తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, March 16, 2008

అమ్మా మన్నుతినంగ...

కృష్ణుడు మన్నుతిన్నాడని బలరాముడు యశోదకి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడావిడ కృష్ణుణ్ణి పట్టుకొని ఎందుకలా చేసావని నిలదీస్తుంది. ఈ సందర్భంలో బాలకృష్ణుడేమంటాడు?


నాహం భక్షితవాన్ అంబ

సర్వే మిథ్యాభిశంసినః
యది సత్య-గిరస్ తర్హి
సమక్షం పశ్య మె ముఖం



"నేను తినలేదమ్మా. అంతా నా మీద తప్పుడు నేరం మోపుతున్నారు. అది నిజమని నువ్వనుకుంటే, నువ్వే, నీ కళ్ళతో నా నోరు చూడు."
ఇదీ సంస్కృతంలో వ్యాసులవారు చెప్పించిన మాటలు. ఈ మాటలని తెలుగు పద్యంలో పెట్టాలి. మామూలు కవులైతే ఏ తేటగీతి పద్యమో తీసుకొని సులువుగా నడిపించేస్తారు. పోతన మామూలు కవి కాదు కదా! పోతన కృష్ణుడు తెలుగు కృష్ణుడు, కాస్త చిలిపి గడుసు కృష్ణుడు. "అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా!" అని మొదలుపెట్టాడు! ఒక చిన్న పిల్లవాడు "నేనేమైనా చిన్నపిల్లాడిననుకుంటున్నారా?" అని అంటే ఎంత మురిసిపోతాం!
సంస్కృతంలోని భారత భాగవతాలు పురాణాలు. భారతాన్ని ఇతిహాసమన్నా, అదీ ఒకరకమైన పురాణమే. "ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విన్ పురాణావళుల్ తెనుగుల్ జేయుచు" అని పోతనే అన్నాడు కదా. ఈ పురాణాలకి శ్రోతలూ, వారికి చెప్పాల్సిన తీరూ వేరు. తెలుగులో వీటిని తిరిగి రాసేటప్పుడు, వాటికి శ్రోతలు వేరు, వారికి చెప్పాల్సిన తీరు వేరు. భారతాన్ని కవిత్రయం ఒక కావ్యంగానే తీర్చిదిద్దారు. అంటే, కేవల ధర్మబోధే కాకుండా, రస పోషణకి ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగువాళ్ళ గుండెలకి హత్తుకోనేలా చెప్పడమన్నమాట. దీనికోసం వాళ్ళు కథని చక్కగా అల్లడం, మంచి నాటకీయమైన సంభాషణలు, అద్భుత వర్ణనలు - ఇలా రక రకాలైన మార్గాలని ఎంచుకున్నారు. అయితే భారతం వేరు, భాగవతం వేరు. భారతంలో ఒకటే మూల కథ. అందులోనే సహజమైన నాటకీయత ఉంది. వర్ణనలకి అవకాశం ఉంది. భాగవతం అలా కాదు. అందులో కేవలం భక్తి, భగవంతుడు మాత్రమే ప్రధానం. శుద్ధ వేదాంతం, గాఢమైన తాత్వికత ఉన్నదది. అందుకే "భాగవతము తెలిసి చెప్పుట చిత్రము, చూలికైన తమ్మిచూలికైన" అన్నది. మరి దాన్ని తెలుగువాళ్ళకి దగ్గర చెయ్యాలంటే ఎలా? దానికోసం తనదైన ఒక విశిష్ట మార్గాన్ని ఎన్నుకున్నాడు పోతన. గాఢమైన భక్తి, శబ్ద మాధుర్యం, తెలుగు జీవితాన్ని ప్రతిబింబించడం - ఈ మూడూ కలిపి చేసిన రసామృతంతో భాగవతాన్ని నింపేసాడు! ఈ పద్యం, ఈ పద్యమనేం మొత్తం భాగవతం, తెలుగువాళ్ళ హృదయాల్లో నిల్చిపోడానికి ఇదే కారణం.

