అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండంకరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖంశరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం
ఇది తెలుగువాళ్ళకి చాలందికి పరిచయమైన శ్లోకమే, కనీసం మొదటి పాదం. ఇది భద్రాచల ఆలయంలో గర్భగుడికి ముందు గది గోడపై ఉంటుంది కూడాను. ఈ శ్లోకం శ్రీరామకర్ణామృతంలోనిది అని ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇది వ్రాసింది ఆది శంకరాచార్యులవారని అంటారు. ఇదే నిజమైతే శంకరాచార్యూలవారి కాలానికే భద్రాద్రిపై శ్రీరాముడు వెలశాడని అనుకోవాలి! ఏదైతేనేం ఆ భద్రాద్రి రాముని రూపాన్ని వర్ణించే చక్కని ధారాసారమైన శ్లోకమిది. శ్రీరామకర్ణామృతాన్ని సిద్ధయోగి అనే అతను తెలుగులోకి మొట్టమొదట అనువదించారని చెప్తారు. ఇతనెవరో ఏ కాలానికి చెందినవారో నాకు తెలియదు. పై శ్లోకానికి అతని అనువాదం:
శరచాపాబ్జరథాంగముల్ కరచతుష్కప్రాప్తమైయుండ సు
స్థిర వామాంకమునందు సీత నియతిన్ సేవింప భద్రాద్రిపై
నిరదైనట్టి సరోజనేత్రు బలు యోగీంద్రేంద్ర సంస్తోత్రు భా
సుర కేయూరవిభూషణున్ దలచెదన్ శుద్ధాంతరంగమ్మునన్
ఇక్కడ అబ్జమంటే శంఖం, రథాంగం అంటే చక్రం. విల్లు, బాణము, శంఖము, చక్రము నాలుగు చేతుల్లో వెలుగుతూంటే, ఎడమతొడపై కూర్చుని ఉన్న సీతతో కేయూరాది భూషణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భద్రాద్రి కొండకొనపై వెలసి ఉన్న రాముని నీలమేఘశ్యాముని మనసారా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.
ఇంక, అంతటి భాషాపటిమ నాకు లేకపోయినా, నాకు వచ్చిన భాషలో రాముని గూర్చి చాన్నాళ్ళ క్రితం నేను వ్రాసిన పద్యాలు కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మరోసారి ఇక్కడ తలచుకుంటున్నాను:
"శ్రీరామా!" అని భక్తిన్
నోరారగ బిల్చినంత నుప్పొంగె మనో
వారాశి, కురిసె నమృతము
పారిన కన్నీటి సుధలు పద్యములయ్యెన్
నీ నామము నెమ్మనమున
నే నీమముతో స్మరింతు నిత్యము శ్యామా!
నానాటి జీవితమ్మిది
నీ నైవేద్యమ్మొనర్తు నిర్గుణధామా!
కలలోననైను నిన్నే
తలచే సౌభాగ్యగరిమ తక్క మరేదీ
వలదింక నాకు వరదా
కొలువై నీవుండ గుండెగుడిలో స్థిరమై!
ఆ రావణు బరిమార్చిన
ధీరోదాత్తుడవు నీవు, దీనుడ నేనున్
నా రాక్షసగుణముల సం
హారము గావించి బ్రోవవయ్యా రామా!
ఒకరికి తల్లివి తండ్రివి
ఒకరికి నువు బిడ్డవౌదు వొకరికి తోడున్
ఇక మరి నాకేమౌదువు
సకలము నీవే యటంచు స్వామీ కొలువన్!
నినునెన్నడు గనలేనని
మునుపెన్నడొ భాధపడుచు మూల్గితి గానీ
నను నేనే కనలేనని
కనుగొంటిని నేడు తుదకు కనువిప్పయ్యెన్!
నీలోపల నేనుంటినొ
నాలోపల నీవు దాగినావో యేమో
యేలాగున తెలియునురా
లీలా మానుష విలాస శ్రీరఘురామా!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Wednesday, March 24, 2010
శ్రీరామనవమి శుభాకాంక్షలు!
Subscribe to:
Post Comments (Atom)
మీ పద్యాలు చాలా బావున్నాయండి. అభినందనలు.
ReplyDeletepanDaga roju paanakam taaginamta haayi ga vumdi mee padyam chaduvutumTea chala bagumdi anDi
ReplyDeleteకామేశ్వరరావు గారు, మీరు రాసిన పద్యాలు అందరికీ అర్ధమయ్యేలా చాలా బాగున్నాయి. అభినందనలు.
ReplyDeleteభద్రాద్రి రాములవారికి నాలుగు చేతులని నాకిప్పుడే తెలిసింది. (నేను భద్రాచలం చూడలేదు.) అలానే శ్రీరామకర్ణామృతం గురించీ ఇప్పుడే వింటున్నాను.
ReplyDeleteమీ పద్యాల గురించి వ్యాఖ్యానించేంత సీను లేదు కాబట్టి చెప్పడం అనవసరం.
"నా రాక్షసగుణముల సం
హారము గావించి బ్రోవవయ్యా రామా!"
- ఈ ఆలోచనలో మాత్రం చాలా అర్ద్రత కనబడుతోంది. మనసును తాకుతోంది, ఒకచో పిండుతోంది కూడా.
మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు
ReplyDelete~సూర్యుడు
పారిన కన్నీటి సుధలు పద్యములయ్యెన్!
ReplyDeleteనీలోపల నేనుంటినొ
నాలోపల నీవు దాగినావో యేమో!
ఈ మాటలు తన్మయత్వాన్నీ, అన్వేషణా పథంలో ఎదురయ్యే భావాలని ప్రతిఫలిస్తూ మనసులో నిలిచి పోయాయి.
అభినందనలు.
కామేశ్వర రావు గారూ !
ReplyDeleteమీ పద్యాలు వింటూ చదువుతూంటే తేలికగా చెవులలోనుంచీ హృదయం లోనికి జారిపోతున్నయి-- కర్ణామృతమే !!
మీ పద్యాలు చదువుతూంటే దాశరధీ శతకం భావాలు వీచికలు వీస్తున్నట్టే ఉంది.
వాటిల్లో నాకత్యంత ఇష్టమైన వేడికోలు ఇప్పటికీ ఇది చదివిన ప్రతిసారీ గొంతు గద్గదమై ఆర్ద్రతో కన్నీళ్ళ పర్యంతం ఔతుంది....
పరుల ధనంబు జూచి పర భామల జూచి హరింప గోరు మత్
గురుతర మానసంబనెడు దొంగను బట్టి నిరూఢ దాస్య వి
స్ఫురిత వివేక పాశముల జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువున గట్టి వేయగదె? దాశరథీ కరుణా పయోనిధీ !!
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు..
వ్యాఖ్యానించిన అందరికీ నెనరులు.
ReplyDeleteరవి, అవును భద్రాచల రామునికి నాలుగు చేతులు. మరో ప్రత్యేకత ఏమిటంటే, శ్లోకంలో చెప్పినట్టు, పైచేతుల్లో శంఖం కుడిచేతిలోనూ, చక్రం ఎడంచేతిలోనూ ఉంటయి. సాధారణంగా విష్ణుమూర్తి కుడిచేత చక్రమూ ఎడం చేత శంఖమూ ధరిస్తాడు. భద్రుడు పిలిచిన పిలుపుకి విష్ణుమూర్తి గాభరాగా రావడంలో తడబాటుపడి శంఖచక్రాలని అటుదిటు ధరించాడని అందాలరాముడు సినిమా హరికథలో, బహుశా ఆరుద్ర అనుకుంటాను, చమత్కరించారు.
సనత్ గారూ,
మీరిచ్చిన దాశరథీశతకంలోని పద్యం చదివిన వెంటనే నాకు శివానందలహరిలో ఈ శ్లోకం గుర్తుకు వచ్చింది:
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖా స్వటతి ఝటితి స్వైరమభితః
కపాలిన్ భిక్షో మే హృదయకపి మత్యంత చపలం
దృఢం భక్త్వా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో
భక్తుల గోలంతా ఒకటే కాబోలు :-)
నినునెన్నడు గనలేనని
ReplyDeleteమునుపెన్నడొ భాధపడుచు మూల్గితి గానీ
నను నేనే కనలేనని
కనుగొంటిని నేడు తుదకు కనువిప్పయ్యెన్!
chaalaa baagundadi.
-Mahesh
This comment has been removed by the author.
ReplyDeleteకామేశ్వర రావు గారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? చాల కాలం తరువాత దేనికో గూగిలిస్తున్నప్పుడు మళ్ళీ అదురుపడిందీ పోస్టు.. అప్పటి భావాలు మళ్ళీ మదిలో మెదిలాయి.. ఈ మధ్య కాలం లో మిత్రులు ఫణి డొక్క గారి ముఖ పుస్తకంలో సీస పద్యంలో మొదటి నాలుగు పాదాలు ఇచ్చారు. మిగిలిన నాలుగు పాదాలు, ఆ పైన తేటగీతి వారిని రాయమన్నారు. దానికి నా స్పందన....పూరణ... వామాంకస్థితజానకీ పరిలసత్ శ్లోకం ప్రేరణతో
ReplyDelete---------
నీలాంబుదశ్యామ. నిరతశోభన సంప
దన్విత దివ్య దేహంబుతోడ
నలువుగా నొప్పెడు నాల్గు చేతులతోడ
పూర్ణేన్దు నిభ కాంతి ముఖముతోడ
-----------
తిమిర తామసమును తెగద్రెంచు కోదండ
శంఖచక్రములతో శరముతోడ
బంగారు మేనితో సింగారముననంక
మధివసించిన ముగ్ధ మగువ తోడ
సకలలక్షణలక్షిత లక్ష్మణుండు
తోడు నిలువగ కేయూర తొడవుదాల్చి
భద్ర గిరిపైన గొలువుండె భద్ర మొసగ
కమలనేత్రుడు రాముండు కరుణతోడ !!