తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, May 22, 2010

మన్మథుడి విజయరహస్యం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే

ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.

లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.

మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.

ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.

తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన

శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.

శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!

6 comments:

  1. సౌందర్యలహరి చదువుతున్నారని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇలాటి టపాలు మరెన్నో వెలువరిస్తారని ఆశిస్తున్నాను.

    సౌందర్యలహరి నూరు శ్లోకాలూ నాకు కంఠస్థమే. బోంబే సిస్టర్సు పాడిన తీరు నాకు ఎంతో ఇష్టం. దాని గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు పాడుకున్నా నాకు తనివి తీరదు. నాకు సంస్కృతభాషతో కలిగిన పరిచయానికి సార్థక్యం సౌందర్యలహరిని ఆస్వాదించడమే. చాలా ఆధ్యాత్మిక రహస్యాలు కూడా అందులో ఉంటాయి, కొన్ని మంచి వ్యాఖ్యానాలు కూడా వీలైతే సంపాదించి చదవండి.

    ReplyDelete
  2. సౌందర్య లహరి నేను సంస్కృతం చదువుకునేప్పుడు కంఠస్థం చేయవలసిన గ్రంథం. నాకు మాత్రం ఒక్క శ్లోకం మాత్రమే కంఠస్థమయింది. :-)

    ReplyDelete
  3. కామేశ్వర రావు గారు, చాలా చక్కగా వివరించారు ...

    ఈ శ్లోకానికి నేను చదువుకున్న ఆంద్రానువాద పద్యాలు..

    పూవిల్లున్, మధుపాళి మౌర్వి, అయిదంబుల్ సర్వసైన్యాధిపుం
    డా వాసంత ఋతుస్వరూపు డనిలుం డాయోధన స్యందముం
    గా వహ్వారె యనంగుడీ సకల లోకంబున్ జయించున్ కృపా
    శ్రీ వాల్లభ్యము నీవు గూర్చుట కదా శ్రీ చక్ర సిమ్హాసనా..

    ("భారతీ ప్రియ" శ్రీ మామిడన్న సత్యనారాయణముర్తి గారిచే రచింపబడినది)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    నలిగెడు పూవు వింటికిని, నారిగతేంట్లు, శరంబులైదు పూల్,
    నిలువని గాలి తేరు, తన నెయ్యపుకాడు వసంత మూర్తి, యీ
    పలుచని సాధనాళి గొని, భావ శరీరుడు మారుడొక్కడున్
    గెలుచును లోకముల్- కరుణ నిండిన నీ కొనచూపు పుష్టితో !!

    (డా|| శ్రీ. జి. ఎల్.ఎన్. శాస్త్రి గారిచే రచింపబడినది)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. భైరవభట్ల కామేశ్వర రావు గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete