తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, September 9, 2010

ఈద్ ముబారక్!

ఈద్ ముబారక్!

ముస్లిముల కాలమానం ప్రకారం రమాదాన్ తొమ్మిదవ నెల. ఇది చాలా పవిత్రమైన నెల. ఆ నెలాఖరున వచ్చే పండగ ఈద్. హిందూ కాలమానం ప్రకారం తొమ్మిదవ నెల మార్గశిరం. అది కూడా మనకి చాలా పవిత్రమైన మాసమే! మాసానాం మార్గశీర్ష్యం అని గీత చెపుతోంది కదా. ఈ పోలిక యాదృచ్ఛికమే కావచ్చు కాని నాకు బాగుందనిపించింది. మరొక విశేషం ఏమిటంటే, ఈ రమాదాన్ సాధారణంగా మన శ్రావణమాసంలో వస్తుంది. మరి శ్రావణమాసం కూడా మనకి పవిత్రమైన మాసమే, చాలా నోములూ వ్రతాలూ ఉన్న మాసం. అలాగే ఈద్ పండగకి ఇటు అటుగానే (ఈసారి అది రేపే!) వినాయకచవితి కూడా వస్తుంది. ఆనందంగా జరుపుకోడానికి ఏ పండగైతేనేం! భక్తితో కొలవాడానికి ఏ దేవుడైతేనేం!

ఈ ఈద్ పండగ సందర్భంగా, ఉమర్ ఆలి షా కవిగారు ఆల్లా మీద రాసిన కొన్ని పద్యాలు చదివి ఆనందించండి. ఇవి కాళహస్తీశ్వర శతక పద్యాలకి దగ్గరగానే ఉంటాయి! ఏకం సత్ విప్ర బహుధా వదంతి.

ఉమర్ ఆలి షా 1885వ సంవత్సరంలో పిఠాపురంలో పుట్టారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆధ్యాత్మిక విద్యాపీఠంలో వీరు ఆచార్యులుగా ఉండేవారు. యోగశాస్త్ర ప్రవీణులు. అంతేకాక సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పారశీకం, ఇంగ్లీషు భాషలలో పాండిత్యం సంపాదించారు. ఉర్దూ వీరి మాతృభాష. తెలుగులో ఎన్నో నాటకాలు, నవలలు, పద్య కావితలు రాసారు. ఉమర్ ఖయాం రుబాయితులని పారశీకం నుండి నేరుగా తెలుగు పద్యాలలోకి అనువదించారు.
ఉమర్ ఆలి షాగారి "అల్లా ప్రభూ" అనే కవితా ఖండిక నుండి కొన్ని పద్యాలు:

శ్రీ లీజాలిన మేటివంచెఱిగి నే సేవింపగాబోను, ఆ
శ్రీలన్ గైకొననెంచి కుంటినయి అర్థింపంగ రాలేదు నీ
శ్రీ లావణ్య ప్రపుణ్య మార్గమున నా చిత్తంబు సంధిల్ల నే
వేళన్ గొల్చెద భక్తి పూర్ణమతినై విశ్వజ్ఞ అల్లాప్రభూ!

నిను జింతించి భజించి మ్రొక్కి మదిలో నిత్యంబు సేవించి నీ
వినుతిన్ జేసియు దానికిన్ ఫలముగా విశ్వజ్ఞ మోక్షంబు దె
మ్మని నే బేరము పెట్టలేను భవదీయంబైన ధ్యానంబు నా
పనిగా జేసెద నూపిరింబలె స్వభావం బొప్ప నల్లాప్రభూ!

జలరాశిన్ విలసిల్లు వీచికలతో సఖ్యంబు గావించి, పు
వ్వులతో నెయ్యము సల్పి తత్సుధలతో బొత్తై, నభోవీథి జు
క్కలతో వియ్యములంది, నీ ఘనఘనాకారంబు జింతింతు, ని
ర్మల సౌభాగ్యసుధా ప్రవృష్టి గురియన్ రావయ్య అల్లాప్రభూ!

జలమధ్యంబున లేచు బుద్బుదము లోజన్ బెద్దలై కొన్ని, కొ
న్ని లవాకారములై తనర్చు పగిదిన్ నీ యందు రూపించు మ
ర్త్యులు నీచాధిక తారతమ్య భవ సందోహమ్ములన్ భ్రాంతులై
కలహింపన్ జనుచుందు రీవని యెఱుంగన్ లేక అల్లాప్రభూ!

కలుముల్ లేములు వచ్చుపోవునవి మేఘవ్రాతముల్ మింటిపై
కలయం బ్రాకుచు నేగునట్లు సుఖదుఃఖ ప్రాప్తమప్రాప్తముల్
కలలం బోలె దనర్చు గోరికలు వృక్షచ్ఛాయలన్ బోలె మ
ర్త్యుల వెన్నాడు మహేంద్రజాలము జగంబూహింప నల్లాప్రభూ!

ధనహీనుండయి పుత్రదార గృహయుక్తంబైన సంసార దుః
ఖ నిధిన్ మున్గుచు తేలుచున్ నిను మదిన్ గాసంత నూహింప లే
కనయంబున్ మృగతృష్ణకై జనెడు దాహాసక్తునిన్ బోలె బో
వును మోహావిలచిత్తుడై చపలుడై మూర్ఖుండు నల్లాప్రభూ!

నిను తేజోలసితాంతరాత్మ వనుచున్ వీక్షింతునో లేక లో
క నికాయ ప్రణుతాఖిల ప్రజనుగా గాంక్షింతునో పుణ్య స
జ్జన దృగ్గోచరతత్త్వమూర్తివని నే సాధింతునో భక్తి నే
మని పూజింతు బరాత్పరాత్మవు మహాత్మా! దేవ! అల్లాప్రభూ!

రాజుల్ ధూర్తులు దుష్టచిత్తులు మృషాప్రాగల్భ్యమూర్తుల్ వృథా
వ్యాజస్త్రోత్ర పరాయణుల్ కుమతులా పాపాత్ములన్ జేర నే
యోజన్ జెల్లదు కోవిదప్రతతి యుద్యోగించి నీ కర్థులై
యోజింపన్ నిఖిలార్థముల్ బడయలేరో రాదొ అల్లాప్రభూ!

నీవే విశ్వమయుండవైన దివిపై నీరేజజాండంబుపై
ఆ వైకుంఠముపై వసింతువన మిధ్యావాదమే గాద టెం
కే వృక్షాకృతినైన వేళ్ళ నది వీక్షింపంగ రానేర న
ట్లీ వెందున్ గనరావు సర్వము భవత్ దృశ్యంబు అల్లాప్రభూ!

6 comments:

  1. చాలా బాగున్నాయి.
    సందర్భోచితంగా పంచినందుకు అనేక ధన్యవాదాలు.

    ReplyDelete
  2. కామేశ్వరరావుగారు,

    ఉమర్ అలీషా గారి పద్యాలు బాగున్నాయి. ఈ పద్యాల్లో "అల్లా ప్రభూ" బదులు "రామా! ప్రభూ" అనుకున్నా భావం ఒకటే ఉంటుంది. ఎదో మతం మార్పిడి జరిగిపోయినట్టు అనిపించదు.

    రాజమండ్రి గౌతమీఘాట్ లో వారి ఆశ్రమానికి నేను వెళ్ళాను. ఆత్మసోధన, ఆత్మానుభూతి వంటివాటి మీద వారి భావాలు కవితారూపం లో అక్కడ కనిపిస్తాయి. ఎంతో ముచ్చటగా ఉంటుంది అవి చదివితే.

    మంచి పద్యాలనందించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ఈద్ ముబారక్!

    ReplyDelete
  3. కామేశ్వరరావు గారు

    చక్కని పద్యాలను తెలియజేశారండీ. ఎంతో లలితమైన భాషలో, ఎంతో ఆర్ద్రతతో ఉన్న ఈ పద్యాలు అందరికీ అర్థమవుతాయి. సందర్భోచితంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈద్ ముబారక్.

    ఈవేళ నా (దూరపు) మిత్రులు ఇద్దరు కులాల పేరున కొట్టుకుంటుంటే చూసి "బిట్స్ పిలానీల్లోనూ, ఐఐటీలలోనూ చదువుకున్నా మనకు కులాలపిచ్చి పోదు కదా..." అని బాధపడుతున్న తరుణంలో మీ బ్లాగు నాకు కొంత ఊరటను కలిగించింది. కృతజ్ఞతలు.

    సందీప్

    ReplyDelete
  4. కామేశ్వర రావు గారూ ,
    నమస్కారం. పై పద్యాలు బాగున్నాయి. అల్లా అని చూడక పొతే సనత్ గారు చెప్పినట్లు ఏ ఆదిభట్ల వారో వ్రాసి నట్లున్నాయి. అందుకే పోతన గారి పద్యానికో పేరడీ.

    కారే రాముడు కృష్ణు విష్ణు ప్రభువుల్ కాంచంగ కామేశ్వరుల్
    వేరే దైవము నంచు మించి కొలువన్ వేమాఱు నల్లా ప్రభున్
    తీరౌ వారికి ,వీరు వారు లనకన్ దీవింపు మో దైవమా
    మీరే చెప్పుడు జ్ఞాన భిక్ష నిడరే "మీ రాజు మా రాముడే!"

    ReplyDelete
  5. గన్నవరపుగారికి నమస్కారాలు. మీ పద్యం బాగుంది.
    అలి షాగారి ఈ పద్యాలలో గాఢమైన తత్త్వం దాగి ఉంది. ముఖ్యంగా "టెంకే వృక్షాకృతినైన వేళ్ళ నది వీక్షింపంగ రానేర నట్లీ వెందున్ గనరావు సర్వము భవత్ దృశ్యంబు అల్లాప్రభూ" అన్న వాక్యం పదేపదే ఆలోచించాల్సింది!

    ReplyDelete
  6. కామేశ్వర రావు గారూ,
    ఆ తత్వము అద్వైత తత్వమును తలపిస్తున్నట్లున్నది.తత్వమేదైనా పద్యాలన్నా,తెలుగు భాషన్నా అభిమానం ఉండడం వలన ఉమర్ ఆలీషా వారి పద్యాలు బాగా నచ్చాయి. తెలుగు భాషాప్రియులకు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు.

    ReplyDelete