ఈ మధ్యనేదో కప్పలపెళ్ళి హవా వీస్తున్నట్టుంది! శంకరయ్యగారు "కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్" అన్న సమస్యనిచ్చారివాళ. మొన్నటికి మొన్న పొద్దులో గిరిగారు "శాపగ్రస్త మండూకము" అని పద్యాలలో ఏకంగా ఒక ఖండకావ్యాన్నే వ్రాసేసారు! సరే నేను మాత్రం తక్కూ తిన్నానా. కప్పలపెళ్ళి కథ ఒకటి నేనూ చెపుతాను. అబ్బే, నేను సొంతంగా రాసింది కాదు లెండి.
నీరప్రాంగణ కర్కటీబిలములన్ నిద్రింప, మృత్స్నామయా
హారంబుం గబళింప, బెల్లఱవ, నిట్టట్టుం బ్లుతంబుల్ గొనన్,
దూరాయాస్య దహీంద్ర భీతిహతి గొందుల్‌దూఱ, గోఱున్ మదిన్
సారాపేతమనోబలంబగు భవిష్యద్భేక ముత్సేకమై
భవిష్యద్భేకము అంటే భవిష్యత్తులో కప్ప. భవిష్యత్తులో కప్పేంటి? అంటే ప్రస్తుతం కప్పకాదు, సమీప భవిష్యత్తులో కప్పగా మారబోతున్న ఒక మనిషి. ఒకడు కప్పగా మారబోతున్నాడు. ఇంకా మార లేదు. కాని అతని మనసులో కప్ప లక్షణాలు పొడసూపాయి. ఆ లక్షణాలీ పద్యంలో వర్ణించబడ్డాయి. నీళ్ళ దగ్గరలో, కర్కటీబిలములన్ - కర్కటీ అంటే పీతలు (సరీగా చెప్పాలంటే ఆడపీతలు). అవి చేసిన కన్నాలు కర్కటీ బిలములు. నీటి గుంటల పక్కన పీతలు చేసిన కన్నాల్లో నిద్రించాలని ఉరకలువేస్తోంది ఆ మనిషి మనసు. మృత్స్నా అంటే మంచి మన్ను. మంచిమన్నుని ఆహారంగా తినాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. బెకబెకా అరవాలని ఉంది. ఇటు అటూ గెంతులు వెయ్యాలని కూడా ఉంది. కప్పలకి పాములంటే భయం కదా, తమని మింగేస్తాయని. అంచేత దూరాస్యత్ + అహీంద్ర = దూరన్నుంచి వస్తున్న పాము, భీతి హతి = ఆ పాముని చూసిన భయంతో కన్నాల్లోకి దూఱిపోదామనుకుంటున్నాడు! మనిషిగా ఉండగానే అతని మనసులో ఇలా కప్ప లక్షణాలు పెరిగిపోయి, అతడు పూర్తిగా గుండెదిటవు కోల్పోయాడు.
