తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, July 6, 2009

నీ వలమూపులావు...

కిందటిసారి ద్రౌపది ధర్మరాజుగురించి చెప్పిన పద్యాన్ని వివరించాను కదా. ఇప్పుడు భీముడి గురించి చెప్పిన పద్యం చూద్దాం. ఇది భీముడి గురించి అతనితోనే చెపుతున్న పద్యం అన్నమాట. అంచేత ఇది మరికాస్త సొగసుగా ఉంటుంది!

నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఱటపట్టు గాదె సం
భావన భూజనంబులకు బండువు గాదె మహోగ్ర కోప రే
ఖా విభవంబు వైరులకు గాలము చేరువ కాదె పావనీ!

దీనికి ఆడియో నాకెక్కడా దొరకలేదు. కొత్తపాళీగారిలా నా గొంతు అందరికీ వినిపించే సాహసం నేను చెయ్యలేను :-) అంచేత ఎవరికి వారు పాడుకుని ఆనందించండి! పాడుకునేటప్పుడు "నాగకూర్మ గోత్రావనిభృద్దిశాకరుల కారయ" అన్న సమాసాన్ని ఒక్క గుక్కలోనే అనడం మర్చిపోకండి. "మహోగ్ర కోప రేఖా విభవంబు" అనేటప్పుడు "ఖా" మరో పాదంలోకి వెళుతోంది కాబట్టి దానికి కాస్తంత ఊనిక (అదే force/stress) ఇవ్వండి. ఇంక చివరనున్న "పావనీ" అన్న సంబోధనని ఎంత మనోహరంగా సాగదియ్యగలిస్తే అంతగా తియ్యండి. మొత్తంగా భావయుక్తంగా పాడుకోండి. ఇంతకీ ఏవిటా భావం?

వలమూపు - కుడి భుజం, లావు - బలం

ఎత్తుకోడంతోనే "నీ వలమూపులావు" అనే అందమైన అచ్చతెలుగు సమాసంతో పద్యాన్ని ఎత్తుకుంది ద్రౌపది. ఎందుకు? ఇక్కడొక భార్య తన భర్తతో మురిపెంగా మాట్లాడుతోంది. ఆప్యాయంగా మాట్లాడుతోంది, ఆంతరంగికంగా మాట్లాడుతోంది. ఆ మురిపెం అంతా ఆ చక్కని తెలుగు సమాసంలో ఉంది. పైగా "నీ" అని ముద్దుగా ఏకవచన ప్రయోగం కూడానూ!
ఈ ఎత్తుగడని "ఎవ్వాని వాకిట..." పద్యపు టెత్తుగడతో పోల్చి చూడండి, ఎంత తేడానో. అక్కడ చెపుతున్నది ధర్మరాజు గురించి భీమునితో. అందుకా ఠీవి, ఆ గాంభీర్యం అవసరమయ్యింది. ఇక్కడ నేరుగా భీమునితో అతని గురించే చెపుతోంది. అందుకే యీ చనవు.

మును నేల వహించిన - ఇంతకుముందు భూమిని మోసిన (అంటే ఇప్పుడు మొయ్యటం లేదన్న మాట!). ఎవరు?

నాగ కూర్మ గోత్రావనిభృత్ దిశాకరులకు ఆరయ ఊరటపట్టు కాదె :

