ఈ కందాన్ని చూడగానే తెలిసిపోతుంది దీని విశిష్టత ఏంటో. ఇది బహుభాషా కందం. ఉత్సాహవంతులు కొందరు ఇంగ్లీషులో పద్యాలు రాయడం మన బ్లాగర్లకి పరిచయమైన విషయమే! ఇది ఒక భాషలో కాదు, నాలుగు భాషల్లో ఉన్న కందం. మూడు నాలుగు పాదాలందరికీ తెలిసిన భాషలే, ఇంగ్లీషు, తెలుగు. రెండో పాదం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సంస్కృతం. ఇకపోతే మొదటి పాదం, ఇది పారసీ భాష. ఈ పద్యాన్ని రాసింది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఇది చిత్రకవిత్వమో, కేవలం సరదాకి రాసినదో కాదు. దీంత్లో ఎంతో ఔచిత్యం ఉంది. అది తెలియాలంటే ఈ పద్యం ఎందులోదో తెలుసుకోవాలి.
ఉమర్ ఖయాము రుబాయెతుల గురించి చాలామంది వినే ఉంటారు. ఆ రుబాయెతులని ఎందరో తమ తమ భాషల్లోకి అనువదించారు. తెలుగులో కూడా చాలామంది అనువదించారు. దాసుగారు కూడా వాటిని అనువదించారు. అందులోని ప్రార్థనా పద్యం ఇది. చాలామంది అనువాదాలకి ఇంగ్లీషులో Fitzgerald అనువాదమే ఆధారం. నారాయణదాసుగారు మాత్రం పారసీ భాష నేర్చుకొని నేరుగా పారసీ భాషలోని రుబాయతులని అనువదించారు. ఇంగ్లీషులోని Fitzgerald అనువాదాన్ని సంస్కృతంలోకి అనుష్టుప్ ఛందస్సులోనీ, తెలుగులోకి కంద పద్యాల్లోనీ అనువదించారు. పారసీలో ఉన్న మూలాన్ని మళ్ళీ తెలుగులో గీతి, భుజంగీ ఛందస్సులలో అనువదించారు! ఈ గ్రంధంలో మూల పారసీ రుబాయతూ, ఇంగ్లీషులో Fitzgerald అనువాదమూ, తన సంస్కృత తెలుగు అనువాదాలూ అన్నీ వరసగా ఇచ్చారు. మరి అలాటి గ్రంధానికి మొదట్లో ఇలాటి పద్యం ఎంత శొభని చేకూరుస్తుందో వేరే చెప్పాలా!
ఆధిబట్ల నారాయణ దాసు గారిని హరికథా పితామహునిగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరో తమిళ అయ్యరు వినిపించిన హరికథని విని, దాన్ని తెలుగుకి అనుగుణంగా మరిన్ని అందచందాలు చేకూర్చి, సంగీత సాహిత్య నాట్య కళా సమాహారంగా హరికథని తెలుగులో దిద్దితీర్చి దానికి ప్రాచుర్యాన్ని కల్పించిన వారు దాసుగారు. దాసుగారి సంగీత ప్రావీణ్యం అపారం. ఇతని గానం విని ఠాగూరు ముగ్ధులయ్యారట. ఠాగూరు విజయనగరం వచ్చి ఉపన్యాసమిచ్చినప్పుడు, దాసుగారు వెనకనెక్కడో కూర్చుంటే, స్వయంగా వెళ్ళి పలకరించి అతని గానం ఇంకా తన చెవులలో రింగుమంటోందని చెప్పినప్పుడు దాసుగారు పరమానందం చెందారు.
ఆదిభట్లవారు సంస్కృతాంధ్ర సాహిత్యాలలో కూడా విశేషమైన కృషి చేసారు. ఎన్నో రచనలు చేసారు. రెండు సంస్కృత శతకాలూ, అయిదు తెలుగు శతకాలూ రచించారు. అందులో ఒకటి సీసాలలో రాసిన అచ్చ తెలుగు శతకం. మరొకటి ఆనందగజపతి రాజుగారిచ్చిన "సతము సంతసమెసంగు సత్యవ్రతికిన్" అన్న సమస్యకి పూరణగా ఆశువుగా చెప్పిన శతకం.
ఆదిభట్లవారు అనేక కావ్యాలు రాసారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బాటసారి పద్య కావ్యం. ఇదొక Allegory, ధ్వని కావ్యం అనవచ్చు. అంటే బయటకి ఒక కథా, పాత్రలూ కనిపించినా అంతర్గతంగా మరొక విషయాన్ని సూచిస్తూ సాగే రచన. నారాయణదాసుగారి అనువాద రచనల్లో గొప్పది రుబాయెతుల అనువాదం. నేరుగా మూలం నుంచి అనువదించడం, క్లుప్తతకి ప్రాధాన్యమివ్వడం ఈ అనువాదాన్ని గొప్ప అనువాదం చేసాయని అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ:
The Worldly Hope men set their Hearts upon
Turn Ashes - or it prospers; and anon,
Like Snow upon the Desert's dusty Face,
Lighting a little hour or two - was gone.
దీనికి తెలుగు అనువాదాలు:
మెయితాల్పు బ్రదుకు కోరిక
నయముగ దొలుదొలుత దోచినన్ బిమ్మట నె
మ్మెయి నయిన జెడున్! రగిలిన
పొయిమీదన్ రాలు మంచుబుగ్గ తెఱగునన్!
తలచు మిదెల్ల డెందమ, కల్లయనుచు
నవియివి నీకులోనై యున్నవనుచు
మంచు చిన్కిసుకపై మాయమౌనట్లు
పోవు నీ మూనాళ్ళ ముచ్చట బ్రతుకు!
నారాయణదాసుగారు ఉమర్ ఖయాముని అనువదించడంలో మరో విశేషముంది. నారాయదాసుగారి అసలు పేరు సూర్యనారాయణ. వారి తండ్రిగారిలాగానే ఆదిభట్లవారు కూడా సూర్యుని ఉపాసించేవారు. ఖయాము కూడా సూర్యోపాసకుడని ఆదిభట్లవారి నమ్మకం! ఖయాము రుబాయత్లలో మొదటిది "ఖుర్షీద్"అన్న పదంతో మొదలవుతుంది. దాని అర్థం సూర్యుడు. సూర్యోదయంతో మొదలయిందా కావ్యం.
ఇలా రాసుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. ఆదిభట్లవారి సర్వతోముఖ కళా వైదుష్యం అనంతమైనది. అతని సారస్వతాన్ని మొత్తం సమీక్షించిన పుస్తకం జోగారావుగారి సంపాదకత్వంలో వచ్చిన "సారస్వత నీరాజనము". Digital Libraryలో దొరుకుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు. అలానే ఆదిభట్లవారి ఇతర కృతులు బాటసారి, రుబాయెతులు మొదలైనవి కూడా Digital Libraryలో ఉన్నాయి.
జోగారావుగారు నారాయణ దాసుగారి అనంతమైన సారస్వత ప్రతిభకి పట్టిన నీరాజనం యీ పద్యం:
"నాయవి నాల్గుమోము లవునా! యెటు ముద్దిడె" దంచు నల్వ ఆ
ప్యాయముగా హసింపగ, "ననంత ముఖన్ నను నెట్లు ముద్దిడం
బోయెదొ!" యంచు జెల్వ నగ, "ముద్దిడెదం గను"మంచు నల్వ నా
రాయణదాసు కాగ ద్రపనందు సరస్వతికిన్ నమస్కృతుల్!"
ఈ రోజు ఆదిభట్ల నారాయణదాసుగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ కళలనెలవుకి నేనిచ్చే నూలుపోగే ఈ చిన్న టపా!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Sunday, August 31, 2008
కళలనెలవుకో నూలుపోగు
Subscribe to:
Post Comments (Atom)
అద్భుతం. విజయనగరం గర్వించదగ్గ మహానుభావుల్లో ఆదిభట్లవారు అగ్రగణ్యులు. వారి హరికధలను అమ్ముల విశ్వనాధం గారి నోటివెంట కొన్ని విన్నా. ఆదిభట్లవారి గురించి ఒక చిన్న మహత్తో, విచిత్రమైన సంఘటనో విజయనగరంలో వీధికొకటి ఉంటుంది. వింటూంటే అసలు ఒక మనిషి ఇంత ప్రతిభ కలిగి ఉండడం సాధ్యమా అనిపిస్తుంది.
ReplyDeleteశ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస గురువరేణ్యులకి మీ బ్లాగ్ముఖంగా సాష్టాంగదండప్రణామాలు.
విచిత్ర కందము, విశిష్ట వ్యక్తని పరిచయం చేసినందుకు నెనరులు..
ReplyDeleteకనిపించీ కనిపించని వైర్లతో కట్టిబడివేయబడ్డ మాకు ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteగ్రంథాన్ని ఆంధ్రీకరించడంకోసం పారశీక భాషని నేర్చుకోవడ మసాధారణం. ఆ మహానుభావునికి బిలేటెడ్ బర్త్‌డే గ్రీటింగ్స్ :)
ReplyDeleteఒక మహోన్నత వ్యక్తి గురించిన ఈ టపా అందించినందుకు మీకు నెనర్లు.
ReplyDeleteనారాయణదాసు గారి ఆత్మకథ "నా యెరుక" చదవాలని నాకు ఎప్పటినుంచో కోరిక. పుస్తకం ప్రస్తుతం లభ్యమవ్వట్లేదు. మీకు ఆ పుస్తకం వివరాలు ఏమయినా తెలిస్తే చెప్పగలరు.
నాలుగు భాషల కందము భలే ఉంది. చివరి పద్యం భావం చెప్పవలసినదిగా మనవి. (నల్వ, చెల్వ, ద్రప - ఈ మాటలకర్థం తెలీక పోవడం వలన పద్యార్థం తెలీలేదు)
ReplyDeleteరాఘవగారు,
ReplyDeleteఆదిభట్లవారు పారసీక భాషని నేర్చుకొన్నది అరవయ్యేళ్ళ వయసులో, ఈ అనువాదం చేసినది డెబ్భయ్యేళ్ళ వయసులో!
శ్రీ హర్షగారు,
అన్నిటి గురించీ చెప్పి అతని ఆత్మకథ "నా యెఱుక" గురించి చెప్పడం మరచాను! ఇది కూడా అచ్చ తెలుగులో సాగినదే. ఇప్పుడీ పుస్తకం అచ్చులో ఉన్నట్టు లేదు. ప్రస్తుతం నాదగ్గర లేదు కాని, మా పుట్టింట్లో :-) ఉన్నట్టుంది. Digitize చెయ్యడమవుతుందేమో చూడాలి.
చదువరిగారు,
నల్వ - నలువ = బ్రహ్మ
చెల్వ - చెలువ = ప్రియురాలు
త్రప = సిగ్గు
బ్రహ్మ సరస్వతితో, "నాకు నాలుగు ముఖాలున్నాయి కదా మరి దేనితో నిన్ను ముద్దుపెట్టుకోవాలీ!" అని సరసమాడితే, సరస్వతి, "మీకు నాలుగే, నాకు అనంత ముఖాలు! మరి నన్నేలా ముద్దుపెట్టుకోగలరూ?" అని తిరిగి సరసమాడిందిట. సరే చూడు నిన్నేలా ముద్దుపెట్టుకుంటానో అని బ్రహ్మ ఆదిభట్ల నారాయణదాసుగా రూపమెత్తి ఆమెని ముద్దుపెట్టుకుంటే సిగ్గుపడుతున్న ఆ సరస్వతికి నమస్కారాలు చెప్తున్నారు జోగారావుగారు. తాత్పర్యం - దాసుగారు సరస్వతి అనంతముఖాలనీ స్పృశించారని, అంటే అతనికి అంతటి వైదుష్యం ఉందని అర్థం! ఆ వైదుష్యానికి అంజలి ఘటించారు.
ఆదిభట్ల గారితో పాటు రుబాయ్ లను నేరుగా పారశీకం నుంచి తెలుగులోకి అనువదించిన వారు ఇంకొకరున్నారు.ఆయన దువ్వూరి రామిరెడ్డి.ఆయన ఉమర్ ఖయ్యామ్ రుబాయ్ లకు చేసిన తెనుగుసేత సుప్రసిద్ధం.పైగా గానయోగ్యం కూడా.అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలోని,అంతములేని ఈ భువనమంతయు అన్న పద్యమొకసారి విని చూడండి.
ReplyDeleteఇక నాయెరుక విషయానికి వస్తే,నేను చదివినంతవరకూ,నాకు గుర్తున్నంతవరకూ...అందులో ఆదిభట్ల వాడిన కొన్ని పదాలు అచ్చతెలుగు వి.ఎల్లడు=భగవంతుడు,పొత్తపుగుడి=గ్రంధాలయము,సీమపలుకువహి=నిఘంటువు
ఇలా ఉంటాయి.
సీమపలుకువహి=నిఘంటువు
ReplyDeleteఆదిభట్ల నారాయణదాసు గారి "కళలనెలవుకో నూలుపోగు"కు అదనంగా "కరుణశ్రీ"గారు వారి మీద చెప్పిన పద్యాలను ఇంకో అదనపు "నూలుపోగు"గా అందిస్తే ఇంకా అందగిస్తుందనే ఆశతో--- నా బ్లాగులో పోస్టు చేసాను.చూడగలరు.
ReplyDeleteరాజేంద్రగారు,
ReplyDeleteఅవును దువ్వూరి రామిరెడ్డిగారు కూడా పారసీ నుంచి నేరుగా రుబాయతులని అనువదించారు, "పానశాల" అన్న పేరుతో. అది స్వేచ్ఛానువాదం, అంటే ప్రతి రుబాయెతునీ అనువదించ లేదు. వాటి సారాన్ని మాత్రం గ్రహించి వాటిని అందమైన పద్యాల్లో మనకందించారు. దీనివల్ల మూలంలోని పునరుక్తి కొంతవరకూ ఇందులో ఉండదు. వాటిని AMdhrabhAratilO చదువుకోవచ్చు.
నరసింహ గారు,
పద్యాలు బావున్నాయి.
ఎడ్వర్డు పట్టాభిషేకం అనే హరికధ వ్రాసినది నారాయణ దాసుగారా లేక చెళ్లపిళ్ల వారా. ఎప్పటినుంచో సందేహం ఇది నాకు.
ReplyDeleteతెలియచేయగలరా దయచేసి?
బొల్లోజు బాబా
బాబాగారు,
ReplyDeleteఎడ్వర్డు పట్టాభిషేకం రాసినది తిరుపతి వేంకటకవులు. అది హరికథ కాదు నాటకం.
కామేశ్వరరావు గారు
ReplyDeleteథాంక్యూ
బొల్లోజు బాబా
నేను బ్లాగు లోకానికి కొత్తవాణ్ణి. అంచేత ఈ బ్లాగులో ఈ పోస్టు చూడడం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే జరిగింది. నా యెరుక పుస్తకం నా దగ్గర ఉంది.అయితే అది డిజిటైజ్ చేయడ మెలాగో తెలియని వాణ్ణి.నేను హైదరాబాదులో ఉంటాను కనుక హైదరాబాదు వాస్తవ్యులెవరైనా ఈ పనికి పూనుకోగలిగితే దానికి నా సహకారం తప్పక ఉంటుంది. సాహితీ ప్రియులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. నా ఈ మెయిల్ అడ్రసు--
ReplyDeletepantulagk@gmail.com సెల్ నం. 9490314932 సంప్రదించవచ్చును.