తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, March 8, 2008

ఛందస్సు - కథా కమామీషు

ఈ రోజెందుకో పద్యం చెప్పేబదులు పాఠం చెప్పే మూడొచ్చింది. అహహ...పాఠవనగానే ఖంగారు పడేరు! క్లాసు పీకడం కాదండీ, ఛందస్సు కథా కమామీషు గురించి, నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీతో పంచుకోడమే.

ఛందస్సనగానే గుర్తుకొచ్చేవి గురువు, లఘువు, యమాతారాజభానస లగం, భరన భబరవ, యతీ, ప్రాసా...ఇచ్చిన పద్య పాదాన్ని రాసుకొని, మూడేసి అక్షరాల తర్వాత ఒక పెద్ద గీత పెట్టుకొని ప్రతి అక్షరమ్మీదా U, I గుర్తులు పెట్టడం...

అలా కుస్తీపట్టి ఏ పద్యమో గుర్తుపట్టేసరికి ఏదో గొప్ప విజయం సాధించేసినట్టు, అదో తుత్తి! శార్దూలానికీ, మత్తేభానికీ నాకెప్పుడూ తికమకే. ఆ తర్వాత దానికో చిట్కా కనిపెట్టాను! "స"(గణం)తో మొదలయ్యేది "మ"త్తేభమూనూ, "మ"(గణం)తో మొదలయ్యేది "శా"ర్దూలమూ! సరే కందానికొచ్చేసరికల్లా ఉండే గందరగోళం అబ్బో, ఇంతా అంతా కాదు! అన్నిటికన్నా ఆటవెలది హాయిగా ఉండేది, కాని అదెప్పుడూ పరిక్షల్లో అడిగేవారు కాదు:-(
ఇంతకీ చెప్పొచ్చేదేవిటంటే, మొదట్లో నేనూ ఛందస్సుని బట్టీపట్టే నేర్చుకొన్నాను. చిన్నప్పుడు సైన్సు కూడా అలానే కదా నేర్చుకుంటాం. "భూమి గుండ్రముగా ఉండును. అది తన చుట్టూ తను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగును.", ఇలా... భూమి గుండ్రంగా ఎందుకుంటుంది? మనకి మాత్రం బల్లపరుపుగా ఎందుక్కనిపిస్తుంది? సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇలాటి ప్రశ్నలు వచ్చినా వాటిగురించి పెద్దగా పట్టించుకోం. పట్టించుకుని మాస్టార్ని అడిగినా, అవన్నీ తర్వాత తెలుస్తాయని దాటేస్తారు. దాని గురించి విపులంగా వివరించాలని ప్రయత్నిస్తే, అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టవుతుంది. అలానే ఛందస్సు కూడా. కాస్త పెద్దయ్యాక, బుద్ధిపెట్టి ఆలోచిస్తే, వాటి వెనకున్న రహస్యాలు కొంచెం కొంచెం బోధపడతాయి. పెద్దయ్యాక ఛందస్సు గురించి తెలుసుకోవాలంటే, చిన్నప్పట్లా బట్టీ పడదామంటే మన బుఱ్ఱ ఒప్పుకోదు, అది తెలివిమీరిపోయింది కదా! ఛందస్సంటే ఏమిటి? దాని ప్రయోజనమేమిటి? ఒక అక్షరం గురువెందుకౌతుంది, లఘువెందుకౌతుంది? ఇలా చాలా చాలా ప్రశ్నలు అడుగడుక్కీ అడ్డుగోడల్లా నిలుస్తాయి. వాటికి సమాధానలు తెలిస్తే కానీ ముందుకి కదల్లేం! వాటికి జవాబులు వెతుక్కొని, ఒకొక్కడుగే ముందుకు వెళుతూ ఉంటే, ఒక్కొక్క మెట్టూ ఎక్కుతున్నట్టనిపిస్తుంది. అలా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వెళుతూ పోతే - నలుచదరంగా, అంతుపొంతూ తెలియకుండా ఉండే ఛందఃప్రపంచం, అందమైన రంగురంగుల బంతిలా కనిపిస్తుంది. దాని అసలు స్వరూపం సాక్షాత్కరిస్తుంది! మరి ఈ ప్రయాణానికి మీరు సిద్ధమేనా? పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి...