అమ్మా మన్నుతినంగ నే శిశువునో! ఆకొంటినో! వెఱ్ఱినో!
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవుగొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు గాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే

ఆకొంటినో - ఆకలితో ఉన్నానా, అచ్చ తెలుగు మాట. "కొట్టంగ" ఇదీ అంతే. "దండింపుమీ" అనలేదు, "దండింపవే" అన్నాడు. అది పిల్లాడికి తల్లి దగ్గరున్న చనువుని ధ్వనిస్తుంది. చివరిన "మదీయాస్య గంధమ్మాఘ్రాణము సేసి" అన్నాడు.
మదీయ - నా, ఆస్యము - నోరు, గంధము - వాసన, ఆఘ్రాణము సేసి - వాసన చూసి
ఇంత పెద్ద సమాసం మరి చిన్నికృష్ణుని నోటి నుండి రావడం సమంజసమేనా? ఎలాటి నోరది? మొత్తం విశ్వాన్నంతటినీ అందులో చూపించబోతున్నాడు! దానికిది సూచన. యశోదని సిద్ధం చేయడానికి. అసలు యశోదకీ విశ్వరూప సందర్శనం ఎందుకు? అదే కృష్ణుని అవతార లక్షణం. రామావతారానికీ కృష్ణావతారానికీ ఉన్న తేడా. రాముడికి తను అవతారపురుషుడినన్న జ్ఞానం పూర్తిగా లేదు, ఉన్నా మనకి కనిపించదు, ఇతరులకీ తెలియదు. కృష్ణుడికా జ్ఞానం ఉంది. ఇతరులకది కలిగించడానికి అతను వెనుకాడడు. తన మీద కంసుడు రాక్షసులని పంపించడం మొదలుపెట్టాడు, తాను ఎదుర్కొంటున్నాడు. ఇదంతా యశోద తట్టుకోలేదు, తల్లిగా. నందుడికి కృష్ణావతారం గురించి వినికిడివల్ల కొంత తెలుసు. యశోదకి తెలీదు, తెలిసినా నమ్మక పోవొచ్చు. అందుకే స్వయంగా చూపించాడు. అయితే మళ్ళీ ఆమెకి మఱపు కలిగించాడు! లేదంటే ఆవిడ తల్లిగా తనని సాకలేదు కదా! అంతరాంతరాల్లో ఆ జ్ఞానం ఉంటుంది, అది చాలు.
ఇంతకీ ఆ పెద్ద సమాసం ప్రాస కోసం వేసాడు అని అనుకోడానికి ఆస్కారం లేకపోలేదు. అయినా అది ఎంతవరకూ అక్కడ అతికిందనేది ముఖ్యం. ఒకోసారి యతి ప్రాసలు పద్యానికిలాటి ప్రత్యేకతను, అధిక శోభను కలగించే ప్రయోగాలని స్ఫురింపచేస్తాయి!
ప్రాస స్థానంలో కొత్త పదం ప్రారంభమైనప్పుడుండే విరుపులో ఒక సొగసుంటుంది. ముందరి పదంతో సంధి కలిసినప్పుడు మరింత సొగసు! చదివితేనే తెలుస్తుంది. ఇలాటి సొగసులు తెలుగు పద్యలకే సొంతం!

13 comments:

  1. బాలుడైనా శ్రీకృష్ణుడు క్లిష్ట సమాసాన్ని వాడటం లో అర్ధాన్ని ,ఔచితిని చక్కగా వివరించారు.అలాగే శ్రీరాముడికి,శ్రీకృష్ణుడికి ఉన్న భేదం కూడా.
    అభినందనలు.

    వెన్నెల

    ReplyDelete
  2. ఓహో... అది భాగవత పద్యమా?
    స్వాతిముత్యం లో వాడితే, ఆ సినిమాకి సొంతమేమో అనుకున్న! ఇంతకీ, మీరు విడమర్చి చెప్పబట్టిగానీ... మొదటిలైను తప్ప అర్థమైనా తెలిసేది కాదు నాకు :)
    ధన్యవాదాలు..మరియు అభినందనలు కూడా... ఓహో... క్లాసికల్ తెలుగు లో ఇన్ని సొగసులు ఉన్నాయన్నమాట..అనిపించేలా రాసారు... :)

    ReplyDelete
  3. ప్రాచీన సాహిత్యంలో ఉన్న మరిన్ని సొగసులు చూడాలంటే, విశ్వనాథవారి "సాహిత్య సురభి" చదవండి. మరీ వేయిపడగల్లా ఉండదులెండి:-)

    ReplyDelete
  4. గురువు గారు, మన్నించాలి, చిన్న నెరసుదొర్లినట్టు ఉన్నది. 'దా -రిమ్మార్గము" కాదేమో, 'వీ-రిమ్మార్గము" అని నాకు గుర్తు. తోటి బాలలు చాడీలు చెబుతున్నారు అనే ఉద్దేశ్యం లో. యశోదాదేవి మనః స్థితి తెలిపే, "కలయో, వైష్ణవ మాయయో" కూడ వివరించండి, అదీ మాయాబజార్ పాట కాదని మా అందరికీ తెలియద్దూ...
    భవదీయుడు.
    ఊకదంపుడు

    ReplyDelete
  5. ఊకదంపుడు గారు,
    నేను చదివిన పుస్తకంలో "దారిమ్మార్గమ్ము" అనే ఉందండీ. "తారు + ఇమ్మార్గమ్ము". "తారు" అంటే "వాళ్ళే" అని అర్థం. వాళ్ళే ఇలా చెపుతున్నారని అర్థం వస్తుంది.
    "కొట్టంగన్ + తారిమ్మార్గమ్ము" = "కొట్టంగ దారిమ్మార్గమ్ము" అవుతుంది.

    ReplyDelete
  6. పద్యాల రుచిని అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు. మరిన్ని పద్యాల కమామీషులకోసం మీ బ్లాగుకు వస్తూనే వుంటాను.

    తారు అంటే వాళ్లు అనే అర్థాన్ని ఏనుగు లక్ష్మణకవి రాసిన ఒక సుభాషితంలో కూడా చూస్తాము - "సజ్జనులు తారె పరహితాచరణమతులు". మేము ఐదోతరగతిలో చదువుకున్నాం ఈ పద్యాన్ని - ఒక పాదం గుర్తుకు రావట్లేదు. గూగులమ్మకూడా పట్టివ్వలేదు. మీకు గుర్తుంటే చెప్పండి.
    .....................
    అర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుఁడు
    కుముద హర్షంబు గావించి నమృతసూతి
    సజ్జనులు తారె పరహితాచరణమతులు

    ReplyDelete
  7. రానారె గారూ, ఇదిగో ఆ పద్యం:
    ద్యుమణి పద్మాకరము వికచముగ జేయు
    కుముద హర్షంబు గావించు నమృతసూతి
    అర్థితుడుగాక జలమిచ్చు నంబుధరుఁడు
    సజ్జనులు తారె పరహితాచరణమతులు
    Digital Library (http://www.new.dli.ernet.in)లో భర్తృహరి సుభాషితాల పుస్తకం దొరుకుతుంది.

    ReplyDelete
  8. కామేశ్వర రావు గారు,

    చాల బాగుంది టపా. ప్రరంబంలోనో, అంతిమలోనో ఒక్క చోట మొతం పద్యం పెడితే బాగుంటుంది.

    ReplyDelete
  9. telugu padyalu baagunnaayi..

    ReplyDelete
  10. @bhairavabhatla garu:
    సాహిత్య సురభి ఆ మధ్య కొన్నాళ్ళు చదివాను. అవును, మీరన్నట్లే బాగుంది :)

    ReplyDelete
  11. సౌమ్య గారు,
    మొత్తానికి వేయిపడగల దెబ్బనించి ఇన్నాళ్ళకి కోలుకున్నారన్న మాట :-)

    ReplyDelete