తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, July 6, 2010

దీర్ఘ విరామం తర్వాత - "దీర్ఘ వాసరా"ల గురించి

ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు. అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది:

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్

ఇది నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. ప్రసిద్ధమైన పద్యమే. భారతం చదవకపోయినా, కన్యాశుల్కం చదివిన వారిక్కూడా ఈ పద్యం గురించి తెలిసే ఉంటుంది. కరటకశాస్త్రి వెంకటేశాన్ని పద్యం చదవమని అడుగుతాడు. వెంకటేశం, "పొగచుట్టకు" పద్యం ఎత్తుకుంటే గిరీశం అడ్డుకొని ఈ "నలదమయంతులిద్దరు" పద్యం చదవమంటాడు. మొదటి పాదం చదవగానే కరటకశాస్త్రి ఆపి, "మనఃప్రభవానల" అంటే అర్థం చెప్పమంటాడు వెంకటేశాన్ని. గుర్తుకొచ్చిందా?

అరణ్యపర్వంలో వచ్చే అనేక కథలలో నల మహారాజు కథ ఒకటి. ఇది కూడా చాలామందికి తెలిసిన కథే. ఇందులో హంస రాయబారం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. నలుడి చేత రక్షింపబడ్డ ఒక హంస, ప్రత్యుపకారంగా దమయంతిదగ్గరకి వెళ్ళి నలుణ్ణి గురించి గొప్పగా చెప్పి, నలునిపై ఆమెకు ఇష్టాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే దమయంతి రూపవైభవాన్ని నలునికి చెప్పి అతనిలోని కోరికని పెంపొందిస్తుంది. ఈ హంస రాయబర ఫలితంగా వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి కోరిక కలిగి, విరహితులౌతారు. ఆ విరహ బాధ తగ్గించుకోడానికి నానా తిప్పలూ పడతారు. వాటిని వర్ణించే పద్యం ఇది!

మనఃప్రభవుడు అంటే మనసులో పుట్టేవాడు, మన్మథుడు. మనఃప్రభవానలం - ఆ మన్మథుడికి సంబంధించిన అగ్ని. మన్మథ తాపం అన్న మాట. ఆ మన్మథ తాపంతో బాధింపబడే మనసు కలవాళ్ళయ్యారు ఆ ఇద్దరూ. ఇక్కడ "మనః ప్రభవానల"లో "నః" యతి స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒత్తి పలకాలి. అలా అక్కడ, ఆ విసర్గతో కూడిన నకారాన్ని వత్తి పలికినప్పుడు ఆ మన్మథ తాపం మనసుని ఎంతగా దహిస్తోందో చక్కగా తెలుస్తుంది.
"దీర్ఘవాసర నిశల్" - పొడవైన పగళ్ళు కలిగిన రాత్రులు. వాటిని ఎలాగో అలా కష్టపడి గడుపుతున్నారు. ఈ "దీర్ఘవాసరనిశల్" అనేది భలే అద్భుతమైన ప్రయోగం. చెపుతున్నది రాత్రుల గురించి. ఆ రాత్రులు ఎలాంటివంటే బాగా దీర్ఘమైన పగళ్ళు కలిగినవి. అంటే రాత్రులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. పగళ్ళు మాత్రం జీళ్ళపాకంలా సాగుతునే ఉన్నాయని. ఎందుకిలా జరుగుతోంది? దీనికి రెండు కారణాలు. ఒకటి అసలే విరహ తాపంతో ఉన్నారు. దానికి తోడు పగలు ఎండ వేడి తోడైతే మరి కాలం ఎంత మెల్లిగా కదులుతుంది! అంచేత ఆ పగళ్ళు అంత దీర్ఘంగా సాగుతున్నాయి. మరొక కారణం - వేసం కాలంలో (వసంత గ్రీష్మ ఋతువుల్లో) పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయం తొందరగా అవుతుంది. సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. అంచేత ఆ కాలంలో పగళ్ళు పొడుగైనవి. కాబట్టి ఈ పదం ద్వారా అది వేసవి కాలమని ధ్వనిస్తోంది. వేసవి కాలం విరహార్తులకి మరింత గడ్డు కాలం కదా! అంచేత నలదమయంతుల బాధ మరింత తీవ్రంగా ఉన్నదన్న మాట. ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది! సరే ఆ విరహాన్ని తట్టుకోలేక వాళ్ళు పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చల్లనీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడిపారట - ఆ తాపాన్ని తట్టుకోలేక!

