తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, April 12, 2008

ఉద్రేకంబున రారు...

స్పెషల్ ఉగాదిపచ్చడందరూ రుచి చూసే ఉంటారనుకుంటాను. అందులో నేనిచ్చిన న్యస్తాక్షరికి నాకు ప్రేరణనిచ్చిన పద్యాన్ని ఈ రోజు మీతో పంచుకుంటాను.

ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకు జేయరు, బలోత్సేకంబుతో జీకటిన్
భద్రాకారుల బిన్నపాపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెనో!



పోతన భాగవతంలో ద్రౌపది అశ్వత్థామతో అన్న మాటలివి. చదివిన ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లే పద్యం!

అసలీ సందర్భంలో ద్రౌపది అశ్వత్థామతో మాట్లాడడం సంస్కృత భాగవతంలో కానీ మహాభారతంలో కానీ లేదు.

అసలు, భారతంలో అశ్వత్థామని ద్రౌపది దగ్గరకి తీసుకురావడమే జరగదు. భీమార్జునులు అశ్వత్థామని వెంటాడి చివరికతని శిరోమణిని పెకిలించేస్తారు. కృష్ణుడు అశ్వత్థామని 3000 సంవత్సరాలు దిక్కుమాలిన బతుకు బతకమి శపిస్తాడు.

సంస్కృత భాగవతంలో అర్జునుడు అశ్వత్థామని బంధించి ద్రౌపది దగ్గరకు తెస్తాడు. అప్పుడు ద్రౌపది, "అశ్వత్థామ తల్లి ఇంకా బతికే ఉంది. ఆమె, నేను పొందే పుత్రశోకాన్ని పొందకూడదు", అని అతణ్ణి చంపకుండా వదిలిపెట్టెయ్యమని అంటుంది. అందరూ ద్రౌపది అన్నదానితో ఏకీభవించినా భీముడు మాత్రం ఒప్పుకోడు. అప్పుడు కృష్ణుడు, అతనికి శిరోముండనం చేసి (తలగొరిగి), అతని శిరోమణిని తీసేస్తే అతను మరణించిన వాడితో సమానమని మథ్యేమార్గాన్ని చెప్తాడు. ఇది సంస్కృత భాగవతంలో ఈ సన్నివేశం.

పోతన సంస్కృత మూలాన్ని ఇంచుమించు అనుసరించినా, ద్రౌపది ఆవేదనని వెళ్ళగక్కించి కానీ ఊరుకోలేకపోయాడు! ఒక కవి తను రచిస్తూన్న సన్నివేశంలో తాదాత్మ్యం చెందితే అందులోంచి పుట్టే రస ప్రవాహానికి ఇది ఉదాహరణ.

"ఉద్రేకంతో నీమీదికేమైనా వచ్చారా? పోనీ యుద్ధభూమిలో ఉన్నారా? నీకేమయినా పోని ద్రోహంచేసారా? కండకావరంతో అలా చీకట్లో, నిద్రిస్తున్న చిన్నపాపలని చంపడానికి నీ చెతులెట్లా ఆడేయయ్యా?" అని అడిగే తల్లికి అశ్వత్థామ ఏం సమాధానం చెప్పగలడు? ఈ కాలంలో ఇలాటి అశ్వత్థామలు ఎందరో!

ఇంతటి ఆర్ద్రత, ఇంతటి ఉద్వేగం ఎంత సులువుగా శార్దూలంలో ఒదిగిపోయిందో చూడండి! చెయితిరిగిన కవికి, నిజమైన భావోద్వేగం గుండెలోతుల్లోంచీ పుడితే, దానికి ఛందస్సు సరైన బాటచూపిస్తుందే కానీ, అడ్డం రాదు.

ఈ పద్యంతో పాటుగా ఇదే సందర్భంలో మరో మంచి పద్యాన్ని, పనిలో పనిగా ఇప్పుడే చూసేద్దాం. ఇవి భీమసేనుడు అశ్వత్థామని వదలవద్దని చెప్పేమాటలు.


కొడుకుల బట్టి చంపెనని కోపమునొందదు, బాలఘాతకున్
విడువుమటంచు జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీడు విప్రుడే?
విడువగనేల? చంపుడిటు వీనిని, మీరలు చంపరేని నా
పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెద జూడుడందఱున్

ద్రౌపది అశ్వత్థామని వదిలిపెట్టెయ్యమని చెప్పడం భీముడు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఒక పక్క ద్రౌపది మాటలకి విస్మయం, మరో పక్క అశ్వత్థామమీద అసహ్యం, కోపం, ఇవన్నీ పద్యంలో ఎంత అద్భుతంగా ధ్వనిస్తున్నాయో చూడండి! "వెఱ్ఱిది ద్రౌపది" అన్న ప్రయోగం, "పిడికిటిపోటునన్" తలబద్దలుకొడతాననడం - మొత్తం పద్యానికి ఆయువుపట్లు. నాటకీయమైన సన్నివేశంలో, సహజ సంభాషణా శైలితో పాత్రల మనస్థితిని ధ్వనింపజెయ్యడంలో, ఇక్కడ పోతన తిక్కనని గుర్తుకు తెస్తున్నాడు. నాకు తెలిసినంతవరకూ, ఇలాటి విశేషం పోతన భాగవతంలో మరెక్కడా లేదు!

కొమె: మొదటి పద్యంలో ప్రాస గమనించారా?

11 comments:

  1. బళ్లో ఈ పద్యం వుండేది. ఈ పద్యానికి ఓ చుక్క కూడా వుండేది. అంటే కంటస్థం పెట్టాలన్నమాట. అంచేత, ఇప్పటికీ పొల్లు పోకుండా ఈ పద్యం జ్ఞాపకం వుంది. ఈ పద్య ఔచిత్యాన్ని చాలా బాగా వివరించేరు. అభినందనలు.

    ReplyDelete
  2. " చెయితిరిగిన కవికి, నిజమైన భావోద్వేగం గుండెలోతుల్లోంచీ పుడితే, దానికి ఛందస్సు సరైన బాటచూపిస్తుందే కానీ, అడ్డం రాదు."

    మీరన్న ఈ పైమాట అక్షరసత్యం. బాగా చెప్పారు.

    ReplyDelete
  3. "..భిన్నపాపల.." కాదండీ, "..జిన్ని పాపల.." అనుకుంటాను. :- )

    ReplyDelete
  4. పద్మగారూ,

    అది "భిన్న"పాపలు కాదండీ, "బిన్న"పాపలు. "బి"కి వత్తులేదు.
    భద్రాకారులన్ + పిన్నపాపల = భద్రాకారుల బిన్నపాపల

    ReplyDelete
  5. ఆ తల్లి కడుపుకోత వెళ్ళబోసుకొన్న ఈ పద్యాన్ని చదివితే హృదయం ద్రవించింది. ఆ దుర్మార్గున్ని కత్తికో కండగా నరికివేయాలి.

    ReplyDelete
  6. గతంలో నాగసిద్ధారెడ్డి మొదలైనవారు ఆంధ్రమహాభారతంలోని పద్ధెనిమిది పర్వాల పద్యాలకూ తమ వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఎంతో ఆసక్తికరంగా చెప్పేవారు కడప ఆకాశవాణిలో. కొన్ని ముఖ్యమయిన ఘట్టాలను వింటూ రేడియోదగ్గరనుంచి కదల్లేక పోయేవాళ్లం. కార్యక్రమం అయిపోగానే ఒక గొప్ప అనుభూతికి లోనయ్యేవాళ్లం. మీ టపా మళ్లీ అలాంటి భావోద్వేగాన్ని కలిగించింది. మీకనేక కృతజ్ఞతలు.

    చిన్న సందేహం: భద్రాకారులు అంటే అర్థం ఏమిటండి? చిన్నపిల్లలనుద్దేశించి ఈ పదం వాడుక...!?

    ReplyDelete
  7. కామేశ్వర రావు గారు,
    పద్యం చూడగానే నేను మొట్టమొదట గమనించినది ప్రాసనే.ద్ర కి ద్ద్ర కి ప్రాస కుదిరింది కాబట్టి ద కి ద్ద కి కూడా కుదురుతుందని చెప్పలేము కదా? దీనికి ఏవైఁనా ప్రత్యేకమైన నిబంధనలుంటే తెలుపగలరు..

    ReplyDelete
  8. కామేశ్వర రావు గారు,
    ఆలోచించకుండా అడిగిన ప్రశ్ననాదని తెలిసింది,కొంచెం ఆలోచిస్తే నాకే సమాధానం బోధపడింది..మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పనవసరం లేదండీ..
    గిరి

    ReplyDelete
  9. @రానారెగారు,
    "భద్ర" అంటే శుభమైన, శ్రేష్టమైన అని కూడా అర్థం ఉంది. "భద్రాకారులు" అంటే మంచి శోభతో కూడిన రూపం కలవారు (అందమైనవారు) అన్న అర్థం వస్తుంది.
    @గిరిగారు,
    ప్రాస గమనించారా అన్నది ఒకటి, మీరన్న "కించిద్ద్రోహము" గురించి. మరొకటి, నేను న్యస్తాక్షరికి కూడా ఇదే ప్రాసనిచ్చాను. ఇంతకీ "కించిద్ద్రోహము" గురించి మీకు తట్టిన సమాధానం ఏమిటి?

    ReplyDelete
  10. కంచిత్, ద్రోహము కాబట్టి ప్రాస కుదిరింది. కానీ, ఉదాహరణకి చిన్మయ లోని న్మ కి, మ కి ప్రాస కుదరదు - నేననుకున్నది సరే అంటారా?

    ReplyDelete
  11. "కించిద్ద్రో", "కించిద్రో" ఇంచుమించు ఒకలాగే పలుకుతాం కాబట్టి ఇక్కడ ప్రాస చెల్లుబడయ్యింది. "పుత్ర" పదం నిజానికి "పుత్త్ర", కాని పలకడంలో పెద్దతేడాలేదు కాబట్టి, "పుత్ర" అని రాసేస్తాం. దానికి "త్ర"తో యతికూడా చెల్లుతుంది. అలాగే ఇదీను.
    దీనికి శాంతిప్రాసం అని పేరనుకుంటాను.

    ReplyDelete