ఇంతకీ ఎవడితను? ఎందుకు కప్పలా మారబోతున్నాడు? ఇది తెలుసుకోవాలంటే తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యం చదవాలి. అందులో "అయుత నియుతోపాఖ్యానం" అని ఒక కథ ఉంది. పాండురంగ మాహాత్మ్యం కావ్యమే కొన్ని కథల సమాహారం. అందులో ఇది చివరి కథ. అయుతుడు, నియుతుడు అని ఇద్దరు అన్నదమ్ములు అగస్త్యమహర్షి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. చాలా నిష్ఠగా చదువుకొనేవారు. అగస్త్యునికి వీళ్ళిద్దరూ బాగా అనుంగు శిష్యులయ్యారు.ఆ రోజుల్లో గురువులకి శిష్యుల మీద చాలా ప్రేమ అధికారం రెండూ ఉండేవి కాబోలు. తన ప్రియశిష్యులిద్దరికీ పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వీళ్ళకి అలాంటిలాంటి అమ్మాయిలు కాదని సరాసరి బ్రహ్మదేవుని కూతుళ్ళనే ఇచ్చి చెయ్యాలనుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరకి స్వయంగా వెళ్ళి అడిగాడు. మరి మగపెళ్ళివారే ఆడపెళ్ళివాళ్ళ దగ్గరకి వెళ్ళి అడగడం ఆచారం. బ్రహ్మగారు అంతకన్నానా అని, సావిత్రి గాయత్రి అనే తన కూతుళ్ళని ఇద్దరినీ అగస్త్యుని వెంట పంపిస్తాడు. ఆ పెళ్ళికూతుళ్ళను వెంటపెట్టుకు వచ్చి, అగస్త్యుడు తన శిష్యులకి చూపించి వాళ్ళని పెళ్ళాడమంటాడు. నియుతుడు సరేనంటాడు కాని అయుతుడు ఒప్పుకోడు. నేను సంసార సాగరంలో మునగలేను స్వామీ నన్ను ఒదిలెయ్యండంటాడు. దానితో అగస్త్యునికి కోపం వచ్చి అయుతుణ్ణి తన ఆశ్రమం నుండి వెళ్ళగొట్టేస్తాడు. నియుతుడే ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటాడు. ఆశ్రమం నుండి బయటకి వచ్చేసిన అయుతుడు హిమాలయాలకి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. ముల్లోకాలు అతని తపశ్శక్తికి అల్లకల్లోలం అయిపోతాయి. లాభం లేదని ఇంద్రుడు అతని తపస్సుని భగ్నం చెయ్యడానికి బయలుదేరతాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అయుతుని దగ్గరకు వస్తాడు. తన పరివారం కొందరు శిష్యులుగా వెంట వస్తారు. కామధేనువుకూడా ఒక ముసలిఆవు రూపంలో వెంటవస్తుంది. సరే వచ్చిన అతిథులకి కూర్చోపెట్టి మర్యాదలు చేస్తాడు అయుతుడు. ఇంద్రుడు అయుతుని వివరాలు అడిగి, పెళ్ళిచేసుకోనని ప్రతిజ్ఞ పూని ఇలా తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని అతనికి గృహస్థాశ్రమంలోని గొప్పదనాన్ని బోధిస్తాడు. ఇంద్రుడెన్ని విధాలుగా చెప్పినా అయుతుడు అతనికి తిరుగు జవాబు చెపుతాడు కాని అతనితో అంగీకరించడు. దాంతో విసిగిపోయిన ఇంద్రుడు, సరే నీ ఖర్మ అని చెప్పి వెళిపోతాడు. ఎలా అయినా అతని తపస్సుని భగ్నం చెయ్యాలని, తనతో తెచ్చిన ఆవుని అక్కడే ఉంచేసి వెళిపోతాడు. అది బాగా నీరసించిపోయి జబ్బుచేసినదానిలా కదలలేకుండా పడుంటుంది. అలా ఉన్న ఆవు మీద అయుతునికి జాలి కలుగుతుంది. ఆ ఆవుని జాగ్రత్తగా సాకుతాడు. చాలా సేవ చేస్తాడు. ఆవు బాగా పుంజుకొని చక్కగా బలిష్టంగా తయారవుతుంది. కొన్ని దూడలని కూడా కంటుంది. ఇదంతా తలకెత్తుకొనే సరికి అతని తపస్సు గంగలో కలుస్తుంది! అప్పటికి అతనికి తెలివి వస్తుంది. చీ చీ ఈ లంపటంలో ఇఱుకున్నానేమిటని చెప్పి, ఆ ఆవుని అడవిలోకి తరిమేస్తాడు. దానితో ఆ గోవుకి కోపం వచ్చి వాధూలుడనే ముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆ ముని తపస్సుచేస్తూ ఉంటే అతని చుట్టూ ఏర్పడిన పుట్టని కాస్తా మట్టేసి పోతుంది. దానితో ఆ వాధూల ముని తపస్సు భగ్నమై, ఆ ఆవును తరుముకు వస్తున్న అయుతుణ్ణి చూసి, నా ఆశ్రమంలోకి ప్రవేశించి నా తపస్సుని భంగం చేస్తావా అని కోపంతో నువ్వు కప్పవైపోవు గాకా అని శపిస్తాడు. అయుతుడు అతని కాళ్ళపై పడి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు వాధూల మునికి అతనిపై కరుణ కలిగి, సరే భీమరథి నది ఒడ్డునున్న నరసింహస్వామిని పూజించు. మరో కప్పతో నీకు పెళ్ళై, సంతానం కలిగాక అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్తాడు. అయుతుడు సరేనని భీమరథి నదివడ్డునున్న పాండురంగని క్షేత్రమైన పండరీపురాన్ని చేరుకొని, అక్కడకి దగ్గరలో ఉన్న నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. ఇంతలో అతనిలో కప్పలో కలిగే మార్పులు పొడసూపుతాయి. అదిగో అప్పుడు వచ్చే పద్యమే ఇది!