ఇంతకీ ఈ పద్యం ఈ మధ్యన గుర్తుకు రావడానికి కారణం, "దీర్ఘవాసర నిశల్" అన్న పదం. ఈ మధ్యనే ఆఫీసుపని మీద అమెరికాకి వచ్చాను. అందులోనూ అమెరికాలో పైన కెనడాకి దగ్గరగా ఉండే చోటు. తస్సాదియ్య "దీర్ఘవాసర నిశల్" అంటే ఏమిటో ఇక్కడకి వచ్చాక తెలిసివచ్చింది! ఇక్కడ ప్రస్తుతం వేసవి కాలం. ఉదయం అయిదు గంటలకే సూర్యోదయమైపోతుంది (నేనెప్పుడూ చూడలేదనుకోండి). రాత్రి(?) తొమ్మిదయ్యాక సూర్యాస్తమయం! అంటే ఉదయం అయిదునుంచీ రాత్రి(?) తొమ్మిది దాకా, పదహారు గంటలు పగలే నన్నమాట! పొడవైన పగళ్ళంటే ఇవి కదూ! చలికాలం వచ్చిందంటే ఎనిమిదింటి దాకా తెల్లవారదు. సాయంత్రం నాలుగింటికల్లా పొద్దుపోతుంది. ఇంత వైవిధ్యం మన దేశంలో ఉండదు. భారతదేశంలో ఉంటేనే నలదమయంతులకి అవి "దీర్ఘవాసర నిశల్" అనిపించాయే, అదే వాళ్ళు అమెరికాలో వేసంకాలం గడిపితే మరేమనిపించేదో! ఐతే ఇక్కడ ఎండకి మన ఎండంత తీక్ష్ణత ఉండదు కాబట్టి కాస్త నయమే :-) మన సూర్యుడు నిజంగా "ఖరకరుడే".

ఈ సందర్భంలోనే ఆముక్తమాల్యదలోని మరో పద్యం కూడా గుర్తుకు వచ్చింది. అద్భుతమైన ఊహ. రాయలంటేనే ఇలాంటి ఊహలకి పెట్టింది పేరు.

పడమరవెట్ట నయ్యుడుకు బ్రాశనమొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవి యాజ్ఞ మాటికిన్
ముడియిడ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్
జడను వహించె నాగ దివసంబులు దీర్ఘములయ్యె నత్తఱిన్

