్ని కన్నయ్యని తమ ముద్దు ముద్దు పలుకులతో కొలుస్తారు మన సిసలైన తెలుగింటి పిల్ల భక్తులు. చిన్నపిల్లల సంగతి ఇలా ఉంటే, ఆ పండు ముదుసలి భీష్ముడు శ్రీకృష్ణదేవుని రూపాన్ని, అదీను తనని చంపడానికి వస్తున్న వాడిని ఎంత భక్తి తన్మయతతో దర్శించాడో చూడండి!

కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి
గగనభాగంబెల్ల గప్పికొనగ
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు

ఇలా జాతి, లింగ, వయో భేదాలు లేకుండా ఎందరెందరో భక్తులు శ్రీకృష్ణుని ఆరాధించారు. మరొక విశేషం ఒకటి చెప్పనా. అసలీ ప్రపంచంలో ఎన్ని రకాల భక్తి మార్గాలుండవచ్చో అన్ని మార్గాల్లోనూ కృష్ణుడికి భక్తులున్నారు. ఇల్లాంటి ప్రత్ర్యేకత, నాకు తెలిసి, మన దేవుళ్ళకే కాదు అసలీ భూప్రపంచంలో ఉన్న ఏ దేవుడికీ లేదు!

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి మెట్లైన ను
ద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరి జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

శత్రుత్వంతో కూడా భక్తులవ్వడం ఎంత చోద్యమో చూడండి! భావంలో ఏకాగ్రత ఉంటే అది ఏ భావమైనా సరే యోగంలాంటిదే అని నారదులవారు ధర్మరాజుకి చెపుతున్న మాటలివి. కడపున పుట్టకపోయినా కన్న ప్రేమకి పరాకాష్ఠ అనిపించే యశోద వాత్సల్య భక్తి మొదలుకొని ఎందరెందరో భక్తులు చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆ స్వామిని కొలిచి తరించలేదూ! ఇక్కడ మీకొక అనుమానం రావచ్చు. రాముడిపై కౌసల్యకి ఉన్నది మాత్రం వాత్సల్య భక్తి కాదా అని. నా ఉద్దేశంలో కాదు. అది వాత్సల్యమే కాని అందులో భక్తి ఉందని చెప్పలేం. కృష్ణుడైతే "చంటి పాప"గా ఉన్న నాటినుండీ ఎన్నెన్నో సాహసాలని చేసి చూపించి తన దైవత్వాన్ని చాటుకున్నాడు. అంచేత యశోదకి కృష్ణుడు దైవమే అన్న స్పృహ తన అంతరాంతరాల్లోనైనా ఉండి ఉండాలి. పైగా తన నోరు తెఱచి విశ్వాన్నంతటినీ చూపించాడు కూడా కదా! "కలయో వైష్ణవ మయయో యితర సంకల్పార్థమో" అంటూ ఆశ్చర్యపడిన యశోద చివరకి,

నా మగడు నేను గోవులు
నీ మందయు గోపజనులు నిబ్బాలుని నె
మ్మోమున నున్న విధము గని
యేమఱితిమి గాని యీశు డీతడు మాకున్

అని నిశ్చయానికి కూడా వచ్చింది కదా. అంచేత యశోదకి ఒక పక్క తల్లిగా వాత్సల్యంతో పాటు మరో వంక పరమాత్ముడన్న భక్తిభావం అంతరాత్మలో నిండి ఉండే ఉంటుంది.

మరొక వింతైన భక్తురాలు కుంతీదేవి. ఆమె స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త. ఆమె జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించిందని! అన్ని కష్టాలామె ఓర్చుకున్నదంటే, అది ఆమెకి కృష్ణుడిపైనున్న అచంచల భక్తి విశ్వాసాల కారణంగానే. ఇది చాలామంది గ్రహించని విషయం. పోతన్నలాంటి భక్త కవులే దీన్ని తెలుసుకున్నారు. కుంతి శ్రీకృష్ణుడిని కోరినది ఇది:

యాదవులందు పాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడి గంగ భంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి న
త్యాదరవృత్తితో గదియునట్లుగ జేయగదయ్య యీశ్వరా!

తన బంధువులైన యాదవులపైనా, తన కుమారులైన పాండవులపైనా కూడా తనకున్న మోహాన్ని త్రుంచెయ్యమని కోరిందా మహా భక్తురాలు.

సరే అర్జునుడి సఖ్య భక్తి అందరికీ తెలిసినదే. తన సఖుడు, ఆత్మబంధువు, తండ్రంతటివాడు, దిక్కు, దైవం అన్నీ ఆ శ్రీకృష్ణ భగవానుడే. ఇలాంటి సఖుడే కృష్ణుడికి మరొకడున్నాడు. అతని గురించి చాలామందికి తెలీదు. అతని పేరు ఉద్ధవుడు. మన భాషలో చెప్పాలంటే అతను శ్రీకృష్ణుడికి "Thickest Friend" అన్నమాట! ఎంతటి గాఢస్నేహం కాకపోతే గోపికల దగ్గరకి తన ప్రణయసందేశాన్ని అందించడానికి ఇతణ్ణి దూతగా పంపిస్తాడా గోపీమనోహరుడు! అప్పుడా గోపికలు ఉద్ధవుణ్ణి ఏమడుగుతారో తెలుసా!

ఏకాంతంబున నీదు పైనొరగి తానేమేని భాషించుచో
మా కాంతుండు వచించునే రవిసుతామధ్యప్రదేశంబునన్
రాకాచంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడ నం
గీకారంబొనరించి బంధనిహతిన్ గ్రీడించు విన్నాణముల్

ఏకాంతంలో మీరిద్దరూ దగ్గరగా కూర్చొని కబుర్లాడుకొనేటప్పుడు, యమునానదిలో వెన్నెల రాత్రుళ్ళు మాతో జరిపిన రాసలీలా వినోదాల విశేషాలని నీకు చెప్పాడా? అని అడుగుతున్నారు. అంటే ఆ ఉద్ధవునికి శ్రీకృష్ణుడి దగ్గర ఎంత చనవో మనం ఊహించుకోవచ్చు! అంతటి దగ్గరవాడు కాబట్టే, అతనికి కూడా అర్జునుడిలాగానే ప్రత్యేకంగా గీతా బోధ చేసాడు!

ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కృష్ణభక్తుల పట్టికకి అంతమే ఉండదు! కురూపి అయిన కుబ్జ, పరమ దారిద్ర్య పీడితుడు కుచేలుడు, భాగవతోత్తముడైన విదురుడు ఇలా ఎందరెందరో ఆ కృష్ణయ్య కరుణాకటాక్షానికి నోచుకున్న భక్తులు మనకి అడుగడుగునా భాగవతంలో కనిపిస్తారు! అందరికన్నా విశిష్టమైన భక్తి గోపికలది. అల్లాంటి భక్తులు మరే దేవునికి ఉన్నారు చెప్పండి! శృంగారాన్ని ఒక భక్తిసాధనంగా చూపించిన ఘనత ఒక్క గోపీరమారమణుడికే దక్కుతుంది. అంతశ్శత్రువులలో మొదటిదైన కామాన్ని భక్తియోగంగా మార్చి, శత్రువుని చంపనవసరం లేదు మార్చగలిస్తే చాలనే గొప్ప సత్యాన్ని నిరూపించినవాడు ఆ లీలామానుషస్వరూపుడే. ఆ గోపికల భక్తి తీవ్రత, అందులోని ఏకాగ్రత ఎలాంటిదంటే,

ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కితీగెలం
జిక్కగబట్టి, హృద్గతముజేసి, వెలిం జనకుండ నేత్రముల్
గ్రక్కున మూసి మేన వులకంబులు గ్రమ్మగ కౌగిలించుచున్
చొక్కములైన లోచవుల జొక్కుచునుండెను యోగికైవడిన్

ఒక గోపిక ఆ మాధవుని ఉజ్జ్వల రూపాన్ని తన చూపులనే తీగలతో కట్టేసి, హృదయంలో పొదువుకుని, మళ్ళీ బయటకి పోకుండా కన్నులు మూసేసుకొని, తన శరీరంపై పులకలు వచ్చేట్టు కౌగిలిలో అతన్ని బంధించి, స్వచ్ఛమైన లోపలి కాంతులతో పరవశించిపోతోందిట - ఒక యోగిలాగా! ఇది మధురభక్తి వర్ణనల్లోకెల్లా మకుటాయమైన పద్యం! ఇందులో శృంగారం ఉంది, భక్తి ఉంది, యోగం ఉంది! ఆ మూడూ గోపిలలో ఎలా కలగలిసిపోయేయో ఆ చిత్రం ఉంది.

భక్తి మార్గాల్లో ఇంత వెరైటీ, వేరియేషను చూపించిన కృష్ణపరమాత్ముడు కాక, "గ్లోబల్" దేవుని పదవికి ఇంకెవరు అర్హులు చెప్పండి? సరే మరొక పాయింటు చెప్తాను. కృష్ణుడిలా అన్నిమార్లు, అందరిమందికి "గ్లోబల్"రూపాన్ని, అదే "విశ్వ"రూపాన్ని చూపించిన దేవుడు ఇంకెవరైనా ఉన్నాడా?

సరే, ఇలా ఏకరువు పెడుతూ పోతే ఆ నల్లనయ్యకున్న ప్రత్యేకతలకీ, విశేషాలకీ కరువే లేదు. భాగవతం, మహాభారతం, హరివంశం ఎన్నెన్ని పురాణాలు కావలసి వచ్చాయి అతని లీలా విశేషాలని వర్ణించడానికి! ఇంకొక్క విశేషం మాత్రం చెప్పి నా వివరణని ముగిస్తాను.

పూర్వమెప్పుడో మొత్తం భూప్రపంచానికంతటికీ ఒక పెద్ద సమస్య వచ్చిందట, అంటే "global problem" అన్న మాట! భూమినుంచి విడిపోయిన ఒక పెద్ద గోళం (meteorite అనుకోండి), gravitational forcesలో వచ్చిన ఏవో తేడాల వల్ల, మళ్ళీ భూమ్మీదకి దూసుకువచ్చిందట. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ గోళాన్ని తన చక్రంతో తునాతునకలు చేసి భూమిని రక్షించాడట. ఆ కథాకమామీషు మరోసారి తీరిగ్గా ముచ్చటించుకుందాం. అలాంటి గ్లోబల్ సమస్యని తీర్చిన దేవుడే కదా గ్లోబల్ దేవుని పదవికి అర్హుడు.

అందుకే అంటున్నాను, గ్లోబల్ దేవుడు గోవిందుడే!

విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింప దలచి విష్ణుడవనగా
విశ్వము జెఱుపను హరుడవు
విశ్వాత్మక! నీవెయగుచు వెలయుదు కృష్ణా!

10 comments:

  1. గ్లోబల్ దేవుడు గోవిందుడే! నిజమేకదా! అందుకేగా శిరోముండనం చేయించుకుని,శిఖతో ,భారతీయ వస్త్రధారణతో హరేకృష్ణంటూ పరవశించిపోతూ ఆనందంతో నాట్యం చేస్తున్నారు విదేశీయులంతా కూడా.
    మీకు,మీకుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. చాలాకాలం తర్వాత మీ టపా వచ్చినా చాలా హృద్యంగా ఉన్నది.
    మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంతకీ స్వదేశాగమనమయ్యిందా?

    ReplyDelete
  3. మీ టపా ప్రేరణతో:

    కజ్జలమేనివాఁడు చిరుగజ్జెలు ఘల్లున మ్రోగుచుండగన్
    అజ్జగ మీదు గేహమునఁ యల్లన కాలిడి మెల్లమెల్లగా
    మజ్జిగ వెన్న జున్నులను మక్కువ మెక్కియు తృప్తిమీరఁగా
    గొజ్జగి సౌరభంబు వలెఁ గూర్మిని గావుత మిమ్మునెల్లెడల్.

    కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. విజయకుమార్ గారూ, మీకూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
    కొత్తపాళీగారు, Yo! Yo! :-)
    సనత్ గారూ, మీకూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వచ్చేసానండీ.
    రవీ, మీ "పజ్జెము" చాలా బాగుంది. :-) కాకపోతే మా యింట్లో మజ్జిగ, వెన్న, జున్ను ఈ మూడూ లేవు :-( ఏదో కుచేలుడిలా అటుకులు సమర్పయామి అన్నాం.

    బాలమురళీకృష్ణ గళంలో కృష్ణుడి గురించి ఒక మంచి పాట కనిపించింది!

    http://www.youtube.com/watch?v=eUYeF9C1llYfeature=related

    ReplyDelete
  5. ఆహా జుఱ్ఱుకున్నాను

    ReplyDelete
  6. >"వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే చేస్తారు".
    *అందుకేనేమో "గోల గోవిందుడిది,అనుభవం వెంకటేశ్వరుడిది" అనే సామెత ప్రజలు పుట్టించారు.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. chaala baaga rasarandi.. inni manchi padyaalu maa mundunchinanduku thanks..

    ReplyDelete
  9. ఆనందం ఆనందం బ్రహ్మానందం

    ReplyDelete