పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో! కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ. విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం! పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన). అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే! ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?
ఈ పద్యం మనసులో మెదిలినప్పుడల్లా నాకు నా ఇంటరు రోజులు జ్ఞాపకమొస్తాయి. మా బి.వి.కె కళాశాలలో ఆ సంవత్సరం పద్యాల అంత్యాక్షరిని నిర్వహించారు. పద్యాలతో అంత్యాక్షరి పోటీ మరెప్పుడూ ఏ కాలేజీలోనీ పెట్టినట్టు నాకు తెలీదు. అది నా అదృష్టమనే చెప్పాలి. అందులో నా మిత్రుడొకడు ఈ పద్యాన్ని చదివాడు. ఈ పద్యాన్ని నేను వినడం అదే మొదటిసారి. ఆ పద్యానికీ, ఆ చదివిన విధానానికీ మంత్రముగ్ధుణ్ణయి పోయాను! వెంటనే ఆ పద్యాన్ని రాసుకొని కంఠస్థం చేసాను.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Sunday, March 2, 2008
మందార మకరంద...
Subscribe to:
Post Comments (Atom)
అద్భతుమైన పద్యం గుఱించి అద్భుతంగా వ్రాసారు.
ReplyDeleteఇలాంటి వివరణలు చెప్పేవారుంటే ఆంధ్ర మహాభాగవతాన్ని కదలకుండా కూర్చొని వినొచ్చనిపిస్తోంది మాస్టారూ.
ReplyDeleteఈ పద్యం మొదటిసారి కె విశ్వనాథ్ సినిమా (పేరు గుర్తు లేదు), చంద్రమోహన్ హీరో (సిరిసిరి మువ్వ కాదు). , లొ విన్నాను. ఆ తర్వాత పోతన భాగవతం చదివేటప్పుడు మళ్ళీ విన్నాను. కుటజము అంటే యేమిటో ఇప్పటి వరకు తెలీదు. ఇప్పుడు మీ నుంచీ తెలుసుకున్నాను. చాలా అందమైన పద్యం. నెనర్లు.
ReplyDeleteనేను కూడా ఈపద్యం ఎప్పుడూ తలుచుకుంటూ వుంటానండీ. మీరన్నట్టు కదాచితుగా సినిమాలవల్ల మంచి జరుగుతుందనడానికి ఈపద్యం చెప్పుకోవచ్చు. రోజారమణి ఇప్పటికీ నాకు గుర్తే. ఇంతకీ ఈపద్యం, కమలాక్షు నర్చించు కరములు. ... ఆడియో ఎక్కడేనా దొరికే అవుకాశం వుందా?
ReplyDeleteపైవారు చెప్పినట్చు చక్కని వివరణ. థాంక్సు.
మంచి పద్యాన్ని గుర్తుచేసి, చక్కటి వ్యఖ్యానం ద్వారా పద్యంలోని రసాన్ని అద్బుతంగా ట్రాంస్ఫర్ (transfer)చేసారు.
ReplyDeleteమీ నుండి "అటజనికాంచె..... పద్యాన్ని వినాలని ఉంది.
ధన్యవాదములు
బొల్లోజు బాబా
మందార మకరంద మాధుర్యమున
ReplyDeleteచాలా చక్కగా ప్రాశారు. ఈ పద్యాన్ని నేను కీర్తి శెషులు శ్రీ నాగయ్య గారి "భక్త పోతన" సినిమాలో చూశాను మరియు విన్నాను. అప్పటినుంచి నేను పోతన గారి అభిమానిని అయ్యాను.
మీరు మీ అనందాన్ని అందరితో పంచుకున్నందుకు ధ్యనవాదములు.
నేతి హరినారాయణ, మల్కాజ్ గిరి, హైదరాబాదు.
ఈ పద్యం - దాని భావం, ఈ అద్భుతమైన వివరణ తో సహా తెలుగు భాషాభిమానం వున్న వారందరూ, అవగాహనతో కంఠస్థం చేసి పది మంది తో పెంచుకోవాలి అని ఆకాంక్షిస్తూ ధన్యవాదములు.- వేంకటేశ్వర్లు పెండ్యాల, విశాఖపట్టణము.చరవాణి: 9491789596.
ReplyDeleteమహాకవి అన్న పదం ఒక్క పోతనకే సరిపోతుంది......మరెవరూ ఆయన దారి దాపులలోకీ రాలేరు....శ్రీశ్రీలూ,శ్రీనాధులూ మరే శ్రీలైనా..నాధులైనా
ReplyDeleteపోతనామాత్యులు మన తెలుగు వారు కావడం మన పూర్వజన్మ సుకృతం. ఆయన ఆంధ్రకరించిన శ్రీమద్భాగవతం అజరామృతం. మీలాగే తెలుగు లో కొంచెం పట్టు ఉన్న అందరి మనసుకూ హత్తుకునే పద్యం ఇది. సుశీలమ్మ గారూ పాడిన విధానం రోజా రమణి గారూ నటించిన తీరు మీరు వివరించిన పద్ధతి సమానంగా ఉన్నాయి. ధన్యవాదములు
ReplyDeleteఇది నా ప్రియాతి ప్రియమైన పద్యం
ReplyDeleteమనస్సుకు హత్తుకునే పద్యం, తెలుగు తనానికి మచ్చు తునక అని మనం అనక తప్పదు,
ReplyDeleteపోతన మత్యుని సాహిత్య పఠిమ అమోఘం, అనిర్వచనీయం, అజరామరం.
I like this poem Tq
ReplyDeleteI am trying to understand why Pothana garu said ‘vihvala naagendramu’’ in the poem ‘ala vaikuntha puramulo’ of Gajendra mokshamu . I was expecting vihvala gajendramu….pardon my ignorance
ReplyDeleteనాగేంద్రము అంటే ఏనుగు అనే అర్థం కూడా వుందండి.
Deleteఇంద్రశబ్దము శ్రేష్ఠతా వాచకము. నాగమనగా పాము కావచ్చును లేదా యొక యేనుగు కావచ్చును. కాని సందర్భము ననుసరించి నాగ మనగా నిచట నేను గనియే. ఈనాగ శబ్దమునకు ఇంద్రశబ్దమునం జోడించి చెప్పుట యనగా నది యొక శ్రేష్ఠమైన గజరాజ మని చెప్పుట. ఈగజేంద్రుని వైభవము బలము మున్నగునవి కథలో నప్పటికే బాగుగా వర్ణించబడి యున్నవి. అట్టి యేనుగుల రాజునకు ప్రాణములు ఠావులు తప్పుచున్నవి.
Deleteఈ పద్యం గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదములు
ReplyDelete