నాగ - ఆదిశేషువు, కూర్మ - తాబేలు, గోత్ర అవనిభృత్ - అవనిభృత్ అంటే భూమిని ధరించేవి అంటే పర్వతాలు. కుల పర్వతాలు, దిశాకరులు - ఎనిమిది దిక్కులా ఉండి భూమిని మోసే దిగ్గజాలు.
చూద్దునుకదా, వీటన్నిటికీ నీ ఒక్క కుడి భుజ బలమే ఊరటపట్టు అయింది కదా! అంటే ఇప్పుడు భూభారాన్నంతా నువ్వే నీ కుడి భుజం మీద మోస్తున్నావు అని భావం. రాజు తన భుజ బలంతో భూభారాన్ని వహిస్తాడు అని కవిసమయం. అది ఆ రాజు పరాక్రమానికి చిహ్నం.
"వలమూపులావు" అన్న చిన్న తెలుగు సమాసం తర్వాత "నాగకూర్మ..." అన్న పెద్ద సంస్కృత సమాసం. ఎందుకు? అంత పెద్ద, భారమైన పనిని ఇంత చిన్న చేత్తో (భుజంతో) నువ్వు చేస్తున్నావని ధ్వనించడానికి. అది భీముని పరాక్రమాన్ని మరింతగా ధ్వనిస్తోంది కదా!
శబ్దశక్తి తెలుసున్న కవిత్వం ఇది. వాక్శక్తి తెలిసినవాడు కాబట్టే తిక్కన కవిబ్రహ్మ అయ్యాడు. ఎక్కడ తెలుగు పదాలు వెయ్యాలో, ఎక్కడ తద్భవాలు వాడాలో, ఆ రెంటినీ పద్యాలలో ఎంత సొగసుగా అతకాలో తిక్కనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. దానికి యీ పద్యం ఒక మచ్చుతునక. మన ప్రాచీన సాహిత్యమంతా వట్టి సంస్కృతభూయిష్టమే అనుకోడం శుద్ధ భ్రమ. అది ఉత్త అనువాదమనో లేదా అర్థంకాని భాష అనో నిరసించి చదవనివాళ్ళనీ, చదవక్కరలేదనేవాళ్ళనీ చూసి జాలిపడ్డం తప్ప వేరే చెయ్యగలిగింది ఏమీ లేదు.

అన్నట్టు అష్టదిగ్గజాలకి (రాయలకొలువులో అష్టదిగ్గజాలు కాదు, ఎనిమిది దిక్కలా ఉన్న ఏనుగులు) పేర్లున్నాయి తెలుసా? ఐరావణ(త), పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. వీటి పేర్లూ, అవి ఏ ఏ దిక్కులని మోస్తాయి అన్న విషయమ్మీద ఏకాభిప్రాయం లేదు. ఈ ఏనుగుల భార్యల పేర్లు కూడా పురాణాల్లో ఉన్నాయి. అభ్ర, కపిల, పింగళ, అనుపమ, తామ్రపర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి.

సరే మళ్ళీ పద్యం దగ్గరికి వస్తే, ఇంకా ద్రౌపది ఇలా అంటోంది.

సంభావన - దానధర్మాలు, భూజనంబులకు పండువు కాదె - ప్రజలందరికీ పెద్ద పండగే
అతను ప్రజలకి చేసే దానధర్మాలతో వాళ్ళు నిత్యం పండగజరుపుకుంటారట.

మహోగ్ర కోప రేఖా విభవంబు - భీకరమైన కోపం అతను రేఖామాత్రంగా చూపించినా, దాని ఆధిక్యానికి
వైరులకు కాలము చేరువ కాదె - శత్రువులకి కాలం దగ్గరపడినట్టే!
భీముడు తన కోపం రేఖామాత్రంగా చూపించినా అది అతని శత్రువులకి కాలం దగ్గరపడ్డట్టే అని. ఈ కాలం దగ్గరపడ్డం ఇప్పటికీ మనం వాడే పలుకుబడి (కొంచెం ఆధునికంగా చెప్పాలంటే టైం దగ్గరపడిందిరోయ్ అన్నది).

ఇక్కడితో చెప్పవలసిందంతా అయిపోయింది. భీముని భుజబలం, అతని దాతృత్వం, అతని శౌర్యం అన్నీ పొగిడింది. కాని పద్యం పూర్తవ్వలేదు. ఆ చివర్న ఏ మాట వెయ్యాలి? ఇక్కడ మళ్ళీ తిక్కనగారికి శబ్దం మీద ఉన్న పట్టు కనిపిస్తుంది. చివర్న యీ "పావనీ" అన్న సంబోధన ఎంత ఆత్మీయంగా వినిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. "నీ"తో మొదలుపెట్టిన పద్యాన్ని మళ్ళీ "నీ"తోనే ముగించాడు. పావని అంటే పవన కుమారుడు, వాయుపుత్త్రుడు. ఇది సాధారణంగా హనుమంతునికి వాడతారు. కాని భీముడుకూడా వాయువు కుమారుడే కదా. అక్కడ ధర్మరాజు గురించి చెప్పిన పద్యంలో "ధర్మసుతుడు" అని పూర్తయ్యింది. ఇక్కడ పావనీ అని. భీముని దైవాంశని ద్రౌపది సూచిస్తోందన్న మాట! ఈ పదంలో ఇంత ప్రత్యేకత ఉంది.

తిక్కనలాంటి కవి మన తెలుగుసాహిత్యానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కవిత్వాన్ని మనం నిలుపుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉంది.

7 comments:

  1. ఇంతకు ముందు పద్యం మీరు చెప్పిన తర్వాత, భారతం కోసం వెతికితే, ఆంధ్రభారతి లో విరాటపర్వం మొత్తం కనిపించింది. అయితే తిక్కన పద్యాల లోగుట్టు, మీ లాగా ఎవరైనా వినిపిస్తే తప్ప పూర్తిగా రసానుభూతి చెందడం కష్టం. ఇది నాకు అనిపించిన భావన. అదే పెద్దన "ప్రాంచద్భూషణ..." అనో, "పాటునకింతులోర్తురే..." అనో చెప్పగానే అర్థం, పరమార్ఠం అన్నీ క్లియర్ గా తెలిసిపోతున్నాయి. లోపమెక్కడుందో తెలియట్లేదు. :-)

    సహదేవుడి మీద పద్యం "పసిబాలుడితడు గోపాలక వృత్తి వహించి.." అనుకుంటాను. ఇదే పద్యం మళ్ళీ ఉద్యోగపర్వంలో రిపీట్ అవుతుందేమో?