అనగనగనగా... ఒక అడవిలో ఇద్దరన్నదమ్ములు. ఒకడేమో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండే వాడు. ప్రకృతి గురించి, ప్రాణం గురించి, జీవితం గురించి ఇలా. మరొకడేమో ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉండేవాడు. జంతువుల్ని వేటాడ్డమో, పంటలు పండించడమో, పనిముట్లు తయారు చెయ్యడమో ఇలా. మొదటి వాడు తనకొచ్చిన ఆలోచనలనీ, ఊహలనీ, అప్రయత్నంగా, ఒక వినూత్న రూపంలో వ్యక్తం చేసాడు. అవి మాటలైనా, వాటి కూర్పులో ఒక ప్రత్యేకత, విలక్షణత ఉన్నాయి. గుర్తు పెట్టుకొని అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వీలుగా ఉన్నాయి. అవే వేదాలయ్యాయి!
ఇక రెండో వాడు, పని చేసుకుంటూ ఆ పనిలోని శ్రమని మరచిపోడానికి, అప్రయత్నంగానే, ఒక సన్నని రాగం తీసాడు. ఆ రాగానికొక విలక్షణమైన నడకతో మాటల్ని కట్టాడు. అవే పాటలయ్యాయి!
అప్పుడే రెండు సమాంతర మార్గాల్లో సాహిత్య సృష్టి జరిగింది. ఆ రెండు మార్గాలూ రెండు రకాలైన ఛందస్సులని అనుసరించినవే! ఇందులో ఏది మొదటిదన్నది చెప్పలేం కానీ, తమ నిర్దిష్ట రూపాన్ని నిలబెట్టుకుంటూ, వేదాలు, తరతరాలకూ ప్రసారమవ్వడం మూలాన, వాటి రూపాన్ని వివరించే శాస్త్రాలు పుట్టాయి. వాటిలో ఒకటే ఛందస్సు. మొదట్లో ఛందశ్శాస్త్రం వేదాల్లో ఛందస్సు గురించే చెప్పినా, తరవాత్తరవాత విస్తృతమై, అన్ని సాహిత్య ప్రక్రియలనీ పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఛందస్సు గురించి మాట్లాడాలంటే, వేదాలూ, ఇతిహాసాలూ, పురాణాలూ, కావ్యాలూ, గేయాలూ అన్నిటి గురించీ చెప్పుకోవాలి. వేదాల్లో ఉన్న శ్లోకాలకీ, కావ్యాల్లోని పద్యాలకీ చాలా తేడానే ఉంది, రూపంలో. అలాగే కావ్యాల్లో పద్యాలకీ, జానపదులు పాడుకునే గేయాలకీ చాలా తేడా. అంచేతనే వాటిని వివరించే ఛందస్సులో కూడా అన్ని రకాలున్నాయి.

అయితే ఇంత వైవిధ్యం ఉన్న ఛందస్సుకీ ప్రాధమికమైన రెండు అంశాలు పునాదులు. ఒకటి అక్షరం (ఇంగ్లీషులో syllable), రెండు మాత్ర (లాటిన్, గ్రీకు భాషల్లో Mora). అక్షరం అంటే అందరికీ తెలిసిందే. మాత్ర అంటే, అక్షరాలని ఉచ్చరించడానికి తీసుకొనే కాలానికి ఒక ప్రమాణం.
మనందరం తెలుగు నేర్చుకునేటప్పుడు (ఒకవేళ నేర్చుకుంటే:-), మొట్టమొదట చదివేది అ, ఆలు. "అ", "ఆ"లని పలికేటప్పుడు, రెండిటికీ మనం ఒకే లాగ నోటిని, గొంతుని కదుపుతాం. వాటి మధ్య ఉన్న తేడా అల్లా వాటిని ఉచ్చరించే కాలం. "ఆ"ని, "అ" కన్నా కొంచెం ఎక్కువసేపు పలుకుతాం. ఈ రెంటి మధ్య ఉన్న కాల భేదమే ఒక "మాత్ర". అయితే కొందరు "ఆ"ని సాగదీసి మరీ ఎక్కువసేపు పలకొచ్చు. కానీ దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఆ మాటకొస్తే ఏ ఇద్దరూ "ఆ"ని పలకడానికీ సరిగ్గా ఒకే సమయం తీసుకోరు. ఇక్కడ చేస్తున్నది ఒక సాధారణీకరణ, generalization. "అ"కి ఒక మాత్ర కాలం పడితే, "ఆ" రెండు మాత్రల కాలం పడుతుంది. అలాగే మిగతా హ్రస్వాచ్చులు (short vowels), దీర్ఘాచ్చులూ (long vowels) కూడా.

ఇప్పుడు ఈ దీర్ఘాచ్చులు కాకుండా మరే అక్షరాలు పలకడానికి మనం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటామో ఆలోచించండి. అదే ప్రస్తుతానికి మీకు ఇంటిపని, అదేనండీ homework:-)

9 comments:

  1. మీ పాఠం చాలా బాగుంది.

    నమస్కారాలతో,
    ~సూర్యుడు :-)

    ReplyDelete
  2. పాఠం దివ్యంగా వుంది. చిన్నప్పటి తెలుగుపాఠం లాగే చిన్నకథతో ప్రారంభించి చిన్న చిరునవ్వుతో ముగించడం - బ్రమ్మాండం. నాకొచ్చే సందేహాలన్నీ అడగడానికి ఈ విశాల బ్లాగావరణంలో ఒక చోటు దొరికింది - కానివ్వండి.

    ReplyDelete
  3. బాగా చెప్తున్నారు. తరువాతి పాఠాలు కూడా త్వరగా చెప్పండి.

    ReplyDelete
  4. చంద్రమౌళి .... ప్రజెంట్ సర్....
    బాగ్గురువుకు ప్రణామాలు... మొదటి పాఠం బాగుంది,,,, రెండవ పాఠం కోసం చూస్తుంటాం

    ReplyDelete
  5. గురువుగారు, చాలా బాగుందండీ...
    నన్నూ చేర్చుకోండి మీ శిష్యరికానికి.

    ReplyDelete
  6. mana padyalu annitikee chandassu pranam, alanti chandassu nerchukovalani naku eppati nundo korika. adhi ila theerchukovachhu annamata.

    ReplyDelete
  7. మీ శీర్షికలు, పద్యాలూ చదివి చాలా ఆనందిస్తాను.
    ఛందస్సు మీద అభిమానం మా తెలుగు మాస్టారి వల్ల. ఆయనలాగే ఎంతో చక్కగా వివరిస్తున్నారు.
    పునరావృతం చేసుకోడానికి అవకాశం ఇస్తున్నారు.
    చాలా ధన్యవాదాలు..

    ReplyDelete
  8. చాల బాగా చెపారు !!

    ReplyDelete
  9. చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete