తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, April 8, 2008

స్పెషల్ ఉగాదిపచ్చడి!

సర్వులకూ సర్వధారి ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది అనగానే పద్య కోకిలలు పలుకుతాయి. కలాలు చిగురిస్తాయి. కవిసమ్మేళనాలూ, అవధానాలూ తెలుగువాళ్ళ ఆనవాయితీ.
ఈ ఉగాది సందర్భంగా మా విజయనగరంలో, విజయభావన అనే సాహితీసంస్థ ఆధ్వర్యంలో, ఈ రోజే ప్రముఖ అవధాని శ్రీ కడిమెళ్ళ వరప్రసాదు గారి అష్టావధానం జరిగింది.
ఆ అవధాన విశేషాలు మీకోసం అందిస్తున్న స్పెషల్
ఉగాదిపచ్చడి. ఇదిగో మరి అవధరించండి...(నా సోది ఇలా బ్రాకెట్లలో ఉంటుంది)

----------------------------------
సమన్వయ కర్త తొలిపలుకులు

తిరుపతి వేంకట కవుల పద్యం:

స్థైర్యము లేని చిత్తమవధానమెరుంగని సత్కవిత్వ మౌ
దార్యము లేని హస్తము యదార్థతలేని రసజ్ఞ మంచి మా
ధుర్యము లేని గానము మృదుత్వము లేని వచః ప్రసంగ మై
శ్వర్యము లేని భోగము నసారములియ్యివి దంతిభూవరా!

అవధాని ప్రార్థన:

పెద్దది పొట్ట విద్దియల పెట్టియగా, నిడుపాటి తొండమా
బుద్దులకెల్ల యూపిరియ, పూజ్యుల పల్కుల నాలకింపగా
పెద్దవియైన వీనులును, బిన్నలు కన్నులు బాహ్యదృష్టియే
వద్దనుచున్న యొజ్జలగువాడు గణాధిపుడిచ్చు దీవెనల్!

1. సమస్య:

శోభన దినమున గులసతి సుతులన్ గనియెన్!

ఒక్క సుతుడు కాదు, ఇద్దరు సుతులని, అందులోనూ కులసతి శోభనంనాడు కన్నదని సమస్య.

పూరణ:

కం: వైభవమన్న సుమిత్రదె (మొదటిపాదంలోనే పూరణ

ఎవరిగురించో అర్థమైపోయింది!)
శోభాయుతులైన త్యాగశూరుల నౌరా!
ప్రాభవమున తారాగ్రహ
శోభన దినమున గులసతి సుతులన్ గనియెన్!

శోభనము అంటే శుభము అన్న అర్థంలో, నక్షత్ర గ్రహ స్థితి శుభంగా ఉన్న రోజున సుమిత్ర సుతలను కన్నది అని పూరణ.

2. దత్తపది:

పదాలు - షకీల, ఇలియాన, త్రిష, జనీలియ
అంశం - సీతాకల్యాణం
పదాలు అదే వరుసలో రావాలన్న నియమం లేదు. ఛందస్సు అవధాని ఇష్టం.

పూరణ:

తేగీ: భా"ష కీల"యై చందన భంగి నొప్పి
పూ"జలీని య"వేలత భూమిజాత
పట్టె దో"యిలి యాన"మ్ము బరగజేసె
రా"త్రి ష"ండమ్ము జీల్చెడి రామ విభుని

అవేలత - అధికమైన
షండము - సమూహము
చందనంలా చల్లగా ఉన్నా, అవసరమైతే మాటని జ్వాలలాగా ప్రయోగించగల సీత, అవేలత - అధికమైన పూజలు చేసి, దోసిలిపట్టి, రాత్రి సమూహాన్ని చీల్చే రామునితో కలసి నడిచింది.
అవధానిగారికి జనీలియా తెలీదుకాబట్టి "జలీనియా" అనుకొని పూర్తిచేసారు:-)

3. వర్ణన:
సర్వధారి ఉగాది వర్ణన. స్వేచ్చా వృత్తం.

పూరణ:

ఉ: కోయిల మావిపై నిలిచి గొంతుక విచ్చి కుహూరుతమ్ములన్
దీయగజేయు వేళ నినదించి రహించుచు నుండు గుండె నా
ప్యాయముతోడుతన్ విజయభావన బుట్టిన యీ వసంత ల
క్ష్మీయుత సర్వధారి విలసించును గాత సమస్త సంపదల్

4. నిషిద్ధాక్షరి:

పాదంలో ఒకో అక్షరం పృచ్చకులు నిషేధించడం, అవధాని నిషేధించిన అక్షరం కాక మరో అక్షరం చెపుతూ పద్యాన్ని నడిపించడం నిషేధాక్షరి.
సాధారణంగా నిషిద్ధాక్షరి కందంలోనే చేస్తారు. అందులోనూ మొదటి రెండుపాదాలే. ప్రాస, యతి స్థానాలకి నిషేధం ఉండదు.

అంశం - భువనవిజయ సభని విజయభావన సభతో పోలుస్తూ వర్ణించడం

పృచ్చక అవధానుల మధ్య జరిగిన సంభాషణా విధంబెట్టిదనిన:

పృచ్చక: మొదటి అక్షరం నిషేధించలేదు.

అవధాని: "శ్రీ"

పృచ్చక: "భ" నిషేధం (అంటే రెండవ అక్షరం "భ"కారం కాలేదు. "భువన" లాంటి పదం వెయ్యకుండా)

అవధాని: "యై" (రెండవ అక్షరం ఇది. అంటే "శ్రీయై", శుభాన్ని చేకూర్చేదై అని అర్థం. అక్కడితో పదం అయిపోయింది. మూడవ అక్షరం కొత్త పదంతో మొదలౌతుంది. కాబట్టి అవధానికి బోలెడు స్వాతంత్ర్యం!)

పృచ్చక: "వ" నిషేధం ("విజయ" లాంటి పదం
వెయ్యకుండా)

అవధాని: "భా"

పృచ్చక: మళ్ళీ "వ" నిషేధం ("భావన" పడకుండా)

అవధాని: "ష"

పృచ్చక: "ల" నిషేధం

అవధాని: "య" ("భాషయ" పదం అయిపోయింది)

పృచ్చక: నిషేధం లేదు

అవధాని: "గె"

పృచ్చక: "య" నిషేధం (ఎందుకో?)

అవధాని: "లు"

పృచ్చక: నిషేధం లేదు

అవధాని: "చున్"

మొదటి పాదం అయిపోయింది - "శ్రీయై భాషయ గెలుచున్"

రెండవ ఆవృత్తి

పృచ్చక: "ర" నిషేధం

అవధాని: "న్యా" రెండవ అక్షరం "య" (ప్రాస కాబట్టి)

పృచ్చక: మూడవ అక్షరానికి "మ" నిషిద్ధం ("న్యాయము" అవ్వకుండా)

అవధాని: "గ"

పృచ్చక: "మ" నిషేధం

అవధాని: "తిన్"

పృచ్చక: "వ" నిషేధం

అవధాని: "గ"

పృచ్చక: "డ" నిషేధం

అవధాని: "న్న"

పృచ్చక: "వ" నిషేధం

అవధాని: "డే"

పృచ్చక: "భ" నిషేధం

అవధాని: "లె", తర్వాతి అక్షరం యతి "నా"

పృచ్చక: "డ" నిషేధం ("నాడు" అనకుండా)

అవధాని: "నీ"

పృచ్చక: "స" నిషేధం

అవధాని: "నా"

పృచ్చక: "శ" నిషేధం

అవధాని: "డున్"

రెండవ పాదం కూడా పూర్తైపోయింది
"న్యాయగతిన్ గన్నడేలె నానీనాడున్"

కన్నడు - కృష్ణుడు లేదా కన్నడభూపతి అన్న అర్థంలో కృష్ణరాయలు
కన్నడేలెనాన్ - కృష్ణరాయలే ఏలుతున్నాడా అన్నట్లుగా
ఈ నాడున్ - ఈ నాడు కూడా
మిగతా రెండు చరణాలూ నిషేధం లేదు.
మొత్తం పద్యం:

శ్రీయై భాషయ గెలుచున్
న్యాయ గతిన్ గన్నడేలెనా నీనాడున్
శ్రేయమ్ము విజయభావన
యీ యువతరమునకునిచ్చి యేపున్ గాంచున్

ఈనాడు కూడా కృషదేవరాయలు నడుపుతునాడా అన్నట్లుగా నడిచే విజయభావన యువతరానికి శ్రేయస్సునిచ్చి ప్రగతి చెందుతుంది. భాష విజయాన్ని పొందుతుంది.
నిషిద్ధాక్షరిలో సాధారణంగా ఉపయోగించే రెండు కిటుకులు:
1. ఇచ్చిన విషయానికి సంబంధించిన పదాలు, నిషేధం లేని చివరి రెండు పాదాల్లో వేసుకోవడం.
2. నిషేధం ఉన్న పాదాల్లో రెండక్షరాల పదాలే ఎక్కువగా పెట్టుకోవడం.

5. న్యస్తాక్షరి

దీనినే నిర్దిష్టాక్షరి అని కూడా అంటారు. ప్రతి పాదంలోనూ ఒక అక్షరాన్ని పృచ్చకులు నిర్దేశిస్తారు. ఇచ్చిన అక్షరాన్ని, ఇచ్చిన స్థానంలో ఉండేటట్టు, ఇచ్చిన అంశం మీద పద్యం చెప్పాలి.

వృత్తం: చంపకమాల
ఇతివృత్తం: ద్రౌపది తన కొడుకులని నిష్కారణంగా చంపిన అశ్వత్థామని దూషించడం

ఒకటవ పాదం 13వ అక్షరం "ల"
రెండవ పాదం 19వ అక్షరం "ష" (చంపకమాలలో 19వ అక్షరం గురువవ్వాలి. ఇచ్చిన అక్షరం లఘువు. దాన్ని తర్వాతి అక్షరం సంయుక్తాక్షరం వేసి గురువుని చేసుకోవాలి.)
మూడవ పాదం 2వ అక్షరం "ద్రి"
(ఇది కాస్త దుర్మార్గమైనది! 2వ అక్షరం ఒక పాదంలో నిర్దేశిస్తే అది ప్రాస కాబట్టి మొత్తం అన్ని పాదాల్లోనీ అదే రావాలి. పైగా "ద్రి" సంయుక్తాక్షరం కాబట్టి దానిముందరి అక్షరం సాధారణంగా గురువౌతుంది. అంటే మొదటి అక్షరం గురువు. కానీ ఇచ్చిన వృత్తం చంపకమాల లఘువుతో మొదలవ్వాలి! ఎలా మరి? దీనికి రెండు పరిష్కారాలున్నాయి.
1. "ద్రి" ముందరి అక్షరం వేరే పదంలోదైతే అది గురువు అవ్వదు. ఉదాహరణకి "నన్ను ద్రినయనుండు" అని ఉన్నప్పుడు "న్ను" గురువవ్వదు.
2. అచ్చ తెలుగు పదాలు ప్రత్యేకమైనవి కొన్ని ఉన్నాయి - అద్రుచు, ఎద్రుచు, విద్రుచు, చిద్రుప, పద్రుచు. ఈ పదాలలో మొదటి అక్షరం లఘువే అవుతుంది. మొత్తం సాహిత్యంలో ఈ పదాలతో "ద్ర"కార ప్రాస వేసి ఒక్క నాచన సోమన తన ఉత్తరహరివంశంలో చంపకమాల పద్యం రాసాడు.
ఇలా అడిగినందుకు అవధానివర్యులకి కాస్త కోపం వచ్చినమాట నిజమే. అయితే ఇలాటి సమస్య ఇచ్చినప్పుడు, పృచ్చకులు కూడా అలాటి పద్యం చెప్పగలిగి ఉండాలి. "మీరు పద్యం తయారుచేసుకున్నారా" అనికూడా అడిగారు. అవునని చెపితే సరేనని మొదలుపెట్టారు. కానీ చివరికి పరమాద్భుతంగా దాని పూరణ చేసారు)

నాల్గవ పాదం 9వ అక్షరం "డ"

పూరణ:

అద్రుచునె నుండు వీరు మరియాద"ల" మీరగ దేశికాత్మజా!
విద్రుచుట పాడియా కరుణ వీడుచు తీవ్రముగా వి"ష"మ్ము, ని
న్ను "ద్రి"భువనమ్ములున్ విడుచునో! పసివారిని గోసియుంటివే!
చిద్రుపలు పాడుపోక"డ"లిసీ బ్రదుకున్ గొను నెల్లకాలమున్!

అద్రుచునె - అదురుతూనే
దేశికాత్మజా - దేశిక + ఆత్మజా = గురు కుమారా (అశ్వత్థామ)
విద్రుచుట - విదిలించుట
చిద్రుపలు - చిన్నవైన

ఈ పసిపాపలు(ఉపపాండవులు) మరియాద మీరడానికెప్పుడూ అదురుతునే ఉంటారు. అలాటి వీరిపై కరుణ వీడి, విషాన్ని విదల్చడం న్యాయమేనా? నిన్ను ఈ త్రిలోకాలూ విడిచిపెట్టకపోవా (నీకు పుట్టగతులు లేకుండాపోవా)! పసివాళ్ళని కోసివేసావే. ఇలాటి నీ చిన్నతనపు పాడు నడవడికలు నీ బ్రతుకంతా ఎల్లకాలమూ నిన్ను వెంటాడతాయి.
ఇక్కడ గురుపుత్రా అన్న సంబోధన చాలా సార్థకమైనది. అంతటి గురువునకి కుమారుడవై ఇలాటి లఘు కార్యానికి తలపడ్డావా అని అనడం. "ఎల్లకాలమూ"అన్న పదం కూడా సాభిప్రాయమే. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి తను చేసిన పాడుపని ఎల్లకాలం అతణ్ణి వెంటాడుతుందని!

6. ఆశువు

ఆశువుగా వెంటనే పద్యం చెప్పడం
1. జ్ఞాన భిక్షని పెట్టమని అడుగుతూ అమ్మవారిని వేడుకోవడం

జ్ఞానభిక్ష ప్రసాదింప జనని నీవు
పూనుకొనకున్న యెవ్వారు పూనగలరు
ఎందరెందరొ అజ్ఞానమిచ్చువారు
కనక నినుజేరి కైమోడ్పు కడగుచుంటి

2. కృష్ణదేవరాయల మతసహనానికి ధూర్జటి ఉదాహరణ. వాళ్ళిద్దరి గురించీ ఒక పద్యం.

అటుబెట్టిన రేడొకడట
ఇటుబెట్టిన కవి యొకండు నేమాయనులే
అటుబెట్టిన యిటుబెట్టిన
ఎటుబెట్టిన నేమి కాని నిటుబెట్టవలెన్

ఇదొక చమత్కారమైన పద్యం. నటిస్తూ చూపిస్తే కాని అర్థం కాదు. "అటుబెట్టిన" అన్నప్పుడు "తిరునామాలు" నిలువుగా పెట్టుకున్న నామాలని చూపించాలి. కృష్ణరాయలు వైష్ణవుడు కదా! "ఇటుపెట్టిన" అన్నప్పుడు అడ్డ నామాలని చూపించాలి. ధూర్జటి శైవుడు. చివరన "ఇటుబెట్టవలెన్" అన్నప్పుడు, ఒకళ్ళకి దానం చేస్తున్నట్లు చేతులు చూపించాలి. ధూర్జటి పెట్టేది కవిత్వం. రాయలు పెట్టేది ధనమో భూమో.

మిగిలిన రెండు అంశాలూ పురాణం, అప్రస్తుత ప్రసంగం. అవి ప్రస్తుతానికి అప్రస్తుతం:-)

కొసమెరుపు:
న్యస్తాక్షరి ఇచ్చిన పృచ్చకరాక్షసుడు భవదీయుడే:-)
>

11 comments:

  1. ఉగాదికి ప్రత్యేకంగా పచ్చడి చేయిస్తున్నానన్నారు గదా.. కానీ సందడేమీ లేదేమిటి అని అనుకుంటూ ఉన్నాను. ఇదన్నమాట సంగతి. నిజంగానే ఇది స్పెషల్.

    మీ న్యస్తాక్షరికి అవధానిగారు చెప్పిన పద్యం బాగుంది. మీరు సిద్ధం చేసుకున్న పద్యం కూడా రాయండి. "అటుబెట్టిన..", గణపతి ప్రార్థన నాకు నచ్చిన ఇతర పద్యాలు.

    ReplyDelete
  2. బ్రహ్మాండం. ఈ సన్నివేశాల వీడియో మాకేమయినా కళ్లబడే అవకాశం కలిగించగలరా మాస్టారూ?

    ReplyDelete
  3. కోట వారితో కాకుండా వారు ఒక్కరే చేశారా? హైదరాబాదు లొ ఎప్పుడైనా మీ అవధానం ఉంటే చెప్పండని వారికి గతంలో విన్నవించుకున్నాను. నాకు ఇంకా చూశే అవకాశం రాలేదు. ఇంతకీ మీ పూరణ మాకు చెప్పనే లేదు.

    ReplyDelete
  4. @రానారె,
    ఆడియో ఉందిగాని వీడియో లేదు. ఉన్నాకానీ ఎలా పెడతానిక్కడ, నన్ను గుర్తుపట్టెయ్యరూ:-)

    @చదువరి, ఊకదంపుడు,
    అతని పూరణ ముందు నా పూరణ సూర్యునిముందు దివిటీ అవుతుందని పెట్టలేదు. మీరు మరీ బలవంతం చేస్తున్నారు...
    నా పూరణ:
    పద్రిచి దురాగ్రహోన్మద దవానలమందున వ్రేల్చి బాలురన్
    చిద్రుపలుగా మిగిల్చితివి చిన్నితనూజుల, మానుషత్వమే
    విద్రిచితివోయి! నీకు తగవే యిది? నిన్నననేల నాకు దా
    నెద్రిచిన కాలమే కడకు నివ్విధి శిక్ష విధించె ద్రోణజా!

    అవధానిగారు ఈ "ఎద్రుచు" మొదలైన పదాలు కేవలం "ద్రు"కారం తోనే రావాలని అనుకున్నారు. అందుకే మూడవపాదంలో "ద్రి" కోసం పదాన్ని విడగొట్టారు. కానీ "ఎద్రిచి" వంటి రూపంలో కూడా(భూతకాలంలో) వాడవచ్చు.

    ReplyDelete
  5. ఇది చాలా అన్యాయం, ఈ పృఛ్ఛకులు మా దత్తపదిని కాపీ కొట్టారు!!!

    ReplyDelete
  6. కామేశ్వర రావు గారు,
    మీ పద్యానికేమి తక్కువండీ.

    @కోపా గారు,
    పైగా మీకు ఎక్కడ కోపమొస్తుందో అని, జెనీలియా ని "వ్యస్త మధ్యమ"ని జేయకుండా, మేము చక్కాగా కూర్చో బెట్టాము. ( చూ:
    అవధానిగారికి జనీలియా తెలీదుకాబట్టి "జలీనియా" అనుకొని పూర్తిచేసారు)

    ReplyDelete
  7. కామేశ్వర రావు గారు, మీరు వ్రాసిన అవధానం విషయాలు చదివి నేను ఎంతో పులకితుడనయ్యాను - ధన్యవాదాలు..కడిమెళ్ళ వరప్రసాదు గారి పూరణలు చాల మనోహరంగా ఉన్నాయి. నాకు మటుకు నిషిధ్ధాక్షరి పద్యం (పద్యం వ్రాయబడిన తీరు) తెగ నచ్చింది..
    ఇక న్యస్తాక్షరి పద్యాలు రెంటికి రెండు (ఆయనది, మీది)పోటిపడుతున్నట్టున్నాయి.

    ReplyDelete
  8. @కోపా గారు,
    అంత కోపమైతే ఎలాగండీ. లైకు మైండ్లు థింకెలైకూ!
    @ఊకదంపుడుగారు,
    మీకైతా ఆ హీరోయిన్లతో బాగా పరిచయం కదా, అంచేత మీరలా పొరపడ్డానికి వీల్లేదుమరి.

    ReplyDelete
  9. అప్రస్తుత ప్రసంగం లేదా??
    వుంటే ఆ చిలిపి ప్రశ్నలు,సరదా సమాధానాలు పంపించండి

    ReplyDelete
  10. avadhAna gubALiMpunu iMta cakkagA aMdiMcinaMduku cAlA kRtaj~natalu.
    gaTTi nyastAkshari samasya iccinaMduku mIru pRcchakarAjulE kAni rAkshalu kAru! mari adE kadA maMci pUraNaku dAri cEsiMdi. mI pUraNa kUDA nacciMdi. iTuvaMTidE nEnU koMceM kashTapaDi kashTamaina nyastAkharE okasAri garikapATi gArikiccAnu. vAru samasya klishTatanu sabhikulaku vivaristU saMtOshapUrvakaMgA pUriMcAru. mottAniki paisalu vasUlayinAyi :-)

    ReplyDelete
  11. కామేశ్వరరావు గారూ
    మీ అవధాన పూరణ పద్యం చదనగానే నాగఫణి శర్మ గారి పూరణ ఇదే అంశం మీద--
    పసికూనల్ కుసుమాలు గాని ముకుళాభ్యాసంబులౌమోములై
    మిసిమిన్ జారినలేతముద్దలు
    రసంబింపొందు బాల్యంబులై
    నిసమై పోయిరి నీకు నేడు నకటా
    నిశ్వాసమే లేదొకో
    అసి యే రీతిని దూయగల్గితివి
    అప్పా చిట్టి బాల్యంబుపై --ఈ పద్యం గుర్తుకొచ్చి వ్రాశాను.చిత్తగించండి

    ReplyDelete