వేసం కాలంలో పగళ్ళు ఎంత పొడుగవుతాయో ముచ్చటించుకుంటున్నాం కదా. అలా ఎందుకవి పొడుగవుతాయో అన్నదానికి రాయల వారి ఊహ ఈ పద్యం. పగళ్ళెందుకు పొడుగవుతాయి? సూర్యుడు ఆకాశంలో తూర్పునుండి పడమరకి మెల్లగా ప్రయాణిస్తాడు కాబట్టి (ఇది ఊహ కాదు నిజమే!). సూర్యుడెందుకంత మెల్లగా ప్రయాణిస్తున్నాడు? సూర్యుడు రథమ్మీద కదా ప్రయాణం చేస్తాడు. ఆ రథానికి ఏడు గుఱ్ఱాలు. వాటికి పగ్గాలేమో పాములు. పాములు గాలిని భోంచేస్తాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. వేసం కాలంలో పడమటినుండి గాలులు (ఎదురుగాలులన్న మాట) బాగా వేడిగా వీస్తున్నాయి. ఎవరైనా వేడన్నం తినగలరు కాని పొగలు క్రక్కుతూ నోరు కాలిపోయేట్టున్న అన్నాన్ని తినగలరా? లేదుకదా. అంచేత పాపం ఆ పాములకి ఆహారం లేకపోయింది. దానితో నీరసం వచ్చి వడలిపోయాయి. పట్టుతప్పి మాటిమాటికీ ఊడిపోతున్నాయి. వాటిని సరిచెయ్యమని సూర్యుడు చెపుతున్నాడు. సరిచెయ్యడానికి సూర్యుడి సారథి అనూరుడు (పిచ్చుకుంటు) మాటిమాటికీ రథాన్ని ఆపవలసి వస్తోంది. అంచేత ప్రయాణం మెల్లగా సాగుతోంది. కాబట్టి పగళ్ళు అంతసేపుంటున్నాయిట! ఏం ఊహ! ఇక్కడ అమెరికా సూర్యుడి పాములు మరీ నిస్సతువలై ఉన్నట్టున్నాయి :-) ఏకంగా పదహారు గంటలపాటు సాగుతోందతని ప్రయాణం!

21 comments:

 1. మనః ప్రభవానల బాధ్యమానలై అనిన్నీ మనః ప్రభవానల దహ్యమానలై అనిన్నీ కూడా చదువుకున్నట్టు గుర్తు చిన్నప్పుడు. రెండూ ఒకటే కదా.
  పిచ్చుకగుంటు అంటే అనూరుడు అనే విషయం ఇప్పుడే తెలిసింది.
  ధన్యవాదాలు. పిచ్చుగ్గుంటల వారని చిన్నప్పుడు మా వూళ్ళలో సంవత్సరానికోసారి ఊరిపోర్లూ , ఇంటిపేర్లూ , ఆ యింటిపేర్లవాళ్ళ గోత్రాల పేర్లనూ వల్లెవేస్తూ ఒక గుంపుగా ఓ పదిహేను ఇరవై మంది దాకా తెల్లని దుస్తులు ధరించిన వాళ్ళు చెంబులు పట్టుకుని ఇంటింటికీ పరుగు లాంటి నడకతో వస్తుండేవారు. వారి చేతుల్లో ఇత్తడి , రాగి చెంబులుంచేవి . ఆ చెంబుల్లో దోసిటితో బియ్యం వేసేవాళ్ళం. వాళ్ళని పిచ్చుగ్గుంట్ల వారని అంటారని పెద్దలు చెప్పేవారు. ఆ పదానికి ఆ అర్థమే కాని అనూరుడనే అర్థం నా కింతవరకూ తెలియదు. చిన్నతనపు విషయాల్లోకి పరకాయ ఫ్రవేశం చేయించినందుకు మరొక్కసారి మీకు నాధన్యవాదాలు. ఆ పిచ్చుగ్గుంట్ల వాళ్ళు ఇప్పుడేమైపోయారో ఎక్కడైనా ఉన్నారో లేదో !

  ReplyDelete
 2. ఊరి పేర్లూ అని చదువుకో ప్రార్థన

  ReplyDelete
 3. బహు సముచితంగా సందర్భోచితంగా ఉన్నది .. రాసినందుకు మీకూ, చదివినందుకు నాకూ :)

  అదలా ఉండగా, ఇవ్వళ్ళ డ్రైవు చేస్తూ రేడియోలో విన్న ఒక విశేషం; సూర్యుడిచుట్టూ పరిభ్రమించడంలో ప్రస్తుతం భూమి సూర్యుడికంటే అత్యధిక దూరంలో ఉన్నదిట!

  ReplyDelete
 4. నేనుకూడ "దహ్యమానులై" అనే చదువుకున్నాను. మీరు చెప్పినట్లు "నల దమయంతు లిద్దరు" అనగానే వెంటనే కన్యాశుల్కం గుర్తొచ్చింది. అందులోను వెంకటేశం "దహ్యమానులై" అనే అంటాడు. మంచి పోస్ట్. ధన్యవాదాలు.

