తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, August 22, 2008

ప్రారంభించిన వేదపాఠమునకున్...


ఓ తెలుగింటి ఆడపడుచు పుట్టింటికి వచ్చింది. చాన్నాళ్ళై చూడని తమ్ముడు ఇంట్లో లేడు. కొంతసేపటికి వచ్చాడు. రాగానే ఆప్యాయమైన ఆ పలకరింపు ఎలా ఉంటుంది?
"ఏరా తమ్ముడూ బొత్తిగా నల్లపూసవైపోయావు? సెలవలే దొరకటం లేదా! నిన్నుచూడాలని కళ్ళుకాయలుకాచిపోయాయి మాకు! నువ్వెటూ రాలేదు, ఆఖరికి మేమే వచ్చాం..." ఇలానే కదా సాగుతుంది. ఇది పద్యంలో పెడితే ఎలా ఉంటుంది?

ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహమౌనంచునో
ఏరా తమ్ముడ! నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనో యుండి, చ
క్షూ రాజీవయుగంబు వాచె నిను గన్‌గోకున్‌కి, మీ బావయున్
నీ రాకల్ మదిగోరు జంద్రుపొడుపున్ నీరాకరంబుంబలెన్

అసలు సందర్భం తెలిస్తే ఇక్కడ పైకి కనిపించే ఆప్యాయత వెనకాల ఎంత వెటకారముందో అర్థమవుతుంది. ఆ తమ్ములుంగారు నిగమశర్మ. అతని అక్క అతని అక్కే, నిగమశర్మ అక్క. నిగమశర్మ చక్కని సదాచారుడైన వేదపండితుని యింట పుట్టీ, కాస్తైనా చదువుకొని కూడా వ్యసనాలకి బానిసైపోయి భ్రష్టుపట్టి పోతాడు. కన్న తల్లిదండ్రులనీ కట్టుకున్న భార్యనీ పట్టించుకోకుండా, ఉన్న సంపదనంతా తగలేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇతని అక్కగారు చక్కగా వేరే ఊళ్ళో భర్తా పిల్లతో సంసారం చేస్తూ ఉంటుంది. ఆవిడకి తన తమ్ముడి సంగతి తెలుస్తుంది. పాపం ఆపేక్షతో తన తమ్ముణ్ణి చక్కదిద్దాలని పుట్టింటికి సపరివారంగా వస్తుంది. చూస్తే తమ్ముడు కనపడడు. ఇల్లేమో పాడుపడినట్టుంటుంది. ఇంటిని కాస్త చక్కదిద్ది తమ్ముడికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకతడు పొద్దున్నే ఊడిపడతాడు, ఇంత చద్దన్నం తిని మళ్ళీ పోవడానికి. అక్కని చూసి ఆశ్చర్యపోతాడు. తనకి క్లాసుపీకడానికే వచ్చిందని అర్థమయ్యే ఉంటుంది నిగమశర్మకి. అయితే ఆ అక్కగారు చాలా తెలివైనది. వచ్చీ రాగానే మొదలుపెడితే ఎదోలా మళ్ళీ ఉడాయిస్తాడని ఆవిడకి తెలుసు. తెలివిగా తమ్ముడిపై ఆప్యాయత చూపి చక్కగా స్నానం అదీ చేయించి, కమ్మని భోజనం పెట్టి, మరదలిచేత తాంబూలం ఇప్పించి అప్పుడు తీరిగ్గా పరామర్శించడం మొదలుపెడుతుంది. అదుగో సరిగ్గా అప్పుడు వచ్చే పద్యం ఇది!

ఈ కథ తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మాహాత్మ్యంలోనిది. తెనాలికవి పేరు తెలియని తెలుగువాడుండం చాలా అరుదు. ఇతని పేరుమీదున్న కథలూ, చాటువులూ అబ్బో ఎన్నో ఎన్నెన్నో! ఇతనికున్న "వికటకవి" బిరుదు కూడా బ్లాగుజనాలకి కొత్తకాదు :-) అయితే ఇతను రాసిన ఈ "పాండురంగ మాహాత్మ్యం" కావ్యం గురించి తెలుసున్నవాళ్ళు తక్కువేనేమో. ఇదో విచిత్రమైన కావ్యం. రామకృష్ణుడంటే మనికి తెలిసున్న కొంటెతనమంతా ఈ కావ్యంలోనూ కనిపిస్తుంది. బాహాటంగా కాదు, నర్మగర్భంగా! అవ్వడానికి ఇదీ కాళహస్తి మాహాత్మ్యం, శివరాత్రి మాహాత్మ్యం మొదలైనవాటిలాగ భక్తి ప్రబంధమే. కానీ తెనాలి రామకృష్ణుడు ధూర్జటిలా భక్తుడు కాదు. పోనీ రాయల మాదిరి మతప్రచారం చెయ్యడమైనా ఇతని ఉద్దేశంగా కనిపించదు. పెద్దనలాగా రసహృదయుడా అంటే అదీ కాదు! ఇతని మనసు అతిచంచలమైనది, రసాస్వాదన చేసే నిలకడ ఎక్కడిది! మరేవిటీ కావ్యం, ఎందుకు రాసాడూ అని ఆలోచిస్తే, ఇదో పెద్ద వ్యంగ్య(వెటకార) కావ్యంగా, పెద్ద parodyలా అనిపిస్తుంది. ఇందులోని కథలు కాని (చాలావాటికి ఎక్కడా ఆధారం కనిపించదు, ఇతని స్వకపోలకల్పితాలేనేమో), కథనం కాని, మాటల కూర్పుకాని, పద్య నిర్మాణం కాని అన్నిట్లోనూ గర్భితమైన ఒక వ్యంగ్యాన్ని చూడవచ్చు. ఆనాటి సమాజంపై, మనుషులపై ఒక వ్యంగ్యాస్త్రమేమో అనిపిస్తుంది. అయితే ఇదంతా ఖచ్చితంగా, ప్రస్పుటంగా కనిపించదు. అదే తమాషా! సన్నాయి నొక్కులు నొక్కడంలో, పోలీసు దెబ్బలు కొట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. సరే విచిత్రమైన మాటల కూర్పుతో చాలాచోట్ల హాస్యాన్నీ విస్మయాన్నీ కూడా పండిస్తాడు.

ప్రస్తుత పద్యానికి తిరిగి వస్తే, ఈ నేపథ్యంలో మళ్ళీ పద్యాన్ని చదవండి. నిగమశర్మ చదువూ సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు. ఆ విషయం అక్కగారికి తెలీదనుకొనేంత మూర్ఖుడు కాడతను. మరి మొదలుపెట్టడమే, "నీ వేద పాఠానికి ఆటంకమని చెప్పా చాన్నాళ్ళై మమ్మల్ని చూడ్డానికి రాలేదు" అని అక్కగారడిగితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి! చీవూ నెత్తురూ ఉన్నవాడికి తగలాల్సిన చోట తగలదూ! పైగా నిన్నుచూడక "చక్షూరాజీవ యుగంబు" వాచిపోయిందంటోంది. కళ్ళనే మాటకి అంత బరువైన సంస్కృత సమాసం (అలంకార సహితంగా) వెయ్యడమెందుకు? ప్రాసకోసమా? మరింత వెటకారం కోసం. ఇప్పటికీ మనం వెటకారానికి అప్పుడప్పుడు కాస్త ఘనమైన పదాలు వాడుతూ ఉంటాం కదా. పైగా "మీ బావ కూడా నువ్వొస్తావని, చంద్రోదయం కోసం ఎదురుచూసే సముద్రంలా ఎదురుచూస్తున్నా"రంటోంది. ఇది మరీ విడ్డూరం! నిజానికి మామూలు తెలుగిళ్ళల్లో అయితే ఇదంత విడ్డూరమైన విషయం కాదు. అక్క భర్తతో బావమరిదికి ఒక ప్రత్యేకమైన చనువు ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోయి ఆవిడగారిని ఆటపట్టిస్తూ ఉంటారు. తన తమ్ముడిపై భర్త చూపించే ఆప్యాయతకి ఆ యిల్లాలు మురిసిపోతూ ఉంటుంది. ఆ బంధుత్వంలో సారస్యమే వేరు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది!
కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఈ నిగమశర్మకి బావమాట దేవుడెరుగు తన ఇంట్లోవాళ్ళే పట్టరు కదా! అంచేత ఇలా అనడం మరింత విడ్డూరం. తమ్ముడికి వేస్తున్న మరో చురక. పైగా యిక్కడ యీవిడ కవిత్వం కూడా వెలగపెడుతోంది. చంద్రోదయం కోసం ఎదురు చూసే సముద్రంలా అతని బావ అతని కోసం ప్రతీక్షించాడట. "నీ రాకల్" మదిగోరు అనడంలో మళ్ళీ శ్లేష కూడానూ. పున్నమినాటి చంద్రుడి కళకి "రాక" అని పేరు. భేష్ రామకృష్ణా! బయటకి కనిపించని వెటకారాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళడానికి అలంకారాలని ఎంత చక్కగా ఉపయోగించుకున్నావ్!
నిజానికిది రామకృష్ణుని గొప్పతన మనలేం, ఇది తెలుగుభాషలో ఉన్న గుణం. తెలుగు భాషకి అతి సహజంగా ఆ సొంపును తెచ్చిపెట్టే తెలుగింటి ఆడపడుచుల సంభాషణా చాతుర్యం! ఆ సంభాషణా చాతుర్యాన్ని సందర్భోచితంగా పద్యంలో బంధించడం తెనాలి కవి ప్రతిభ.

ఈ పద్యం "ఏరా తమ్ముడ!" అన్న సంబోధనతో మొదలుపెట్టవచ్చు. ఇంచుమించు యథాతథంగా రెండవ పాదాన్ని మొదటి పాదంగానూ, మొదటిపాదాన్ని రెండవ పాదంగానూ మార్చవచ్చు. కానీ మన కవిగారెందుకలా పద్యాన్ని నిర్మించలేదు? పద్యం మధ్యలో సంబోధన రావడంలో ఒక సొగసుంది. "ఏరా తమ్ముడ" అని మొదలుపెడితే మామూలు మాటల్లా (casual talk) కాకుండా ఏదో ఉపన్యాసం మొదలుపెట్టినట్టుంటుంది. ఇక్కడది రక్తి కట్టదు. అది గ్రహించి దానికి తగ్గట్టు పద్యాన్ని నడిపించడం కవి చూపించిన పద్య రచనా శిల్పం.

నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.

తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!

11 comments:

  1. మా గురువు గారి కీర్తి ఏ నోట విన్నా ఆనందదాయకమే. హైస్కూల్లో ఈ పాఠం చదివిన రోజులు గుర్తుకొచ్చాయి. మారుతీ రామశర్మ అని మా మాస్టారు ఇంతే చక్కగా చెప్పారు. నిగమశర్మ అక్క అన్న పేరుతోనే పాఠం. ఈ తరహా కథలు అంటే చెవి కోసుకొనేవాణ్ణి చిన్నప్పుడు. పనిలోపనిగా మరో దుండగుడు ఆషాడభూతి పని పడ్దురూ. ధన్యవాదాలు.

    ఈ "వికటకవి" ఆ వికటకవి డూపు :-) అచ్చ తెలుగులో అయితే నేతిబీరకాయ.

    ReplyDelete
  2. కామేశ్వరరావు గారు, నాకు మీ వివరణ ఎంతో నచ్చింది. మీరు పద్యాలతో పాటు హృద్యమైన గద్య రచనలు కుడా కొన్ని పట్టకుని విడగొడితే చదివి ఆనందిస్తాను.

    వికటకవి గారు,నిన్ననే పరవస్తు చిన్నయసూరి వ్రాసిన నీతిచంద్రికలో ఆషాఢభూతి కధ మళ్ళీ చదివాను..కధలో చిన్నయసూరి వారి శ్లేషల వల్ల నవ్వురాక మానదు..

    ReplyDelete
  3. మీరు వివరించిన పద్ధతి బాగుంది.
    ఇది ఒకప్పుడు తెలుగు పాఠ్యాంశం గా ఉందేది.
    మరి ఇప్పటి విద్యారులకి అసలు పరిచయం ఉందో లేదో!

    ReplyDelete
  4. కామేశ్వరరావుగారూ, ఈపద్యాలూ, మీ వ్యాఖ్యలూ కూడా అద్భుతంగా వున్నాయి.
    నాకు మరొక సందేహం.వీలయితే చెప్పగలరు. నాచిన్నతనంలో పాణిని బాల్యంగురించి ఒక కథ వుండేది. అందులో ఒకపద్యం పరిపూర్ణచంద్రబింబమువోలె శాంతమై కళకళలాడు మొగంబు వాడు ... అని మొదలవుతుంది. మీకేమైనా గుర్తుందా? ఎంత కొట్టుకున్నా నాకు పూర్తి పాఠం గుర్తు రావడం లేదు.
    ధన్యవాదాలు.
    మాలతి

    ReplyDelete
  5. చాలా బాగుందండి. మంచి పద్యాన్ని చక్కటి వ్యాఖ్యానంతో పరిచయం చేశారు. ఇన్ని రోజులూ మీబ్లాగు నాకెందుకు కనిపించలేదో!

    ReplyDelete
  6. అటంచని కాంత బూమీసురడంబరచుంబి అన్నా పద్యం చూడాలనుకుంటున్నాను మీకు కనుక కుదిరనట్లైతే వ్రాయగలరు

    ReplyDelete
  7. అశ్విన్ బూదరాజు గారు,
    అటజని కాంత కాదు, కాంత ఇంకా రంగప్రవేశం చేయలేదు, అప్పటికి.
    ఆ కధ ఇటజని కాంచుడీ :)

    http://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.html

    ReplyDelete
  8. మాస్టారు గారు: రామకృష్ణున్ని కొత్త కోణంలో చూపెట్టారు. నేను ఈయనగారి ఉద్భటారాధ్య చరిత్రము చదివాను కాస్త. నాకు మాత్రం పాండురంగ మహాత్మ్యం కన్నా అదే నచ్చింది.

    వికటకవి గారు ఉటంకించిన హై స్కూల్ పాఠం, "నిగమశమ అక్క" పై రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు వ్రాసిన విశ్లేషణ అన్నట్లు గుర్తు. ఆ పాఠంలో చివర "అక్కరకు రాని ముక్కెరకునై యేడ్చె" అన్న వాక్యం తో ముగుస్తుంది అన్నటు ఙ్ఞాపకం.

    ReplyDelete
  9. నిగమ శర్మ అక్క పాఠం మా అక్క వాళ్లకుండేది! అయితే తెలుగు పుస్తకాలు (టెక్స్ట్ బుక్స్ అయినా వదిలే ప్రసక్తి లేదు కాబట్టి అది మా అక్క కంటే ముందే చదివేసాను నేను).

    'తెలుగు అక్కలందరికీ ప్రతినిధిగా నిలిచిపోవాలనేమో ' అన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. అక్షర సత్యం కూడా! ప్రతి ఇంట్లో ఒక నిగమ శర్మ అక్క...ఆడపడుచు రూపంలో! ఎక్స్ లెంట్!

    ReplyDelete
  10. నా టపామీద వ్యాఖ్యలు రాసిన అందరికీ నెనరులు.
    మాలతిగారు, మీరన్న కథ నేనెప్పుడూ వినలేదండీ. ఎవరినైనా కన్నుక్కొని తెలిస్తే చెప్తాను.
    "నిగమశర్మ అక్క" అని రాళ్ళపల్లివారిది మంచి వ్యాసం ఉంది. ఆ పాత్రలోని విశిష్టతని ఆ వ్యాసంలో చక్కగా వివరించారు.

    ReplyDelete
  11. అయ్యో పోరపాటున పడిందండీ కాంత అని హ హ అప్పుడూ నేను గమనించలేదు వూకదంపుడు గారు పద్యం చూడలేదు. ఇప్పుడే చూశా హ హ

    ReplyDelete