ఆ మధ్యనే సంపత్కుమార, ఈ మధ్యనే వడలి మందేశ్వరరావుగారు. విశ్వనాథ సాహిత్యాం, ముఖ్యంగా రామాయణకల్పవృక్షం, లోతులను దర్శించి మనకి చూపించగల/చూపించిన దక్షులు - ఒకొక్కరే రాలిపోతున్నారు. కిందటి వారం అఫ్సర్ గారి బ్లాగు చూసేదాక మందేశ్వరరావుగారి అస్తమయం గురించి నాకు తెలియనే లేదు! బహుశా విరిగే వార్తల వెల్లువలో అదెక్కడో కొట్టుకుపోయి ఉంటుంది. ఇలాంటివారి గురించిన వార్తలు ఎంతమందికి ఆసక్తినిస్తాయి గనక!
నాకు మందేశ్వరరావుగారు పరిచయమయ్యింది వారి "ఇది కల్పవృక్షం" పుస్తకంతో. కల్పవృక్షం కన్నా ముందే నాకీ పుస్తకం పరిచయం. కల్పవృక్షాన్ని నాకు పరిచయం చేసిన పుస్తకమది. ఒక కవి గురించి బాగా తెలిసినప్పుడే అతను వ్రాసిన కవిత్వాన్ని సరిగాను లోతుగాను అర్థం చేసుకోడానికి వీలవుతుంది. కవి గురించి తెలియడమంటే అతని పుట్టుపూర్వోత్తరాలో, అతని వ్యక్తిగత అలవాట్లో కాదు. ఆ కవి సమస్త సాహిత్యంతోనూ పరిచయం. అందులో దాగిన మూలసూత్రం అంతుబట్టడం. ఈ విషయం నాకు బాగా తెలిసింది "ఇది కల్పవృక్షం" చదివాకనే.
ఈ పుస్తకంలో "మఱలనిదేల రామాయణంబన్న..." అనే ఉపోద్ఘాత వ్యాసంలో, ఆకాశమంత విశ్వనాథభారతిని అద్దంలో చూపించే ప్రయత్నం చాలా సమర్థవంతంగా చేసారు మందేశ్వరరావుగారు.
"వేషాలెన్ని మారినా మనిషిలోని నాడీ స్పందనలో చరకుని నాటినుండి నేటి దనుక సామ్యాన్ని పసిగట్టగలం. అలాగే నాగరికత మారినా, విలువలు మారుతున్నా, జాతియొక్క జీవనాడి ఎక్కడో అవిచ్ఛిన్నంగా స్పందిస్తూనే ఉంటుంది. అది కృతయుగాదినుండి నేటిదాకా ఒక్కలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ జాతికొక అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉంటుంది. అదికాస్తా స్తంభించిపోతే, జారిపోతే ఆ జాతి నశించినట్లే. అది మరో జాతో, జీవరాశో అవుతుంది. ఇట్టి దర్శనం కల విశ్వనాథకు రామాయణం త్రేతాయుగం నాటి కథ అవదు."
అని, విశ్వనాథ దర్శనాన్ని స్పష్టంగా సంగ్రహంగా మన ముందుంచారు. విశ్వనాథ సాహితీమూర్తిమత్వాన్ని వివరించాక, "మరి ఇంతటి కవి ఒక కావ్యాన్ని వ్రాయాలని సంకల్పిస్తే - మిల్టన్ చెప్పినట్ట్లు - తర్వాతి తరాలవారు కోరి మరచిపోకుండా ఉండే మహాకావ్యాన్ని వ్రాయ సంకల్పిస్తే, దాని వస్తువు ఎట్టిదై ఉండాలి?" అని ప్రశిస్తారు. దానికి సమాధానం కోసం ఇలా ఆలోచిస్తారు:
[
అందులోని పాత్రలలో వైవిధ్యముండాలి. ఒక్క రాముడూ, ఒక్క రావణుడే కాదు - మనకు అంతుపట్టని ఒక కుంభకర్ణుడూ, ఒక శబరీ ఉండాలి. దగ్గర దగ్గరగా ఉంటూనే తేడా విస్పష్టంగా కనపడే సుమంత్రుడూ మాతలీ ఉండాలి. వీరికి దీటుగా అటు రావణుని సారథి ఒకడు ఉండాలి. శీలాన్ని తీర్చే తన దక్షతనంతనూ సవాలు చేసేటట్టు, ఏ కైక పాత్రకో గుండె మార్పిడి చేసి, ఆమెను సరికొత్త పాత్రగా దిద్దాలి. నగరంలో ఒక అరుంధతి, అడవిలో ఒక అనసూయా, కిష్కింధలో తార, లంకలో మండోదరీ మనకు కనబడాలి. లోక రక్షణకై వ్రతాన్ని పూనిన అగస్త్యుడూ, సీతారక్షణకై ప్రాణాలు వదలిన జటాయువూ ఉండాలి. మాత్సర్యానికి ప్రతీక అవాలొక పర్వతం. మరొక రాక్షసుడు దున్నపోతే కావాలి. ఇలా ఎందరు? ఎందరో పాత్రలు అవసరమవుతారు. వారందరికీ తలమానికంగా ఉండే మహా జ్ఞాని, మౌని, వాగ్మి, కార్యకరణ దక్షుడు, ఇత్యాది లక్షణాలుండే ఏ ఆంజనేయుడో ఉండాలి.
వీళ్ళందరినీ తనచుట్టూ పరిభ్రమింప చేసుకొనే ఒక నాయకుడు, రాముడు కావాలి. అట్టి రాముడు ఎవరి గవేషణము తన జీవితానికి పరమార్థమనుకున్నాడో, అట్టి లోకమాత, సీతాదేవి, కూడా ఒక పాత్ర అవాలి. అంటే అదొక లోకం అవ్వాలన్న మాట. అందులో మానవలోకం అంతా ప్రతిఫలించాలి.
]
ఇది విశ్వనాథ కల్పవృక్షంలో పాత్రలని ఎలా తీర్చిదిద్దారన్నదానికి పరిచయం. మానం పాత్రలని ఎలా పరిశీలించాలన్న దానికి సూచన. ఇలా పరిచయం చేస్తునే మరింత ముందుకి సాగి ఇలా వివరిస్తారు:
[
ఇక విశ్వనాథ ప్రధానంగా, వస్తుతః కవి. వస్తువు ఎట్టిదైనా, అది ఆయన కవిత్వానికి నికషోపలంగా ఉండాలి. అంతటి కవిత్వమున్న వస్తువేది? అంతటి రససృష్టి కాకరమైన కథ ఏది? అట్టి కవి ఏడి? అంటే ఆయనకు వాల్మీకి తప్ప మరెవ్వరూ సుకవి శబ్ద వాచ్యునిలా కనబడలేదు. సర్వకావ్య వాక్కు ఆ మౌని వదన సీమనుంచే పుట్టింది.
"అచ్చమైన యమృత మమరులు త్రావినా
రోయి! దానికే నసూయ పడను
పరమమౌనియైన వాల్మీకి కృత రామ
సత్కథా సుధారసంబు ద్రావి"
ఇన్ని లక్షణాలున్న మహాకావ్యాన్ని రచించడానికి సమకట్టే కవి, కేవలం కొత్త కథను కట్టడంతోనే కాలం సరిపోయే ఏ కళాపూర్ణోదయం వంటి కథనో శ్రమపడి నిర్మించ దలచుకోలేదు.
కావ్యంలో కావలసింది కవిత, రసభావాలు. వీనికి పుష్కలంగా అవకాశమిస్తూ, పాత్రలలోని వైవిధ్యాన్నీ, వర్ణనలలో రామణీయకతనూ, అలంకారంలో వైదగ్ధ్యాన్ని సాధిస్తూ, దుష్టశక్తుల ప్రాబల్యం వల్ల, పరాయిపాలన తీవ్రతవల్ల, నిర్జీవమైన సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికి, సంశయగ్రస్తుడైన ఆధునిక మానవుణ్ణి, మహోత్తుంగ శృంగంలా పెరిగిన మానవుణ్ణి చూపడానికి, ఒంటరిగా మిగిలిన కుంటి కాలుమీద నిలబడలేక కుప్పగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ధర్మాన్ని సంజీవితం చేయడానికి, వస్తువెట్టిదై ఉండాలన్న ప్రశ్న విశ్వనాథకు ఎదురైనప్పుడు -
ఆయనకు కనబడింది ఈ రామాయణం. అందుకే "మఱల నిదే రామాయణం"! అందుకే ఆయన ప్రతిజ్ఞ:
"ముని ఋణము దీర్ప నీ కావ్యమును రచింతు"నని. ఆ ప్రతిజ్ఞ నుంచి పుట్టిందే "కల్పవృక్షము".
]
రామాయణకల్పవృక్షానికి ఇంతకన్నా గొప్ప పరిచయం సాధ్యమా? కల్పవృక్షం ఒకో కాండనూ తీసుకొని, అందులో ఉన్న ఎత్తులను, లోతులనూ తల స్పర్శిగానే అయినా, ఎంతో సమర్థవంతంగా అద్భుతంగా వివరించారీ పుస్తకంలో. ముగింపు వ్యాసంలో వారి ముగింపు మాటలివి:
[
ఇన్ని మహార్థాలను వివరించడం చేతనే కల్పవృక్షం మహాకావ్యమైంది. ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ఇమిడ్చానని విశ్వనాథ అనేవాడు. వాట్లన్నింటినీ వెదుక్కోడానికి ఇంకో ప్రయత్నం చేయాలి. కావ్యాన్ని మరోసారి ఆ దృష్టితో అనుశీలన చేస్తేనే ఆ అర్థాలు ఆవిష్కృతమవుతాయి.
కల్పవృక్షంలో ఉన్న అర్థం ఒక పొరలో లేదు. అందులోని అర్థాలు పొరలు పొరలుగా ఉంటాయి. భావకుని భావయత్రీ శక్త్యవధికంగా, వ్యుత్పత్తిని అనుసరించి ఒక్కొక్క పొరలోని అర్థమూ ఆవిష్కృతమవుతుంది.
ఇన్ని ఇమిడి ఉండబట్టే ఇది కల్పవృక్షమైంది.
ఇందులో ఉన్నది సద్యోనిర్గతమైన సర్వకవితా సంభారము.
ఇది కల్పవృక్షం!
]
మందేశ్వరరావుగారు ఇంకో ప్రయత్నం చెయ్యలేదు. చేసారేమో, మనదాకా అందలేదు. ఇక వారు చేసే అవకాశం లేదు. మరెవరో చేస్తారన్న ఆశకూడా లేదు.
శిశిరంలో ఆకులు రాలిపోవడం సహజం. వసంతం వస్తే మళ్ళీ కొత్త చిగురులు వేస్తాయి. అలాంటి వసంతం ఎప్పుడో!
పూర్తిగా చదవండి...
Thursday, March 24, 2011
మరో పండుటాకు రాలిపోయింది!
Friday, March 11, 2011
దిగిరావా దాశరథీ!
దిగిరావా దాశరథీ!
నువ్వు కురిపించిన అగ్నిధార, నువ్వు వినిపించిన రుద్రవీణ, నువ్వు ఆశించిన మహాంధ్రోదయం పిచ్చెక్కిన మా మనస్సులకి, మొద్దుబారిన మా హృదయాలకి, చచ్చిపోయిన మా ఆత్మలకి మళ్ళీ అవసరం.
నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తరచినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను
కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నలను గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోటుల నొక్కటే ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి !
అని ఆ రోజెప్పుడో నువ్వు గొంతెత్తి పాడావుట!
ఇవాళ మా గుండెలే రాక్షసమయ్యాయి దాశరథీ! మా చేతులతో మేమే మహాంధ్ర సౌభాగ్యాన్ని చెరిపేసాము. చేవ చచ్చిన తెలుగు జాతికి, నీతి చచ్చిన తెలుగు జాతికి, బుద్ధి పుచ్చిన తెలుగు జాతికి, గుండెల్ని కుదిపేసి బూజు దులిపేసే నీ కవిత్వం కావాలి. దయచేసి మరొక్కసారి నీ గొంతు సవరించుకొని ఆకాశమంత యెత్తు అరవ్వూ!
చచ్చిపోయె చేవ, చచ్చె సంస్కారము
చచ్చిపోయె సిగ్గు, చచ్చె తెలివి
పెచ్చరిల్లిపోయె పిచ్చి విద్వేషము
చచ్చిపోయె తెలుగుజాతి పరువు
పగలగొట్టిరి విగ్రహమ్ములు
పగలగొట్టిరి నిగ్రహమ్మును
తగలబెట్టిరి తెలుగు సంస్కృతి
పగలగొట్టిరి గుండెలన్
ఛీ! యిది యేమి జాతి! మన చేతులతో మన కొమ్మలే తెగన్
గోయుచునుంటి మస్థికలు కుళ్ళెనొ నెత్తురు చల్లబడ్డదో!
పోయెను జాతి గౌరవము బుద్ధుని సాక్షిగ పుణ్యభూమిలో
గాయము శాశ్వతమ్మిది వికారపు మచ్చిది మాసిపోవునా?!
పూర్తిగా చదవండి...
Wednesday, March 2, 2011
మహాశివరాత్రి శుభాకాంక్షలు!
మహాశివరాత్రి శుభాకాంక్షలు!
మహేశ్వరునికున్న అనేకానేక విశిష్టతలలో అతని నటన్మూర్తి ప్రత్యేకమైనది. అతను నటనానికే రాజు. శివుని పద నర్తనలో విశ్వమంతా సంచలిస్తుంది. ఆ చైతన్య తాండవ హేలా విలాసంలో అణువణువూ లయాన్వితమవుతుంది. ఆ నటరాజ స్వరూపం ఊహకే పరమాద్భుతం! ఎందరో కవులా స్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం చేసారు. వారిలో నన్నెచోడుడు కుమారసంభవంలో చేసిన వర్ణన లయగ్రాహి, లయహారిణి వృత్తాలలో ఎంతో లయబద్ధంగా సాగుతుంది.
విశేషమేమిటంటే ఇది దక్షుడు చేసే శివస్తోత్రం. దక్షాధ్వర ధ్వంసానంతరం శాంతించిన శివుడు కరుణించి దక్షుడిని క్షమించిన తర్వాత భక్త్యావేశంతో దక్షుడు చేసిన స్త్రోత్రమిది.
ఫాలతల విస్ఫురిత లోలతర భాసుర వి
శాల భయ దాసుర కరాళ నయనాగ్ని
జ్వాలలొకొ? పింగళ జటాళి యొకొ? నా బెరసి
తూలి, దివి భూషణ చయాలుళిత దీర్ఘ
వ్యాళ నికరంబొకొ? కరాళి యొకొ? నా దనరి
క్రాల, వర నృత్య పరిలోలుడగు శ్రీకం
కాలధరు, నుజ్జ్వలకపాలధరు, సన్నిశిత
శూలధరు, నీశ్వరు, దయాళు నుతియింతున్
శివుడు తాండవమాడుతూంటే, తలపై ఎఱ్ఱని జటలు ముడివిడి, వ్యాపించి, సంచలించిపోయున్నాయి. అవి ఘోర రాక్షస భయంకరములైన ఫాలనేత్ర జ్వాలలా అన్నట్టుగా ఉన్నాయి! నాట్య భంగిమలతో అతని నాలుగు చేతులూ ఆకాశంలో కదలాడుతూంటే అవి చేతులా నాగుపాములా అన్నట్టుగా ఉన్నాయి. అలాంటి కంకాలధరుడు, శూలధరుడు, దయాస్వరూపుడు అయిన నటరాజుని భకితో స్తుతిస్తున్నాడు దక్షుడు.
ఉర్వర చలింప, గులపర్వతచయం బడర,
బర్వ భువి నంబునిధు లౌర్వశిఖి యాడన్
బూర్వసుర నాగ సుర పూర్వదిగధీశ యమ
వార్విభు ధనేశ్వరుల గర్వము లడంగన్
సర్వగణ ముఖ్యులును, సర్వగణ భూతములు
నార్వ, నహిభూషణము లార్వ, దిశలం గం
ధర్వతతి పాడగ, నపూర్వనటనాదిగురు,
సర్వగతు, సర్వమయు, శర్వు నుతియింతున్
ఆ తాండవార్భటికి భూమి సంచలిస్తోంది. కులపర్వతాలు అదిరిపోతున్నాయి. సప్తసముద్రాలు ఉప్పొంగుతున్నాయి. బడబాగ్ని అతలాకుతలమవుతోంది. రాక్షసుల, నాగుల, దేవతల, అష్టదిక్పాలకుల గర్వమంతా అణిగిపోతోంది. గణాధీశ్వరులు, సమస్త భూత గణము అదిరిపోతోంది. ఆభరణాలైన సర్పాలు అలసిపోయి నిట్టూర్పులు విడుస్తున్నాయి. దిశలన్నిటా గంధర్వగానం వినిపిస్తోంది. నటనకి తొలిగురువు, సర్వజ్ఞుడు, అంతటా నిండినవాడు అయిన శర్వుడిని భక్తితో నుతిస్తున్నాడు దక్షుడు.