  ReplyDelete
 5. మంచి పద్యము గురించి వివరించారు. ధన్యవాదాలు.

  పోతే మీరు ఇంకా అమెరికాలో ఉండి, వీలు పడితే తప్పకుండా మా Dallas నగరానికి రండి - ఈ వారాంతము. తెలుగు సాహిత్య వేదిక తృతీయ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. అష్టావధానము, హరికథ, ఆముక్తమాల్యద నృత్య రూపకము మొన్నగునవి కార్యక్రమములోని విశేషాలు. http://tantex.org.

  ఇంకా details తెలుసుకోవాలంటే నాకు email చెయ్యండి.. teluguyankee@gmail.com

  ReplyDelete
 6. >>అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది!

  అవునేమో!

  మంచి పద్యాలే గుర్తుకు వస్తున్నాయి మీకు. బిచ్చు గుంటు అమెరికా ఆన్ సైట్ ఆపర్చ్యూనిటీ వచ్చినా రథాలు అంత మందంగా తోలుతున్నాడు. పాపం స్వనామధేయుడు! ఆయనకూ ఛాయాదేవితో విరహబాధ తప్పలేదనుకుంటాను.

  ReplyDelete
 7. అద్భుతంగా తాత్పర్యం రాశారండి! నన్నయ్యకు రోజుల్లో కెనడ దేశానికి వెళ్ళే అవకాశం ఉండుంటే బాగుండేదేమో! ఇంకా గొప్పగా ఉపమానమిచ్చుండవచ్చు.

  ఇంతవరకు నన్నయ పద్యాలను చదివే సాహసం చెయ్యలేదు. ఈ టపా చదివాక నన్నయ్యని చదవాలని కుతూహలంగా ఉంది. తీఖా చదివితే నాకు అర్థం కాదు. ఇలాంటి detailed తాత్పర్యం నాలాంటి వళ్ళకి ప్రయోజాత్మకం!

  ఇంకా మంచి పద్యాలకు తీకా రాయండి. అంతవరకు మీ ఇతర టపాలు చదువుతాను.
  -అవినేని భాస్కర్

  ReplyDelete
 8. కామేశ్వర రావు గారు ! చాలా బాగున్నది పద్యం, భావం, భాష్యం....

  నాకో చిన్న డౌటు... (కొంటె ప్రశ్నే అనుకోండీ)
  ఇంతకీ మీకు 'ఆ' పద్యమే గుర్తుకు రావటానికి కారణం?? .. (తెలివిగా జవాబు చెప్పండి)

  ReplyDelete
 9. కామేశ్వర రావు గారు ! ఇందాక రాసిన కామెంటు ఎందుచేతనో రాలేదు. అందుకే మళ్ళీ ఇస్తున్నా..

  చాలా బాగున్నది పద్యం, భావం, భాష్యం....

  నాకో చిన్న డౌటు... (కొంటె ప్రశ్నే అనుకోండీ)
  ఇంతకీ మీకు 'ఆ' పద్యమే గుర్తుకు రావటానికి కారణం?? .. (తెలివిగా జవాబు చెప్పండి)

  ReplyDelete
 10. రెండో పద్యం గరికపాటి వారు టి.వి లో ఆముక్త మాల్యద చెప్పినప్పుడూ విన్నానండీ, మొదటి పద్యానికి మీ వివరణ చదువుతుంటే రెండో పద్యం గుర్తుకు వచ్చింది, రెండో పద్యం చదువుతుంటే మీ దాహకరోష్ణ పద్యం గుర్తొచ్చింది.