తెనాలి రామకృష్ణుడి ప్రత్యేకత ఇదే. ఏ కవైనా ఒక మనిషి కప్పగా మారడాన్ని వర్ణించాలనుకోండి. అతని ఆకారంలో వచ్చే మార్పులని వర్ణిస్తాడు. లేదా అతను కప్పగా మారిన తర్వాత ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు. కాని రామకృష్ణుడు అలా కాదు. అతని దృష్టి విచిత్రంగా ఉంటుంది. పూర్తిగా కప్పగా మారక ముందు, మనిషి మనసులో కప్ప లక్షణాలు వస్తే ఎంత వింతగా ఉంటుంది అన్నది ఇతడి ఊహ. అందులో ఒక వెటకారం ఉంది. ఇది రామకృష్ణుడిలోని వికటత్వం. మనుషుల మనసుల్లోకి తొంగిచూసి, వాటిల్లో ఉండే అవలక్షణాలని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రించడం తెనాలి కవిలో ఉన్న విశిష్టత. అలాంటి సందర్భం వస్తే వదులుకోడు. మీరే ఆలోచించండి, ఒక మనిషి పై పద్యంలో వివరించిన చేష్టలు చేస్తే ఎంత వింతగా ఉంటుంది? అయితే అవన్నీ అయుతుడు చేసేడని వర్ణించలేదు. అతని మనసులో అలాంటి కోరికలు చెలరేగేయని మాత్రం వర్ణించి ఊరుకున్నాడు! ఎవరైనా అలా చేస్తున్నారని చెప్తే ఆ చేసేవాడిని ఊహించి నవ్వుకుంటాం. కాని అలాంటి ఊహలు మనసులో మెదిలాయి అని మాత్రం చెప్పి ఊరుకుంటే, మనమూ అలా ఊహించుకుంటాం. రామకృష్ణుడు గొప్ప కవే కాదు మంచి సైకాలజిస్టు అనికూడా అనిపిస్తుంది. :-)
ఇంతకీ అయుతుడి సంగతేమయ్యింది? ఆ కప్పరూపంలో చాలా ఏళ్ళు విష్ణు సాన్నిధ్యంలో గడిపిన తర్వాత కన్యాకుబ్జ రాజ్య రాకుమార్తె తన చెలికత్తెలతో ఈ పుండరీక క్షేత్రానికి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తూ అక్కడున్న ఈ కప్పని చూస్తుంది. వింత కాంతులతో ఉన్న ఆ కప్పని చూసి రాకుమార్తె దానితో సరదాగా ఆడుకోవాలని దాన్ని పట్టుకుంటుంది. తన చేతిలో కొంచెం సేపు ఆడిస్తూ, అల్లరిచేస్తూ, ఆ కప్పని తీసుకువెళ్ళి ఒక వృద్ధ బ్రాహ్మణుడి మీదకి విసురుతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు కోపించి ఆ రాకుమార్తెని, చెలికత్తెలనీ కూడా కప్పలుగా మారిపొమ్మని శపిస్తాడు. వెంటనే అవి కప్పలుగా మారిపోతాయి. ఒక్క భార్యని వద్దన్న అయుతుడికి ఈ కప్ప రూపంలో ఆ ఆడకప్పలన్నీ భార్యలైపోతాయి! నీళ్ళల్లో ఈదడంతో పాటు సంసారంలో కూడా ఈదాల్సి వస్తుంది! ఆఖరికి అయుతునికీ రాకుమార్తెకీ ఒక పిల్ల కప్ప, కొడుకు, పుడతాడు. దానితో అతనికి శాపవిమోచనమై, అంత కాలం విష్ణు సేవలో గడిపినందుకు ఫలంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు.
ఇదీ కథ! ఈ కథ ఎక్కడా పురాణాల్లో ఉన్నట్టు లేదు. ఇదంతా రామకృష్ణుని స్వకపోలకల్పితమే! బహుశా మన జానపథకథలని ఆధారం చేసుకొని దీన్ని రచించి ఉంటాడు. రామకృష్ణుని వైచిత్రి పేర్లలో కూడా కనిపిస్తుంది. అయుత నియుతుల తండ్రి పేరు ప్రయుతుడు. అయుత, నియుత, ప్రయుత అనేవి సంస్కృతంలో సంఖ్యా వాచకాలు. ఎంత అన్న విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది. అయుత అంటే పదివేలు, నియుత అంటే లక్ష, ప్రయుత అంటే పది లక్షలు అని చాలామంది ఒప్పుకున్న అర్థాలు. ఈ పేర్లని ఎందుకు ఎంచుకున్నాడో మరి! యుత అంటే బంధమనే అర్థం వస్తుంది. అయుత అంటే బంధం లేనివాడు, నియుత అంటే బంధమున్నవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఆలా అవి ఆ పాత్రల స్వభావాలకి తగిన పేర్లే! కాని ఎంత బంధ విముక్తుడవుదామనుకున్నాడో అంతకి అంతా బంధాల్లో చిక్కుకున్నాడు అయుతుడు, అదీ విచిత్రం!
పెళ్ళి చేసుకోం, సంసార బంధాలలో చిక్కుకోం అని భీష్మించే బ్రహ్మచారులకి ఈ కథ మంచి గుణపాఠమే నేర్పుతుంది. :-)
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, October 4, 2010
కప్పల పెళ్ళి
Subscribe to:
Post Comments (Atom)
bavvundhandi
ReplyDeleteఅద్భుతంగా ఉంది. పద్యం, దాన్ని మీరు వివరించిన విధం రెండూ అనన్య సామాన్యంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
ReplyDeletekatha chaala bagundi.. chakkani padyam prastaavinchaaru..
ReplyDeleteపద్యం బాగుంది. దాన్ని అల్లుకుని మీరు కథ చెప్పిన తీరు మరీ బాగుంది. నాకు ఇంకో కప్ప వృత్తాంతం గుర్తుకొస్తున్నది - కూచిపూడి సాంప్రదాయంలో చేసే మండూక శబ్దం, అడవిలో మడుగులో కప్ప ఎలా సర్వాంగ సౌందర్యవతియైన మండోదరిగా మారినది అనే సన్నివేశం.
ReplyDeleteమీరు వివరించిన విధానం బాగుంది.
ReplyDelete~సూర్యుడు
మంచి విషయం చెప్పారు. చెప్పిన విధానం చాలా బాగుంది. ధన్యవాదాలు.
ReplyDeleteకామేశ్వర రావు గారూ ప్రతి పదార్థము ఇచ్చి నాలాంటి వారికి అర్థమయేలా వివరించినందుకు ధన్యవాదాలు. ఇలా ప్రతిపదార్థము వ్రాయడం ద్వారా పదాలు విడిగా తెలియడమేకాక ఏ పదము ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలుస్తుంది.
ReplyDeleteకామేశ్వర రావు గారూ, నమస్కారములు. కధను కడు రమ్యంగా చెప్పారు. తెనాలి రామకృష్ణుని పద్యాలు విశిష్టంగా వుంటాయి. వాటికి మీ వ్యాఖ్యానాలు అందంగా వుంటాయి. మంచి కధకు రక్తి గట్టించారు. ధన్యవాదములు.
ReplyDeleteఈ కప్ప పద్యం అలనాడు భక్తిటీవీలో గరికపాటినోట విన్నాను. పూర్తి కథ క్లుప్తంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete