తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, November 9, 2008

జననీ గర్భములోన...


కర్తవ్య నిర్వహణలో ఆ రాముడికే కాదు, నాక్కూడా అప్పుడప్పుడూ అరణ్యవాసం చెయ్యాల్సివస్తుందని ఈ మధ్యనే తెలిసొచ్చింది! కంగారుపడకండి, నేను చేసింది బ్లాగ్రాజ్యానికి (ఆమాటకొస్తే అంతర్జాల సామ్రాజ్యానికి) దూరంగా జనారణ్యవాసం.
ఇన్నాళ్ళ తర్వాత వచ్చి చూస్తే నాకు నా బ్లాగూ, నా బ్లాగుకి నేనూ కాస్త కొత్తగా కనిపించాం! ఇంతలోనే అంత మరుపా అనిపించింది. దీనికంతగా సంబంధం లేకపోయినా, ఎందుకో చట్టుక్కున ఓ పద్యం గుర్తుకొచ్చింది.

ఒక తండ్రి, తన బిడ్డకి ఊహ తెలియని రోజుల్లో, పనిమీద పరదేశానికి వెళ్ళి, కొన్నాళ్ళ తర్వాత ఆ బిడ్డకి ఊహ తెలిసే వయసుకి తిరిగి వచ్చాడనుకోండి. "అతనే నాన్న" అని తల్లి చెప్పి, ఆ తండ్రి ఆప్యాయంగా ఆ బిడ్డని చేరబోతే, ఆ బిడ్డ మనస్థితి ఎలా ఉంటుంది? ఇలాటి అనుభవం ఈ కాలంలో మరీ అరుదేమీ కాదు. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా.
అలాటి పరిస్థితిని పద్యంలో వర్ణించడమే కాదు, మరో మహత్తరమైన విషయాన్ని చెప్పడానికి, దీన్నొక పోలికగా ఉపయోగించిన ఒక మంచి పద్యం ఇది.

జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, బెక్కేండ్లకున్
జనుదే దండ్రిని గాంచు బిడ్డవలె నీ సంబంధమున్ ముందు నే
గన కీ వేళ నెఱింగి స్నేహభయశంకాముత్త్రపాశ్చర్య భా
జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్తచింతామణీ!

ఈ పద్యాన్ని రాసిన కవి శ్రీ వడ్డాది సుబ్బారాయుడు. ఇతను 1854-1938 మధ్య కాలంలో జీవించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయిన ఇతను తన ఇంట్లోనే, బంధువుల సాయంతో సొంతంగా చదువుకొని సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. వేణీసంహారం, విక్రమోర్వశీయం వంటి సంస్కృత నాటకాలని తెలిగించారు. నందనందన, భక్తచింతామణీ వంటి శతకాలని రాసారు. తన భార్యా పిల్లలనందరినీ కోల్పోయి ఒంటరైపోయిన ఇతను వాళ్ళగురించిన స్మృతికావ్యాలలో తన బాధని పొందుపరచారు. ఇతని ఇతర రచనలు నేను చదవలేదు కాని, భక్తచింతామణీ శతకంలో (నిజానికి ఇందులో రెండువందలకి పైగానే పద్యాలున్నాయి, ఈ మకుటంతో) చాలా ఆర్ద్రమైన పద్యాలెన్నో ఉన్నాయి. అలాటివాటిలో ఇదొకటి!

తానిన్నాళ్ళూ భగవంతుణ్ణి తెలుసుకోలేదు. ఇప్పుడొక్కసారిగా అతని గురించి తెలుసుకొనే సరికి అతను పొందిన అనుభూతిని ఎంత గొప్ప పోలికతో రూపుకట్టించారో చూడండి! అందులో స్నేహం(ఆప్యాయత)ఉంది, భయముంది, అనుమానముంది, సిగ్గుంది, ఆశ్చర్యముంది! అలాటి అనేక భావ పరంపరలతో ఒక వింత అనుభూతికి లోనై, అలా చూస్తూనే నిలుచుండి పోయాడట. అలాంటి సందర్భంలో బిడ్డ తండ్రి వద్దకు చొరవగా రాలేడు. తండ్రే అతన్ని చేరదీసుకొని బుజ్జగించాలి. అదే వేడుకుంటున్నాడు కవి.

భగవంతుణ్ణి నిత్యం ఆరాధించే భక్తులెవరైనా, ఆ భగంతుడు తమకి నిజంగా ప్రత్యక్షమైతే ఇలాటి అనుభూతికే లోనవుతారనడంలో సందేహమేమీ లేదు!

4 comments:

  1. భలే ఉందండి ఈ పద్యం.

    అన్నట్టు, సద్భక్తచింతామణీ అన్న ప్రయోగాన్ని పోతనగారి భాగవతంలో కూడ ఎక్కడో చదివిన గరుతు!

    ReplyDelete
  2. చాలా రోజులు దూరమై పోయారు. మీరు లేని వెలితి కనబడింది బ్లాగ్లోకంలో.

    అద్భుతమైన సన్నివేశానికి, అందమైన పద్యం తోడయి, బంగారానికి తావి అబ్బినట్టు - చక్కగా ఉంది.

    ReplyDelete
  3. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా.

    అవును అది నిజమేకదా. మీ పద్యంలోని పరిస్థితిని ఎదుర్కొన్నవారు చాలామంది మన బ్లాగ్లోకంలోనే ఉండవచ్చు.
    మంచి పద్యం.

    ReplyDelete
  4. రాఘవగారు, రవిగారు, బాబాగారు - నెనరులు
    రవిగారు - ఏదో మీ అభిమానం కాని, వెలితి కనిపించే అంత సీను నాకు బ్లాగ్లోకంలో లేదండీ.
    భక్తచింతామణి శతకంలో చదివిన పద్యాలన్నిటిలోకీ ఇది నాకు బాగా గుర్తిండిపోయిన, గుర్తుకువచ్చే పద్యం. అయితే, ఇలాటి అనుభూతి నేను కాని, మా అమ్మాయి కాని ఎప్పుడూ పొందలేదనుకోండి :-)

    ReplyDelete