తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, September 11, 2008

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోతుందా?


నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో! ఈ మార్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్

ఇతని కవిత్వాన్ని గురించి బహుశా ఇంతకన్న సరైన అంచనా మరెవరూ వెయ్యలేరు. తన శిష్యుని గురించి స్వయంగా అతని గురువే చెప్పిన మాటలుకావడం వీటికి మరింత విశిష్టతనిస్తుంది. ఆ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ, ఆ గురువు చెళ్ళపిళ్ళ.
ఈ రోజు అతని జయంతి. అది గుర్తుచేసిన తెలుగురథం శర్మగారికి ముందుగా కృతజ్ఞతలు.

విశ్వనాథ నాకెప్పుడు పరిచయమయ్యారో సరిగా గుర్తులేదు కాని, అతన్ని చదువుతూంటే కలిగే అనుభూతులు అనేకం! ఒకోసారి అతని మీద జాలి పుడుతుంది. మరోసారి చిరాకు, ఇంకోసారి భక్తి, కొన్ని సార్లు భయం, మరికొన్ని సార్లు గౌరవం పుడుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు పుట్టే అనుభూతి మాత్రం ఆశ్చర్యంతో కూడుకొన్న తీవ్రమైన విస్మయం! విశ్వనాథ కవిత్వం చదువుతునప్పుడు, అది పూర్తిగా నాకర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కానీ అర్థమయ్యిందీ అని అనిపించినంతలో, దాన్ని అనుభవించినంతలో, అందులో దర్శనమిచ్చే అతని "ప్రతిభ" ("పాండిత్యం" కాదని గుర్తించండి) - ఇంతటి గాఢ ప్రతిభ యితనికెలా అబ్బిందబ్బా అన్న విస్మయంలో ముంచెత్తేస్తుంది.
విశ్వనాథ మౌలికంగా కవి. కథకుడూ, నవలాకారుడూ, విమర్శకుడూ కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అయ్యారు అని నాకనిపిస్తుంది.
విశ్వనాథకి భక్తులూ ఎక్కువే, బద్ధ శత్రువులూ ఎక్కువే. అయినా, వీళ్ళుకాని వాళ్ళుకాని అతన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువే.

బహుశా నేను మొట్టమొదట విన్న (అప్పటికి అతని పద్యాలేవీ నేను చదవలేదు కూడా) మొట్టమొదటి పద్యం ఇదనుకుంటాను:

నా ప్రాణములకు నీ పొగమబ్బుల
కేమి సంబంధమో! యేను గూడ
పొగమబ్బునై కొండచిగురు కోసలపైన
బురుజులపైని గొమ్ములకు బైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల
రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందర పరిభ్రమణమై
యీ పొగమబ్బులనే వరించె

యెన్ని పొగమబ్బు లెఱిగి లేనేను మున్ను?
తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు లట్టి
విచటి యీ పొగమబ్బులే యెడదలోన
లలితము మదీయ గీతి నేలా వెలార్చు?

ఇది ఆంధ్రప్రశస్తిలోని పద్యం. ఎవరిదో ఉపన్యాసంలో విన్నాను. ఆ ఉపన్యాసకుడు ఈ పద్యాన్ని చదివిన తీరుకీ, దాన్ని వివరించిన విధానానికీ మంత్ర ముగ్ధుణ్ణయిపోయాను! అలా ఆనాడా మబ్బుతునక చిందించిన చిన్న చినుకు, ఆ తర్వాత చిలికి చిలికి గాలివానై మొత్తం నన్ను ముంచెత్తేసింది!

విశ్వనాథ గురించి చెప్పడం మొదలుపెడితే ఇంక అతన్నీ పట్టలేం, నన్నూ పట్టలేం :-) అంచేత, అతని పద్యాలు కొన్ని తలచుకొని "సం" తృప్తిని పొందుతాను, ప్రస్తుతానికి.

శ్రీకృష్ణ సంగీతంలో ఒక గోపిక కృష్ణునితో చేస్తున్న నిందా స్తుతి ఇది:

యాదవా నీది గానంబు కాదురయ్య!
గాన మెచ్చటనైనను కర్ణ రంధ్రములను జొచ్చు,
యెడదకు సౌఖ్యము సమకూర్చు.
ఇంక నీ పాట చెవులలో నెపుడు జొచ్చు? చొచ్చుచును జొచ్చుచును గుండె జొచ్చుగాని!
ఎపుడు నీ పాట అది సుఖమిచ్చు నెదకు? ఇచ్చుచును ఇచ్చుచును దుఃఖ మిచ్చుగాని!
నేను నీ పాటకును రానె రాను పొమ్ము...

పైది నిజానికి వచనమే, కాని తేటగీతి ఛందస్సులో ఉంది.

ఆంధ్రప్రశస్తిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిస్తూ అన్న మాటలలో విశ్వనాథ ఆంధ్ర దేశాభిమానం ఉరకలు వేస్తుంది:

ఇది నీకై యిడినట్టి నా యుపద, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదునై యాంధ్ర విరోధి కంఠ దళన ప్రారంభ సంరంభ మే
చు దినాలనే మఱి తోడి సైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశంబనియైన జెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్!

రామాయణకల్పవృక్షంలో శబరి తలమీద పువ్వులూ పండ్లూ పెట్టిన తట్టతో నడిచి వస్తూ ఉంటే, ఆమే ఇలా ఉందిట:

తుట్టతుద దాక ఎండిన చెట్టుకొమ్మ
శేఖరంబున యందు పుష్పించినట్లు

శబరి శరీరం ఎండిపోయిన చెట్టుకొమ్మలా ఉంది. ఆ చెట్టుకొమ్మ చివరమాత్రం పుష్పించినట్లుందట!

రాముడు ఖరుడిని చంపేటప్పుడు చూపించిన వీర రసం:

ఆకంఠంబుగ మెక్కినట్టి మునిరాజానేక మాంసంబులన్
నీ కంఠంబును గత్తిరించి యిదిగో నీచేత గ్రక్కించెదన్
భూకాంతుండయినట్టి యా భరతు డబ్బో! తీక్ష్ణు డీ కార్యమున్
నాకుం బెట్టెను దైత్య రాడ్గళ గళన్నాళంబులం గోయగన్

కల్పవృక్షంలోంచి ఎన్నని ఉదాహరణలివ్వగలం! రాముడు ధనుర్విద్యా పారంగతుడయ్యాక అతని పరిస్థితి ఎలా ఉందో వివరించే పద్యం ఇది:

సుడియన్ బ్రత్యణువున్ బ్రవేగధుర మౌచుం బంచకల్యాణి సా
వడిలో నూఱక కట్టివేసిన నసృగ్బాధోల్బణంబైన కై
వడి నిల్పోపక రామభద్రుడు ధనుర్వైధగ్ధ్య సాఫల్య మే
ర్పడు మార్గంబుల కోసమై వెదకు సౌత్రశ్రీ లహోలిప్తలన్

మంచి పదునుమీదున్న పంచకల్యాణీ గుఱ్ఱాన్ని ఊరికే సావడిలో కట్టేస్తే ఉఱకలు వేసే నెత్తుటితో అది ఎలా బాధపడుతుందో అలా తన ధనుర్విద్య సాఫల్యం చెందే అవకాశం రాక రామభద్రుడు విలవిలలాడిపోయాడుట!

అన్నిటికన్నా విశ్వనాథని దగ్గరగా మనం చూడగలిగేది అతని శతకాల్లో. అందులోనూ విశ్వేశ్వర శతకంలో. అందులోంచి రెండు పద్యాలు:

అతను కటిక దారిద్ర్యం అనుభవించిన రోజుల్లో ఒళ్ళుమండి రాసిన పద్యం కాబోలు ఇది!

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

అయినా అతనికా స్వామి మీదున్న భక్తి అపారమైనది.

నీవే రాజువు నేను సత్కవిని తండ్రీ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవము నేను భక్తుడను తండ్రీ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడ తండ్రీ! నిన్ను బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ చూతు, కృప సంధానించు విశ్వేశ్వరా!

తెలుగు పద్యకవిత్వం మొత్తాన్ని చదవే భాగ్యం నాకీ జన్మకు ఎలాగూ లేదు. విశ్వనాథ కవిత్వాన్ని చదివితే తప్పకుండా ఆ లోటు తీరుతుంది. కాని అది కూడా సాధ్యమవుతుందన్న నమ్మకం లేకుండా ఉంది :-(

6 comments:

  1. విశ్వనాధుని పద్యాలగురించి మీరు చెప్పిన విషయాల తో నేనూ ఏకీభవిస్తున్నాను...

    వెయిపడగలు, కిన్నెరసాని పాటలు, ఆంధ్రప్రశస్తి ... అబ్బో ఏన్నని చెప్పను...ఒకదానిని మించినది మరొకటి..

    మంచి పద్యాలను చదివించిన దానికి....ధన్యవాదములు..

    అనిల్ చీమలమఱ్ఱి

    ReplyDelete
  2. చాలా కాలం క్రితమే రామాయణ కల్పవృక్షం వాల్యూములన్నీ కొన్నాను.బాలకాండ మటుకు ఓ సారి చదివిన గుర్తు.అయోధ్య సగమో పావో చదివిన గుర్తు.ఎప్పటికైనా ఒక్కసారైనా పూర్తిగా చదవాలనే కోరిక.ఆ పుస్తకాల అట్టలు ఒకటీ అరా పేజీలు కూడా చిరిగి పోయి ఉన్నాయి. వాటిని ముందుగా అందంగా బైండు చేయించుకోవాలి.సంవత్సరాలు గడచిపోతున్నాయి.ఎప్పటికి పుస్తకాలకు బైండు చేయించి టైము దొరకపుచ్చుకుని ఆ కల్పవృక్షాన్ని పూర్తి చేయగలుగుతానో? వయసేమో పరిగెడుతుంది.మీరు చెప్పినట్లుగా విశ్వనాథగారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదవాలంటే నిజంగానే ఓ జీవితకాలం సరిపోదు.ఈ శేషజీవితంలో ఎంతవరకూ చదవగలనో చూడాలి.పద్యాలు పరిచయం చేసినందుకు శతథా ధన్యవాదాలు.

    ReplyDelete
  3. అద్భుతమైన పద్యాలు పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. విశ్వనాథవారిని తలచుకున్నంతమాత్రాన మనసు పులకిస్తుంది. ఆ మహానుభావుడి ప్రతిభని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలనుకుంటే - తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం - అనుకోవాల్సిందే. ఆ మహాసాగరంలో పడి మన ఓపిక మేరకు ఈతలు కొట్టుకోవడమే...

    ReplyDelete
  4. ఆయన మాటల్లో,

    అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
    డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
    హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడయినా డన్నట్టి దా వ్యోమపే
    శల చాంద్రీమృదు కీర్తి చెళ్ళపిళ్ళ వంశస్వామి కున్నట్లుగన్..

    కామేశ్వర రావు గారు,
    విశ్వనాథ వారిని చదువతూంటే కలిగే అనుభూతులలో మొదట మీరు జాలిని ప్రస్తావించడం నాకు విచిత్రంగా అనిపించింది.

    ReplyDelete
  5. అదేమిటో గానీ విశ్వనాధ గారంటే అందరికీ గంభీరమైన పద్యాలే గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం ఆయనలోని సునిశితమైన వ్యంగ్యం, హాస్య చతురతా జ్ఞాపకం వస్తాయి. 'విశ్వనాధ పంచశతి ' అని వారు ఐదు వందల పద్యాలు వ్రాశారు సరదాగా. ఏ పద్యానికాపద్యమే ఓ రస గుళిక. ఒక్కో పద్యాన్ని పంచ్ లైన్ గా తీసుకొని ఒక్కో కథ వ్రాయవచ్చు మన కొత్తపాళీ గారిలాంటివారు. మచ్చుకు ఇవి చూడండి:

    " వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
    సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
    అంగనామణి పెండిలియాడి కూడ
    ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె "

    " ఊరి భార్యలెల్లరూహించి యామెను
    మంచంబుతోనిడిరి శ్మశానమందు
    అట పిశాచకాంతలాలోచనము జేసి
    పడతి మరల నూరి నడుమనిడిరి "

    మీరు చెప్పినట్లు ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

    ReplyDelete
  6. సురస.నెట్ లో విశ్వనాధ వారిశిష్యులు మల్లాప్రగడ వారు కల్పవృక్షం మీద చేసిన ఉపన్యాసం 4 భాగాలుగా ఉంది. వీలు చేసుకు వినండి, ఆనందిస్తారు.
    వారి నాన్నగారు రాముడి మిడ రాయమన్నారని చెప్పే పద్యము\
    కౌసల్య అంటం బాల రాముడికి నోరు తిరగక పోతే, నేను అమ్మనే,కౌసల్యను కానే కాదు అనే పద్యం నాకు ఇష్టం.

    ReplyDelete