తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, March 1, 2012

అదిగో ద్వారక...


అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ
య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్యల్, వారలే యాదవుల్!
యదుసింహుండు వసించు మేడ యదిగో! ఆలాన దంతావళా
భ్యుదయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడిన్!



ఆఁ.. ఆఁ... వినిపిస్తున్నాయ్... మీ ఈలలూ వన్సుమోర్లూ! :-) ఇదిగో మళ్ళీ వినండి.



తన కాలానికి ప్రచారంలో ఉన్న పద్యనాటక సంపదాయ ధోరణిని కాదని, పద్యాలు పాడడంలో ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించినవారు ఘంటసాల మేష్టారు. ఒకొక్కరికి ఒకో పద్ధతి నచ్చుతుంది! (నాకు రెండూ నచ్చుతాయ్ :-)) పద్యాలు పాడడంలో మార్పుని తెచ్చింది ఘంటసాల అయితే, అసలు పద్య రచనలోనే ఒక విప్లవాన్ని తెచ్చినవారు తిరుపతివేంకట కవులు. అటు అవధానాలతో పండితులనూ, ఇటు భారత నాటకాలతో సామాన్య ప్రజలనూ ఏకకాలంలో తమ పద్యాలతో ఉఱ్ఱూతలూగించిన కవులు వారు. ఆ కాలంలో వారిదొక ప్రభంజనం.

పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి. దుర్యోధనుడు తమ రాజ్యం తిరిగి యివ్వడన్నది దాదాపుగా స్పష్టమైపోయింది. ఇరు పక్షాలవారూ యుద్ధోద్యోగులయ్యారు. నానా రాజుల సైన్యబలాలనీ సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీకృషుడు పాండవులకి ఎంత సన్నిహితుడయినా, తమ పక్షమే వహిస్తాడని వారికి తెలిసినా, ఒక రాజుగా అతడిని వెళ్ళి తమ పక్షంలో ఉండమని కోరడం రాచమర్యాద. మరి ఆ కార్యాన్ని నిర్వహించ గలిగేవారెవరు? కృష్ణుని ప్రియసఖుడైన అర్జునుడు కాక ఇంకెవరు? శ్రీకృష్ణుడంటే అర్జునుడికున్న స్నేహం, భక్తి, అనురక్తి అనన్యసామాన్యం. అలాంటి ప్రియబాంధవుడైన కృష్ణుని చూడబోతున్నాడంటే అర్జునుడి మనసు ఉత్సాహంతో ఉరకలు వెయ్యదూ! "అదిగో ద్వారక!" అంటూ ఎత్తుగడలోనే ఆ ఉరకలేసే ఉత్సాహాన్ని అలవోకగా ధ్వనింపజేయ్యడం తిరుపతివేంకట కవుల నాటకీయ పద్యనిర్మాణ ప్రతిభ. తిరుమల కొండ చూసి అన్నమయ్య ఎంతటి ఆనందంతో "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అన్నాడో అదే ఆనందం మనకిక్కడ అర్జునుడిలో ధ్వనిస్తుంది. ద్వారకానగరం, నగరం ముందు పచ్చిక మేస్తున్న ఆలమందలు, కోట, అగడ్త - యిలా ఒకొటొకటీ చూస్తున్న కొద్దీ, శ్రీకృష్ణుని చూడ బోతున్నాననే ఆనందం అతనిలో పెరుగుతూ పోయింది. చివరికి కృష్ణుని మేడ కనిపించగానే ఆనందం పట్టలేక మళ్ళీ "యదుసింహుండు వసించు మేడ యదిగో!" అని పెద్దపెట్టున అన్నాడు. ఉప్పొంగిన ఆ ఆనందోత్సాహాన్ని, ధారగా సాగిన చివరి పాదం చక్కగా స్ఫురింపజేస్తోంది. నేను చూసిన పుస్తకంలో "నాలాన" అని ఉంది కాని, అది "ఆలాన" అయ్యుండాలి. "ఆలాన" అంటే ఏనుగులను కట్టే స్తంభం. "అదిగో" అన్న తర్వాత నాకు తెలిసి ద్రుతం రాదు. దంతావళం అంటే ఏనుగు. ఆలానములకు కట్టబడిన ఏనుగులతో అలరారుతున్నదా మేడ. మందురము అంటే గుఱ్ఱపుసాల. వర+మందుర+అంతర+తురంగ+ఉచ్చండమై. శ్రేష్ఠమైన గుఱ్ఱపుసాలలో మాంచి ఉత్సాహంతో నురుగులుకక్కే గుఱ్ఱాలతో శోభిస్తోంది.

ఈ పద్యంలో మరొక విశేషం కూడా ఉంది. అర్జునుడు ముందు చూసింది ద్వారకా నగరాన్ని, అల్లంత దూరంలో. అంత దూరం నుండి కోట కాని, కోటలోని రాజ మార్గాలు కాని (రథ్యలు), అందులోని ప్రజలు కాని కనిపిస్తారా? కనిపించరు. అంటే అర్జునుడు తన రథమ్మీద ద్వారకకి వస్తూ చెప్పిన పద్యమన్న మాట. ముందు దూరంగా ద్వారకని చూసాడు. కాస్త దగ్గరకి వచ్చాక నగర శివార్లలోని ఆలమందలు కనిపించాయి. మరికొంత దగ్గరకి వచ్చాక కోట, కోట ముందరి అగడ్త కనిపించాయి. కోటలోకి ప్రవేశించాడు. అప్పుడు రాజమార్గాలు (రథాలు వెళ్ళే మార్గాలు కాబట్టి అవి రథ్యలు), వాటిలో తిరుగుతున్న యాదవులు కనిపించారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుని మేడ, మేడలోని ఏనుగులు, గుఱ్ఱాలు అగుపడ్డాయి. యీ ఒక్క పద్యం చదివేలోపు అంత దూరం ప్రయాణం చేసాడన్న మాట అర్జునుడు! అంటే శ్రీకృష్ణుడి కోసం అతను ఎంత వేగంగా పరుగులు తీసి వచ్చాడో మనం ఊహించవచ్చు. అదీ పద్యనిర్మాణంలో నేర్పు!

ఇంతకీ యీ పద్యం ప్రస్తావనిప్పుడు రావడానికి కారణం ఏవిఁటంటే, ఒక పది రోజుల కిందట మా చిన్నాన్నగారి అబ్బాయి పెళ్ళికి విశాఖపట్నం వెళ్ళాం. మర్నాడు పెళ్ళనగా ముందు రోజు సాయంత్రం మా చిన్నాన్నగారింట్లో అందరం కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మా కుటుంబం, చిన్నాన్నలిద్దరూ వాళ్ళ కుటుంబాలు, మా చిన్నాన్నల పిల్లలూ, వాళ్ళ పిల్లలూ, మా అత్తయ్యా వాళ్ళ కుటుంబం, మా పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు - ఇలా, అబ్బో! చాలామందే చేరాం. పెళ్ళంటే మాటలా మరి, బంధువులందరూ కలిసి హడావిడి చెయ్యొద్దూ! సరే మా అమ్మాయి, మా మేనకోడలూ సంగీతం నేర్చుకుంటున్నారు కాబట్టి, ఇద్దరినీ కలిసి వాళ్ళకొచ్చిన గీతాలు రెండు పాడమన్నాం. ఇద్దరూ ఎంచక్కా కూర్చొని సంగీత కచేరీ మొదలుపెట్టారు. లోపల గదిలో పడుకొని ఉన్న మా చిన్నాన్నగారి మామగారు పాటలు విని బయటకి వచ్చారు. ఆయనకి సుమారు ఎనభయ్యేళ్ళుంటాయనుకుంటా. కళ్ళు కనిపించవు. కాని గొంతు ఖంగుమంటుంది. పద్యాలు పాడితే అదురొహో! ఇకనేం. పిల్లల పాటలయ్యాక అతనినో పద్యం పాడమని అడిగాం.
"కన్నె ప్రాయమునందు భాస్కరుని కరుణ" అంటూ కృష్ణకర్ణ సంవాదంలో (ఇవికూడా పాండవోద్యోగవిజయాలలో పద్యాలే) కృష్ణుడి పద్యాన్ని అందుకున్నారు. ఆహా! ఏవిఁ గొంతూ! ఏవిఁ రాగం! ఏవిఁ స్థాయి! చెవుల తుప్పొదిలిపోయింది. ఒక పద్యంతో ఏం సంతృప్తి కలుగుతుంది, మాకైనా అతనికైనా. అదే వరసలో తక్కిన పద్యాలు కూడా అందుకున్నారు. "అంచితులైన బందుగుల", "వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు" పద్యాలుకూడా పాడారు. అంత పెద్దాయనకి ఆ పద్యాలు ఎంత గుర్తో! చివరిసారి అతను స్టేజెక్కి నాటకం వేసింది 1968లోనట! మనసుకి ఉత్సాహమున్నా వయసు సహకరించాలి కదా. వరసగా మూడు పద్యాలు పాడేసరికి కాస్త అలసట అనిపించిందేమో, ఆగారు. నా వెనక కూర్చున్న మా బావ, నువ్వందుకో అని నన్ను పొడిచాడు. నాకు పద్యాలయితే వచ్చు కాని అతనిలా ఎక్కడ పాడగలను. సంగీతమూ రాదు. గొంతుకి అంత స్థాయీ లేదు! అయినా మనవాళ్ళేగా, ఆయనకీ కొంచెం విరామం ఇచ్చినట్టవుతుందని నేను తర్వాతి పద్యం, "ఏ సతి వహ్నిలోన జనియించెను" అందుకున్నాను. అదయ్యాక, ఇంకా... అన్నారు. కృష్ణకర్ణ సంవాద ఘట్టంలో అక్కడికి కృష్ణుడి పద్యాలైపోయాయి. తర్వాత కర్ణుడి పద్యాలు. మనదెప్పుడూ కృష్ణ పాత్రే. అంచేత అక్కణ్ణుంచి నేరుగా రాయబారంలోకి దూకి "చెల్లియొ చెల్లకో" ఎత్తుకున్నాను. అది వినేసరికి మా చిన్నాన్నగారికి ఊపొచ్చింది. "జెండాపై కపిరాజు" అని ఆయన అందుకున్నారు. ఇక పద్యాలు ఊపందుకున్నాయి. మా నాన్నగారు పడకసీన్లో తన అర్జునపాత్ర పద్యం "అదిగో ద్వారక" ఎత్తుకున్నారు. ఆ తర్వాత అర్జునుడిదే, "అరవిందాక్షుడు శేషశాయి". అప్పుడిక కృష్ణుడి పద్యం, అంటే నావంతు. "ఎక్కడనుండి రాక యిటకు", ఆ తర్వాత "బావా ఎప్పుడు వచ్చితీవు!" పాడాను. అప్పుడు మళ్ళీ పెద్దాయన (అదే మా చిన్నాన్నగారి మావగారు) తన గొంతు సవరించి దుర్యోధనుడి పద్యం "కౌరవపాండవుల్ పెనగు కాలము" అందుకున్నారు. పడకసీను పద్యాలన్నీ వరసబెట్టి పాడేసాం. ఆ తర్వాత రాయబారంలో యింకా రెండు పద్యాలుండిపోయాయని గుర్తుచేసారు మా చిన్నాన్నగారు. "అలుగుటయే ఎరుంగని" పెద్దాయన, "సంతోషంబున సంధిసేయుదురె" నేనూ పూర్తి చేసాం. అందరి మనసుల్లో ఒక గొప్ప ఆహ్లాదం పరచుకుంది. ఆ తర్వాత మా పిన్ని చెల్లెలికి శాస్త్రీయసంగీతం బాగా వచ్చని చెపితే, ఆవిడని కూర్చోబెట్టి కచేరీ చేయించేసాం. అలా ఆ సాయంత్రం సంగీతపద్య విభావరిగా మారింది! అందరికీ ఆనందాన్ని పంచింది. ఒక తీయని జ్ఞాపకంగా మిగిలింది. మా బంధువులందరినీ మరింత ఆత్మీయులని చేసింది!

14 comments:

  1. మీరు అన్ని పద్యాలనూ రికార్టు చేసి పెట్టుంటే ఎంత బాగుండేది? అనిపిస్తోంది.
    చిన్నప్పుడోసారి స్కూల్లో నాటకం వేద్దామనుకొని కొన్ని పద్యాలు కృష్ణుడివి బట్టీ పట్టడం జరిగింది. కాని ఎందువల్లో కాని నాటకం వేయటం జరగలేదు.

    ReplyDelete
  2. మీరు అన్ని పద్యాలనూ రికార్టు చేసి పెట్టుంటే ఎంత బాగుండేది? అనిపిస్తోంది.
    చిన్నప్పుడోసారి స్కూల్లో నాటకం వేద్దామనుకొని కొన్ని పద్యాలు కృష్ణుడివి బట్టీ పట్టడం జరిగింది. కాని ఎందువల్లో కాని నాటకం వేయటం జరగలేదు.

    ReplyDelete
  3. అయ్యో నేను కూడా ఉండుంటే ఎంత బాగుండేదో... మా మేనమామ యర్రాప్రగడ రామకృష్ణ టివీల్లో వ్యాఖ్యాతగా.. రాజమండ్రి "సమాచారం" పత్రిక లో వ్యాసకర్త గా సుప్రతిష్టులే. సాహితీ సభల్లో, అవధానాల్లో కూడా తరచూ కనిపిస్తూంటారు.. బేతవోలు రామబ్రహ్మం గారి స్నేహుతులు. మాంఛి ఖంగుమనే కంఠం.. రాజమండ్రి కాకినాడలలో ఎన్నోసార్లు భువనవిజయం లో రాయలై, పెద్దనామత్యుడై పద్యాలను అలవోకగానాలాపిస్తూంటారు.. అవన్నీ గుర్తుచేశారు. ధన్యవాదాలు

    ReplyDelete
  4. ఊరు చేరాలి మన ఊరు చేరాలిపాటలో అలాగే రాశారు కవిగారు...

    ReplyDelete
  5. "అందరి మనసుల్లో ఒక గొప్ప ఆహ్లాదం పరచుకుంది. అలా ఆ సాయంత్రం సంగీతపద్య విభావరిగా మారింది! అందరికీ ఆనందాన్ని పంచింది. ఒక తీయని జ్ఞాపకంగా మిగిలింది. మా బంధువులందరినీ మరింత ఆత్మీయులని చేసింది". బాగా చెప్పారు. ఆ తిరుపతి వెంకటకవుల గొప్పతనమది.

    మా డల్లాసులో జరిగే "నెల నెలా తెలుగు వెన్నెల" గురించి మీకు తెలుసుకదా. అందులో భాగముగా ఒకసారి తిరుపతి వెంకటకవులను గురించి ప్రసంగించాను. మీకు కుదిరితే ఈ లంకెను చూడండి. http://teluguyankee.blogspot.com/2010/03/blog-post_27.html

    ReplyDelete
  6. మమ్మల్నీ పిలవకపోయారా? స్వరయుక్తంగా పద్యం విని ఎన్నాళ్ళయ్యిందో కనీసం మీరు ఆయన పాడినవి రికార్డు చేసి పెట్టి ఉండవలసినది విని ఆనందించేవాళ్ళం! ఎంతో మధురమయిన పద్యాన్ని చాలా చక్కగా వివరించారు! ధన్యవాదాలు!

    ReplyDelete
  7. వెనుకటి కాలంలో లోగిళ్ళలో జరిగే పెళ్ళి తంతు మీ టపా గుర్తుకు తెచ్చింది. ఆ పద్యాలూ, పాటలూ. నవ్వులూ, కేరింతలూ, వేళాకోళాలూ, హాస్యాలూ , పేకాటలూ, వాహ్ !

    పద్యాలు విని చెవుల తుప్పు వదిలి పోయింది. మరిన్ని పద్యాలు చదివి మరో చక్కని టపా పెట్టండి.
    మీ పద్యాలు విని పరవశించి పోయానంటే నమ్మండి.

    ReplyDelete
  8. please see this blog ..www.gitasairam1111.telugu blogspot.com

    ReplyDelete
  9. వ్యాఖ్యలు రాసిన అందరికి కృతజ్ఞతలు.
    మొదటి పద్యం నేను పాడిందని కొందరు అపోహపడ్డట్టుగా అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. :-)
    కాదండోయ్ కాదు! అంత గొంతు, స్వరజ్ఞానమూ ఉంటే ఈపాటికి నా బ్లాగులో ప్రస్తావించే పద్యాలన్నీ పాడి వినిపించెయ్యనూ! :-) ఇది షణ్ముఖ ఆంజనేయులుగారు పాడింది.

    సనత్‌గారు, యర్రాప్రగడ రామకృష్ణగారి పేరు విన్నానండి. బహుశా టీవీలోనో ఎక్కడో చూసే ఉంటాను.
    సురేశ్‌గారు, మీ టపా ఎప్పుడో చూసానండీ! మిమ్మల్ని కలవక పూర్వమే :)
    రసజ్ఞగారు, అది అప్పటికప్పుడు అసంకల్పితంగా జరిగింది కాని ముందు అనుకోలేదుగా పిలవడానికి. :) అయినా మీరు పద్యాలు వినడానికింతగా మొహంవాచి ఉన్నారని నాకు తెలియదు కదా!
    జోగారావుగారు, అవునండీ. మీరు చెప్పినవన్నీ లేకపోతే అది పెళ్ళే కాదు!

    ReplyDelete
  10. ఈ టపా కాకతాళీయంగా ఇప్పుడే చూడడం జరిగింది. గొప్ప కళాకారులబృందం మధ్య కూర్చొని రసాస్వాదన చేసిన అనుభూతి కలిగింది.స్వయంగా నేను పాడలేనుగానీ... పాండవోద్యోగ విజయాలు వంటి ఎన్నో స్టేజీ నాటకాలను మా చిన్నతనంలో ప్రముఖ కళాకారులు ప్రదర్శిస్తున్నప్పుడు చూసే అదృష్టం అయితే ఉంది. ఇప్పుడు ఈ టపా చూస్తుంటే మా చీరాల టౌన్ హాలులో నాటకం చూస్తున్న అనుభూతి కలిగింది, ధన్యవాదాలు!

    ReplyDelete
  11. బాగున్నది

    ReplyDelete
  12. This Nataka kacheri story is very well

    ReplyDelete