తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, March 29, 2010

భవిష్యత్తు

ఈ రోజు నిశ్యాలోచనాపథం ఫేం సౌమ్యగారి గూగుల్ బజ్ చూడగానే నాకీ కవిత గుర్తుకు వచ్చింది! ఇది ఎవరిదో ఎక్కడిదో వివరాలు త్వరలో విడుదల :-)

భవిష్యత్తు
======

నడచుచున్న పథంబు కంటక శిలావృ
తంబు, కటికచీకటి పైన, దారిసుంత
నాకు దోచదు, లాగుచున్నదియు నన్ను
కాలశైవలిన్యావర్తగర్భమునకు

(నడుస్తున్న దారంతా ముళ్ళూ రాళ్ళూ. పైనంతా కటికచీకటి. దారి ఏమాత్రం కనబడటం లేదు. కాలమనే నది నీటి సుడిలోకి నన్ను లాగుతున్నట్టుగా ఉంది.)

సురిగిపోయితి నంచు నెంచుకొనులోన
ముందు దూరాన కనవచ్చె పురుషుడొకడు
శతసహస్ర మార్తాండ తేజస్సహితుడు
హృదయ బాధా నివారణ మదనమూర్తి

(పూర్తిగా ఆ సుడిలో మునిగిపోతున్నానని అనుకొనే లోపల ముందు అల్లంత దూరంలో ఒక పురుషుడు కనిపించాడు. వందవేల సూర్యుల తేజస్సుతో ఉన్నవాడు. గుండెలో బాధని తీర్చే అందగాడు.)

అతి ప్రయాసంబు మీద నే నతనియున్న
తావునకు బోయి పడితి, నతండ దేమొ
అంజనావనీధర మట్టు లతి భయంక
రాకృతి వహించె, నాకు భయంబు తోచె

(అతి కష్టమ్మీద నేనతను ఉన్న చోటుకి వెళ్ళి పడ్డాను. అదేమిటో, అతను నల్లని అంజనా పర్వతాకారంలో భయంకరంగా కనిపించాడు. నాకు భయం వేసింది.)

పరుగులెత్తి మిక్కిలి దూర మరిగి వెనుక
తిరిగి చూచితి, నా చిత్రపురుషుడేలొ
నన్నుగని శాంతముగ నిల్చి నవ్వుచుండె
నా కతని నవ్వు దోచె స్వప్నంబువోలె

(పరుగులు పెట్టి, చాలా దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసాను. ఆ చిత్రపురుషుడు ఎందుకో నన్ను చూసి శాంతంగా నిల్చుని నవ్వుతున్నాడు. అతని నవ్వు ఏదో స్వప్నంలాగా అనిపించింది నాకు.)

వివిధ సూచీముఖోపలవిషమమైన
మార్గమున బోవుచుంటిని మరల నేను
ఇటుల జూతునుగద, ముందు నీ పురుషుడె
అతి మనోహరమూర్తి నన్నాహరించి

(ఎన్నో సూదుల్లాంటి మొనలున్న రాళ్ళతో నిండి నడవడానికి కష్టంగా ఉన్న త్రోవలో మళ్ళా పోతున్నాను. ఇటు తిరిగి చూసేసరికి ముందు ఆ పురుషుడే, ఎంతో మనోహరమైన మూర్తితో నన్ను ఆకర్షిస్తూ!)

9 comments:

  1. ఇతను కాలపురుషుడా ఏం కథ? :))
    ఇంతకీ ఎవరు వీళ్ళు - నిశి లాగానే ఆలోచిస్తున్నారు...

    ReplyDelete
  2. ఆ పురుషుడు మానవాకృతి దాల్చిన భవిష్యత్తు అనుకుంటున్నాను.

    ReplyDelete
  3. బాగున్నాయి పద్యాలు! శైలి జాషువా లాగా అనిపిస్తుంది.

    ReplyDelete
  4. వ్యాఖ్యానించిన అందరికీ నెనరులు.

    తెలుగుయాంకిగారూ, తర్వాత ఏమీ లేదండీ, కవిత మొత్తం అంతే! :-)
    సౌమ్యగారూ, మీ ఆలోచనలని ఎవరో కాపీ కొట్టేసారు చూసారా! :-)
    మందాకినిగారూ, మీరెలా అనుకుంటే అలాగే!
    చంద్ర మోహన్ గారూ, మీ ఊహ సరా కాదా అని తెలుసుకోడానికి మరి కొంత సమయం ఓపికపట్టాలి. :-)

    ReplyDelete
  5. బాగున్నాయండీ పద్యాలు తేలికపదాలతో. తదితరవివరాలు కోసం ఎదురు చూస్తూ, ధన్యవాదాలు.

    ReplyDelete
  6. ఈ కవిత ఎక్కడిదో ఎవర్రాసారో వివరాలు ఇక్కడ చూడవచ్చు:

    http://pustakam.net/?p=4332

    ReplyDelete