తాళరుతి గీతిరుతి మేలి తత వాద్యరుతి
చాల రసవంతమయి యోలి నులియం, ద
త్తాలగతి మెట్టుచును గేల జరు లిచ్చుచును
జాలి యనురాగమున గ్రాలుచు సుఖాబ్ధిం
దేలుచును మే మఱచి వ్రాలుచును గెత్తుచును
లోలగతి నేత్ర భుజ చాలనముతో బ్రే
తాలయమునందు సుఖలీల నెఱసంజ నను
కూలగతి నాడు శివు శూలి నుతియింతున్
తాళా గీత ధ్వనులు రెండూ మేళవించిన సంగీతం చాలా రసవంతమై నినదిస్తోంది. ఆ తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, చేతులతో చఱుపులు చఱుస్తూ, అనురాగంతో ఉప్పొంగుతూ, సౌఖ్యసముద్రంలో తేలిపొతూ, మైమఱచి సోలిపోతూ, గంతులు వేస్తూ, నాట్యానికి అనుగుణంగా కన్నులు, భుజాలు కదిలిస్తూ శ్మశానంలో సంధ్యావేళ ఆనంద తాండవం చేస్తున్నాడు శివుడు. ఆ శూలిని స్తోత్రం చేస్తున్నాడు దక్షుడు.
కఱ గళము ఘనఘనము తెఱగనగ, నుఱికలును
గఱడియలు ద్రిపుదలును గిఱిడియలు బెల్లై
యుఱుము లన వడి జెలగ గొఱ నెలయు దనురుచులు
మెఱుగులన దశదిశల మెఱవ, దలమీదన్
వఱలు సురనది దొలకి నెఱి జినుకులును గిరియ
దఱిమికొని తొలుమొగులు తఱి యనగ నృత్యం
బొఱ వమర లలితగతి మెఱయు శివు డజు డమరు
డుఱుఫలము లొసగునని యెఱిగి నుతియింతున్
శివుడు నాట్యం చేస్తూంటే నల్లని కంఠము దట్టమైన మేఘంలాగా ఉంది. ఉఱికలు, కఱడియలు, త్రిపుదలు, కిఱిడియలు మొదలైన వాద్యవిశేషాలు చేసే ఢమఢమ ధ్వనులు ఉఱుముల్లాగా ఉన్నాయి. తెల్లని శరీరము, పైనున్న నెలవంక మెఱుపులా మెఱుస్తున్నాయి. తలమీదనున్న ఆకాశగంగ తొణికి చినుకులుగా కురుస్తోంది. అలా తొలకరి సమయాన్ని స్ఫురింజేస్తూ నాట్యం చేస్తున్న ఆ పరమేశ్వరుడు భక్తాభీష్ట ప్రదాత.
కరనికర మురు విటపవరము లన, గరతలము
కరుణరుచి దలిరు లన, గరజములు పుష్పో
త్కర మనగ, వనరుహజ హరి దనుజ ముని మనుజ
సుర గగనచర భుజగ గరుడ గణ యక్షే
శ్వరుల కతిదయ నొసగు వరఫలము లనిశమును
భరితమయి మధుసమయ సురవర మహీజ
స్ఫురణ కెన యన, దనరు వరదు, హితనటనరతు
బరమపరు, పరమగురు, బరము నుతియింతున్
ఆ నటరాజమూర్తి చేతులు పెద్దపెద్ద కొమ్మల్లాగా ఉన్నాయి. అఱచేతులు ఎఱ్ఱని కాంతితో మెఱుస్తూ చివురుల్లాగా ఉన్నాయి. చేతి గోరులు పువ్వుల్లా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, రాక్షసులు, మునులు, మనుష్యులు, దేవతలు, ఖేచరులు, నాగులు, గరుత్మంతుడు, ప్రమథ గణాలు, కుబేరుడు మొదలైన వాళ్ళకి ఇచ్చే వరములు ఫలముల్లా ఉన్నాయి. నిరంతరం ఫలభరితమైన వసంతకాల కల్పవృక్షాన్ని స్ఫురింపజేస్తున్న ఆ నటరాజ మూర్తికి, పరాత్పరునుకి, పరమగురువుకి పరమాత్మునికి భక్తితో అంజలి ఘటిస్తున్నాడు దక్షుడు.
ఆ దక్షుడితోపాటు మనమూ ఆ నటరాజ విరాణ్మూర్తిని ఆత్మలో భావించి భక్తితో సన్నుతిద్దాం!
ఓం నమశ్శివాయ
పూర్తిగా చదవండి...