తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, March 31, 2009

పద్యానికొక కొత్త గూడు - పద్యం.నెట్


ఎప్పుడో అంతరాంతరాల్లో ఒక చిన్న ఆలోచన విత్తనంలా నాటుకుంటుంది. అది సరైన సంరక్షణ లేక అలానే పడి ఉంటుంది. ఎవరో ఒకరు, ఒకరోజు హఠాత్తుగా దాన్ని గుర్తించి, దానికి నీళ్ళు పోసి, కష్టపడి మొలకెత్తేట్టు చేస్తే, ఆ విత్తనంలోంచి ఒక మొలక తలెత్తి ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ భూమికి ఎంత ఆనందం కలుగుతుంది! సరిగ్గా అదే ఆనందం ఇప్పుడు నేను పొందుతున్నాను.
అంతర్జాలంలో పద్యానికి ప్రత్యేకమైన ఒక గూడు నిర్మించాలన్న ఆలోచనే ఆ విత్తనం. ఆ చిన్ని మొలక పద్యం.నెట్. ఆ కృషీవలుడు యోగిగారు (అతనికి సహాయం చేసినవారు శివగారు, మరింకెవరైనా కూడా ఉన్నారేమో నాకు తెలీదు).
అయితే ఉన్న తేడా అల్లా, ఊరికినే పైన పడున్న విత్తనాన్ని సమంగా భూమిలోకి నాటింది కూడా ఆ రైతే.

కొన్ని నెలల క్రితం, పద్యాల కోసం ఒక ప్రత్యేకమైన సైటు ఏర్పాటు చేస్తే బావుంటుందని యోగిగారు ప్రస్తావించినప్పుడు, నాలోని ఆలోచన అతని ద్వారా వినడం ఆశ్చర్యం ఆనందం అనిపించింది.
అయినా స్వాతిశయం అడ్డువచ్చి, భలేవారే, అయితే ఇక నా బ్లాగెందుకు మూసెయ్య వచ్చు అన్నాన్నేను. ఆ సైటు ఏర్పాటు చేసి మీకిచ్చేస్తాను ఆ తర్వాత దాన్ని ఎలా నిర్వహిస్తారో మీ యిష్టం అని అతను మర్యాదగా జవాబు చెప్పారు. అయితే ఆ తర్వాత సావధానంగా ఆలోచిస్తే నేను పొరపాటుపడ్డానన్న విషయం అర్థమయ్యింది.
బ్లాగు ప్రపంచంలో, ఇంకా విస్తృతంగా చూస్తే అంతర్జాలంలో, పద్యాల గురించి రాసిన, రాస్తున్న వాడిని నేనొక్కణ్ణే కాదు. చాలా మంది, చాలా బాగా రాస్తున్న వారు ఉన్నారు కదా. అలాంటి అందరికీ కూడా ఒక సామాన్య వేదికగా ఉండాల్సిన గూడు, నా ఒక్కడి సొత్తూ కాకూడదు. అందులో పద్య ప్రియులందరూ భాగస్వాములు కావాలి. ఆ ఉద్దేశంతో, దానికి తగ్గట్టుగా దీన్ని రూపకల్పన చేద్దామనుకున్నాం.

ఇంతకీ యీ కొత్త గూడు ఏం సాధించడానికీ అంటే;

1. అంతర్జాలంలో ఇప్పటికే పద్యాల గురించిన రకరకాల సమాచారం చాలా చాలా రూపాల్లో ఉంది. అయితే దాని గురించి వెతుక్కోవాలి. పైగా చాలా చోట్ల అది ఇంగ్లీషు లిపిలో ఉంది. అది చదవడానికి అసౌకర్యం. ఈ రెండు అసౌకర్యాలనీ నివారించాలన్నది ఒక ఉద్దేశం. దీనికోసం అంతర్జాలంలో అక్కడక్కడా ఇంగ్లీషు లిపిలో ఉన్న పద్య సంపదని వీలైనన్ని చోట్ల యూనీకోడులోకి మార్చి భద్రపరచే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాం. అలాగే ఇప్పటికే తెలుగులో ఉన్న సమాచారానికి ఇక్కడనుంచి లంకెలివ్వడం ద్వారా వీటి గురించి ఒకే చోటనుంచి అందరికీ తెలిసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం.

2. ప్రాచీన పద్య సాహిత్యం వీలైనంత భద్రపరచాలన్నది మరో ఉద్దేశం. అయితే యిది చాలా బృహత్తర కార్యం. ఒకరిద్దరితో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ప్రస్తుతం వాటిలో కొన్ని కొన్ని భాగాలని మాత్రమిక్కడ ప్రచురించి పద్య ప్రియులకి వాటి మీద ఆసక్తి కలిగించాలన్నది ఆలోచన.

3. కొత్తగా పద్యాలు రాసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేందుకు, వారికున్న సందేహాలని తీర్చేందుకు, తగిన ప్రోత్సాహం అందించేందుకూ ఒక వేదికగా కూడా యీ పద్యం.నెట్ ఉండాలని మరొక ఆకాంక్ష. దీనికి తగ్గట్టుగా, చర్చా వేదిక ఒకటి అందులో ఉంది. అలాగే పద్యాల కసరత్తు శీర్షిక ఒకటి.

సరే ఇంకా చాలా చాలా చెయ్యాలన్న ఉత్సాహం ఉంది (చెయ్యగలిగే వీలు కూడా ఉందని యోగిగారు భరోసా ఇచ్చారు కూడా) కాని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఇక్కడ ప్రస్తావించడం అతిశయోక్తి అవుతుంది.

కాబట్టి పద్య ప్రియులందరికీ యీదే ఆహ్వానం, విన్నపం. పద్యం.నెట్ సందర్శించండి. మీ మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి. దానిలో ఉత్సాహంగా పాల్గొనండి. అది మనందరి గూడు.
ముందే చెప్పినట్టుగా, ప్రస్తుతమిది మొలక దశలోనే ఉంది. దీన్ని జాగ్రత్తగా పెంచే పూచీ మనందరిదీను.

ఇదే నేను మిమ్మల్ని ఊరించిన కొత్త సంవత్సర కానుక :-) ఇది కానుక మాత్రమే కాదు, బాధ్యత కూడా అని గుర్తుంచుకోండి!

14 comments:

  1. పద్యమ్.నెట్ తెరవబోతే నా అవాస్ట్ యాంటీ వైరస్ " వైరస్ ఉంది ఈ సైటులో " అంటోంది. సమస్యేమిటో చూడగలరా?

    ReplyDelete
  2. ప్రదీప్ గారు

    నేను రెండు వేర్వేరు Anti virus లు (AVG, Avast) ఉన్న రెండు వేర్వేరు కంప్యూటర్లలో పద్యం సైటు ను తెరచి చూసాను(రెండింటికీ url scanning enable చేసి ఉంది). రెండింటి లోనూ ఏ సమస్యా రాలేదు మరి.

    ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తె ఇక్కడ ఒక వ్యాఖ్య వ్రాయగలరు.

    పద్యం.నెట్

    ReplyDelete
  3. host కంట్రోల్ పానెల్ లో ని ఉపకరణం సహాయంతో వైరస్ స్కాన్ మరియు డక్టర్ వెబ్ సహాయం తో వైరస్ scan చేసాను. అంతా సరిగానే ఉందని అంటున్నాయి అవి...

    http://online.us.drweb.com

    ReplyDelete
  4. Below are the avast warning details
    File name: http://padyam.net/\{gzip}
    Malware name: HTML:Iframe-inf
    Malware type: Virus/Worm
    VPS version: 090331-0, 03/31/2009

    ReplyDelete
  5. హ్మ్...!

    సరే చూద్దామండి, ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చిందేమో!

    గురువు గారు - రామాయణం లో పిడకలవేట లాగా ఎంచక్కా పద్యాలు రాసుకునే మీ బ్లాగులో ఈ టెక్కు చర్చలను మీరు మన్నించాలి :)

    ReplyDelete
  6. పద్యం.నెట్ లో ఎటువంటి వైరస్ లేదు. నావద్ద కూడా అవాస్ట్ లేటెస్ట్ ఉంది.

    ReplyDelete
  7. hmm,
    I keep my system up to date.... not sure what's happening. Let me scan my machine completly or try from other machine.... Thanks for quick replies

    ReplyDelete
  8. ఇది పిడకలవేట ఎంత మాత్రం కాదండి! ఇది చాలా ముఖ్యమైన అంశం. పంటకి చీడ పట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా :-)
    ప్రదీప్ గారు,
    మీరీ విషయం మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా దీని అంతు తేల్చి ఏ విషయమూ ఇక్కడ తెలియజేస్తాను.

    ReplyDelete
  9. పద్యం.నెట్ నిర్వాహకుల వారికి,

    ఒక సారి ఈ లంకె చూడండి http://forum.avast.com/index.php?topic=43764.0
    నాకు వచ్చిన సమస్య కూడా పైన లంకెలో ఉన్న సమస్యలాంటిదే.

    ReplyDelete
  10. పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్రయత్నిస్తే, వ్యాకరణ పరంగా అవి సరియైనవా, లేక, వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయో గుర్తించి, సవరణలకి సూచనలు చేసే సౌలభ్యం ఉంటేబావుంటుంది

    మరికొన్ని విషయాలతో:
    http://karvepaku.blogspot.com/2009/04/compiler.html

    ReplyDelete
  11. ఇప్పుడు చూడండి పద్యం.నెట్. దీనికి పట్టిన చీడని తొలగించాము.

    ReplyDelete
  12. ఇప్పుడు తెరుచుకుంటోంది. ఇంత త్వరగా ప్రతిస్పందించినందుకు ధన్యవాదములు.
    పద్య జాలంలో పడతాను ఇక

    ReplyDelete
  13. ధవళ సోమశేఖర్ గారు

    మీరు ప్రతుపాదించినట్లు సాధ్యమో కాదో తెలియదు కానీ, మీకా ఆలోచన వచ్చిననదుకు మాత్రం మిమ్మల్ని అభినందించాలి. :)

    ప్రదీప్ గారు

    అలా సైటు తయారు చేయడం అయిపోవడమేఅమిటి, అప్పుడే ఎవరో ifame అనే virus ని చొప్పించారు. మీరు ఈ విషయం మా దృష్టికి తీసుకువచ్చినందుకూ, నిద్ర మానుకుని ఓపిగ్గా కోడ్ ను సరి చేసిన శివ గారికి వేవేల కృతజ్ఞతలు. ఇప్పుడు అంతా సరి చేసాం, ఇక అందరూ నిర్భయం గా దీనిని చదవచ్చు.

    ReplyDelete
  14. అయ్యా భైరభట్ల గారు, నాకో email somasd at gmail dot com కి చెయ్యగలరా. కొంత ఆశక్తికరమైన సమాచారం చెప్పాలి

    ప్రదీప్ గారూ, సాధ్యమేనండీ, అందరం తలుచుకోవాలే గానీ, అవ్వకపోవడమేమిటి

    ReplyDelete