  ReplyDelete
 11. నరసింహగారూ,
  పిచ్చుకకుంటి - పిచ్చుకుంటి అయ్యిందని నిఘంటువులు చెపుతున్నాయి. పిచ్చుకలాగ కుంటేవాడు అన్న అర్థంలో, కుంటివాళ్ళకి ఈ పదం ప్రయోగిస్తారట. అనూరుడికి కాళ్ళు పూర్తిగా లేవు కాబట్టి అతనికి కూడా ఈ పేరు స్థిరపడిపోయింది. మరి మీరు చెప్పిన వాళ్ళని ఇలా ఎందుకు పిలిచేవారో?
  "బాధ్యమానలై" అన్న చోట మొత్తం మూడు పాఠాంతరాలున్నాయి. "దహ్యమానులై", "బాధ్యమానులై", "బాధ్యమానలై". కన్యాశుల్కంలో వెంకటేశం చదివింది మొదటి పాఠం. "సాహిత్య సురభి"లో విశ్వనాథవారు "బాధ్యమానలై" అన్న పాఠాన్ని తీసుకున్నారు. అందులో "నలదమయంతులు" అన్న సమాసం స్త్రీలింగ శబ్దంతో అంతమయ్యింది కాబట్టి వాళ్ళ గురించిన రెండో సమాసం "మనఃప్రభవానల..." కూడా "బాధ్యమానలై" అని స్త్రీలింగాంతమవ్వడం సముచితమని విశ్వనాథవారు వివరించారు. అంచేత నేను కూడా ఆ పాఠాన్నే స్వీకరించాను.

  కొత్తపాళీగారూ, మీరు చెప్పేదాక తెలియదండి. సరిగ్గా నిన్ననే ఈ ఏడాది aphelion అవ్వడం తమాషాగా కుదిరింది!

  తెలుగుయాంకీ గారూ, మంచి మంచి కార్యక్రమాలే ఉన్నాయి! కాని చెప్పానుగా, నేనుంటున్నది బాగా పైన. డల్లాసంటే బాగా దూరమవుతుంది.

  రవీ, పిచ్చుకుంటుకి చాయాదేవి విరహబాధ ఏమిటీ, రామరామ! :-)

  భాస్కర్ గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. తప్పకుండానండీ. వీలుకుదిరినప్పుడల్లా నాకు నచ్చిన పద్యాలని ఇక్కడ పంచుకొనే ప్రయత్నమే ఇది. భారతం టీకా తాత్పర్యాలతో ప్రచురణలున్నాయి. ప్రయత్నించండి. అయితే ఒకటి, ఇలా విడివిడిగా కొన్ని పద్యాలని చదివి ఆస్వాదించడం వేరు. మొత్తం భారతాన్ని చదువుకుంటూ వెళ్ళడం వేరు. రెండూ పూర్తిగా వేర్వేరు అనుభవాలన్న విషయం గుర్తుంచుకోవాలి.

  సనత్ గారూ,
  మీ ప్రశ్నకి సమాధానం నా టపాలోనే ఉందండి :-) "ఇదంతా "దీర్ఘవాసరనిశల్" అన్న ఒక్క పదంతో ధ్వనింప జేసాడు నన్నయ్య. అనుభవించ గలిగేవారికి ఇందులోని కవిత్వం అనుభూతమవుతుంది!". ఇది నాకు పరిపూర్ణంగా ఇప్పుడు అనుభూతమవుతోంది కాబట్టే ఈ పద్యం గుర్తుకువచ్చింది :-)

  ఊదంగారూ,
  మాకు భక్తి టీవీ రాదు కాబట్టి నేను గరికిపాటివారి కార్యక్రమాలేవీ చూడలేదండి. "కాళహస్తి మాహాత్మ్యం" మాత్రం ఆడియో సీడీ కొనుక్కున్నాను. ఆముక్తమాల్యద కూడా తీసుకోవాలనుకుంటున్నాను.

  ReplyDelete
 12. కామేశ్వర్రావు గారు: నా వ్యాఖ్యలో విరహబాధ స్వనామధేయుడు (రవి) కి ఛాయాదేవితో.