    ReplyDelete
  2. వన్ మోర్ ప్లీజ్... :D

    ReplyDelete
  3. @కాలనేమిగారు, నర్తనశాల పద్యాలన్నీ ఒకచోట బావున్నాయండి. ధన్యవాదాలు.
    @రాఘవగారు, తప్పకుండా.
    @రవిగారు,
    మంచి పాయింటు చెప్పారు. "రసానుభూతి" కొంచెం పెద్ద పదం, కాబట్టి దాన్ని పక్కనబెడదాం. పెద్దన పద్యాలు చదవగానే/వినగానే, ముందా శైలి మనసుని పరవశింప జేస్తుంది (కొంతవరకూ అర్థం కన్నా శబ్దానికి ఇతనెక్కువ ఫోకస్ ఇస్తాడని అనవచ్చు). కాబట్టి అర్థంలో తరచిచూడ్డానికి మరీ లోతులుండవు. ఇతను రాసినది ప్రబంధం, పైగా శృంగార ప్రధానమైనది. కాబట్టి హృదయాన్ని ఇట్టే ఆకట్టుకొనే వర్ణనలు, అలంకారప్రయోగం ఉంటాయి. ఇక్కడ నేను చెపుతున్నది పద్య రచన గురించి. కథనం, పాత్ర స్వభావాల చిత్రణ తరచి ఆస్వాదించేవిగానే ఉంటాయి.
    అదే తిక్కన విషయానికొస్తే, ఇతను శబ్దమూ అర్థమూ రెంటికీ సమానమైన ఫోకస్ ఇస్తాడు. అంటే శబ్దాలని వినసొంపుగా ఉండటానికే కాకుండా అర్థస్ఫూర్తి ఇచ్చేట్టుగా వాడతాడు. కాబట్టి అతని పద్యాలు చదివేటప్పుడు అందులో పదాలూ, సమాసాలూ ఎలా అర్థస్ఫూర్తిని కలిగిస్తాయి అని తరచి చూసి తెలుసుకుంటే అవి మరింత గొప్పగా అనిపిస్తాయి. పైగా ఇతనిది నాటకీయ శైలి. అంటే ఒక నాటకం చూపెట్టేట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక పద్యాన్ని ఆస్వాదించాలంటే ఆ సందర్భాన్ని మొత్తం మనం ఊహించుకోవాలి. అప్పుడే ఆ పద్యం పూర్తిగా మనకి హత్తుకుంటుంది.
    అందికే పెద్దన పద్యాలు విడిగా చదువుకున్నా, మొత్తం ప్రబంధం చదువుకుంటూ వెళ్ళినా ఒకేలా హత్తుకుంటాయి. అదే తిక్కన పద్యాలైతే, విడిగా చదువుకునే కన్నా కథలో భాగంగా చదువుకుంటూ వెళితే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఇది నా అనుభవం.
    మీరు చెప్పింది సహదేవుడి మీద పద్యమే కాని దాని మొదలు "సుకుమారుడితడు గోపాలకవృత్తి...". ఇది ఉద్యోగ పర్వంలో మళ్ళీ ఎక్కడ వస్తుందో గుర్తు లేదు. ఒకసారి చూడలి.
    సహదేవునిగురించి ఇక్కడ మరో మంచి పద్యం ఉంది, "కడుపసిబిడ్డ...". దీని గురించి ఒక టపావేస్తాను, అర్జునుడిగురించి అయ్యాక.

    ReplyDelete
  4. "...కొంతవరకూ అర్థం కన్నా శబ్దానికి ఇతనెక్కువ ఫోకస్ ఇస్తాడని అనవచ్చు..."
    అలా అర్థంతో కాక కేవలం శబ్దాడంబరంతో మంత్రముగ్ధుల్ని చేయడంలో ప్రథమ తాంబూలం శ్రీనాధునిదే అని నా అభిప్రాయం. చెప్పిందేదీ లేకున్నా ఏదో చెప్పాడనిపించి మళ్ళీ మళ్ళీ చదువుకొనేలా చేసే శబ్ద చమత్కారం శ్రీనాధునిది. ఇక్కడ అప్రస్తుతమే అయినా, మచ్చుకొకటి:

    చంచల్లీలల హస్త కంకణ మణిచ్ఛాయల్ పిసాళించ పూ
    జించున్ వేమ మహీ విభుండు నవరాజీవంబులన్ గల్వలన్
    ప్రాంచత్కాంచన పుష్పకేసరములన్ ప్రాసాద పంచక్షరిన్
    మంచుంగొండయనుంగు పెండ్లికొడుకున్ మధ్యాహ్న కాలంబునన్

    కంకణం తళతళలకో పాదం, శివుడని చెప్పడానికి చాంతాడంత సమాసం, మిగిలినవన్నీ పూవుల పేర్లు. ఇంతకూ చెప్పిందేమిటంటే వేమారెడ్డి మధ్యాహ్నాల్లో శివుని పూజిస్తాడని!

    ReplyDelete
  5. కామేశ్వర రావు గారు, పద్యంతో పాటు మీరు వర్ణంచిన విధానం బాగుంది. ఏదో ఒక ఆడియో పేడితే మాకు నోరు తిరగని ఈ సమాసాలు చక్కగా విని ఇంకా ఆనందించేవాళ్ళం కదా :)

    ReplyDelete
  6. na peru kavitha miru miru varninchhina vidanam bhagundi anni 8th class
    loli padyalanu adio lo pedite memu chakkaga nerchukovachu..

    ReplyDelete