తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, September 20, 2008

పద్య రచనలో టెక్కునిక్కులు


గిరిగారు తన బ్లాగులో రాసిన "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" అనువాదం చూసి, కొన్ని "ఉచిత" సలహాలక్కడ పడేసాను. ఆ తర్వాత దాని గురించి మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అందుకే యీ టపా.
"పద్యం రాయడం ఎలా?" అన్న ప్రశ్న కాస్త విచిత్రంగా అనిపించొచ్చు. ఛందస్సు (గురులఘువులు, గణాలూ, వృత్తాలూ మొదలైన విషయాలు) నేర్చుకొని, రాయాల్సిన పద్య ఛందస్సుని ఎన్నుకొని, అందులోని నియమాలని అనుసరించి మనం చెప్పాలనుకున్న విషయానికి తగ్గ పదాలని పేరుస్తూ పోతే పద్యం వస్తుంది - ఇంతే కదా! ఇంతే కదా అంటే స్థూలంగా ఇంతే, కానీ సూక్ష్మంగా ఇంకా చాలా ఉంది. అలాటి కొన్ని సూక్ష్మ విషయాలని కాస్త పరిశీలిద్దాం. దీనికోసం ముందు వేసుకొన్న ప్రశ్నని "మంచి పద్యం రాయడం ఎలా?" అని మారిస్తే మరికొంత అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఉదాహరణతో వివరిస్తే బావుంటుందనిపించింది. దీనికోసం "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" రైమునే తీసుకుంటాను, గిరిగారు తప్పుగా అనుకోరనే ధైర్యంతో.

పద్యం రాయడం ఓ కళ అని అందరూ ఒప్పుకొనేదే. కాని అందులో కొన్ని టెక్కునిక్కులు కూడా ఉన్నాయి. పద్యం అనగానే మొట్టమొదటి ప్రశ్న, "ఏ ఛందస్సులో రాయాలి?" అని. మనకి బాగా నచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. లేదా బాగా వచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. మొదట్లో ఈ పని చెయ్యొచ్చు కాని, "ఫరవాలేదు, మనం పద్యాలు రాయగలం" అని అనుకున్న తర్వాత ఈ టెక్నిక్కుని అవతల పడేయాలి. పడేసి, రాయదల్చుకున్న విషయం మీద దృష్టి సారించాలి.

రాయాలనుకున్న వస్తువుని బట్టి ఛందస్సుని ఎంచుకోవడం మంచి టెక్నిక్కు. అలా అని "విషయం బై ఛందస్సు" లాంటి పట్టిక ఏదీ లేదు, ఠపీమని విషయాన్ని బట్టి ఛందస్సుని ఎంచేసుకోవడానికి. ఇక్కడ ఛందస్సు స్వరూపం గురించి కాస్త జెనరల్ నాలెడ్జి అవసరం అవుతుంది.
కాస్త గంభీరమైన విషయాలకు శార్దూలం మత్తేభం లాంటి వృత్తాలూ, సుకుమారమైన విషయాలకి ఉత్పల చంపకమాలలూ, ఒకే వస్తువు గురించి రక రకాలగా వర్ణించడానికి సీసం, లలితమైన క్లుఫ్తమైన భావాలకి తేటగీతీ, ప్రత్యేకమైన నడకతో తేలికగా గుర్తుండిపోవాల్సిన చిన్న చిన్న విషయాలకి ఆటవెలదీ... ఇలా కొన్ని సూచికలు ఉన్నాయి. అవి కేవలం సూచికలే, సూత్రాలు కావన్న సంగతి మాత్రం మరిచిపోకూడదు.

సరే మన ఉదాహరణకి వద్దాం. "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్"ని అనువదించాలంటే ఏ ఛందస్సు సరైనది? ఇదొక పిల్లల గీతం. ఇందులో గంభీరమైన, సుకుమారమైన విషయాలేవీ లేవు. కాబట్టి ఖచ్చితంగా వృత్తాల జోలికి పోకూడదు. చెప్పే విషయం చాలా చిన్నదైనా, ఇది పిల్లలకి గుర్తుండిపోవాలి. అలాంటి విశేషం ఇందులో ఏవుంది అంటే, అందులోని కొట్టొచ్చినట్టు కనబడేది - "తానా నానా తానా నా..." అంటూ సాగిపోయే దాని నడక. అంచేత దీన్ని అనువదించేటప్పుడు అలాంటి కొట్టొచ్చినట్టుండే నడక అత్యవసరం. అలాటి ఛందస్సు పైన చెప్పుకున్న వాటిలో ఆటవెలది ఒక్కటే. మరొకటి ముత్యాలసరం. ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సులకి నడకే ప్రాణం. అసలీ ఇంగ్లీషు గీతం కూడా మాత్రా ఛందస్సులో ఉన్నదే. చూడండి:

ట్వింకిల్ (4) ట్వింకిల్ (4) లిట్టిల్ (4) స్టార్ (2) (మాత్రలు)
హౌ ఐ (4) వండర్ (4) వాట్యూ (4) ఆర్ (2)
అప్పే (4) బోవ్ దా (4) వార్ల్డ్ సో (4) హై (2)
లైకే (4) డైమండ్ (4) ఇందా (4) స్కై (2)

ఇప్పుడు మనదగ్గర మూడు రకాల ఛందస్సులున్నాయి ఎన్నుకోడానికి. ఒకటి ఆటవెలది, మరొకొటి ముత్యాలసరం, మూడోది ఇంగ్లీషు రైములోనే ఉన్న మాత్రా ఛందస్సు, దీన్ని ఆ రైము పేరుమీద ట్వింకిల్ ఛందస్సు అందాం. ఇప్పుడీ ఛందస్సులనీ, మూలాన్నీ మరి కాస్త పరిశీలించాలి. ట్వింకిల్ ఛందస్సులో మనం గమనించాల్సిన అంశం - నాలుగు పాదాలూ ఒకే రకమైన మాత్రలు. అలానే రైములో ప్రతి వాక్యమూ ఒక పాదం. అంటే ఒక వాక్యం ఒక పాదంతో పూర్తయిపోతోంది. మొదటి రెండు పాదాలకీ అంత్య ప్రాస ఉంది, అలానే మూడు నాలుగు పాదాలకీను. ఈ అంశాలన్నీ ఆ రైము చక్కదనానికి దోహదం చేసినవే. కాబట్టి సాధ్యమైనంతవరకూ తెలుగులో కూడా ఇవి ఉంటే బావుంటుంది. అయితే తెలుగుకి అంత్యప్రాస అంత అందాన్ని ఇవ్వదు కాబట్టి దాన్ని వదిలేయొచ్చు.
ఇప్పుడు మనమనుకున్న ఛందస్సులని పరిశీలిస్తే, ఆటవెలది అసమ పాదాలు కలిగినది. అంటే నాలుగు పాదాలూ ఒకే మాత్రలూ లేదా గణాలూ కాదు. చెప్పే విషయంలో అలాటి అసమత ఉంటే దానికి ఆటవెలది వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మన ఇంగ్లీషు గీతంలో అలాటిదేం లేదు. కాబట్టి ఆటవెలది ఈ సందర్భంలో ఎంత అందాన్నిస్తుందో కొంచెం అనుమానమే. పోతే ముత్యాలసరం. ఇది సమ ఛందస్సనే అనుకోవచ్చు. అంటే నాలుగు పాదాలూ ఒకే నడక ఉండే అవకాశం ఉంది. చివరి పాదంలో కావాలంటే కొంత తేడా చూపించవచ్చు.
అంచేత ప్రస్తుతానికి ఛందస్సు ముత్యాలసరమో, ట్వింకిలో అని నిర్నయించవచ్చు.

హమ్మయ్యా! ఛందస్సు నిర్ణయించే పెద్ద పని అయిపోయింది. వాట్ నెక్స్టూ?

ఛందస్సుతో పాటు దాని నిర్మాణం గురించి కూడా ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది. ఇంగ్లీషు రైముకున్న లక్షణం, అంటే ఒకో పాదానికీ ఒకో వాక్యం అన్న నియమం మన అనువాదంలో కూడా ఉండాలి. నిర్మాణ పరంగా ప్రస్తుతానికి ఇది చాలు.

తరవాత గమనించాల్సిన ముఖ్యమైన విషయం భాష. ఇది పిల్లల గీతం. కాబట్టి భాష చాలా సరళంగా, పిల్ల భాషకి దగ్గరగా ఉండాలి. అంటే పదాలు తేలికగా (సంస్కృతపాండిత్యం లేకుండా) వాక్యాలు సరళంగా (సంధులూ సమాసాలూ లాంటివి లేకుండా) ఉండాలన్న మాట.

భావం విషయంలో పూర్తిగా ఇంగ్లీషు రైముని అనుసరిస్తే సరిపోతుంది.

ఇంక అనువాదం మొదలుపెడదావా మరి! ముందుగా ముత్యాలసరంలో ప్రయత్నిద్దాం.

ట్వింకిల్ కి మంచి తెలుగు పదం ఉండనే ఉంది - మినుకు
"మినుకు మినుకని మెఱయు తారా" ఎలా ఉంది? ఊ.ఊ.ఊ... "మెఱయు" పదం కొంచెం గ్రాంధిక వాసన కొట్టటం లేదూ? పైగా అలాటి పదమేవీ ఇంగ్లీషు రైములో లేదాయె. అంచేత ఇక్కడా పదం అనవసరం. సరే తీసేద్దాం. మరి దాని బదులు ఏ పదం వెయ్యాలి? అరే, "లిట్టిల్" మన అనువాదంలో రాలేదు. అది పెడితే సరి.
"మినుకు మినుకూ చిన్ని తారా". బాగానే ఉంది కాని "చిన్న" తెలుగుపదం, "తార" సంస్కృతపదం అయిపోయి రెండూ పక్కపక్కనే బావున్నట్టు లేదు. "తార"కి చక్కని తెలుగు పదం ఉందిగా, దాన్నే ఉపయోగిద్దాం.
"మినుకు మినుకూ చిన్ని చుక్కా". బావుంది. ఒక పాదం అయిపోయింది.

ఇక రెండో పాదం, "How I wonder what you are!"- ఇది చాలా సులువు. "నిన్ను చూస్తే ఎంత వింతా!".

మూడో పాదం, "Up above the world so high". ఇది కొంచెం ఇబ్బంది పెట్టే వాక్యమే. ఎందుకంటే "world so high" అన్నది ఇంగ్లీషు భాషకే పరిమితమైన పదబంధం. ఇది మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేం. తర్వాత పాదం "Like a diamond in the sky" కూడా అలాటిదే. ఇక్కడొక విశేషం గమనించాలి. ఈ రెండు పాదాల్లోనూ "క్రియ" ఎక్కడుంది? లేదు! కాని దాని లోటు మనకి తెలీటం లేదు. అదే తెలుగులో అయితే అలా కుదరదు. ఉదాహరణకి, ఈ రెండు వాక్యాలనీ ఉన్నదున్నట్టుగా తెలుగులో చెప్తే, "లోకానికంతటికీ అంత ఎత్తులో, ఆకాశంలో ఒక వజ్రంలా". వజ్రంలా ఉందనో మెరుస్తోందనో అనకపోతే ఆ వాక్యం పూర్తికాదు తెలుగులో. కాబట్టి తెలుగులో అలాటి క్రియా పదం చేర్చుకోవాలి. సరే, అలాటి పదాన్ని చేర్చుకొని ఆ రెండు పాదాలనీ పూర్తి చేద్దాం:

అంత ఎత్తున ఆకసమ్మున
వజ్రమల్లే మెరసినావే

ఊ..హూ.. మళ్ళీ "ఆకసమ్మున", "వజ్రం" కాస్త గ్రాంధిక వాసన కొడుతున్నాయి. ఆకసము బదులు నింగి వాడొచ్చు. చక్కని తెలుగు పదం. మరి వజ్రానికి తెలుగు పదం ఏమైనా ఉందా? ఉంది - "రవ్వ". "రవ్వల గాజులు", "రవ్వల నెక్లెసు" అనే వాడుక ఉండేది, ఇప్పటికీ కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో వినొచ్చు. వాటితో పద్యాన్ని పూర్తి చెయ్యొచ్చు. పూర్తి పద్యం:

మినుకు మినుకూ చిన్ని చుక్కా
నిన్ను చూస్తే ఎంత వింతా!
అంత ఎత్తున నింగిలోనా
మెరిసిపోతావ్ రవ్వలా!

ఇది ముత్యాలసరంలో అనువాదం. ఇలాగే, ట్వింకిల్ ఛందస్సులో రాస్తే:

మినుకూ మినుకూ చుక్కమ్మా
నినుచూస్తేనే వింతమ్మా!
అంతెత్తులోన మెరిసావే
ఆకాశంలో రవ్వల్లే!

ఇక్కడ నిర్మాణ సంబంధమైన మరో విశేషాన్ని గమనించాలి. ఇంగ్లీషు రైములో, మూడో పాదంలో "Up above the world so high" అని ఉంది కదా. మాత్రల సంఖ్య మిగతా పాదాల్లోలాగే ఉన్నా, దీని నడకలో చిన్న తేడాని గమనించండి. "Up above the" అన్నప్పుడు నడుస్తూ నడుస్తూ ఒక్కసారి ఎగిరినట్టు లేదూ? మాత్రలు పదాలలో ఎలా విరిగాయో గమనిస్తే, ఇది ఎలా సాధ్యమయిందో తెలుస్తుంది. మరి దీన్ని అనువాదంలో ఎందుకు వదులుకోవాలి?
"అంతెత్తులోన" అనడంలో అది కొంతవరకూ వచ్చిందని అనుకుంటున్నాను. మూడో పాదం నడకని తక్కిన పాదాల నడకతో పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అలాగే మనకి తెలియకుండానే చేసిన మరో పని - అంత్యప్రాసని కొంతలో కొంత తీసుకురావడం. "హల్లులు" కలవకపోయినా, "అచ్చులు" కలిసాయి కదా! ముత్యాలసరంలో అన్ని పాదాల చివరా "ఆ" వస్తే, ట్వింకిల్ ఛందస్సులో చేసిన అనువాదంలో మొదటి రెండు పాదాల చివరా "ఆ", మూడు నాలుగు పాదాల చివరా "ఏ" వచ్చాయి. నిజానికి గమనిస్తే, ఇంగ్లీషు రైములో కూడా చివరి రెండు పాదాల్లోనూ ఉన్న అంత్యప్రాస "అచ్చు"లకి మాత్రమే!

ఇవీ పద్యం రాయడంలో "కొన్ని" టెక్కునిక్కులు! ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండున్నాయి:
1. ఈ అనువాదం చాలావరకూ మూలాన్ని మక్కీకి మక్కీ అనుసరించింది. ప్రతి అనువాదం ఇలాగే ఉండాలని లేదు.
2. ఇక్కడ చేసిన అనువాదాల కన్నా మంచి అనువాదాలు ఈ రైముకి ఉండవచ్చు. నేను చేసినవే ఉత్తమమైనవి అని నేను చెప్పటంలేదు. కానీ అనువాద విధానంలో ఈ సూత్రాలు చాలావరకూ వర్తిస్తాయని మాత్రం చెప్పగలను.

మరోసారి మరో రకమైన ఇంగ్లీషు కవితని తీసుకొని దాన్ని అనువదించే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతానికి మీకో సమస్య. ట్వింకిల్ లాంటిదే మరో పిల్లల గీతం. దీన్ని అనువదించడానికి ప్రయత్నిస్తారా?

"Johny Johny" "Yes Papa!"
"Eating Sugar" "No Papa!"
"Telling lies" "No Papa!"
"Open your mouth" "Ha! Ha! Ha!"

14 comments:

  1. తప్పుగా అనుకునే ప్రసక్తి లేదండి - మీ వివరణ బావుంది.
    ఇక మీరిచ్చిన సమస్యని నేను ఛందస్సుకేసి చూడకుండా పూరించేసాను.

    అబ్బీ, అబ్బీ, "ఏందబ్బా?"
    ఏదిర బెల్లం? "తెల్దబ్బా"
    కల్లలురా? "కాదబ్బా"
    తెరవర నోరు, హ హ హ :-)

    ReplyDelete
  2. గురువు గారు, మంచి విషయాలు చెప్పారు.
    గరి గారు, మీ అనువాదము అదిరింది.
    నేనూ ప్రయత్నించాను కాని గ్రాంథిక వాసనల నుండి బయటపడలేక పోయాను.

    "నానీ నానీ" - "నానా ఏమి?"
    "చెక్కెర బొక్కితివా?" - "లేనే లేదు"
    "నిక్కము పల్కరా!" - "లేనే లేదు"
    "వాయిని తెరవరా!" - "హహ్హహ్హా"

    ReplyDelete
  3. చిన్నా,చిన్నా, "ఏమప్పా?"
    మిఠాయి తింటివా? "లేదప్పా"
    బొంకకు కన్నా! "లేదప్పా"
    నోటిని చూపరా, "హ్హ,హ్హ,హ్హ"

    ReplyDelete
  4. మీ ప్రయత్నం కడు అభినందనీయం.
    ఉడతా భక్తిగా రెండు పంక్తులు..

    జానీ!జానీ!! యేమయ్యా?
    తీపిని తింటివ? లేదయ్యా!
    కల్లలాడకూ? కాదయ్యా!!
    తెరవర నోరూ!హా!హా!!హా!!!

    ReplyDelete
  5. ప్రయత్నం చాల బాగుంది. మనకి తెలుగులో బాలల సాహిత్యం ఉందో లేదో తెలియదు కాని, బజారులో వెతికితే బహు తక్కువగా కనిపిస్తున్నాయి. (నేను అమెరికాలో ఉండి ఇండియా బజారుల్లో ఎక్కడ వెతికేను కాని?) ఇలాంటి పిల్లల పాటలు ఎవ్వరైనా సేకరించి నలుగురుకీ అందుబాటులో పెట్టి పుణ్యం కట్టుకొండి.

    ReplyDelete
  6. అందరికి అభినందనలు... చాల బాగున్నయ్ ప్రయత్నాలు ..
    ఎందుకొ గుర్తుకొచ్హింది.. అసంధర్బ ప్రేలాపన లాగ..
    ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి" వాడుక భాషే రాస్తున్నామా" అని!
    ఎన్నో సార్లు అనుకున్నాదే.. తెలుగు అంటె ఎంటి? ఎప్పటిది ( ఈ కాలం లొది)? మార్పు వొప్పుకొవాల?
    ( అరె.. మనసులొ ఉన్నది ఒకటి.. రాసెటప్పుదు ఇంకొక్కటి వచ్హింది ... అర్ధం కాని భాష.. మౌనమె నా భాష అయితే బెటర్ ... )

    ReplyDelete
  7. Kanna kanna, Enti nanna
    chakkera bukkeva,le nanna
    bonkaku kanna, le nanna,
    noru choopumu, am aha, am aha!!!!

    ReplyDelete
  8. తెలుగు తల్లి మీ లాంటి వారి కోసమే పరితపిస్తున్నది . మీ తపన కు జోహార్లు .

    ReplyDelete
  9. చాలా బావుంది. మీ ప్రయత్నానికి జోహార్లు.

    ReplyDelete
  10. నాన్నా నాన్నా ... హా నాన్నా
    నోట్లో చాక్లెట్ ... హు హు హు
    ఏయ్ అబద్దం ... హు హు హు
    నోరు చూపించు ... హ్హ హ్హ హ్హ

    ReplyDelete
  11. Sabash! మీరు ఇంకా తెలుగు లిటరసీ టార్చ్ను ధైర్యంగా నిలబెట్టారు, దాని కోసం నేను మిమ్మల్ని స్తుతించాను. దయచేసి ఈ అందమైన భాషలో మరింత రాయడం కొనసాగించండి.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. సుబ్బా సుబ్బా ... ఏమబ్బా
    చక్కర డబ్బా ... ఏ..డబ్బా! (ఏదబ్బా)
    తిని దొబ్బావా ... లేదబ్బా
    నోట్లో గబ్బు ... ఏంటబ్బా! (అబ్బబ్బా!)


    కన్నా కన్నా ... ఏం నాన్నా
    బెల్లం ఏదిర ... నే తిన్నా
    తప్పే గదరా ... ఔన్నాన్నా

    నిజమే చెబుతా ... మా నాన్నే


    నాన్నా నాన్నా ... ఏం నాన్నా
    ఏంటా సీసా --- మందుర కన్నా
    జ్వరమొచ్చిందా ... ఔన్నాన్నా
    నాకూ జ్వరమే ... అన్నన్నా ...


    నాన్నా నాన్నా ... ఏం బాబూ
    ఏంటా సీసా --- మందే బాబూ
    జ్వరమొచ్చిందా ... ఔ బాబూ (మా బాబే)
    నాకూ జ్వరమే ... నోర్ముయ్ బాబూ


    (అలాగే సరదా నేను "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ..." కు లవ్ పేరడీ గా వ్రాసిన
    "ట్వింకిల్ ట్వింకిల్ మేరా ప్యార్ ..." ను ఇక్కడ చూడండి ...)

    http://nmraobandi.blogspot.com/2015/07/twinkle-twinkle-little-star.html

    ReplyDelete