  ReplyDelete
 13. చాలా చాలా బాగుందండీ..నాకు చాలా చక్కగా అర్ధమైంది (నేను చాలా నిరుపెదనండీ తెలుగు భాషలో).

  ReplyDelete
 14. adaraho andrabhoja :-)) innnallu chala missyyanu guruji mimalni!

  ReplyDelete
 15. నన్నయ్యభట్టు భారతం చెబుతున్నప్పుడు గరికపాటి వారు పైరెండు పద్యాలూ చెప్పినారు। నాకు రెండవదే గుర్తున్నది। రెండవది కూడా ఏదో వేఱే భారత పద్య సందర్భంలో చెప్పారు। ఆ పద్యం నాకు ఇంకా బాగా నచ్చింది।
  అందులో ఏముంటుందంటే, సూర్యుడి గుఱ్ఱాలఁట ఇంద్రప్రస్త భవనపు కాంతులు చూసి వాటి కళ్ళు తళుక్కు మని చెల్లా చెదురవుతుంటే సూరీడు కంగారు పడ్డాట్ట। ఆ పద్యం గుర్తుకు వస్తే వ్రాయండి।
  ఆముక్తమాల్యద పద్యం మాత్రం నాకు నవ్వు తెప్పించింది।
  సూరీడు ఎక్కువ సేపు వుండడం వలన వేడిగా వుంటుంది, కానీ అదే సూరీడు వేడిగా వుండడం వలన గమనం సాగక ఎక్కువ సేపు వుంటాడఁట। అనుమానాస్పదంగా లేదూ? కవిత్వంలో అన్నీ చెల్లుతాయనుకోండి।

  ReplyDelete
 16. చక్కని విషయాలను తెలిపారండీ. సంతోషంగా ఉంది. మీ కృషి మా అందరికీ ఆదర్శప్రాయం.

  ReplyDelete
 17. స్వాతిగారూ, సావిరహేగారూ, సందీప్ గారూ, నెనరులు.
  రాకేశా, సభాపర్వంలో ఇంద్రప్రస్థపుర వర్ణన ఒక మూడు నాలుగు పద్యాలున్నాయి. వాటిని చూసాను. కాని అందులో మీరు చెప్పిన భావంతో పద్యమేదీ కనిపించలేదు! ఇంకెక్కడా ఉండడానికి ఆస్కారం తక్కువ. మళ్ళీ ఒకసారి చూస్తాను.

  ReplyDelete
 18. మీ వివరణ చాలా బావుంది గురువుగారు

  ReplyDelete
 19. "రెండో పద్యం గరికపాటి వారు టి.వి లో ఆముక్త మాల్యద చెప్పినప్పుడూ విన్నానండీ,..."

  కామేశ్వర రావు గారూ,
  పైన చెప్పినప్పుడూ లొ దీర్ఘం అచ్చుతప్పు, నా ఉద్దేశ్యం చెప్పినప్పుడు అనే.

  ReplyDelete
 20. రాకేశ్వర రావుగారు అడుగుతున్నపద్యమిదేనా?
  (ఆదిపర్వము-అష్టమాశ్వాసము-77) చ.
  తమము నడంచుచున్ వెలుఁగు తత్పురగోపురశాతకుంభకుం
  భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్ విచిత్రవ
  ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా
  హము లని సంశయప్రణిహితాత్ముఁ డగున్ హరిదశ్వుఁ డెప్పుడున్.

  ReplyDelete
 21. కామేశ్వరరావుగారూ!
  మీ బ్లాగునీరోజే చూచాను. చాలా ఆనందంగా ఉంది. మీ వివరణ భాషా పండితులకు కూడా అత్యంత ప్రయోజనకరమనిపించింది. ఎప్పటికప్పుడు మంచిమంచి విషయలపై మీ మనోభావాలను వివరిస్తూ ఉంటే బహుళ ప్రయోజన కరముగా ఉంటుందని నా ఆశ.
  శుభమస్తు.

  ReplyDelete